రాహుల్ గాంధీ శనివారం కేరళ వెళ్తూ మార్గమధ్యంలో తమిళనాడులోని ముత్తునాడు వద్ద ‘తోడ’ జాతి గిరిజనులతో ముచ్చటించారు. బరువైన గుండ్రటి బండరాయిని ఓ వ్యక్తి ఆవలీలగా భుజంపైకి ఎత్తుకోవడాన్ని ఆసక్తిగా గమనించారు. వారితో కలిసి నృత్యం చేశారు.
వయనాడ్: మణిపూర్ హింసాకాండ వంటి అతి తీవ్రమైన సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ నవ్వులాటగా మార్చేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. వయనాడ్ ఎంపీ అయిన ఆయన అనర్హత వేటు తొలగాక శనివారం తొలిసారి కేరళలో పర్యటించారు. కాల్పెట్టలో యూడీఎఫ్ బహిరంగ సభలో మాట్లాడారు. మణిపూర్ సమస్యను విపక్షాలు పార్లమెంటు దాకా తీసుకెళ్లి చర్చకు పెట్టినా దానిపై మాట్లాడటానికి కూడా మోదీ ఇష్టపడలేదని ఆరోపించారు.
‘అవిశ్వాస తీర్మానంపై చర్చకు బదులిస్తూ మోదీ 2 గంటల 13 నిమిషాల సేపు ప్రసంగించారు. అందులో ఏకంగా 2 గంటల పాటు కాంగ్రెస్ గురించి, నా గురించి, విపక్ష ఇండియా కూటమి గురించి... ఇలా అన్నింటి గురించీ మాట్లాడారు. అంతసేపూ మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు అన్నింటి మీదా జోకులు వేశారు. నవ్వుకున్నారు. కానీ అసలు సమస్య మణిపూర్ హింసాకాండ గురించి మాట్లాడేందుకు మాత్రం మోదీ కేటాయించింది కేవలం రెండంటే రెండే నిమిషాలు! భారత్ అనే భావనకే మణిపూర్‌లో తూట్లు పొడిచారు‘ అని మండిపడ్డారు. భారత్ అనే భావనకే తూట్లు పొడిచే వాళ్లు జాతీయవాదులు ఎలా అవుతారని రాహుల్ ప్రశ్నించారు.
మణిపురీల దుస్థితి చూసి.. చలించిపోయా
మణిపూర్ పర్యటన సందర్భంగా అక్కడి బాధితుల దుస్థితి చూసి ఆపాదమస్తకం చలించిపోయానని రాహుల్ గుర్తు చేసుకున్నారు. తన 19 ఏళ్ల రాజకీయ జీవితంలో అంతటి దారుణ పరిస్థితులను ఎన్నడూ చూడలేదని ఆవేదన వెలిబుచ్చారు. బీజేపీయే తన స్వార్థ ప్రయోజనాల కోసం మణిపూర్ ప్రజల మధ్య నిలువునా చీలిక తెచి్చందని ఆరోపించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కనీసం ఐదేళ్లయినా పడుతుందని అభిప్రాయపడ్డారు. ‘ పునరావాస కేంద్రాల్లో ఒక మహిళ చెప్పింది విని కన్నీరు పెట్టా. కొడుకును ఆమె కళ్ల ముందే చంపారు.
మిగతా అందరూ కుటుంబాలతో ఉంటే ఆమె మాత్రం ఒంటరిగా పడుకుని కనిపించింది. మీ వాళ్లెక్కడ అని అడిగితే ఎవరూ మిగల్లేదంటూ ఏడ్చేసింది. తన పక్కన పడుకున్న కొడుకును కళ్ల ముందే కాల్చేస్తే రాత్రంతా శవం పక్కనే గడిపానని గుర్తు చేసుకుంది. తనెలాగూ తిరిగి రాడని గుండె రాయి చేసుకుని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నానని చెప్పింది. ఆ ఘోర కలి గురించి చెప్తూ కూడా వణికిపోయింది. ఇంకో బాధిత మహిళ తనకు జరిగిన దారుణాలను తలచుకున్నంత మాత్రాన్నే స్పృహ తప్పి పడిపోయింది. మణిపూర్‌లో ఇలాంటి దారుణ గాథలు వేలాదిగా ఉన్నాయి. నా తల్లికి, చెల్లికి ఇలా జరిగితే ఎలా ఉంటుందని ఊహించుకున్నా‘ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment