Rajya Sabha adjourned
-
PM Narendra Modi: ప్రశాంతంగా మణిపూర్
న్యూఢిల్లీ: విపక్షాల విమర్శల నేపథ్యంలో మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు బుధవారం ప్రధాని బదులిచ్చారు. రెండు గంటలపాటు సాగిన ప్రసంగంలో మణిపూర్ అంశంపై వివరంగా మాట్లాడారు. అక్కడ హింస క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ‘‘మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యా సంస్థలతో పాటు వ్యాపార సంస్థలు కూడా దాదాపుగా తెరుచుకుంటున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను సంపూర్ణంగా పునరుద్ధరించేందుకు కేంద్రం అన్ని చర్యలూ చేపడుతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో అన్నివిధాలా కలిసి పని చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్‌లో పలు రోజుల పాటు ఉండి మరీ పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేశారు. హింసాకాండకు సంబంధించి ఇప్పటిదాకా 500 మందికి పైగా అరెస్టయ్యారు. 11 వేల పై చిలుకు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి’’ అని వివరించారు. మణిపూర్ హింసపై గత సమావేశాల సందర్భంగా రాజ్యసభలో తాను సుదీర్ఘంగా మాట్లాడానని ప్రధాని గుర్తు చేశారు. ‘‘మణిపూర్ ఇప్పుడు వరదలతో సతమతమవుతోంది. కనుక ఈ అంశంపై విపక్షాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. పరిస్థితిని చక్కదిద్దేందుకు మాతో కలిసి రావాలి’’ అని కోరారు. కానీ మోదీ వ్యాఖ్యలతో విపక్షాలు సంతృప్తి చెందలేదు. మణిపూర్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందన్నాయి. అక్కడ గత మేలో హింస చెలరేగితే ఏడాదైనా ఆ రాష్ట్రాన్ని సందర్శించేందుకు మోదీకి తీరిక చిక్కలేదా అంటూ మండిపడ్డాయి. ఈ అంశంపై మాట్లాడేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు అవకాశమివ్వాలని డిమాండ్ చేశాయి. అందుకు చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ నిరాకరించడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రధాని మాట్లాడుతుండగానే సభ నుంచి వాకౌట్ చేశాయి. దీనిపై చైర్మన్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. విపక్షాలు సభనే గాక రాజ్యాంగాన్ని కూడా అవమానించాయంటూ ఆగ్రహించారు. ‘‘మీరు వీడింది సభను కాదు, మర్యాదను’’ అంటూ దుయ్యబట్టారు. అనంతరం మోదీ మాట్లాడుతూ మణిపూర్ జాతుల సంఘర్షణలకు మూలం దాని చరిత్రలోనే ఉందన్నారు. స్వాతంత్య్రానంతరం అక్కడ 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచి్చందని గుర్తు చేశారు. 1993 నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రంలో భారీ స్థాయిలో సామాజిక సంఘర్షణ చోటుచేసుకుందన్నారు. ‘‘కనుక మణిపూర్ సమస్యను పరిష్కరించే క్రమంలో ఓపికగా, ఆచితూచి వ్యవహరించాలి’’ అన్నారు. నీట్ లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. రాజ్యాంగాన్ని కాలరాసిందే కాంగ్రెస్! అంతకు ముందు సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను మరోసారి తూర్పరాబట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడామన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్నే అపహాస్యం చేసిన వారినుంచి ఇలాంటి మాటలు విడ్డూరం! ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 ఎన్నికల సందర్భంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపింది. ఆ ఎన్నికల్లో మాత్రమే ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఓటేశారు. కాంగ్రెస్ సర్కారును సాగనంపారు’’ అంటూ దుయ్యబట్టారు. దాంతో మోదీ అబద్ధాలకోరంటూ విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీనిపై ఖర్గేకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. వారి నినాదాల మధ్యే మోదీ ప్రసంగం కొనసాగించారు. దర్యాప్తు సంస్థలకు మరింత స్వేచ్ఛ అవినీతి, నల్లధనంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపుతామని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు చెప్పారు. ‘‘అవినీతిపరులెవరినీ వదలబోం. ఇది మోదీ గ్యారంటీ’’ అన్నారు. రాజ్యసభ నిరవధిక వాయిదా రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సభ ఆమోదించగానే చైర్మన్ ఈ మేరకు ప్రకటించారు. లోక్‌సభ మంగళవారమే నిరవధికంగా వాయిదా పడటం తెలిసిందే. దీంతో పార్లమెంటు సమావేశాలకు తెర పడింది. -
‘ప్రధాని మోదీ రావాలి.. మాట్లాడాలి’
సాక్షి, న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. విపక్ష ఎంపీలు తమ డిమాండ్‌పై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి.. సమాధానం ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెప్పారు. ప్రధానమంత్రి మొండి వైఖరిని నిరసిస్తూ నల్లరంగు దుస్తులు ధరించి పార్లమెంట్‌కు హాజరయ్యారు. విపక్షాల నినాదాలు, ఆందోళనలతో ఉభయ సభల్లో గురువారం సైతం వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. మణిపూర్ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. మోదీ మౌనాన్ని వీడాలని, మణిపూర్ హింసపై నోరు విప్పాలని బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో అధికార బీజేపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యుల నినాదాల హోరు మధ్యే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఖనిజ చట్ట సవరణ బిల్లును, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ జన్‌విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత జన్‌విశ్వాస్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. 76 కాలం చెల్లిన చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. అనంతరం లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఆ భేటీని బహిష్కరించిన ఎంపీలు రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశాన్ని ప్రతిపక్ష ఎంపీలు బహిష్కరించారు. మణిపూర్ అంశంపై ప్రధాని వైఖరికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. రాజ్యసభ బీఏసీలో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ సమావేశాన్ని జైరాం రమేశ్(కాంగ్రెస్), మీసా భారతి(ఆర్జేడీ), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ) బహిష్కరించారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సభ్యుడు కేశవరావు గైర్హాజరయ్యారు. దేశాన్ని విభజిస్తున్నారు: రాహుల్ దేశాన్ని విభజించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలసికట్టుగా కుట్రపన్నుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ప్రజల దుఃఖం బాధ వారికి పట్టడం లేదు. అధికారం తప్ప వారికి మరి దేనిపైనా ఆసక్తి లేదు’ అని అన్నారు. యువజన కాంగ్రెస్ గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆన్లైన్లో పాల్గొని ప్రసంగించారు. ‘బీజేపీ–ఆర్ఎస్ఎస్కి కావాల్సింది అధికారమే. దాని కోసం ఏమైనా చేస్తారు. అధికారం కోసం వారు మణిపూర్‌ను రావణకాష్టంలా మారుస్తారు. యావత్ దేశాన్ని నిప్పుల కుంపటి చేస్తారు. దేశ ప్రజల బాధ, శోకం వారికి పట్టదు’ అని తీవ్ర స్థాయిలో «ధ్వజమెత్తారు. ‘మీరు ఒక వైపు కూర్చొని ప్రేమను పంచుతూ ఉంటారు. దేశానికి, దేశ ప్రజలకి గాయమైతే మీకూ ఆ నొప్పి తెలుస్తుంది. కానీ వాళ్లకి అలాంటి భావాలే లేవు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి ప్రజల బాధ ఏంటో తెలీదు. వాళ్లు దేశాన్ని విభజించే పనిలో బిజీ’ అని అన్నారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. మణిపూర్‌లో మంటలు చెలరేగుతున్నా ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు ప్రయ తి్నస్తుండగా, అధికారపక్ష ఎంపీలు అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. పునఃప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర మంత్రి ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో విపక్షాల తీరును ఆయన తప్పుపపట్టారు. దాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఒక సమయంలో ప్రతిపక్ష సభ్యులు ‘ఇండియా, ఇండియా’ అంటూ నినాదాలు చేయగా, బీజేపీ సభ్యులు ‘మోదీ, మోదీ’ అంటూ నినదించారు. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు మూజువాణి ఓటుతో సభలో ఆమోదం పొందింది. -
పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేసింది. ఈ సమావేశాల్లో భాగంగా బడ్జెట్, ద్రవ్యవినిమయ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో లోక్‌సభలో 18 బిల్లులు, రాజ్యసభలో 19 బిల్లులు ఆమోదం పొందాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్లమెంట్ సమావేశాల సమయాన్ని కుదించారు. ఏప్రిల్ 8వరకు జరగాల్సి ఉన్న పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రెండు నెలలపాటు కొనసాగిన ఈ సమావేశాలు జనవరి29న ప్రారంభమయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువులు ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. చదవండి: ఖరారైన శరద్ పవార్ బెంగాల్ పర్యటన -
రాఫేల్, కావేరీ వివాదాలపై పార్లమెంట్లో గందరగోళం
సాక్షి, న్యూఢిల్లీ : క్రిస్మస్ విరామం అనంతరం గురువారం ప్రారంభమైన పార్లమెంట్ ఉభయసభలూ సమావేశమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. కావేరీ వివాదంపై నిరసనలు హోరెత్తడంతో రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభలో రాఫేల్ ఒప్పందంపై విపక్షాలు నినాదాలతో ప్రభుత్వంపై విరుచుకుపడటంతో గందరగోళం నెలకొంది. ట్రిపుల్ తలాక్ తాజా బిల్లుపై చర్చ చేపట్టాల్సిఉండగా సభ రాఫేల్ డీల్‌పై దద్దరిల్లింది. విపక్ష సభ్యుల ఆందోళనల నడుమ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌లు తమ పార్టీ సభ్యులు విధిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేశాయి. ఈ బిల్లుపై చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. ట్రిపుల్ తలాక్‌ను నేరపూరిత చర్యగా బిల్లులో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత శశి థరూర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇండియన్ మెడికల్ కౌన్సిల్ బిల్లు, కంపెనీల చట్టం సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం లోక్‌సభ ముందుంచనుంది. -
మోదీ లేరంటూ గందరగోళం.. రాజ్యసభ వాయిదా
మధ్యాహ్నం భోజన విరామ సమయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్చలో పాల్గొనేందుకు రాజ్యసభకు రాలేదంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు తీవ్రంగా గందరగోళం సృష్టించడంతో రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. పెద్దనోట్ల రద్దుపై విపక్షాల డిమాండ్ మేరకు రాజ్యసభలో గురువారం చర్చ నిర్వహించారు. ఈ చర్చలో ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పాల్గొన్నారు. అయితే భోజన విరామానికి సభ వాయిదా పడిన తర్వాత ఆయన మళ్లీ సభకు రాలేదు. ఈ అంశాన్ని కాంగ్రెస్, సీపీఎం, ఇతర పార్టీల సభ్యులు లేవనెత్తారు. దానికి అధికారపక్షం తరఫున సభా నాయకుడు అరుణ్ జైట్లీ, మరో మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సమాధానం ఇచ్చారు. మొత్తం 25 మందికి పైగా సభ్యులు మాట్లాడాల్సి ఉన్నందున చర్చ ఇంకా ముగిసిపోలేదని, చర్చ ముగిసేలోపు ప్రధాని తప్పనిసరిగా వచ్చి, ఆయన కూడా చర్చలో పాల్గొంటారని చెప్పారు. కానీ, ప్రతిపక్ష సభ్యులు దాంతో ఏకీభవించలేదు. గతంలో 2013 ఆగస్టులో ఇలాగే రాజ్యసభలో చర్చ జరిగేటప్పుడు నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సభలోనే ఉండి తీరాలని నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారని, ఇప్పుడు మాత్రం ఆయన ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మాజీ మంత్రి ఆనంద్ శర్మ మండిపడ్డారు. అనంతరం ఒక్కసారిగా కాంగ్రెస్ ఎంపీలంతా వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రధానమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. సభను జరగనివ్వాలని, ప్రతి ఒక్కరూ చర్చలో పాల్గొనాలని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదే పదే కోరినా ఎవరూ పట్టించుకోలేదు. పరిస్థితి ఎంతసేపటికీ అదుపులోకి రాకపోవడంతో సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు కురియన్ ప్రకటించారు. -
గందరగోళం మధ్య కాసేపు..!
పార్లమెంటు సభా కార్యక్రమాల కొనసాగింపు * క్వశ్చన్ అవర్, జీరో అవర్ పూర్తి * నిరసనలు కొనసాగించిన కాంగ్రెస్, ఇతర విపక్షాలు * సోమవారానికి ఉభయ సభలు వాయిదా * రెండు వారాలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన సాక్షి, న్యూఢిల్లీ: గత రెండు వారాలుగా సభా కార్యక్రమాలు తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో.. నిరసనలు ఎదురైనా, విపక్షాలు గందరగోళం సృష్టించినా, సభను నడిపి తీరాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. అదే వైఖరి శుక్రవారం నాటి లోక్‌సభ నిర్వహణలో కనిపించింది. విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సభ్యులు పట్టువదలకుండా నినాదాలతో హోరెత్తించినా, సభను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించినా, స్పీకర్ తాత్కాలికంగా సభను వాయిదా వేశారే కానీ మరుసటిరోజుకు వాయిదా వేయలేదు. గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాల సమయాన్ని, జీరో అవర్‌ను పూర్తి చేశారు. గురుదాస్‌పూర్‌లో ఉగ్ర దాడిపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేసిన సమయంలో తప్ప, మిగతా సమయమంతా కాంగ్రెస్, పలు ఇతర విపక్షాలు నిరసనలు కొనసాగించాయి. రాజ్యసభలో ప్రతిష్టంభన కొనసాగింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి అధికార, విపక్ష సభ్యులు వాద ప్రతివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, పోటాపోటీ నినాదాలతో సభను వేడెక్కించారు. మోదీగేట్కు సంబంధించి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, వ్యాపమ్ స్కామ్‌లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దాంతో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ల సమయంలో రెండు సార్లు సభను వాయిదా వేశారు. ప్రధాని మోదీ సభకు వచ్చి వ్యాపమ్‌కు సంబంధించి శివరాజ్ సింగ్ రాజీనామాపై హామీ ఇచ్చేంతవరకు సభాకార్యక్రమాలను వాయిదా వేయాలంటూ సభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ డిమాండ్‌ను అధికార పక్షం తోసిపుచ్చింది. నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోబోమంటూ పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. వ్యాపమ్‌పై చర్చకు సిద్ధమన్నారు. దానిపై, ప్రభుత్వం చర్య తీసుకున్న తరువాతే చర్చ అని ఆజాద్ తేల్చిచెప్పారు. అధికార, విపక్ష సభ్యులు తమ పట్టు వీడకుండా, నినాదాలతో గందరగోళం సృష్టించడంతో సభను డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సోమవారానికి వాయిదా వేశారు. లోక్‌సభలో.. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ శుక్రవారం వాయిదా తీర్మానాల నోటీసులను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చి పెద్దపెట్టున నినాదాలు చేశారు. దాదాపు మీటరు వెడల్పు, ముప్పావు మీటరు ఎత్తుతో ప్లకార్డులు ప్రదర్శించారు. ‘దాగియో సే ముహ్ మోడో.. ప్రధాన్ మంత్రి చుపీ తోడో..’ , ‘భ్రష్టాచారీయోంకో సాథ్ చోడో.. ప్రధాన్ మంత్రి చుపీ తోడో..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు ప్లకార్డులతో స్పీకర్ స్థానానికి కుడిపక్కన అధికార పక్షం వైపు మౌనంగా నిల్చుని నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ ఎంపీ మల్లారెడ్డి కూడా ఈ అంశంపై వెల్ వద్ద నిల్చుని నిరసన తెలిపారు. విపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. విజ్ఞప్తులు, హెచ్చరికలు కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకుంటుండటంతో ఆందోళన విరమించుకోవాలని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేశారు. ప్లకార్డులు తీసి, ఆందోళన విరమించకపోతే చర్య తీసుకోవాల్సి వస్తుందన్నారు. అయినా సభ్యులు వినకపోవడంతో స్పీకర్ ‘మీరు ఆందోళన చేసినా సభను వాయిదా వేయను. దేశం మొత్తం చూడనివ్వండ’ంటూ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. అనంతరం గురుదాస్‌పూర్ ఉగ్ర ఘటనపై రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరగా స్పీకర్ నిరాకరించారు. దాంతో విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. 12.30 గంటప్పుడు స్పీకర్ సభను 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ మొదలయ్యాక రాజ్‌నాథ్ ప్రకటనపై కాంగ్రెస్ ఖర్గే మాట్లాడుతూ.. ఉగ్ర ఘటనపై సుమోటో ప్రకటన ఇస్తానన్న హోంమంత్రి రాజకీయ ప్రసంగం చేశారని విమర్శించారు. దాంతో, బీజేపీ సభ్యులు ఖర్గేను అడ్డుకున్నారు. ఇలా అధికార, విపక్ష సభ్యుల నిరసనల మధ్యే జీరో అవర్‌ను పూర్తి చేశారు. గందరగోళం మరింత పెరగడంతో మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో పావుగంట పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ సమావేశమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో 10 నిమిషాల తరువాత సోమవారానికి వాయిదా వేశారు. -
పెద్దల సభలో నిరసనలు, నినాదాలు
న్యూఢిల్లీ : సభ్యుల ఆందోళనలు.. నినాదాలు, నిరసనల మధ్య రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. అంతకు ముందు మతహింస నిరోధక బిల్లుపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లుపై వివరణ ఇవ్వాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దాంతో మంత్రి కపిల్ సిబల్ మాట్లాడేందుకు డిప్యూటీ ఛైర్మన్ అనుమతి ఇచ్చారు. మతహింస బిల్లును బీజేపీ, టీఎంసీ వ్యతిరేకించాయి. కాగా ఓవైపు.. సీమాంధ్ర సభ్యుల తమ నిరసనను కొనసాగిస్తుండగానే.. నిరసన మధ్యనే.. మతహింస నిరోధక బిల్లును ఎలా ప్రవేశపెడతారంటూ.. బీజేపీ సభ్యులు డిప్యుటీ ఛైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో సభ స్థంభించిపోయింది. అంతకు ముందు సభ ప్రారంభం కాగానే .. ఛైర్మన్.. హమీద్ అన్సారీ వారించినా ఎంపీలు ఛైర్మన్ వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేయడంతో తొలుత సభను వాయిదా వేశారు. రెండు సార్లు వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో ఎటువంటి మార్పు లేకపోవడంతో పెద్దల సభ మూడవసారికూడా వాయిదా బాట పట్టింది. వాయిదాల అనంతరం సమావేశాలు ప్రారంభమైనా గందరగోళం సద్దుమణగకపోవటంతో సభను డిప్యూటీ ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు.