న్యూఢిల్లీ: అధికార బీజేపీ ఆగడాల మీద మరింత దూకుడుగా పోరాడతానని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తేల్చి చెప్పారు. ‘‘కావాలంటే నాపై జీవిత కాలం పాటు వేటు వేయండి. జైల్లో పెట్టుకోండి. మీరేం చేసినా నన్నాపలేరు. సత్యం కోసం, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా. అందుకోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడను’’ అని ప్రకటించారు. ‘‘దేశ పౌరుల ప్రజాస్వామిక గళాన్ని పరిరక్షించేందుకే నేనున్నా.
ఇలాంటి హెచ్చరికలు, అనర్హతలు, ఆరోపణలు, జైలు శిక్షలతో నన్నెప్పటికీ బెదిరించలేరు. వాటికి ఎంతమాత్రం వెరవబోను. వీళ్లకు నేనింకా అర్థం కాలేదు. అదానీ అవినీతిపై ఎక్కడ నిజాలు బయటికొస్తాయోనని బీజేపీ సర్కారు నిలువెల్లా భయంతో కంపించిపోతోంది. నా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా విపక్షాలకు చేజేతులారా అతి పెద్ద అస్త్రాన్ని అందించింది’’ అన్నారు.
పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన 24 గంటల్లోపే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఆ తర్వాత తొలిసారి రాహుల్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై వేటును కేవలం అదానీ ఉదంతం నుంచి దృష్టి మళ్లించేందుకు ఆడిన గేమ్‌గా అభివర్ణించారు. ‘‘అదానీ గ్రూప్ అవకతవకలపై పార్లమెంటులో నా తర్వాతి ప్రసంగంలో ఏం మాట్లాడతానోనని ప్రధాని నరేంద్ర మోదీ వణికిపోయారు.
అదానీతో ఆయన బంధం పూర్తిగా బయట పడిపోతుందని కలవరపాటుకు లోనయ్యారు. ఆ భయాన్ని మోదీ కళ్లలో నేను స్పష్టంగా చూశా’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘అందుకే నా ప్రసంగాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనుకున్నారు. నాపై ఆరోపణలు, అనర్హత వేటు తదితరాలతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారు’’ అని ఆరోపించారు.
‘‘కానీ అదానీతో మోదీ బంధం బయట పడితీరుతుంది. దాన్నెవరూ ఆపలేరు. అప్పటిదాకా అదానీ అవినీతిపై ప్రశ్నలు సంధిస్తూనే ఉంటా. అదానీ షెల్ సంస్థల్లో రూ.20 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టిందెవరు? అదానీతో మోదీ సంబంధమేమిటి? సమాధానాలు దొరికేదాకా వీటిని లేవనెత్తుతూనే ఉంటా’’ అన్నారు. అదానీ వంటి అవినీతిపరున్ని ప్రధాని ఎందుకు కాపాడుతున్నారన్న ప్రశ్నే ఇప్పుడు ప్రజలందరి మనసుల్లోనూ మెదులుతోందన్నారు.
ప్రజాస్వామ్యానికి పాతర
బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిపోయిందని రాహుల్ అభిప్రాయపడ్డారు. బీజేపీ సర్కారు దృష్టిలో అదానీ అంటే దేశం, దేశమంటే అదానీ అంటూ ఎద్దేవా చేశారు. తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నారా అని ప్రశ్నించగా, తానలా కనిపిస్తున్నానా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ‘‘నిజానికి నాకెంతో ఉత్సాహంగా, సంతోషంగా ఉంది. అనర్హత వేటు బహుశా వాళ్లు నాకివ్వగలిగిన అత్యుత్తమ కానుక!’’ అన్నారు.
‘‘బ్రిటన్లో నేను ఎక్కడా భారత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరలేదు. కానీ కేంద్ర మంత్రులు దీనిపై పార్లమెంటులో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాటిపై స్పందించాలనుకుంటే అవకాశమివ్వలేదు. పైగా ఓబీసీలను అవమానించానంటూ నాపై తప్పుడు ఆరోపణలతో అదానీ అవినీతి నుంచి అందరి దృష్టీ మళ్లించజూస్తోంది. తప్పు చేసిన వాళ్లు ఇలాగే వ్యవహరిస్తారు. దొంగ అడ్డంగా దొరికినా తానేమీ తప్పు చేయలేదనే అంటాడు. ‘అదుగో, అటు చూడండి’ అంటూ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తాడు. కానీ బీజేపీని వదిలిపెట్టబోను. విపక్షాలన్నీ కలసికట్టుగా మోదీ–అదానీ బంధాన్ని బయట పెట్టి తీరతాయి’’ అన్నారు.
..సభ్యత్వం ముఖ్యం కాదు
తన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆశ పడటం లేదని ఒక ప్రశ్నకు బదులుగా రాహుల్ చెప్పారు. ‘‘దానితో నిమిత్తం లేకుండా నా విధి నేను నిర్వర్తిస్తూనే ఉంటా. శాశ్వతంగా వేటు వేసినా, నా సభ్యత్వాన్ని పునరుద్ధరించినా ఈ విషయంలో తేడా ఉండదు. పార్లమెంటులో ఉన్నా, బయట ఉన్నా నా తపస్సు కొనసాగుతుంది’’ అన్నారు. ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల గొంతుకను కాపాడటం. ప్రధానితో సాన్నిహిత్యాన్ని దుర్వినియోగం చేస్తున్న అదానీ వంటివారి గురించి ప్రజలకు నిజాలు చెప్పడం. ఆ పని చేసి తీరతాం’’ అని స్పష్టం చేశారు.
నా పేరు సావర్కర్ కాదు...!
‘బ్రిటన్లో చేసిన వ్యాఖ్యలపై మీ క్షమాపణకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై కోర్టులో విచారం వ్యక్తం చేసుండాల్సిందని భావిస్తున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని రాహుల్‌బదులిచ్చారు. ‘‘నా పేరు సావర్కర్ కాదు, గాంధీ. గాంధీ ఎవరికీ ఎప్పుడూ క్షమాపణలు చెప్పడు’’ అన్నారు. ‘‘వీటిపై లోక్‌సభలో మాట్లాడతానని స్పీకర్‌కు రెండుసార్లు లేఖ రాసినా అవకాశమివ్వలేదు. తానలా చేయలేనంటూ నవ్వి చాయ్ ఆఫర్ చేశారు. ఆయన మరింకేం చేయగలరు? ఇక బహుశా మోదీనే అడగాలేమో. కానీ ఆయనా నాకు మాట్లాడే అవకాశమివ్వరు’’ అన్నారు.
విపక్షాలన్నీ ఏకమవ్వాలి
వేటును నిరసిస్తూ తనకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించిన విపక్షాలకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. భయాందోళనలతో మోదీ తీసుకున్న ఈ వేటు నిర్ణయం విపక్షాలకు చెప్పలేనంత మేలు చేస్తుందని జోస్యం చెప్పారు. ‘‘దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందాం. విపక్షాలు ఒక్కతాటిపైకి రావడం తక్షణావసరం. అందరమూ కలసికట్టుగా పని చేద్దాం’’ అని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఆందోళనలు
మోదీ దిష్టి బొమ్మ దగ్ధం
రాహుల్‌పై వేటును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శనివారం ఆందోళనలకు దిగింది. ఆయన ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంతో సహా పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనంచేశారు. మరోవైపు బీజేపీ కూడా సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ముంబైలో ఆందోళనకు దిగింది. ఓబీసీలను అవమానించే ప్రయత్నాలను సహించబోమని పార్టీ నేతలు హెచ్చరించారు.
వేటును సొమ్ముచేసుకునే యత్నం: బీజేపీ
పరువు నష్టం కేసు, అనర్హత వేటు తదితరాలు అదానీ ఉదంతం నుంచి జనం దృష్టి మళ్లించేందుకేనన్న రాహుల్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. జైలు శిక్ష నేపథ్యంలో రాహుల్‌పై వేటును కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోందని పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. అందుకే వేటు పడకుండా ముందస్తు చర్యలేవీ చేపట్టలేదని ఆరోపించారు. ఓబీసీలను రాహుల్ అవమానించిన తీరును దేశమంతటా ప్రచారం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment