
న్యూఢిల్లీ: ఒకవైపు ఢిల్లీ హైకోర్టులో బాధ్యతలు ఏమీ అప్పగించడం లేదు.. మరొకవైపు అలహాబాద్ హైకోర్టేమో వద్దంటోంది. ఇది జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రస్తుత పరిస్థితి. ఢిల్లీలోని తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయన ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ చిక్కుల్లో పడ్డారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయడానికి పూనుకున్న సుప్రీంకోర్టు.. ముగ్గురు ప్రధాన న్యాయమూర్తలతో కూడిన కమిటీని ఇప్పటికే నియమించింది.
అయితే యశ్వంత్ వర్మ సచ్ఛీలురుగా బయటకొచ్చేవరకూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్ తో పలు రాష్ట్రాల బార్ అసోయేషన్స్ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలు బార్ అసోసియేషన్ హెడ్స్ తో సీజేఐ సంజీవ్ ఖన్నా ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ బదిలీని నిలుపుదల చేయాలని సదరు బార్ అసోసియేషన్స్ కోరిన తరుణంలో వారితో సీజేఐ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ సమావేశమై వారితో చర్చించారు. వారి డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
#WATCH | Presidents of Bar Associations of High Court of Allahabad, Lucknow bench, Gujarat, Karnataka, and Jabalpur bench of Madhya Pradesh have come to Supreme Court to meet Chief Justice of India Sanjiv Khanna and other senior judges on the issue of Justice Yashwant Varma.… pic.twitter.com/JuX6sLgsl3
— ANI (@ANI) March 27, 2025
ఢిల్లీ హైకోర్టు ‘ దూరం’ పెట్టేసింది..!
జస్టిస్ యశ్వంత్ వర్మపై అవినీతి ఆరోపణల అనంతరం ఏం జరుగుతుందా అని ఉత్కంఠ ఏర్పడింది. యశ్వంత్ యధావిధిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారా.. లేక అలహాబాద్ హైకోర్టు వెళతారా అనే సందిగ్థంలో ఉండగా సుప్రీంకోర్టు కొలీజియం ,, అలహాబాద్ హైకోర్టుకు పంపడానికే మొగ్గుచూపింది. ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ కు ఎటువంటి బాధత్యలు అప్పగించకపోవడంతోనే.. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసనలు..
అయితే అలహాబాద్ హైకోర్టు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తొలుత తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.. దీనిపై తీవ్రంగా మండిపడింది. అవినీతి ఆరోపణలు ఉన్న యశ్వంత్ ను ఇక్కడకు ఎలా బదిలీ చేస్తారంటూ నేరుగా సీజేఐకే లేఖ రాసింది. ఆ ‘ చెత్త’ మాకొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే బదిలీకి, అవినీతి అంశానికి ఎటువంటి సంబంధం లేదని సీజేఐ చెప్పుకొచ్చారు. యశ్వంత్ పై దర్యాప్తు జరుగుతుందంటూనే బదిలీని సమర్ధించుకుంది ధర్మాసనం.
అయినా మళ్లీ అలహాబాద్ హైకోర్టుకే యశ్వంత్ వర్మ అంటూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని.. అక్కడ బార్ అసోసియేషన్ ఖండించింది. జస్టిస్ యశ్వంత్ గతంలో ఇచ్చిన తీర్పులన్నీ రివ్యూ చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. ప్రజల్లో నమ్మకం చూరగొనాలంటే ఆయన తీర్పులపై మళ్లీ సమీక్షలు అవసరమని, సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు చేయించాలని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ డిమాండ్ చేశారు.
ఇంట్లో నోట్ల కట్టలు..!
కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది. ఈ తరుణంలో జస్టిస్ యశ్వంత్ పై సుప్రీంకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయడమే సమంజనమా అనే కోణంలో సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.