
న్యూఢిల్లీ: 2018నాటి ఎలక్టోరల్ బాండ్ పథకం ద్వారా రాజకీయ పార్టీలు అందుకున్న రూ.16,518 కోట్లను జప్తు చేయాలన్న పిటిషన్లను తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్ష చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఖేమ్ సింగ్ భాటి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం కొట్టివేసింది.
ఇందుకు సంబంధించిన పెండింగ్ పిటిషన్లను సైతం తిరస్కరిస్తూ మార్చి 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో అప్పటి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయడం తెల్సిందే. ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు సారథ్యంలో విచారణ జరపాలని, ఆ నిధులను జప్తు చేయాలంటూ గతేడాది ఆగస్ట్‌లో భాటి సహా పలువురు వేసిన పిటిషన్లు సైతం తిరస్కరణకు గురయ్యాయి.