రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యలు కాంగ్రెస్‌పై మరోసారి నిప్పులు
ఏడాదైనా మణిపూర్‌కు ఎందుకు వెళ్లలేదని విపక్షాల మండిపాటు..
సభ నుంచి వాకౌట్
సభను అవమానించాయి: చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్
న్యూఢిల్లీ: విపక్షాల విమర్శల నేపథ్యంలో మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు బుధవారం ప్రధాని బదులిచ్చారు. రెండు గంటలపాటు సాగిన ప్రసంగంలో మణిపూర్ అంశంపై వివరంగా మాట్లాడారు. అక్కడ హింస క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ‘‘మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
విద్యా సంస్థలతో పాటు వ్యాపార సంస్థలు కూడా దాదాపుగా తెరుచుకుంటున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను సంపూర్ణంగా పునరుద్ధరించేందుకు కేంద్రం అన్ని చర్యలూ చేపడుతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో అన్నివిధాలా కలిసి పని చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్‌లో పలు రోజుల పాటు ఉండి మరీ పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేశారు. హింసాకాండకు సంబంధించి ఇప్పటిదాకా 500 మందికి పైగా అరెస్టయ్యారు.
11 వేల పై చిలుకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి’’ అని వివరించారు. మణిపూర్ హింసపై గత సమావేశాల సందర్భంగా రాజ్యసభలో తాను సుదీర్ఘంగా మాట్లాడానని ప్రధాని గుర్తు చేశారు. ‘‘మణిపూర్ ఇప్పుడు వరదలతో సతమతమవుతోంది. కనుక ఈ అంశంపై విపక్షాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. పరిస్థితిని చక్కదిద్దేందుకు మాతో కలిసి రావాలి’’ అని కోరారు. కానీ మోదీ వ్యాఖ్యలతో విపక్షాలు సంతృప్తి చెందలేదు.
మణిపూర్లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందన్నాయి. అక్కడ గత మేలో హింస చెలరేగితే ఏడాదైనా ఆ రాష్ట్రాన్ని సందర్శించేందుకు మోదీకి తీరిక చిక్కలేదా అంటూ మండిపడ్డాయి. ఈ అంశంపై మాట్లాడేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు అవకాశమివ్వాలని డిమాండ్ చేశాయి. అందుకు చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ నిరాకరించడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రధాని మాట్లాడుతుండగానే సభ నుంచి వాకౌట్ చేశాయి. దీనిపై చైర్మన్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు.
విపక్షాలు సభనే గాక రాజ్యాంగాన్ని కూడా అవమానించాయంటూ ఆగ్రహించారు. ‘‘మీరు వీడింది సభను కాదు, మర్యాదను’’ అంటూ దుయ్యబట్టారు. అనంతరం మోదీ మాట్లాడుతూ మణిపూర్ జాతుల సంఘర్షణలకు మూలం దాని చరిత్రలోనే ఉందన్నారు. స్వాతంత్య్రానంతరం అక్కడ 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచి్చందని గుర్తు చేశారు. 1993 నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రంలో భారీ స్థాయిలో సామాజిక సంఘర్షణ చోటుచేసుకుందన్నారు. ‘‘కనుక మణిపూర్ సమస్యను పరిష్కరించే క్రమంలో ఓపికగా, ఆచితూచి వ్యవహరించాలి’’ అన్నారు. నీట్ లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు.
రాజ్యాంగాన్ని కాలరాసిందే కాంగ్రెస్!
అంతకు ముందు సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను మరోసారి తూర్పరాబట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడామన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్నే అపహాస్యం చేసిన వారినుంచి ఇలాంటి మాటలు విడ్డూరం! ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 ఎన్నికల సందర్భంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపింది. ఆ ఎన్నికల్లో మాత్రమే ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఓటేశారు. కాంగ్రెస్ సర్కారును సాగనంపారు’’ అంటూ దుయ్యబట్టారు. దాంతో మోదీ అబద్ధాలకోరంటూ విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీనిపై ఖర్గేకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. వారి నినాదాల మధ్యే మోదీ ప్రసంగం కొనసాగించారు.
దర్యాప్తు సంస్థలకు మరింత స్వేచ్ఛ
అవినీతి, నల్లధనంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపుతామని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు చెప్పారు. ‘‘అవినీతిపరులెవరినీ వదలబోం. ఇది మోదీ గ్యారంటీ’’ అన్నారు.
రాజ్యసభ నిరవధిక వాయిదా
రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సభ ఆమోదించగానే చైర్మన్ ఈ మేరకు ప్రకటించారు. లోక్‌సభ మంగళవారమే నిరవధికంగా వాయిదా పడటం తెలిసిందే. దీంతో పార్లమెంటు సమావేశాలకు తెర పడింది.
Comments
Please login to add a commentAdd a comment