democracy values
-
Lok sabha elections 2024: దేశ గౌరవం ధ్వంసం: సోనియా
జైపూర్: దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలు, బెదిరింపులతో ప్రతిపక్ష నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. గత పదేళ్ల ఎన్డీయే పాలనలో ఒరిగిందేమీ లేదని అన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. నేడు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు విధ్వంసానికి గురవుతున్నాయని తెలిపారు. ఎన్డీయే పాలనలో రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనలను సహించే ప్రసక్తే లేదని, తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇది ప్రజలందరికీ చెందుతుందని పేర్కొన్నారు. ‘గ్యారంటీ’ని దొంగిలించిన మోదీ: ఖర్గే అబద్ధాల నాయకుడు నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘గ్యారంటీ’ అనే పదాన్ని కాంగ్రెస్ నుంచి మోదీ దొంగిలించారని చెప్పారు. అవినీతిపరులు బీజేపీలో చేరగానే పరిశుద్ధులుగా మారిపోతున్నారని ప్రియాంకాగాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. -
Defamation case: పోరాడుతూనే ఉంటా..నా పేరు సావర్కర్ కాదు...!
న్యూఢిల్లీ: అధికార బీజేపీ ఆగడాల మీద మరింత దూకుడుగా పోరాడతానని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తేల్చి చెప్పారు. ‘‘కావాలంటే నాపై జీవిత కాలం పాటు వేటు వేయండి. జైల్లో పెట్టుకోండి. మీరేం చేసినా నన్నాపలేరు. సత్యం కోసం, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా. అందుకోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడను’’ అని ప్రకటించారు. ‘‘దేశ పౌరుల ప్రజాస్వామిక గళాన్ని పరిరక్షించేందుకే నేనున్నా. ఇలాంటి హెచ్చరికలు, అనర్హతలు, ఆరోపణలు, జైలు శిక్షలతో నన్నెప్పటికీ బెదిరించలేరు. వాటికి ఎంతమాత్రం వెరవబోను. వీళ్లకు నేనింకా అర్థం కాలేదు. అదానీ అవినీతిపై ఎక్కడ నిజాలు బయటికొస్తాయోనని బీజేపీ సర్కారు నిలువెల్లా భయంతో కంపించిపోతోంది. నా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా విపక్షాలకు చేజేతులారా అతి పెద్ద అస్త్రాన్ని అందించింది’’ అన్నారు. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన 24 గంటల్లోపే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఆ తర్వాత తొలిసారి రాహుల్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై వేటును కేవలం అదానీ ఉదంతం నుంచి దృష్టి మళ్లించేందుకు ఆడిన గేమ్‌గా అభివర్ణించారు. ‘‘అదానీ గ్రూప్ అవకతవకలపై పార్లమెంటులో నా తర్వాతి ప్రసంగంలో ఏం మాట్లాడతానోనని ప్రధాని నరేంద్ర మోదీ వణికిపోయారు. అదానీతో ఆయన బంధం పూర్తిగా బయట పడిపోతుందని కలవరపాటుకు లోనయ్యారు. ఆ భయాన్ని మోదీ కళ్లలో నేను స్పష్టంగా చూశా’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘అందుకే నా ప్రసంగాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనుకున్నారు. నాపై ఆరోపణలు, అనర్హత వేటు తదితరాలతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారు’’ అని ఆరోపించారు. ‘‘కానీ అదానీతో మోదీ బంధం బయట పడితీరుతుంది. దాన్నెవరూ ఆపలేరు. అప్పటిదాకా అదానీ అవినీతిపై ప్రశ్నలు సంధిస్తూనే ఉంటా. అదానీ షెల్ సంస్థల్లో రూ.20 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టిందెవరు? అదానీతో మోదీ సంబంధమేమిటి? సమాధానాలు దొరికేదాకా వీటిని లేవనెత్తుతూనే ఉంటా’’ అన్నారు. అదానీ వంటి అవినీతిపరున్ని ప్రధాని ఎందుకు కాపాడుతున్నారన్న ప్రశ్నే ఇప్పుడు ప్రజలందరి మనసుల్లోనూ మెదులుతోందన్నారు. ప్రజాస్వామ్యానికి పాతర బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిపోయిందని రాహుల్ అభిప్రాయపడ్డారు. బీజేపీ సర్కారు దృష్టిలో అదానీ అంటే దేశం, దేశమంటే అదానీ అంటూ ఎద్దేవా చేశారు. తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నారా అని ప్రశ్నించగా, తానలా కనిపిస్తున్నానా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ‘‘నిజానికి నాకెంతో ఉత్సాహంగా, సంతోషంగా ఉంది. అనర్హత వేటు బహుశా వాళ్లు నాకివ్వగలిగిన అత్యుత్తమ కానుక!’’ అన్నారు. ‘‘బ్రిటన్‌లో నేను ఎక్కడా భారత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరలేదు. కానీ కేంద్ర మంత్రులు దీనిపై పార్లమెంటులో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాటిపై స్పందించాలనుకుంటే అవకాశమివ్వలేదు. పైగా ఓబీసీలను అవమానించానంటూ నాపై తప్పుడు ఆరోపణలతో అదానీ అవినీతి నుంచి అందరి దృష్టీ మళ్లించజూస్తోంది. తప్పు చేసిన వాళ్లు ఇలాగే వ్యవహరిస్తారు. దొంగ అడ్డంగా దొరికినా తానేమీ తప్పు చేయలేదనే అంటాడు. ‘అదుగో, అటు చూడండి’ అంటూ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తాడు. కానీ బీజేపీని వదిలిపెట్టబోను. విపక్షాలన్నీ కలసికట్టుగా మోదీ–అదానీ బంధాన్ని బయట పెట్టి తీరతాయి’’ అన్నారు. ..సభ్యత్వం ముఖ్యం కాదు తన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆశ పడటం లేదని ఒక ప్రశ్నకు బదులుగా రాహుల్ చెప్పారు. ‘‘దానితో నిమిత్తం లేకుండా నా విధి నేను నిర్వర్తిస్తూనే ఉంటా. శాశ్వతంగా వేటు వేసినా, నా సభ్యత్వాన్ని పునరుద్ధరించినా ఈ విషయంలో తేడా ఉండదు. పార్లమెంటులో ఉన్నా, బయట ఉన్నా నా తపస్సు కొనసాగుతుంది’’ అన్నారు. ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల గొంతుకను కాపాడటం. ప్రధానితో సాన్నిహిత్యాన్ని దుర్వినియోగం చేస్తున్న అదానీ వంటివారి గురించి ప్రజలకు నిజాలు చెప్పడం. ఆ పని చేసి తీరతాం’’ అని స్పష్టం చేశారు. నా పేరు సావర్కర్ కాదు...! ‘బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై మీ క్షమాపణకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై కోర్టులో విచారం వ్యక్తం చేసుండాల్సిందని భావిస్తున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని రాహుల్బదులిచ్చారు. ‘‘నా పేరు సావర్కర్ కాదు, గాంధీ. గాంధీ ఎవరికీ ఎప్పుడూ క్షమాపణలు చెప్పడు’’ అన్నారు. ‘‘వీటిపై లోక్‌సభలో మాట్లాడతానని స్పీకర్‌కు రెండుసార్లు లేఖ రాసినా అవకాశమివ్వలేదు. తానలా చేయలేనంటూ నవ్వి చాయ్ ఆఫర్ చేశారు. ఆయన మరింకేం చేయగలరు? ఇక బహుశా మోదీనే అడగాలేమో. కానీ ఆయనా నాకు మాట్లాడే అవకాశమివ్వరు’’ అన్నారు. విపక్షాలన్నీ ఏకమవ్వాలి వేటును నిరసిస్తూ తనకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించిన విపక్షాలకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. భయాందోళనలతో మోదీ తీసుకున్న ఈ వేటు నిర్ణయం విపక్షాలకు చెప్పలేనంత మేలు చేస్తుందని జోస్యం చెప్పారు. ‘‘దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందాం. విపక్షాలు ఒక్కతాటిపైకి రావడం తక్షణావసరం. అందరమూ కలసికట్టుగా పని చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆందోళనలు మోదీ దిష్టి బొమ్మ దగ్ధం రాహుల్‌పై వేటును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శనివారం ఆందోళనలకు దిగింది. ఆయన ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంతో సహా పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనంచేశారు. మరోవైపు బీజేపీ కూడా సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ముంబైలో ఆందోళనకు దిగింది. ఓబీసీలను అవమానించే ప్రయత్నాలను సహించబోమని పార్టీ నేతలు హెచ్చరించారు. వేటును సొమ్ముచేసుకునే యత్నం: బీజేపీ పరువు నష్టం కేసు, అనర్హత వేటు తదితరాలు అదానీ ఉదంతం నుంచి జనం దృష్టి మళ్లించేందుకేనన్న రాహుల్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. జైలు శిక్ష నేపథ్యంలో రాహుల్‌పై వేటును కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోందని పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. అందుకే వేటు పడకుండా ముందస్తు చర్యలేవీ చేపట్టలేదని ఆరోపించారు. ఓబీసీలను రాహుల్ అవమానించిన తీరును దేశమంతటా ప్రచారం చేస్తామన్నారు. -
ప్రజాస్వామ్య విలువలు నాశనం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పరిరక్షించాల్సిన విలువలను నిదానంగా, పూర్తిస్థాయిలో నాశనం చేస్తోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఈ విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ రాసిన ‘షేడ్స్ ఆఫ్ ట్రూత్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మన్మోహన్ మాట్లాడారు. ‘మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పరిరక్షించే విలువలను నిదానంగా పూర్తిస్థాయిలో నాశనం చేస్తోంది. సుపరిపాలన అందించడంలో కీలకమైన జాతీయ సంస్థలు ఎన్నడూలేని స్థాయిలో కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నాలుగేళ్లలో పొరుగుదేశాలతో మన సంబంధాలు దిగజారాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి శాస్త్ర, సాంకేతికతల వినియోగంలో ప్రభుత్వం విఫలమైంది. మహిళలు, దళితులు, మైనారిటీలు మరింత అభద్రతాభావంలోకి జారిపోతున్నారు. విదేశాల్లో మూలుగుతున్న లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న హామీని నెరవేర్చేందుకు కేంద్రం సరైన చర్యలేవీ తీసుకోలేదు. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది.ఈ అణచివేత చర్యలన్నింటిపై నిజంగా జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చ ఈ రోజు ఇక్కడి నుంచే మొదలవుతుందని నేను ఆశిస్తున్నా’ అని మన్మోహన్ తెలిపారు. విపక్షాలు ఏకమైతే ఇక బీజేపీ అధికారంలోకి రావడం కలేనని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. -
మరింత విశ్వసనీయత అవసరం
సాక్షి, చెన్నై: విశ్వసనీయతపై మీడియా మరింత దృష్టి పెట్టాలని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వార్తా కథనాలు అందించాలని ప్రధాని మోదీ సూచించారు. వార్తల్లో కచ్చితత్వానికి ప్రాధాన్యమివ్వాలని ఆకాంక్షించారు. ప్రముఖ తమిళ దినపత్రిక ‘దిన తంతి’ 75వ వార్షికోత్సవ వేడుకల్లో సోమవారం ప్రధాని ప్రసంగిస్తూ.. ఎప్పుడూ రాజకీయ నాయకుల చుట్టూనే కాకుండా ప్రజల విజయ గాథల్ని అందించడంపై మీడియా దృష్టి పెట్టాలన్నారు. ‘ప్రజాప్రయోజనాల కోసం పత్రికలు తమకున్న స్వేచ్ఛను తెలివిగా వాడుకోవాలి. వార్తలు రాసే క్రమంలో కచ్చితత్వంలేని, వాస్తవ విరుద్ధమైన స్వేచ్ఛతో వ్యవహరించకూడదు. ఏది ముఖ్యం, మొదటి పేజీలో ఏ వార్తకు ఎంత స్థలం కేటాయించాలి, దేనికి అధిక ప్రాధాన్యమివ్వాలి అనేవి ఎడిటర్లు నిర్ణయించుకోవాలి’ అని అన్నారు. ‘మీడియా నిజంగా ఒక శక్తే. దానిని దుర్వినియోగం చేయడం నేరం. మీడియా సంస్థలు ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలో ఉన్నా ప్రజా ప్రయోజనం కోసం పనిచేయాలి’ అని సూచించారు. ఆరోగ్యకర పోరుతో ప్రజాస్వామ్యానికి మేలు గ్రామాల్లో బ్లాక్ బోర్డులపై వార్తలు రాసే స్థాయి నుంచి నేడు ఆన్లైన్లో క్షణాల్లో సమాచారం ప్రజలకు అందుతోందని, అందువల్ల సరైన వార్తలు అందించడంలో మీడియా అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘ప్రజలు వివిధ మార్గాల్లో వార్తల్ని విశ్లేషించడంతో పాటు నిర్ధారించుకుంటున్నారు. మొబైల్ ఫోన్లలో కూడా సమాచారాన్ని తెలుసుకుంటున్న నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం అందించేలా మీడియా మరింత కృషి చేయాలి. విశ్వసనీయ మీడియా సంస్థల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ప్రజాస్వామ్యానికి కూడా మంచిది’ అని ప్రధాని చెప్పారు. మన కలం శక్తికి తెల్లదొరలు భయపడ్డారు.. దేశంలో అధిక శాతం మీడియా చర్చలు రాజకీయాల చుట్టూ తిరగడం సహజమేనని, ప్రజాస్వామ్యంలో అంతకుమించిన విషయాలు ఎన్నో ఉన్నాయని మోదీ అన్నారు. ‘ప్రజలకుసంబంధించిన కథనాలు, విజయాలపై మీడియా ఎక్కువ దృష్టి పెడితే ఆనందిస్తా’ అని అన్నారు. బ్రిటిష్ పాలనలో మహాత్మాగాంధీ, తిలక్‌ల సందేశాన్ని ప్రజలకు చేరవేసిన భారతీయ విలేకరులను చూసి తెల్లదొరలు భయపడ్డారని చెప్పారు. స్వచ్ఛభారత్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ పురోహిత్, రక్షణ మంత్రి నిర్మలా, సీఎం పళనిస్వామి, రజనీకాంత్ పలువురు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య విలువలపై.. ‘దేశం’ అత్యాచారం
* ఎమ్మెల్సీ ఓటుకు 5 కోట్లు ఎర.. 50 లక్షల అడ్వాన్స్ * బాసే (చంద్రబాబు) పంపాడంటూ కెమెరాకు చిక్కిన రేవంత్‌రెడ్డి * ఏసీబీ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే * నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులిస్తూ పట్టుబడ్డ తెలుగుదేశం పార్టీ నాయకుడు * కావాలంటే బాస్ దగ్గరికి తీసుకెళ్తానన్న రేవంత్ఇబ్బంది వస్తే ఏపీలో నామినేటెడ్ పదవి ఇప్పిస్తామని హామీ * పక్కా సమాచారం మేరకు నిఘా పెట్టిన ఏసీబీ * రాయబారాలు.. బేరసారాలన్నీ వీడియోల చిత్రీకరణ * రేవంత్‌తో పాటు ఇద్దరు అనుచరులను అరెస్టు చేసిన అధికారులు.. కేసు నమోదు సాక్షి, హైదరాబాద్: పదవులే పరమావధిగా.. అడ్డదారిలోనైనా గెలవడమే లక్ష్యంగా.. తెలుగుదేశంపార్టీ బరితెగించిన వైనం బట్టబయలైంది. విపక్షాలు తమ ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొంటున్నాయంటూ మహానాడు సాక్షిగా విలువల పాఠాలు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నిజస్వరూపం వీధిన పడింది. చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్న బాబు దొంగనాటకం కెమెరాల సాక్షిగా బయటపడింది. కోట్లు ఎరవేసి అయినా ఎమ్మెల్యేలను కొనేసి.. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఆయన దుర్మార్గపు వ్యవహారం గుట్టు రట్టయింది. అధికారంకోసం చంద్రబాబు అండ్ కో ఎంతకైనా దిగజారుతారని, ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తారని మరోసారి రుజువైంది. తెలుగుజాతి ఖ్యాతిని దేశ దేశాలకు విస్తరిసానని చెప్పిన చంద్రబాబు చర్యలతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు తలదించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రకటించడమే లక్ష్యమని పదేపదే చెప్పుకునే పార్టీ నేడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి తలవంపులు తెచ్చింది. చంద్రబాబు ఆదేశాలతో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. తనను తన బాసే(చంద్రబాబు) పంపాడంటూ రహస్య కెమెరాలకు అడ్డంగా చిక్కారు. తమ పార్టీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి అనుకూలంగా ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు ఆఫర్ ఇచ్చి, రూ.50 లక్షలు అడ్వాన్సుగా ఇస్తుండగా ఏసీబీ వలపన్ని పట్టుకుంది. రేవంత్‌ను, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసింది. తెలంగాణలో సోమవారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు వెలుగులోకి వచ్చిన ఈ ముడుపుల బాగోతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తనకు డబ్బు ఆశచూపిన విషయంపై స్ట్టీఫెన్సన్ శనివారమే ఏసీబీకి సమాచారం అందించారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కాగా వలపన్నారు. తొలుత అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇచ్చేందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి ఫోన్ చేశారు. అయితే స్టీఫెన్ తన ఇంటికి కాకుండా, తనకు సోదరుడి వరుసయ్యే సంపత్‌రెడ్డి ఇంటికి రేవంత్‌ను రమ్మన్నారు. విజయపురి కాలనీలోని పుష్పా నిలయం అపార్ట్మెంట్లో ఉన్న 4వ నంబర్ ఫ్లాట్‌లో కలుద్దామని చెప్పారు. ఆదివారం సాయంత్రం 3 గంటలకు రేవంత్‌రెడ్డి తన వాహనంలో డబ్బు బ్యాగులతో వచ్చారు. మరో ఇద్దరు వ్యక్తులు వేరే కారులో అక్కడికి చేరుకున్నారు. వారితో కలిసి ఫ్లాట్‌లోకి వెళ్లిన రేవంత్ తన వెంట తెచ్చిన రూ.50 లక్షలను స్టీఫెన్ ముందు పెట్టారు. రేవంత్ అనుచరులు బ్యాగ్‌లోని నోట్ల కట్టలను తీసి అక్కడున్న టీపాయ్‌పై సర్దారు. ఈ సమయంలో ఇరువురి మధ్య కొంతసేపు సంభాషణ జరిగింది. అనంతరం మిగతా డబ్బును రాత్రికల్లా అందజేస్తానని మాటిచ్చిన రేవంత్.. అక్కడి నుంచి బయలుదేరారు. అప్పటికే పక్కా సమాచారం మేరకు సమీపంలో మాటేసిన ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేశారు. డబ్బు కట్టలను సీజ్ చేయడంతో పాటు రేవంత్‌రెడ్డిని, ఆయనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సంపత్‌రెడ్డి నివాసంలోనే ఆ ముడుపుల సొమ్మును లెక్కించి పంచనామా నిర్వహించిన అనంతరం ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రేవంత్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించి, బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ అరెస్టు వ్యవహారాన్ని ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ ధ్రువీకరించారు. లంచం ఇచ్చినందుకు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి తీసుకొచ్చిన రూ.50 లక్షల మొత్తాన్ని లెక్కించి 102 సీఆర్పీసీ కింద సీజ్ చేసినట్లు తెలిపారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. కాగా ఇదంతా అవాస్తవమని, తనను కుట్రపూరితంగా ఇరికించారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఈ డీల్‌కు సంబంధించిన వీడియోలు మీడియాకు అందాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ చేసిన బండారం బయటపడింది. రేవంత్‌ను సోమవారం ఉదయం కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడు రోజులుగా నిఘా: తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు మెజారిటీ సభ్యుల బలం లేకపోవడంతో టీడీపీ ఈ డీల్‌కు తెరలేపింది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారం మొత్తాన్ని.. స్టీఫెన్సన్, రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన రాయబారాలు, బేరసారాలకు సంబంధించిన దృశ్యాలను ఏసీబీ రహస్యంగా చిత్రీకరించింది. తమ బాస్ సూచనల మేరకే వచ్చినట్లు రేవంత్‌రెడ్డి పదే పదే ప్రస్తావించడం.. ఈ డీల్ వెనుక స్వయంగా చంద్ర బాబు ప్రమేయం ఉందని స్పష్టం చేస్తోంది. -
ప్రజాస్వామ్య విలువలపై.. ‘దేశం’ అత్యాచారం