న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో యథావిధిగా రగడ కొనసాగింది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో శుక్రవారం ఆందోళనకు దిగారు. నినాదాలతో హోరెత్తించారు. సభా కార్యకలాపాలకు పదేపదే అడ్డు తగిలారు. రాజస్తాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాలపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో అధికార బీజేపీ సభ్యులు నినదించారు. గందరగోళం కారణంగా లోక్‌సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. చివరకు రెండు సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.
లోక్‌సభలో పట్టువీడని విపక్షాలు
లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇంతలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ జోక్యం చేసుకున్నారు. ముఖ్యమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టాల్సి ఉందని, సభ్యులంతా సహకరించాలని కోరారు. సభా కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. నినాదాలు కొనసాగించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య దాదాపు 20 నిమిషాలపాటు సభ జరిగింది.
అనంతరం సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమయ్యాక కూడా విపక్షాలు శాంతించలేదు. దాంతో చేసేదిలేక సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. సైనిక దళాలను మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ‘ఇంటర్–సరీ్వసెస్ ఆర్గనైజేషన్స్(కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్) బిల్లు’ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. స్వల్ప చర్చ అనంతరం సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అలాగే ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్(అమెండ్‌మెంట్) బిల్లు–2023’ కూడా ఆమోదించారు.
జ్యసభలో అధికార బీజేపీ ఆందోళన
రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య వ్యవహారాన్ని రాజ్యసభలో అధికార బీజేపీ సభ్యులు లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాజస్తాన్‌లో శాంతి భద్రతలు నానాటికీ దిగజారుతున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. బీజేపీ సభ్యులు ఆయనకు మద్దతు పలికారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ‘మణిపూర్, మణిపూర్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ప్రతిష్టంభనకు తెరపడలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment