సాక్షి, చెన్నై: విశ్వసనీయతపై మీడియా మరింత దృష్టి పెట్టాలని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వార్తా కథనాలు అందించాలని ప్రధాని మోదీ సూచించారు. వార్తల్లో కచ్చితత్వానికి ప్రాధాన్యమివ్వాలని ఆకాంక్షించారు. ప్రముఖ తమిళ దినపత్రిక ‘దిన తంతి’ 75వ వార్షికోత్సవ వేడుకల్లో సోమవారం ప్రధాని ప్రసంగిస్తూ.. ఎప్పుడూ రాజకీయ నాయకుల చుట్టూనే కాకుండా ప్రజల విజయ గాథల్ని అందించడంపై మీడియా దృష్టి పెట్టాలన్నారు. ‘ప్రజాప్రయోజనాల కోసం పత్రికలు తమకున్న స్వేచ్ఛను తెలివిగా వాడుకోవాలి. వార్తలు రాసే క్రమంలో కచ్చితత్వంలేని, వాస్తవ విరుద్ధమైన స్వేచ్ఛతో వ్యవహరించకూడదు. ఏది ముఖ్యం, మొదటి పేజీలో ఏ వార్తకు ఎంత స్థలం కేటాయించాలి, దేనికి అధిక ప్రాధాన్యమివ్వాలి అనేవి ఎడిటర్లు నిర్ణయించుకోవాలి’ అని అన్నారు. ‘మీడియా నిజంగా ఒక శక్తే. దానిని దుర్వినియోగం చేయడం నేరం. మీడియా సంస్థలు ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలో ఉన్నా ప్రజా ప్రయోజనం కోసం పనిచేయాలి’ అని సూచించారు.
ఆరోగ్యకర పోరుతో ప్రజాస్వామ్యానికి మేలు
గ్రామాల్లో బ్లాక్ బోర్డులపై వార్తలు రాసే స్థాయి నుంచి నేడు ఆన్‌లైన్‌లో క్షణాల్లో సమాచారం ప్రజలకు అందుతోందని, అందువల్ల సరైన వార్తలు అందించడంలో మీడియా అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘ప్రజలు వివిధ మార్గాల్లో వార్తల్ని విశ్లేషించడంతో పాటు నిర్ధారించుకుంటున్నారు. మొబైల్ ఫోన్లలో కూడా సమాచారాన్ని తెలుసుకుంటున్న నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం అందించేలా మీడియా మరింత కృషి చేయాలి. విశ్వసనీయ మీడియా సంస్థల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ప్రజాస్వామ్యానికి కూడా మంచిది’ అని ప్రధాని చెప్పారు.
మన కలం శక్తికి తెల్లదొరలు భయపడ్డారు..
దేశంలో అధిక శాతం మీడియా చర్చలు రాజకీయాల చుట్టూ తిరగడం సహజమేనని, ప్రజాస్వామ్యంలో అంతకుమించిన విషయాలు ఎన్నో ఉన్నాయని మోదీ అన్నారు. ‘ప్రజలకుసంబంధించిన కథనాలు, విజయాలపై మీడియా ఎక్కువ దృష్టి పెడితే ఆనందిస్తా’ అని అన్నారు. బ్రిటిష్ పాలనలో మహాత్మాగాంధీ, తిలక్‌ల సందేశాన్ని ప్రజలకు చేరవేసిన భారతీయ విలేకరులను చూసి తెల్లదొరలు భయపడ్డారని చెప్పారు. స్వచ్ఛభారత్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ పురోహిత్, రక్షణ మంత్రి నిర్మలా, సీఎం పళనిస్వామి, రజనీకాంత్ పలువురు పాల్గొన్నారు.
మరింత విశ్వసనీయత అవసరం
Published Tue, Nov 7 2017 1:47 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment