
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మణిపూర్‌లో అమాయకులు బలైపోతున్నా ప్రధానమంత్రి ఎందుకు నోరువిప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విపక్ష ఎంపీలు శుక్రవారం సైతం పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనకు దిగారు. అలాగే మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో తక్షణమే చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉభయసభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. కార్యకలాపాలేవీ జరగకుండానే లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి.
లోక్‌సభలో 3 బిల్లులకు ఆమోదం
లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పదేపదే విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. 1978 మే 10న కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వెంటనే చర్చ జరిగిందని కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి గుర్తుచేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందిస్తూ.. ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నడుచుకుంటుందని, అవిశ్వాస తీర్మానంపై 10 రోజుల్లోగా చర్చ చేపట్టవచ్చని తేలి్చచెప్పారు. సంఖ్యా బలం ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గందరగోళం మధ్యే పలు బిల్లులను సభ ఆమోదించింది.
ఇదేమన్నా స్టేజీయా: చైర్మన్ ఆగ్రహం
మణిపూర్ తదితర అంశాలపై చర్చకు రాజ్యసభలోనూ విపక్షాలు పట్టుబట్టాయి. 47 మంది ఎంపీలు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నోత్తరాల ప్రాధాన్యతను వివరిస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ జోక్యం చేసుకున్నారు. అది తమకు తెలుసని, మణిపూర్ హింసపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. దాంతో, ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి ఇది నాటక రంగం కాదని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఓబ్రెయిన్ బల్లపై చేతితో గట్టిగా కొడుతూ అరిచారు. ఆయన తీరును తప్పుబడుతూ సభను చైర్మన్ సోమవారానికి వాయిదా వేశారు.