Defamation Case: రాహుల్‌పై అనర్హత వేటు | Defamation Case: Rahul Gandhi Declared Disqualified As A Member Of Lok Sabha | Sakshi
Sakshi News home page

Defamation Case: రాహుల్‌పై అనర్హత వేటు

Published Sat, Mar 25 2023 4:16 AM | Last Updated on Sat, Mar 25 2023 2:58 PM

Defamation Case: Rahul Gandhi Declared Disqualified As A Member Of Lok Sabha - Sakshi

శుక్రవారం తనపై వేటు నిర్ణయం అనంతరం పార్లమెంటు నుంచి వెళ్లిపోతున్న రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ:  దేశ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం! పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన కాంగ్రెస్‌ నాయకుడు, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది! ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంటూ లోక్‌సభ సెక్రటేరియట్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొంది.

తీర్పు వెలువడ్డ ఈ నెల 23వ తేదీ (గురువారం) నుంచే వేటు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. నిజానికి అపీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్‌ కోర్టు పేర్కొనడం తెలిసిందే. అయినా లోక్‌సభ సెక్రటేరియట్‌ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో స్టే లభించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్షా కాలం, అనంతరం మరో ఆరేళ్లు కలుపుకుని మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్‌ అనర్హుడవుతారు!

శుక్రవారం ఉదయం మామూలుగానే లోక్‌సభ సమావేశానికి హాజరైన ఆయన, లోక్‌సభ సెక్రటేరియట్‌ నిర్ణయం అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు. రాహుల్‌పై అనర్హత వేటును కాంగ్రెస్‌ తీవ్రంగా నిరసించగా విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. ఆయనకు బాసటగా నిలిచాయి. దీనిపై ‘జనాందోళన్‌’ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. బీజేపీ మాత్రం వేటు చట్టప్రకారమే జరిగిందని పేర్కొంది.

రాహుల్‌కు చట్టం వర్తించదా అని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన, అనురాగ్‌ ఠాకూర్‌ ప్రశ్నించారు. ‘నేరాలకు పాల్పడడం రాహుల్‌కు అలవాటే. పార్లమెంట్‌కు, ప్రభుత్వానికి, దేశానికి అతీతుడినని ఆయన భావిస్తున్నారు. తమకు ప్రత్యేక భారత శిక్షాస్మృతి ఉండాలని, తమను ఎవరూ నేరస్తులుగా నిర్ధారించవద్దని, శిక్షలు విధించవద్దని కాంగ్రెస్,  ప్రధానంగా నెహ్రూ–గాంధీ కుటుంబం కోరుకుంటోంది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కానీ దేశ ప్రజలంతా ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు’’ అన్నారు.

వయనాడ్‌ ఖాళీ
లోక్‌సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్‌ స్థానం ఖాళీ అయినట్టు లోక్‌సభ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఎన్సీపీ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై హత్యా యత్నం నేరం రుజువై పదేళ్ల జైలు శిక్ష పడటంతో లక్షద్వీప్, కాంగ్రెస్‌ ఎంపీ సంతోఖ్‌ సింగ్‌ చౌదరి మృతితో జలంధర్‌ (పంజాబ్‌) స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. 2019లో వయనాడ్‌తో పాటు గాంధీల కంచుకోట అయిన యూపీలోని అమేఠీ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్‌ అక్కడ బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి చూవిచూశారు.

ప్రమాదంలో ప్రజాస్వామ్యం
వేటును నిరసిస్తూ విపక్షాల ర్యాలీ
అదానీ అంశంపై జేపీసీతో దర్యాప్తు చేయించాలని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ నిరసన ర్యాలీ చేపట్టిన 40 మంది ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు నిర్బంధించారు. పార్లమెంట్‌ హౌస్‌ నుంచి విజయ్‌ చౌక్‌కు ర్యాలీగా వెళ్లిన ప్రముఖుల్లో కేసీ వేణుగోపాల్, ఆధిర్‌ రంజన్‌ చౌధురి, కె.సురేశ్, మాణిక్కం ఠాగోర్‌æ తదితరులు ఉన్నారు. వీరంతా నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని పోలీసులు చెప్పారు. సెక్షన్‌ 144ను ఉల్లంఘించి ర్యాలీ చేపట్టిన 40 మంది ఎంపీలను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్‌ స్టేషన్‌కు తరలించామన్నారు. అంతకుముందు విజయ్‌చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే తదితర నేతలు మాట్లాడారు. ర్యాలీలో కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, శివసేన ఉద్ధవ్‌ వర్గం, జేడీయూ, ఆప్‌ నేతలు పాల్గొని ‘వుయ్‌ డిమాండ్‌ జేపీసీ’, ‘సేవ్‌ ఎల్‌ఐసీ’, ‘డెమోక్రసీ ఇన్‌ డేంజర్‌’ అన్న ప్లకార్డులను ప్రదర్శించారు.  

 రాహుల్‌ నోరు నొక్కేందుకే: కాంగ్రెస్‌
సోనియా సహా అగ్ర నేతల అత్యవసర భేటీ
రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. దీనిపై దేశవ్యాప్తంగా ‘జనాందోళన్‌’కు పిలుపునిచ్చింది. రాహుల్‌ సభ్యత్వంపై వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్‌ వెలువడగానే కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ సహా కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా శక్రవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. రాహుల్‌ నోరు నొక్కేందుకే అధికార బీజేపీ ఇలా వాయు వేగంతో చర్యలకు దిగిందని తీర్మానించారు.

వేటుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని, మోదీ సర్కారు నిరంకుశ వైఖరిపై నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ రాష్ట్ర, జిల్లా, మండల విభాగాలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నాయి. రాహుల్‌కు విపక్షాల సంఘీభావాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ స్వాగతించింది. ‘‘దీనిపై ఐక్యంగా పోరాడదాం. ఆందోళనల్లో మీరు కూడా కలిసి రండి’’ అంటూ ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చింది. భేటీలో ప్రియాంక, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, చిదంబరం తదితరులు పాల్గొన్నారు.

స్పందనలు
ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో చీకటి రోజు
‘ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. నిజాలు మాట్లాడుతున్నందుకు, ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నందుకే రాహుల్‌పై అధికార బీజేపీ కక్షగట్టింది. ఆయన గొంతు నొక్కడమే ఉద్దేశం. నిజాలను రాహుల్‌ బహిర్గతం చేయడం బీజేపీకి ఇష్టం లేదు, రాహుల్‌పై వేటు పడినా అదానీ అక్రమాలపై జేపీసీ విచారణ డిమాండ్‌పై తగ్గేది లేదు. మమ్మల్ని జైలుకు పంపించినా పోరాడుతూనే ఉంటాం’’  
– మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు  

‘‘మోదీ భారత్‌లో విపక్ష నాయకులే లక్ష్యంగా మారారు. నేర చరితులైన బీజేపీ వారికి మంత్రి పదవులు. విపక్ష నేతలపై అనర్హత వేటు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత హీనమైన పరిస్థితి!’’
మమత బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి  

 ‘‘రాహుల్‌పై అనర్హత వేటు దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది.   దేశంలో ఒకే పార్టీ, ఒకే నాయకుడు ఉండాలని అనుకుంటున్నారు. బ్రిటీష్‌ పరిపాలన కంటే ప్రమాదకరంగా ప్రధాని మోదీ పాలన మారింది. ఇది కేవలం ఒక్క కాంగ్రెస్‌ చేసే పోరాటం కాదు. దేశాన్ని రక్షించుకోవడానికి 130 కోట్ల మంది భారతీయులు ఏకం కావాలి’’
అరవింద్‌ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి  

‘‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మోదీ స్నేహితుడైన పారిశ్రామికవేత్త (అదానీ) అంశాల నుంచి దృష్టి మరల్చే బీజేపీ ఎత్తుగడ ఇది. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కుట్రలు పన్ని, తప్పుడు కేసులు పెట్టి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజమ్‌ఖాన్‌ సహా ఎందరిపైనో అనర్హత వేటు వేసింది’’  
అఖిలేశ్‌ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు  

‘‘రాహుల్‌గాంధీపై అనర్హత వేటు రాజ్యాంగం ప్రాథమిక సిద్ధాంతాలకే వ్యతిరేకం. ప్రజాస్వామ్య విలువలన్నీ మంటగలుపుతున్నారు. ఇలాంటి చర్యల్ని పూర్తిగా ఖండించాలి’’
శరద్‌ పవార్, ఎన్సీపీ అధినేత

‘‘రాహుల్‌పై అనర్హత ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులపై జరిగిన దాడి. ఇదొక ఫాసిస్టు చర్య. ఒక జాతీయ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడుకి కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరిచే ప్రజాస్వామ్య హక్కు లేదని ఇలాంటి చర్యల ద్వారా భయపెడుతున్నారు’’
ఎంకె స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి  

 ‘‘ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్‌ చేయడానికి పరువు నష్టం మార్గాన్ని బీజేపీ ఎంచుకోవడాన్ని  ఖండించాలి. వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం తారాస్థాయికి చేరుకుంది. ఇలాంటి నిరంకుశ దాడుల్ని ప్రతిఘటించాలి, ఓడించాలి’’
సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి  

‘‘అబద్ధాలు, వ్యక్తిగత నిందలు, ప్రతికూల రాజకీయాలు రాహుల్‌లో ఒక అంతర్భాగంగా మారాయి. ఒబిసి సామాజిక వర్గాన్ని దొంగలతో పోల్చి రాహుల్‌ తనకున్న కుల అహంకారాన్ని బయటపెట్టుకున్నారు.  2024 ఎన్నికల్లో ఆయనకి ప్రజలు ఇంతకంటే పెద్ద శిక్ష విధిస్తారు.’’  
జె.పి. నడ్డా, బీజేపీ అధ్యక్షుడు

తలవంచం.. ఏం చేసుకుంటారో చేసుకోండి
‘‘దేశ ప్రజాస్వామ్యం కోసం మా కుటుంబం రక్తం ధారపోసింది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రాణత్యాగం చేసిన ప్రధాని కుమారుడైన రాహుల్‌ గాంధీని ‘మీర్‌ జాఫర్‌’ అంటూ మోదీ మనుషులు కించపర్చారు. మా కుటుంబాన్ని దూషించారు. రాహుల్‌ తండ్రెవరని బీజేపీ ముఖ్యమంత్రి ఒకరు ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని పాటిస్తూ తలపాగా ధరిస్తే దాన్నీ తప్పుపట్టారు. తద్వారా పండిట్ల సామాజిక వర్గాన్ని అవమానించారు. నెహ్రూ ఇంటి పేరు ఎందుకు పెట్టుకోలేదని పార్లమెంట్‌లో మీరు (మోదీ) మమ్మల్ని ప్రశ్నించారు. మమ్మల్ని దారుణంగా అవమానించినా ఏ జడ్జి కూడా మీకు రెండేళ్ల జైలు శిక్ష విధించలేదు. పార్లమెంట్‌ నుంచి అనర్హత వేటు వేయలేదు. రాహుల్‌ నిజమైన దేశ భక్తుడు. అందుకే అదానీ గ్రూప్‌ సాగించిన లూటీపై ప్రశ్నించాడు. నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ బాగోతాలపై నిలదీశాడు. మీ మిత్రుడు గౌతమ్‌ అదానీ పార్లమెంట్‌ కంటే గొప్పవాడా? అధికార దాహమున్న వ్యక్తుల ముందు మేం తలవంచే ప్రసక్తే లేదు. ఏం చేసుంటారో చేసుకోండి!’’
– ప్రియాంకాగాంధీ వాద్రా, కాంగ్రెస్‌ నాయకురాలు  

భారత్‌ గొంతుక కోసమే నా పోరాటం
‘‘భారతదేశ గొంతుక కోసం పోరాటం సాగిస్తున్నా. ఈ విషయంలో ఎలాంటి మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నా’’  
– రాహుల్‌ గాంధీ ట్వీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement