జైపూర్: దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలు, బెదిరింపులతో ప్రతిపక్ష నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. గత పదేళ్ల ఎన్డీయే పాలనలో ఒరిగిందేమీ లేదని అన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు.
నేడు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు విధ్వంసానికి గురవుతున్నాయని తెలిపారు. ఎన్డీయే పాలనలో రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనలను సహించే ప్రసక్తే లేదని, తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇది ప్రజలందరికీ చెందుతుందని పేర్కొన్నారు.
‘గ్యారంటీ’ని దొంగిలించిన మోదీ: ఖర్గే
అబద్ధాల నాయకుడు నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘గ్యారంటీ’ అనే పదాన్ని కాంగ్రెస్ నుంచి మోదీ దొంగిలించారని చెప్పారు. అవినీతిపరులు బీజేపీలో చేరగానే పరిశుద్ధులుగా మారిపోతున్నారని ప్రియాంకాగాంధీ వాద్రా ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment