Union Minister Nitin Gadkari
-
ప్రసంగిస్తూనే సొమ్మసిల్లిన గడ్కరీ
యావత్మాల్(మహారాష్ట్ర): మహారాష్ట్రలోని యావత్మాల్ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూనే వేదికపై కుప్పకూలారు. అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయిన ఆయన్ను పార్టీ కార్యకర్తలు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ‘ఎండ వేడిమికి తాళలేక పుసాద్ సభలో అనారోగ్యానికి గురయ్యాను.ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాను. వరుడ్‌లో జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్నాను. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’అంటూ కొద్దిసేపటి తర్వాత ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి గడ్కరీ పోటీ చేస్తున్నారు. మొదటి విడతలో అక్కడ పోలింగ్ పూర్తయింది. రెండో విడతలో భాగంగా ఈనెల 26న యావత్మాల్లో పోలింగ్ జరగనుంది. -
Nitin Gadkari: విరాళాల్లేకుండా పార్టీలు మనలేవు
అహ్మదాబాద్: ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దుచేశాక ఈ పథకంపై ప్రజాక్షేత్రంలో చర్చోపచర్చలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన మనసులో మాట చెప్పారు. ‘‘ అసలు విరాళాలు తీసుకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. సదుద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల పథకం తెచ్చాం. పథకాన్ని సుప్రీంకోర్టు రద్దుచేయకుండా అందులోని లోటుపాట్లను సరిచేయాలని సూచనలు చేస్తే బాగుండేది. సూచనల మేరకు అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూర్చుని చర్చించుకునే అవకాశం దొరికేది. ఏకాభిప్రాయంతో సవరణలు చేసేవాళ్లం’ అని అన్నారు. శుక్రవారం గాంధీనగర్‌లోని ‘గిఫ్ట్ సిటీ’లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. ‘గతంలో అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఇలాంటి పథకం ఒకటి ఉంటే మంచిదని చర్చ జరిగినప్పుడు నేను అందులో పాల్గొన్నా. వనరులు లేకుండా రాజకీయ పార్టీల మనుగడ అసాధ్యం. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే పార్టీలకు నిర్వహణ నిధులిస్తాయి. భారత్‌లో అలాంటి పద్ధతి లేదు. అందుకే పార్టీలకు ఆర్థిక అండగా నిలబడే ఇలాంటి పథకాలను రూపొందించుకున్నాం. నేరుగా పార్టీలకు విరాళాలు చేరేలా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. విరాళాల అందజేతకు ముందు, తర్వాత అధికారంలో ఉన్న పార్టీ మారిపోతే దాతలకు సమస్యలు వస్తాయి. అందుకే దాతల వివరాలు రహస్యంగా ఉండేలా పథకంలో నిబంధనలు పెట్టాం. ఏదైనా మీడియా సంస్థ తన ఒక కార్యక్రమానికి నిధులు అవసరమైతే స్పాన్సర్‌ను చూసుకుంటుంది. పార్టీ నిర్వహణ, కార్యకలాపాలకు నిధులు అవసరమే కదా’ అని గడ్కరీ ఉదహరించారు. ప్రతిదీ పారదర్శకంగా ఉండాలనే పార్టీలకు విరాళాలు పారదర్శకంగా వచ్చేలా చూశామన్నారు. -
19th EV EXPO 2023: 2030 నాటికి కోటి ఈవీలు...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2030 నాటికి వార్షిక ప్రాతిపదికన ఒక కోటి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే ఈవీ విభాగం సుమారు 5 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనాగా చెప్పారు. 19వ ఈవీ ఎక్స్పో–2023 సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘వాహన్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే 34.54 లక్షల ఎలక్ట్రిక్ వెహికిల్స్ నమోదయ్యాయి. ప్రపంచంలోనే నంబర్–1 ఈవీ తయారీదారుగా భారత్ అవతరించే అవకాశం ఉంది. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో భారత్‌ను స్వావలంబన కలిగిన దేశంగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే ఉన్న కాలుష్య వాహనాలను హైబ్రిడ్, పూర్తిగా ఈవీలుగా మార్చేందుకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఖరారవడంతోపాటు సాంకేతిక ప్రదర్శనలు విజయవంతం అయ్యాయి. ప్రజా, సరుకు రవాణా వాహనాలను ఈవీలకు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని మంత్రి వివరించారు. -
భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో
దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రీనర్ ఫ్యూయెల్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని గత కొన్ని రోజులుగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. తాజాగా విడుదలైన ఒక వీడియోలో తన గ్యారేజిలోని ప్రపంచంలోనే మొట్ట మొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా రాజకీయ నాయకులు మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లను వినియోగిస్తారు. కానీ గడ్కరీ దీనికి భిన్నంగా ఇథనాల్ శక్తితో నడిచే 'ఇన్నోవా హైక్రాస్' ప్రోటోటైప్ హైబ్రిడ్ కారుని ఉపయోగిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశ్యంతో ప్రజలకు చెప్పడమే కాకుండా.. తానూ ఆచరిస్తుండటం నిజంగా గొప్ప విషయం. ఈ వీడియోలో తన కారు గురించి వెల్లడిస్తూ.. ఇది ప్రపంచంలో మొట్ట మొదటి 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనమని తెలిపారు. దీనికి కావలసిన ఇంధనం రైతుల దగ్గర నుంచి లభిస్తుందని, ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, పెట్రోల్ కంటే చౌకగా లభిస్తుందని పేర్కొన్నాడు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ కలిగిన ద్విచక్ర వాహనాలు త్వరలోనే మార్కెట్లో లభిస్తాయని, ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల ద్వారా ఇటువంటి ఇంధనాలను అందించడానికి కృషి చేస్తోందని వెల్లడించారు. ఇండియన్ ఆయిల్ ప్రస్తుతం ఇథనాల్ నుంచి ఏవియేషన్-గ్రేడ్ ఇంధనాన్ని వెలికితీసే పనిలో ఉందని తెలిపారు. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే పెట్రోలియం దిగుమతులు రానున్న రోజుల్లో తగ్గుతాయని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: దీపావళికి కొత్త స్కూటర్ కొనాలా? బెస్ట్ మోడల్స్ ఇక్కడ చూడండి! నితిన్ గడ్కరీ గ్యారేజీలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే టయోటా మిరాయ్ కారు కూడా కనిపిస్తుంది. ఇది ఫ్యూచరిస్టిక్ కారు అని, భవిష్యత్తులో ఇలాంటి కార్లు వినియోగంలోకి వస్తాయని వెల్లడించారు. ఈ కారు 1.2 కిలో వాట్ లిథియం అయాన్ బ్యాటరీ, మూడు హైడ్రోజన్ ట్యాంకులు కలిగి ఉంటుంది. కావున ఇది 647 కి.మీ రేంజ్ అందిస్తుంది. -
జోజిలా భారీ గేమ్ ఛేంజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కశ్మీర్‌ను కన్యాకుమారితో అనుసంధానం చేయాలనే కలను సాధించడంలో జోజిలా టన్నెల్‌కీలకపాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. ‘ఈ ప్రాజెక్ట్ ఇండియాలో భారీ గేమ్ ఛేంజర్కాబోతోంది. కశ్మీర్ లోయ, లడఖ్ మధ్య సంవత్సరం పొడవునా కనెక్టివిటీని అందిస్తుంది. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో పనులు కొనసాగిస్తున్న ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు నా అభినందనలు. ఎముకల కొరికే చలిలో కూడా వారు పనులను కొనసాగిస్తున్నారు. టన్నెల్లో దాదాపు 38 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుంది. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. ఇక్కడ రిసార్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్ వంటివి నిర్మిస్తూ.. కశ్మీర్‌ను మరో స్విట్జర్లాండ్‌లా తీర్చిదిద్దుతాం’ అని అన్నారు. మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) నిర్మిస్తున్న జోజిలా టన్నెల్‌నిర్మాణ పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పురోగతిని సోమవారం పరిశీలించారు. ఎంఈఐఎల్ డైరెక్టర్ సి.హెచ్.సుబ్బయ్య, జోజిలా ప్రాజెక్ట్ హెడ్ హర్పాల్ సింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ఇచ్చారు. కశ్మీర్ లోయ, లడఖ్ ప్రాంతం మధ్య అన్ని వాతావరణాలకు అనువుగా ఉండేలా వ్యూహాత్మకంగా జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. 2026 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. -
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ అవినాష్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ అవినాష్‌రెడ్డి కలిశారు. ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి జాతీయ రహదారి పనులకు టెండర్ పిలిచి ఆరు నెలలు అయ్యిందని, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. బాకరపేట నుంచి బెస్తవారిపేట వయా బద్వేల్, పోరుమామిళ్ల రహదారిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
కేంద్రం నుంచి ఏపీకి సంపూర్ణ సహకారం: నితిన్ గడ్కరీ
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఏపీ పారిశ్రామిక వృద్ధిలో రోడ్ కనెక్టివిటీ కీలకమని పేర్కొన్నారు. పోర్టులతో రహదారుల కనెక్టివిటీని బలోపేతం చేస్తామని చెప్పారు. పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో రోడ్ కనెక్టివిటీని పెంచేందుకు రూ.20వేల కోట్లు కేటాయిస్తామని గడ్కరీ తెలిపారు. అలాగే ఏపీలో మత్స్య పరిశ్రమ చాలా కీలకంగా మారిందని గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు. 50-50 భాగస్వామ్యంతో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఈ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోందని వివరించారు. పర్యావరణహిత వాహనాలదే భవిష్యత్ అని స్పష్టంచేశారు. కాలుష్యాన్ని తగ్గించడం చాలా ముఖ్యమని సూచించారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి రాయితీలు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. కేంద్రం నుంచి ఏపీకీ సంపూర్ణ సహకారం ఉంటుందని గడ్కరీ చెప్పారు. దేశంలోని ముఖ్య రాష్ట్రాల్లో ఏపీ ఒకటన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఏపీ జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చదవండి: ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు.. అంబానీ కీలక ప్రకటన -
ప్రపంచ ఆటో తయారీ హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచ ఆటో తయారీ కేంద్రం(హబ్)గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. సమీప భవిష్యత్‌లో దేశీ ఆటో పరిశ్రమ విలువ రూ. 15 లక్షల కోట్లకు చేరే అంచనాలున్నట్లు తెలియజేశారు. జైపూర్‌లో ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ఏర్పాటు చేసిన వాహనాలను తుక్కుగా మార్చే(స్క్రాపింగ్) ప్లాంటును వర్చువల్‌గా ప్రారంభించిన గడ్కరీ ప్రస్తుతం ఆటో పరిశ్రమ దేశ జీడీపీలో 7.1 శాతం వాటాను సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. రూ. 7.8 లక్షల కోట్ల పరిమాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలియజేశారు. 2025కల్లా ఈ సంఖ్య 5 కోట్లను తాకనున్నట్లు అభిప్రాయపడ్డారు. జైపూర్‌లో టాటా మోటార్స్ వార్షికంగా 15,000 వాహన స్క్రాపింగ్ సామర్థ్యంతో తొలిసారి రిజిస్టర్డ్ ప్లాంటును ఏర్పాటు చేసింది. రూ. 15 లక్షల కోట్లకు..: గ్లోబల్ ఆటో తయారీ కేంద్రంగా భారత్‌ను నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. సమీప కాలంలో పరిశ్రమ పరిమాణాన్ని రూ. 15 లక్షల కోట్లకు చేర్చనున్నట్లు చెప్పారు. పాత, పనికిరాని వాహనాలను తొలగించడం ద్వారా స్క్రాపేజ్ పాలసీ దశలవారీగా పర్యావరణ అనుకూల కొత్త వాహనాలకు దారి చూపుతుందని వివరించారు. తుక్కుగా మార్చే తాజా విధానాల వల్ల వాహన డిమాండు ఊపందుకుంటుందని, రూ. 40,000 కోట్ల ఆదనపు జీఎస్టీ ఆదాయానికి వీలుంటుందని తెలిపారు. -
లాభాల కోసం చూడొద్దు.. అమ్మేసుకోండి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఏటేటా పెరుగుతున్న అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ) మీద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డెవలపర్లు అత్యాశగా లాభాల కోసం ఎదురుచూడకుండా ఇన్వెంటరీ గృహాలను విక్రయించుకోవాలని.. దీంతో కనీసం బ్యాంక్ వడ్డీ భారాౖన్నైనా తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఏర్పాటు చేసిన వెబ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇన్వెంటరీ గృహాల విషయంలో అత్యాశ వద్దు. ఎంత ధర వచ్చినా సరే విక్రయించడమే ఉత్తమం. కనీసం చేతిలో నగదు లభ్యత అయినా పెరుగుతుంది. ముంబైలో చాలా మంది బిల్డర్లు ప్రీమియం ధర రావాలని ఇన్వెంటరీని విక్రయించడం లేదు. చ.అ.కు రూ.35–40 వేల ధర వచ్చే వరకు ఎదురుచూస్తున్నారని’’ వివరించారు. ఇన్వెంటరీ కొనుగోళ్ల కోసం వచ్చే కస్టమర్లతో డెవలపర్లు ధరల గురించి చర్చించాలని, బ్యాంక్‌లు, ప్రైవేట్ రుణదాతల వడ్డీ వ్యయ భారం నుంచి విముక్తి కోసమైనా వీటిని విక్రయించడమే మేలని చెప్పారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి, గృహ విభాగంలో డిమాండ్‌ను సృష్టించడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విస్తరించాలన్నారు. రూ.10 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలను నిర్మించాలని కోరారు. రోడ్లు, రహదారుల విభాగంలో భారీ వ్యాపార అవకాశాలున్నాయి. ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగంతో లాజిస్టిక్ పార్క్‌లు, రహదారుల నిర్మాణంలోకి రావాలని సూచించారు. రహదారుల వెంట బస్ డిపోలు, పెట్రోల్ పంప్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్ ఓవర్ బ్రిడ్జ్‌లు వంటివి అభివృద్ధి చేస్తున్నామని.. ఆసక్తివున్న నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం కావాలని సూచించారు. ముంబై–ఢిల్లీ కారిడార్‌లో టౌన్‌షిప్‌ల నిర్మాణం ప్రణాళికలో ఉందని చెప్పారు. సొంతంగా ఫైనాన్స్ కంపెనీలు పెట్టుకోండి.. నిర్మాణ కంపెనీలు తమ వ్యాపార విభాగాలను మార్చుకోవాలని, సొంతంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను స్థాపించాలని సూచించారు. ఉదాహరణకు ఆటోమొబైల్ పరిశ్రమలో చాలా తయారీ కంపెనీలకు సొంతంగా ఆటో ఫైనాన్స్ కంపెనీలున్నాయని తెలిపారు. అలాగే నిర్మాణ సంస్థలు కూడా సొంతంగా గృహ రుణ కంపెనీలను ఏర్పాటు చేసుకొని కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించాలని సూచించారు. దీంతో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల మీద పూర్తిగా ఆధారపడాల్సిన అవసరముండదని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులు, ఇన్వెస్టర్లలకు ఈక్విటీ ఇష్యూల ద్వారా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎన్బీఎఫ్సీలు నిధులను సమీకరించాలని సూచించారు. -
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినా పర్లేదు!
సాక్షి, హైదరాబాద్: మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగి సిందా? రెన్యువల్ వీలుపడలేదా? అయినా పర్లేదు. దీనికి సంబంధించి జూన్ 30 వరకు వెసులుబాటు కల్పించారు. డ్రైవింగ్ లైసెన్సులతోపాటు వాహనాల ఫిట్నెస్ సర్టిఫి కెట్లు, పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు.. ఇలా వాహనాలకు సంబంధించిన పలు రకాల సర్టిఫికెట్ల గడువు ముగిసినవారు, త్వరలో ముగుస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఈ విషయం కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి వెళ్లటంతో ఆయన సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. రవాణా శాఖతో ముడిపడిన వివిధ పత్రాలకు సంబంధించి.. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకు గడువు ముగిసిన, ముగుస్తున్న వాటికి సంబంధించిన వాహనదారులపై ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం ఎలాం టి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకు గడువు ముగిసినవాటిని జూన్ 30 తర్వాత రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు. -
డీసీఐని మూసివేసే ప్రసక్తే లేదు: గడ్కరీ
సాక్షి, విశాఖపట్నం: ప్రకాశం జిల్లా ఓడరేవుకు 3వేల ఎకరాలు కేటాయిస్తే పోర్టు నిర్మాణానికి మేము సిద్ధమని కేంద్ర షిప్పంగ్ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆమేరకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు అందిస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ)విషయంలో ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. దీనికి సంబంధించిన కేంద్ర కార్యాలయం విశాఖలోనే ఉంటుందని, దానిని మూసివేసే ప్రసక్తే లేదని తెలిపారు. డీసీఐని బలోపేతం చేయడమే మా లక్ష్యమని, దీనికి సంబంధించి కెబినెట్ నోట్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. డీసీఐ సేవల్లో మరింత పోటీ పెంచి, మరికొన్ని ఉద్యోగాలు కల్పిస్తామని గడ్కరీ తెలిపారు. సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖ పోర్టుకు అనుబంధంగా శాటిలైట్ పోర్టును ఏర్పాటు చేస్తామని గడ్కరీ చెప్పారు. ప్రధాన పోర్టుల నుంచి వ్యవసాయ, అక్వా ఉత్పత్తు ఎగుమతికి ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అన్నీ మేజర్ పోర్టులలో టూరిజం అభివృద్ధికి ఫ్లోటింగ్ హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాటర్‌వేస్ టూరిజం అభివృద్ధి చేయబోతున్నామని, ముంబై నుంచి గోవాకు టూరిజం క్రూయిజ్‌టు నడుపుతున్నామన్నారు. పోర్టుల ఆధునీకరణ, యాంత్రీకరణంగా గైడ్ చేసేందుకు మద్రాస్ ఐఐటీ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. మురుగు నీరు సముద్రంలో చేరకుండా సీవెజ్ ప్లాంట్ల నిర్మాణం అన్నీ పోర్టులకు తప్పనిసరి చేశామని పేర్కొన్నారు. -
వాహన పరిశ్రమకు ’స్క్రాప్’ బూస్ట్
* వినూత్న పాలసీకి కేంద్రం కసరత్తు * కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడి న్యూఢిల్లీ: దేశ ఆటో పరిశ్రమకు ఊపునిచ్చే వినూత్న పథక ప్రకటనకు కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ ఆదివారం తెలిపిన సమాచారం ప్రకారం- కాలుష్య కారకమైన పాతవాహనాలను అప్పగిస్తే- ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఉద్దేశించిన కొత్త ‘స్క్రాప్’ పథకం ముసాయిదా సిద్ధమయ్యింది. సంబంధిత వర్గాల సలహాలు, సూచనల కోసం ఈ ముసాయిదాను మరో వారం రోజుల్లో మంత్రిత్వశాఖ వెబ్సైట్లో ఉంచుతున్నట్లు మంత్రి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయా అంశాల ప్రాతిపదికన ముసాయిదాను ఆమోదం నిమిత్తం ఆర్థిక మంత్రిత్వశాఖ ముందు ఉంచుతామని తెలిపారు. ఇక్కడ ఆమోదం లభించిన వెంటనే ఈ విధానం కేబినెట్ ముందుకు వెళుతుంన్నారు. రానున్న ఐదేళ్లలో ఆటో పరిశ్రమ 4 రెట్లు పెరిగి రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరుకునేలా ముసాయిదా రూపకల్పన జరిగినట్లు వెల్లడించారు. ప్రపంచ అత్యుత్తమ కార్ల ఎగుమతుల విషయంలో భారత్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకునే శక్తిసామర్థ్యాలను సముపార్జించుకుంటున్నట్లు వెల్లడించారు. కాలుష్య కారక తమ పాతవాహనాన్ని అప్పగించి కొత్త వాహన కొనుగోలుపై ఎక్సైజ్ సుంకంపై 50% రిబేట్ ఇచ్చే అంశం ముసాయిదాలో ఉన్నట్లు తెలిపారు. -
మా కూతురును సైన్యంలో చేరుస్తా
అమర జవాను హనుమంతప్ప భార్య వెల్లడి నాగ్‌పూర్: కూతురు పెద్దయ్యాక తనను సైన్యంలో చేర్పిస్తానని అమర జవాను హనుమంతప్ప భార్య మహాదేవి తెలిపారు. లాన్స్ నాయక్ హనుమంతప్ప సియాచిన్‌లో హిమపాతం కారణంగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన మంచుకింద ఆరురోజులు చిక్కుకుపోయారు. తర్వాత గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 11న మృతిచెందారు. కాగా, తమకు కుమారుడు లేనందుకు బాధలేదని, తమ ఏకైక కుమార్తెనే పెద్దయ్యాక భారత సైన్యం లో చేర్పిస్తానని మహాదేవి పేర్కొన్నారు. అదే హనుమంతప్పకు నిజమైన నివాళి అని అన్నారు. హనుమంతప్ప తల్లి బసమ్మ, మహాదేవిలను నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ భార్య కంచన్ హనుమంతప్ప కుటుంబానికి లక్షరూపాయల చెక్‌ను అందజేశారు. ఏబీవీపీ, యువ జాగరణ్ మంచ్‌లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. -
పేదలకు రూ. 5లక్షల లోపే ఇళ్లు!
కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ♦ దేశంలో రూ. 10 లక్షల కన్నా ఎక్కువకు ఇల్లు కొనుక్కునేవారు ఒక్కశాతమే ♦ రూ. 5 లక్షలలోపు అందిస్తే 30 శాతం మందికి ఇళ్లు న్యూఢిల్లీ: పేదలకు తక్కువ ధరలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఉపరితల రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. రూ.5 లక్షల కంటే తక్కువ ధరకే ఇళ్లను అందిస్తామని చెప్పారు. ‘తక్కువ ధరకు ఇళ్లు నిర్మించడం చాలా ముఖ్యమైన అంశం. మనదేశంలో రూ.10 లక్షల కన్నా ఎక్కువ వెచ్చించి ఇల్లు కొనుక్కునేవారు కేవలం ఒక్క శాతమే ఉన్నారు. రూ.5 లక్షల లోపు ఇళ్లను అందించగలిగితే దాదాపు 30 శాతం మంది వాటిని కొనుక్కోగలుగుతారు’ అని ఆయన చెప్పారు. బుధవారమిక్కడ ‘స్మార్ట్ సిటీ’పై అసోచామ్ నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు. స్మార్ట్‌సిటీల నిర్మాణంతోపాటు పేదలకు తక్కువ ధరలో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కేంద్రం అధికార ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నాగ్‌పూర్‌లో ప్రయోగ ప్రాతిపదికన ఇలాంటి వెంచర్ ఒకటి చేపట్టినట్టు వివరించారు. నిర్మాణానికి ఒక చదరపు అడుగుకు రూ.వెయ్యి వెచ్చించినట్టు వివరించారు. ఈ లెక్కన 450 చదరపు అడుగుల ఇంటిని రూ.5 లక్షలలోపే నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 20న ఈ ఇళ్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. -
బుర్జ్ ఖలీఫాను మించేలా చత్రపతి టవర్!
ముంబయి: దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బుర్జ్ ఖలిఫాలాంటి నిర్మాణాన్ని అంతకంటే ఎత్తులో ముంబయిలో నిర్మించాలని అనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మరాఠ వీరుడు చత్రపతి శివాజీకి గుర్తుగా దానిని నిర్మించాలని ఉందన్నారు. అయితే, ఇది అధికారిక ప్రకటన కాదని కేవలం తన మనసులో మాట అని మాత్రమే చెప్పారు. ప్రపంచంలో ఎత్తయిన బుర్జ్ ఖలీఫా లాంటి ఎత్తయిన భవనం ముంబయి సముద్ర తీరంలో ఉండాలని, దానిని చత్రపతి శివాజీ టవర్ అని పిలిస్తే చూడాలనేది తన కోరిక అని అన్నారు. అందులో 30 ఫ్లోర్స్ కేవలం సమావేశాలకోసమే ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.మరో 30 ఫ్లోర్లు రెస్టారెంట్లు, మరో 30 హోటల్స్, 20 షాపింగ్ మాల్స్, మరెన్నో ఫ్లోర్స్ పార్కింగ్ కు ఉండాలని చెప్పారు. బుర్జ్ ఖలీపా ప్రపంచంలోనే 829.8 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనంగా ఉంది. -
భారత్-శ్రీలంక అనుసంధానం
రూ. 22,000 కోట్లతో ప్రాజెక్టు... ♦ రహదారులు, నౌకా రంగాల్లో 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ♦ రూ. 6 లక్షల కోట్ల ప్రాజెక్టులకు వ్యూహ రచన ♦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటన న్యూఢిల్లీ : రహదారులు, నౌకా రంగాల్లో ప్రభుత్వం 50 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఈ కీలక రంగాల్లో భారీగా రూ.6 లక్షల కోట్ల ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వివరించారు. ఇందులో భారత్-శ్రీలంకలను కలుపుతూ రూ.20,000 కోట్ల ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి నిధులను అందించడానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసిందని వెల్లడించారు. హైవేలు- పరికరాలకు సంబంధించి ఇక్కడ గురువారం జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఐదేళ్లలో రహదారుల రంగంలో రూ.5 లక్షల కోట్ల ప్రాజెక్టులను, నౌకా రంగంలో లక్ష కోట్ల ప్రాజెక్టులను చేపట్టాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు దేశంలో 50 లక్షల మంది యువతికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని వివరించారు. గత ఏడాది నుంచి హైవేలు, షిప్పింగ్ రంగాలు పురోగతి దిశగా అడుగులు వేస్తున్నాయని అన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. భారత్- శ్రీలంక అనుసంధాన ప్రాజెక్టుపై... ఇతర దేశాలతో రవాణా సదుపాయాలను పెంపొందించుకోడానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌లతో ఈ దిశలో ముందడుగు వేసిన ప్రభుత్వం, శ్రీలంకతోనూ రవాణా సదుపాయాలను మెరుగుపరచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రామేశ్వరం నుంచి శ్రీలంకకు 22 కిలోమీటర్ల మేర క్యారిడార్ ఏర్పాటు ప్రణాళిక సిద్ధమవుతోందని వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ ‘ఫెర్రీ’ సేవల ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొంటూ, సాధ్యమైనంత త్వరగా ప్రతిపాదిత ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది కేంద్రం ప్రణాళిక అని వివరించారు. వంతెనకి అలాగే నీటి అంతర్భాగ సొరంగం కలయికగా ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఉంటుందని వివరించారు. నౌకా రవాణాకు ఎటువంటి విఘాతం కలగకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని తెలిపారు. నిధుల సమస్య కాదు..: ఫైనాన్సింగ్ అనేది రహదారుల మంత్రిత్వశాఖలో అసలు సమస్యే కాదని గడ్కారీ అన్నారు. 112 ప్రాజెక్టులను పూర్తిచేసి, విదేశీ బీమా, పెన్షన్ ఫండ్స్‌లకు అమ్మడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు దీనికితోడు 0.50 శాతం వడ్డీకి రెండు, మూడు లక్షల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి పలు విదేశీ ఫండ్లు సిద్ధంగా ఉన్నట్లు సైతం ఆయన తెలిపారు. మంత్రిత్వశాఖకు రూ. 42,000 కోట్ల బడ్జెటరీ కేటాయింపులు ఉన్నాయని పేర్కొంటూ, పన్ను మినహాయింపు బాండ్ల ద్వారా రూ.70,000 కోట్లు సమీకరణకు సైతం మంత్రిత్వశాఖకు వీలుందని వివరించారు. అలాగే వార్షిక టోల్ వసూళ్లు రూ.7,000 నుంచి రూ.8,000 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. తద్వారా 15 ఏళ్ల ఆదాయం రూ.1,20,000 కోట్లని అన్నారు. హైవేస్ ఎక్విప్మెంట్ తయారీపై ఇలా... ఈ విభాగం అభివృద్ధిని మంత్రి ప్రస్తావిస్తూ, వినూత్న ఆవిష్కరణలు, టెక్నాలజీ మేళవింపు ఇందుకు దోహదపడతాయని తెలిపారు. ఆయా అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షకు, తగిన సిఫారసుల అమలుకు ఎనిమిది రోజుల్లో ఒక మండలిని తన మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నదీ జల రవాణాపై బిల్లు... దేశ వ్యాప్తంగా 101 నదులను ‘జల మార్గాలుగా’ మార్చడానికి ఉద్ధే శించిన బిల్లును రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు గడ్కారీ చెప్పారు. దేశాభివృద్ధిలో ఇదొక కీలక అంశమన్నారు. మయన్మార్, థాయ్తోనూ త్వరలో ఒప్పందాలు... బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌లతో రవాణా సదుపాయాల మెరుగుకు చేసుకున్న ఒప్పందం తరహాలోనే ఈ ఏడాది చివరకు మయన్మార్, థాయ్‌లాండ్‌లతో కూడా భారత్ కీలక మోటార్ ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించారు. మోటార్ వెహికల్ ఒప్పందం (ఎంవీఏ) కింద బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ మధ్య జరుగుతున్న 8 బిలియన్ డాలర్ల రోడ్డు అనుసంధాన ప్రాజెక్టు రానున్న రెండేళ్లలో పూర్తవుతుందని గడ్కారీ వివరించారు. -
తెలంగాణలో 1000 కి.మీ. జాతీయ రహదారి!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వెయ్యి కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాలు, ట్రాఫిక్ ఒత్తిడి అధికంగా ఉండే రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. సోమవారం హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వచ్చే ఆరు నెలల్లో మూడున్నర లక్షల కోట్ల వ్యయమయ్యే జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. దేశంలో నదీ రవాణాను ప్రోత్సహిస్తున్న క్రమంలో తెలంగాణలో ఏడు జల రవాణా మార్గాలను ఎంపిక చేసినట్టు గడ్కరీ తెలిపారు. మంజీరా, భీమా, పెన్‌గంగా / వార్దా, తుంగభద్ర, ప్రాణహిత/వెన్‌గంగా, కృష్ణ, గోదావరి నదుల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు అనుసంధానంగా బకింగ్‌హామ్ కాలువద్వారా జల రవాణాకు వీలుగా ఈ ఏడే పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణలో రెండు చోట్ల డ్రై పోర్టులను, మల్టీమోడల్ హబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. భూసేకరణ చట్టంతో గ్రామీణ వికాసం అంబానీ, ఆదానీల కోసమే కొత్త భూసేకరణ చట్టమన్న ప్రచారం కుట్రతో కూడుకున్నదని గడ్కారీ అన్నారు. గ్రామీణ ప్రాంత వికాసాన్ని దృష్టిలో పెట్టుకునే 2013 నాటి భూసేకరణ చట్టాన్ని సవరిస్తున్నామన్నారు. రైతు సంఘాలతో చేపట్టిన ముఖాముఖిలో పాల్గొన్నారు. -
రాజ్యసభలో అదే తీరు
అరుపులు, కేకలతో హోరెత్తిన సభ గడ్కారీ రాజీనామాకు పట్టు న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ రాజీనామా వ్యవహారంపై సోమవారం కూడా రాజ్యసభలో పెద్దగా కార్యకలాపాలు జరగలేదు. సభ ప్రారంభం అయినప్పటి నుంచి కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఏకమై గడ్కారీ రాజీనామా చేయకుండా సభను సాగనిచ్చేది లేదని భీష్మించాయి. చివరకు నితిన్ గడ్కారీ సభలో ప్రకటన చేయాల్సి వచ్చింది. విపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడిటర్ నివేదికను వక్రీకరిస్తున్నాయని ఆయన తన ప్రకటనలో ఆరోపించారు. తన కుటుంబానికి చెందిన ప్యూరిటీ గ్రూప్‌నకు రుణాన్ని మంజూరు చేయటంలో అవకతవకలు జరిగినట్లు కాగ్ ఆరోపించటంపై శనివారం నుంచి విపక్షాలు రాజ్యసభను స్తంభింప జేస్తున్న సంగతి తెలిసిందే. తనను కాగ్ ఎక్కడా తప్పు పట్టలేదని, జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ(ఐఆర్ఈడీఏ)అనుసరించిన విధానాలలో లోపాలు, అవకతవకలు ఉన్నాయని మాత్రమే కాగ్ పేర్కొందనీ గడ్కారీ అన్నారు. అయితే విపక్షాలు పట్టు వీడకపోవటంతో రోజంతా నినాదాల మధ్య రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది. బంగ్లా సరిహద్దు బిల్లు మళ్లీ ఆమోదం భారత, బంగ్లా సరిహద్దు బిల్లును రాజ్యసభ సోమవారం మరోసారి ఆమోదించింది. గత వారం ఆమోదించిన బిల్లులో స్వల్ప సవరణలు చేయాల్సి రావటంతో మరోసారి బిల్లును పార్లమెంటు ఆమోదించాల్సి వచ్చింది. కాగా, ప్రభుత్వం బొగ్గు గనుల(ప్రత్యేక నిబంధనల)బిల్లును ఉపసంహరించుకుంది.