సదుద్దేశంతోనే బాండ్లు: గడ్కరీ
అహ్మదాబాద్: ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దుచేశాక ఈ పథకంపై ప్రజాక్షేత్రంలో చర్చోపచర్చలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన మనసులో మాట చెప్పారు. ‘‘ అసలు విరాళాలు తీసుకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. సదుద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల పథకం తెచ్చాం. పథకాన్ని సుప్రీంకోర్టు రద్దుచేయకుండా అందులోని లోటుపాట్లను సరిచేయాలని సూచనలు చేస్తే బాగుండేది.
సూచనల మేరకు అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూర్చుని చర్చించుకునే అవకాశం దొరికేది. ఏకాభిప్రాయంతో సవరణలు చేసేవాళ్లం’ అని అన్నారు. శుక్రవారం గాంధీనగర్‌లోని ‘గిఫ్ట్ సిటీ’లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. ‘గతంలో అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఇలాంటి పథకం ఒకటి ఉంటే మంచిదని చర్చ జరిగినప్పుడు నేను అందులో పాల్గొన్నా. వనరులు లేకుండా రాజకీయ పార్టీల మనుగడ అసాధ్యం. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే పార్టీలకు నిర్వహణ నిధులిస్తాయి.
భారత్‌లో అలాంటి పద్ధతి లేదు. అందుకే పార్టీలకు ఆర్థిక అండగా నిలబడే ఇలాంటి పథకాలను రూపొందించుకున్నాం. నేరుగా పార్టీలకు విరాళాలు చేరేలా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
విరాళాల అందజేతకు ముందు, తర్వాత అధికారంలో ఉన్న పార్టీ మారిపోతే దాతలకు సమస్యలు వస్తాయి. అందుకే దాతల వివరాలు రహస్యంగా ఉండేలా పథకంలో నిబంధనలు పెట్టాం. ఏదైనా మీడియా సంస్థ తన ఒక కార్యక్రమానికి నిధులు అవసరమైతే స్పాన్సర్‌ను చూసుకుంటుంది. పార్టీ నిర్వహణ, కార్యకలాపాలకు నిధులు అవసరమే కదా’ అని గడ్కరీ ఉదహరించారు. ప్రతిదీ పారదర్శకంగా ఉండాలనే పార్టీలకు విరాళాలు పారదర్శకంగా వచ్చేలా చూశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment