
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాసేపటికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ కేవలం బదిలీపై మాత్రమే అలహాబాద్ హైకోర్టుకు వస్తున్నారని, ఆయనకు ప్రస్తుతానికి ఏ విధమైన జ్యుడిషియల్ వర్క్ అప్పచెప్పవద్దని సీజేఐ సంజీవ్ ఖన్నా కోరారు. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ పై విచారణ పెండింగ్ లో ఉన్న క్రమంలోనే ఆయనకు ఏ పనీ అప్పచెప్పవద్దని సీజేఐ సూచించారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఈ తరహా ఆదేశాలనే జారీ చేశారు సీజేఐ.
కేంద్రానికి సిఫార్సు.. గ్రీన్ సిగ్నల్
జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే క్రమంలో కేంద్రానికి ప్రతిపాదన పంపింది సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం. దీనికి ఈరోజు(శుక్రవారం) గ్రీన్ సిగ్నల్ లభించడంతో యశ్వంత్ వర్మ.. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లనున్నారు. 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్ మళ్లీ అక్కడికే వెళ్లనున్నారు.
ఆరు రాష్ట్రాల బార్ అసోసియేన్స్ తో సీజేఐ భేటీ
అయితే యశ్వంత్ వర్మ సచ్ఛీలురుగా బయటకొచ్చేవరకూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్ తో పలు రాష్ట్రాల బార్ అసోయేషన్స్ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలు బార్ అసోసియేషన్ హెడ్స్ తో సీజేఐ సంజీవ్ ఖన్నా నిన్న(గురువారం)ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ బదిలీని నిలుపుదల చేయాలని సదరు బార్ అసోసియేషన్స్ కోరిన తరుణంలో వారితో సీజేఐ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ సమావేశమై వారితో చర్చించారు. వారి డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇంట్లో నోట్ల కట్టలు..!
కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది.
ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయడమే సమంజసమా?, బదిలీ చేసి అక్కడ జ్యుడిషియల్ వ్యవహారాలు అప్పగించకుండా ఉండేలా చేయడమే కరెక్టా అనే కోణంలో వీరు చర్చించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జస్టిస్ యశ్వంత్ పై విచారణ పూర్తయ్యేవరకూ ఎటువంటి బాధ్యతలు కేటాయించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించినట్లు సమాచారం.