హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ ఒక లొట్ట పీసు సీఎం అని, తనదొక లొట్టపీసు కేసు అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈరోజు(గురువారం) ఏసీబీ విచారణలో తనను అడిగిన ప్రశ్నలే పదే పదే అడిగారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది తర్వాత కూడా రేవంత్‌ను ఎవరూ ముఖ్యమంత్రిగా గుర్తించలేదని విమర్శించారు.
ఏసీబీ(ACB) విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ‘ఎవరకీ రేవంత్ పేరు కూడా గుర్తు ఉండటం లేదు. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోపెట్టినట్లు రేవంత్ తీరుంది. ఏసీబీ అధికారుల వద్ద ప్రశ్నలు ఏమీ లేవు. రేవంత్ రెడ్డి ఏమైనా ప్రశ్నలు పంపితే ఏసీబీ మళ్ళీ పిలుస్తోందేమో. ఏసీబీ 80 పైగా ప్రశ్నలు అడిగింది. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగింది. ఏసీబీకి కూడా ఈ కేసులో ఏమీ లేదని తెలుసు. రేవంత్‌రెడ్డి జైలుకి వెళ్లారు కాబట్టే అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నారు. ఇంకా వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటా. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా సమాధానం ఇస్తా. రేపటినుంచి ప్రజాక్షేత్రంలో పోరాటాలు కొనసాగిస్తాం. యాధావిధిగా పార్టీ క్యాడర్ ప్రజా సమస్యలపై పోరాడాలి’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఏడుగంటల పాటు ఏసీబీ విచారణ
ఫార్ములావన్ ఈ -కార్ కేసులో భాగంగా ఈరోజు(గురువారం) కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. సుమారు ఏడు గంటలపాటు కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. అయితే మరొకసారి విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ స్పష్టం చేసింది. ఈ మేరకు కేటీఆర్ మరోసారి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment