ప్రజాస్వామ్య విలువలపై.. ‘దేశం’ అత్యాచారం | Telugu desam party try to rape democracy values | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య విలువలపై.. ‘దేశం’ అత్యాచారం

Published Mon, Jun 1 2015 3:40 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ప్రజాస్వామ్య విలువలపై.. ‘దేశం’ అత్యాచారం - Sakshi

ప్రజాస్వామ్య విలువలపై.. ‘దేశం’ అత్యాచారం

* ఎమ్మెల్సీ ఓటుకు 5 కోట్లు ఎర.. 50 లక్షల అడ్వాన్స్
* బాసే (చంద్రబాబు) పంపాడంటూ కెమెరాకు చిక్కిన రేవంత్‌రెడ్డి
* ఏసీబీ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే
* నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ముడు
పులిస్తూ పట్టుబడ్డ తెలుగుదేశం పార్టీ నాయకుడు
* కావాలంటే బాస్ దగ్గరికి తీసుకెళ్తానన్న రేవంత్ఇబ్బంది వస్తే ఏపీలో నామినేటెడ్ పదవి ఇప్పిస్తామని హామీ
* పక్కా సమాచారం మేరకు నిఘా పెట్టిన ఏసీబీ
* రాయబారాలు.. బేరసారాలన్నీ వీడియోల చిత్రీకరణ
* రేవంత్‌తో పాటు ఇద్దరు అనుచరులను అరెస్టు చేసిన అధికారులు.. కేసు నమోదు

 
 సాక్షి, హైదరాబాద్: పదవులే పరమావధిగా.. అడ్డదారిలోనైనా గెలవడమే లక్ష్యంగా.. తెలుగుదేశంపార్టీ బరితెగించిన వైనం బట్టబయలైంది. విపక్షాలు తమ ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొంటున్నాయంటూ మహానాడు సాక్షిగా విలువల పాఠాలు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నిజస్వరూపం వీధిన పడింది. చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్న బాబు దొంగనాటకం కెమెరాల సాక్షిగా బయటపడింది. కోట్లు ఎరవేసి అయినా ఎమ్మెల్యేలను కొనేసి.. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఆయన దుర్మార్గపు వ్యవహారం గుట్టు రట్టయింది. అధికారంకోసం చంద్రబాబు అండ్ కో ఎంతకైనా దిగజారుతారని, ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తారని మరోసారి రుజువైంది.
తెలుగుజాతి ఖ్యాతిని దేశ దేశాలకు విస్తరిసానని చెప్పిన చంద్రబాబు చర్యలతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు తలదించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రకటించడమే లక్ష్యమని పదేపదే చెప్పుకునే పార్టీ నేడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి తలవంపులు తెచ్చింది. చంద్రబాబు ఆదేశాలతో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. తనను తన బాసే(చంద్రబాబు) పంపాడంటూ రహస్య కెమెరాలకు అడ్డంగా చిక్కారు. తమ పార్టీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి అనుకూలంగా ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్లు ఆఫర్ ఇచ్చి, రూ.50 లక్షలు అడ్వాన్సుగా ఇస్తుండగా ఏసీబీ వలపన్ని పట్టుకుంది. రేవంత్‌ను, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసింది. తెలంగాణలో సోమవారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు వెలుగులోకి వచ్చిన ఈ ముడుపుల బాగోతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
 
 టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తనకు డబ్బు ఆశచూపిన విషయంపై స్ట్టీఫెన్‌సన్ శనివారమే ఏసీబీకి సమాచారం అందించారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కాగా వలపన్నారు. తొలుత అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇచ్చేందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి ఫోన్ చేశారు. అయితే స్టీఫెన్ తన ఇంటికి కాకుండా, తనకు సోదరుడి వరుసయ్యే సంపత్‌రెడ్డి ఇంటికి రేవంత్‌ను రమ్మన్నారు. విజయపురి కాలనీలోని పుష్పా నిలయం అపార్ట్‌మెంట్‌లో ఉన్న 4వ నంబర్ ఫ్లాట్‌లో కలుద్దామని చెప్పారు. ఆదివారం సాయంత్రం 3 గంటలకు రేవంత్‌రెడ్డి తన వాహనంలో డబ్బు బ్యాగులతో వచ్చారు.
 
 మరో ఇద్దరు వ్యక్తులు వేరే కారులో అక్కడికి చేరుకున్నారు. వారితో కలిసి ఫ్లాట్‌లోకి వెళ్లిన రేవంత్ తన వెంట తెచ్చిన రూ.50 లక్షలను స్టీఫెన్ ముందు పెట్టారు. రేవంత్ అనుచరులు బ్యాగ్‌లోని నోట్ల కట్టలను తీసి అక్కడున్న టీపాయ్‌పై సర్దారు. ఈ సమయంలో ఇరువురి మధ్య కొంతసేపు సంభాషణ జరిగింది. అనంతరం మిగతా డబ్బును రాత్రికల్లా అందజేస్తానని మాటిచ్చిన రేవంత్.. అక్కడి నుంచి బయలుదేరారు. అప్పటికే పక్కా సమాచారం మేరకు సమీపంలో మాటేసిన ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేశారు. డబ్బు కట్టలను సీజ్ చేయడంతో పాటు రేవంత్‌రెడ్డిని, ఆయనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సంపత్‌రెడ్డి నివాసంలోనే ఆ ముడుపుల సొమ్మును లెక్కించి పంచనామా నిర్వహించిన అనంతరం ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
 
 రేవంత్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించి, బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ అరెస్టు వ్యవహారాన్ని ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ ధ్రువీకరించారు. లంచం ఇచ్చినందుకు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి తీసుకొచ్చిన రూ.50 లక్షల మొత్తాన్ని లెక్కించి 102 సీఆర్‌పీసీ కింద సీజ్ చేసినట్లు తెలిపారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. కాగా ఇదంతా అవాస్తవమని, తనను కుట్రపూరితంగా ఇరికించారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఈ డీల్‌కు సంబంధించిన వీడియోలు మీడియాకు అందాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ చేసిన బండారం బయటపడింది. రేవంత్‌ను సోమవారం ఉదయం కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
 
 మూడు రోజులుగా నిఘా: తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు మెజారిటీ సభ్యుల బలం లేకపోవడంతో టీడీపీ ఈ డీల్‌కు తెరలేపింది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారం మొత్తాన్ని.. స్టీఫెన్‌సన్, రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన రాయబారాలు, బేరసారాలకు సంబంధించిన దృశ్యాలను ఏసీబీ రహస్యంగా చిత్రీకరించింది. తమ బాస్ సూచనల మేరకే  వచ్చినట్లు రేవంత్‌రెడ్డి పదే పదే ప్రస్తావించడం.. ఈ డీల్ వెనుక స్వయంగా చంద్ర బాబు ప్రమేయం ఉందని స్పష్టం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement