పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన కార్యక్రమంలో ఖర్గే తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. విపక్ష ఎంపీలు తమ డిమాండ్‌పై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి.. సమాధానం ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెప్పారు. ప్రధానమంత్రి మొండి వైఖరిని నిరసిస్తూ నల్లరంగు దుస్తులు ధరించి పార్లమెంట్‌కు హాజరయ్యారు. విపక్షాల నినాదాలు, ఆందోళనలతో ఉభయ సభల్లో గురువారం సైతం వాయిదాల పర్వం కొనసాగింది.
ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. మణిపూర్ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. మోదీ మౌనాన్ని వీడాలని, మణిపూర్ హింసపై నోరు విప్పాలని బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో అధికార బీజేపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు.
సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యుల నినాదాల హోరు మధ్యే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఖనిజ చట్ట సవరణ బిల్లును, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ జన్‌విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత జన్‌విశ్వాస్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. 76 కాలం చెల్లిన చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. అనంతరం లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
ఆ భేటీని బహిష్కరించిన ఎంపీలు
రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశాన్ని ప్రతిపక్ష ఎంపీలు బహిష్కరించారు. మణిపూర్ అంశంపై ప్రధాని వైఖరికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. రాజ్యసభ బీఏసీలో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ సమావేశాన్ని జైరాం రమేశ్(కాంగ్రెస్), మీసా భారతి(ఆర్జేడీ), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ) బహిష్కరించారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) సభ్యుడు కేశవరావు గైర్హాజరయ్యారు.
దేశాన్ని విభజిస్తున్నారు: రాహుల్
దేశాన్ని విభజించాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కలసికట్టుగా కుట్రపన్నుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ప్రజల దుఃఖం బాధ వారికి పట్టడం లేదు. అధికారం తప్ప వారికి మరి దేనిపైనా ఆసక్తి లేదు’ అని అన్నారు. యువజన కాంగ్రెస్ గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో పాల్గొని ప్రసంగించారు. ‘బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌కి కావాల్సింది అధికారమే. దాని కోసం ఏమైనా చేస్తారు. అధికారం కోసం వారు మణిపూర్‌ను రావణకాష్టంలా మారుస్తారు. యావత్ దేశాన్ని నిప్పుల కుంపటి చేస్తారు. దేశ ప్రజల బాధ, శోకం వారికి పట్టదు’ అని తీవ్ర స్థాయిలో «ధ్వజమెత్తారు. ‘మీరు ఒక వైపు కూర్చొని ప్రేమను పంచుతూ ఉంటారు. దేశానికి, దేశ ప్రజలకి గాయమైతే మీకూ ఆ నొప్పి తెలుస్తుంది. కానీ వాళ్లకి అలాంటి భావాలే లేవు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి ప్రజల బాధ ఏంటో తెలీదు. వాళ్లు దేశాన్ని విభజించే పనిలో బిజీ’ అని అన్నారు.
రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్
రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. మణిపూర్‌లో మంటలు చెలరేగుతున్నా ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు ప్రయ తి్నస్తుండగా, అధికారపక్ష ఎంపీలు అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది.
వెంటనే సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. పునఃప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర మంత్రి ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో విపక్షాల తీరును ఆయన తప్పుపపట్టారు. దాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఒక సమయంలో ప్రతిపక్ష సభ్యులు ‘ఇండియా, ఇండియా’ అంటూ నినాదాలు చేయగా, బీజేపీ సభ్యులు ‘మోదీ, మోదీ’ అంటూ నినదించారు. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు మూజువాణి ఓటుతో సభలో ఆమోదం పొందింది.
Comments
Please login to add a commentAdd a comment