serious issue
-
మణిపూర్ సమస్యను కామెడీగా మార్చేస్తారా?
వయనాడ్: మణిపూర్ హింసాకాండ వంటి అతి తీవ్రమైన సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ నవ్వులాటగా మార్చేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. వయనాడ్ ఎంపీ అయిన ఆయన అనర్హత వేటు తొలగాక శనివారం తొలిసారి కేరళలో పర్యటించారు. కాల్పెట్టలో యూడీఎఫ్ బహిరంగ సభలో మాట్లాడారు. మణిపూర్ సమస్యను విపక్షాలు పార్లమెంటు దాకా తీసుకెళ్లి చర్చకు పెట్టినా దానిపై మాట్లాడటానికి కూడా మోదీ ఇష్టపడలేదని ఆరోపించారు. ‘అవిశ్వాస తీర్మానంపై చర్చకు బదులిస్తూ మోదీ 2 గంటల 13 నిమిషాల సేపు ప్రసంగించారు. అందులో ఏకంగా 2 గంటల పాటు కాంగ్రెస్ గురించి, నా గురించి, విపక్ష ఇండియా కూటమి గురించి... ఇలా అన్నింటి గురించీ మాట్లాడారు. అంతసేపూ మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు అన్నింటి మీదా జోకులు వేశారు. నవ్వుకున్నారు. కానీ అసలు సమస్య మణిపూర్ హింసాకాండ గురించి మాట్లాడేందుకు మాత్రం మోదీ కేటాయించింది కేవలం రెండంటే రెండే నిమిషాలు! భారత్ అనే భావనకే మణిపూర్‌లో తూట్లు పొడిచారు‘ అని మండిపడ్డారు. భారత్ అనే భావనకే తూట్లు పొడిచే వాళ్లు జాతీయవాదులు ఎలా అవుతారని రాహుల్ ప్రశ్నించారు. మణిపురీల దుస్థితి చూసి.. చలించిపోయా మణిపూర్ పర్యటన సందర్భంగా అక్కడి బాధితుల దుస్థితి చూసి ఆపాదమస్తకం చలించిపోయానని రాహుల్ గుర్తు చేసుకున్నారు. తన 19 ఏళ్ల రాజకీయ జీవితంలో అంతటి దారుణ పరిస్థితులను ఎన్నడూ చూడలేదని ఆవేదన వెలిబుచ్చారు. బీజేపీయే తన స్వార్థ ప్రయోజనాల కోసం మణిపూర్ ప్రజల మధ్య నిలువునా చీలిక తెచి్చందని ఆరోపించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కనీసం ఐదేళ్లయినా పడుతుందని అభిప్రాయపడ్డారు. ‘ పునరావాస కేంద్రాల్లో ఒక మహిళ చెప్పింది విని కన్నీరు పెట్టా. కొడుకును ఆమె కళ్ల ముందే చంపారు. మిగతా అందరూ కుటుంబాలతో ఉంటే ఆమె మాత్రం ఒంటరిగా పడుకుని కనిపించింది. మీ వాళ్లెక్కడ అని అడిగితే ఎవరూ మిగల్లేదంటూ ఏడ్చేసింది. తన పక్కన పడుకున్న కొడుకును కళ్ల ముందే కాల్చేస్తే రాత్రంతా శవం పక్కనే గడిపానని గుర్తు చేసుకుంది. తనెలాగూ తిరిగి రాడని గుండె రాయి చేసుకుని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నానని చెప్పింది. ఆ ఘోర కలి గురించి చెప్తూ కూడా వణికిపోయింది. ఇంకో బాధిత మహిళ తనకు జరిగిన దారుణాలను తలచుకున్నంత మాత్రాన్నే స్పృహ తప్పి పడిపోయింది. మణిపూర్‌లో ఇలాంటి దారుణ గాథలు వేలాదిగా ఉన్నాయి. నా తల్లికి, చెల్లికి ఇలా జరిగితే ఎలా ఉంటుందని ఊహించుకున్నా‘ అన్నారు. -
బలవంతపు మతమార్పిళ్లు... దేశభద్రతకే పెనుసవాలు!
న్యూఢిల్లీ: బలవంతపు మతమార్పిడులను అత్యంత తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. మోసగించి, ప్రలోభపెట్టి, భయపెట్టి మతాంతరీకరణ చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేసింది. ‘‘మత స్వేచ్ఛ ఉండొచ్చు. కానీ బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ ఎవరికీ లేదు! ఈ తరహా మార్పిడులను అడ్డుకోని పక్షంలో చాలా సమస్యాత్మక పరిస్థితులు తలెత్తుతాయి. ఈ పోకడలు నిజమే అయితే గనక అంతిమంగా ఇది దేశభద్రతకే పెను సవాలు విసరగలిగినంతటి తీవ్రమైన సమస్య! అంతేగాక పౌరులు తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను కూడా ప్రమాదంలో పడేస్తుంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తక్షణం జోక్యం చేసుకోండి. బలవంతపు మతమార్పిళ్లకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోండి. ఆ వివరాలతో 22లోగా అఫిడవిట్ దాఖలు చేయండి’’ అని ఆదేశించింది. బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ అడ్వకేట్ అశ్వనీకుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. బలవంతపు మతమార్పిడులను అడ్డుకునేందుకు కేంద్రం ఏం చేయనుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. ఈ అంశాన్ని రాజ్యాంగ పరిషత్తులో చర్చించినట్టు ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘డబ్బు తదితర ప్రలోభాలు చూపి, భయపెట్టి, మోసగించి మతం మార్చడాన్ని అడ్డుకునేందుకు ఒడిశా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తెచ్చిన రెండు చట్టాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ అంశం గతంలో సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినప్పుడు ఆ చట్టాల చెల్లుబాటును సమర్థించింది కూడా’’ అని ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల్లో ఈ బలవంతపు మతమార్పిళ్లు అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయన్నారు. ‘‘తాము క్రిమినల్ నేరాల్లో భాగస్వాములుగా మారుతున్నామన్న వాస్తవం కూడా ఇలాంటి బాధితులకు చాలాసార్లు తెలియదు. పైగా మతం మారుస్తున్న వాళ్లు తమకు సాయం చేస్తున్నారని భ్రమిస్తుంటారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. విచారణను నవంబర్ 28కి ధర్మాసనం వాయిదా వేసింది. -
రాజ్యాంగ పరిధిలో పరిశీలించాలి
మూడుసార్ల తలాక్‌పై సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ముస్లిం సమాజంలో మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులిచ్చే పద్ధతి ఎంతో కీలకమైనదని, పెద్ద సంఖ్యలో ప్రజల జీవితాలపై ప్రభావం చూపే అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. దీన్ని రాజ్యాంగ పరిధిలోని ప్రమాణాల ఆధారంగా పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో పర్సనల్ లా చట్టబద్ధత అంశాన్ని పరిశీలించేందుకు కూడా అంగీకరించింది. ట్రిపుల్ తలాక్ అంశంపై వ్యతిరేక, అనుకూల వర్గాల వైపు నుంచి బలమైన కారణాలు ఉన్నాయని, కాబట్టి ఈ విషయంలో తాము తక్షణమే ఒక నిర్ణయానికి రాలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకుర్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లతో కూడిన ధర్మాసనం బుధవారం పేర్కొంది. ఈ అంశంలో గతంలో ఇచ్చిన తీర్పుల్లో ఏవైనా తప్పులున్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించి.. అవసరమైతే ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించడంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపింది. ట్రిపుల్ తలాక్ అంశంపై గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయపరంగా సమీక్షించడంపై తమ అభిప్రాయాలను తెలిపేందుకు సంబంధిత పక్షాలు సిద్ధపడాలని ఈ సందర్భంగా కోరింది. తదుపరి విచారణను సెప్టెంబర్ ఆరవ తేదీకి వాయిదా వేసింది. ముస్లిం సమాజంలో వివాహ రద్దు(విడాకుల) కోసం మూడుసార్లు తలాక్ చెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. వీరందర్నీ ఈ కేసులో కక్షిదారులుగా చేరేందుకు అనుమతించింది. అదే సమయంలో ట్రిపుల్ తలాక్ అంశంపై తన విధానమేంటో తెలపాలని కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం ఆరువారాల గడువు ఇచ్చింది. -
ట్రిపుల్ తలాక్ చాలా సీరియస్ అంశం
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిశీలించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. తలాక్ పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశంగా పేర్కొన్న బెంచ్ పెద్ద సంఖ్యలో ప్రజల జీవితాలకు సంబంధించినదిగా అభిప్రాయపడింది. మూడుసార్లు తలాక్ చెప్పే అంశాన్ని రాజ్యాంగ ముసాయిదాలోని అంశాల గీటురాయిగా, గత తీర్పుల ఆధారంగా పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగం ఆమోదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని భావిస్తే ముస్లిం మతం వ్యక్తిగత చట్టాలు జోక్యం చేసుకుని వారిని ఒప్పించాలని ధర్మాసనం సూచించింది. అవసరమయితే అయిదుగురు న్యాయమూర్తులతో సుదీర్ఘ బెంచ్ ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపింది. అలాగే విచారణ సందర్భంగా మీడియాను నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేసిన సుప్రీం తదుపరి విచారణకు సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. కాగా ముస్లిం సంప్రదాయంలో వివాహ రద్దు (విడాకుల) కోసం ఆచరణలో ఉన్న తలాక్ (ట్రిపుల్ తలాక్) విధానాన్ని తీవ్రంగా ముస్లిం మహిళలు ఆన్ లైన్ పోరాటానికి దిగారు. ఈ అనైతిక విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ యాభైవేల మంది ముస్లింలు సంతకాలు కూడా చేశారు. ఈ విధానానికి వ్యతిరేకంగా భారతీయ ముస్లిం మహిళా ఆందోళన సంస్థ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. తమకు న్యాయం జరగాలంటే ముస్లిం పర్సనల్ లా బోర్డులో సంస్కరణలు తేవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీం గడప తొక్కారు.