రాజ్యాంగ పరిధిలో పరిశీలించాలి
మూడుసార్ల తలాక్‌పై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ముస్లిం సమాజంలో మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులిచ్చే పద్ధతి ఎంతో కీలకమైనదని, పెద్ద సంఖ్యలో ప్రజల జీవితాలపై ప్రభావం చూపే అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. దీన్ని రాజ్యాంగ పరిధిలోని ప్రమాణాల ఆధారంగా పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో పర్సనల్ లా చట్టబద్ధత అంశాన్ని పరిశీలించేందుకు కూడా అంగీకరించింది. ట్రిపుల్ తలాక్ అంశంపై వ్యతిరేక, అనుకూల వర్గాల వైపు నుంచి బలమైన కారణాలు ఉన్నాయని, కాబట్టి ఈ విషయంలో తాము తక్షణమే ఒక నిర్ణయానికి రాలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకుర్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం పేర్కొంది.
ఈ అంశంలో గతంలో ఇచ్చిన తీర్పుల్లో ఏవైనా తప్పులున్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించి.. అవసరమైతే ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించడంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపింది. ట్రిపుల్ తలాక్ అంశంపై గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయపరంగా సమీక్షించడంపై తమ అభిప్రాయాలను తెలిపేందుకు సంబంధిత పక్షాలు సిద్ధపడాలని ఈ సందర్భంగా కోరింది. తదుపరి విచారణను సెప్టెంబర్ ఆరవ తేదీకి వాయిదా వేసింది. ముస్లిం సమాజంలో వివాహ రద్దు(విడాకుల) కోసం మూడుసార్లు తలాక్ చెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. వీరందర్నీ ఈ కేసులో కక్షిదారులుగా చేరేందుకు అనుమతించింది. అదే సమయంలో ట్రిపుల్ తలాక్ అంశంపై తన విధానమేంటో తెలపాలని కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం ఆరువారాల గడువు ఇచ్చింది.