భారత్-శ్రీలంక అనుసంధానం
రూ. 22,000 కోట్లతో ప్రాజెక్టు...
♦ రహదారులు, నౌకా రంగాల్లో 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
♦ రూ. 6 లక్షల కోట్ల ప్రాజెక్టులకు వ్యూహ రచన
♦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటన
న్యూఢిల్లీ : రహదారులు, నౌకా రంగాల్లో ప్రభుత్వం 50 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఈ కీలక రంగాల్లో భారీగా రూ.6 లక్షల కోట్ల ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వివరించారు. ఇందులో భారత్-శ్రీలంకలను కలుపుతూ రూ.20,000 కోట్ల ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఇందుకు సంబంధించి నిధులను అందించడానికి ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసిందని వెల్లడించారు. హైవేలు- పరికరాలకు సంబంధించి ఇక్కడ గురువారం జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఐదేళ్లలో రహదారుల రంగంలో రూ.5 లక్షల కోట్ల ప్రాజెక్టులను, నౌకా రంగంలో లక్ష కోట్ల ప్రాజెక్టులను చేపట్టాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు దేశంలో 50 లక్షల మంది యువతికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని వివరించారు. గత ఏడాది నుంచి హైవేలు, షిప్పింగ్ రంగాలు పురోగతి దిశగా అడుగులు వేస్తున్నాయని అన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు.
భారత్- శ్రీలంక అనుసంధాన ప్రాజెక్టుపై...
ఇతర దేశాలతో రవాణా సదుపాయాలను పెంపొందించుకోడానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌లతో ఈ దిశలో ముందడుగు వేసిన ప్రభుత్వం, శ్రీలంకతోనూ రవాణా సదుపాయాలను మెరుగుపరచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రామేశ్వరం నుంచి శ్రీలంకకు 22 కిలోమీటర్ల మేర క్యారిడార్ ఏర్పాటు ప్రణాళిక సిద్ధమవుతోందని వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ ‘ఫెర్రీ’ సేవల ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొంటూ, సాధ్యమైనంత త్వరగా ప్రతిపాదిత ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది కేంద్రం ప్రణాళిక అని వివరించారు. వంతెనకి అలాగే నీటి అంతర్భాగ సొరంగం కలయికగా ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఉంటుందని వివరించారు. నౌకా రవాణాకు ఎటువంటి విఘాతం కలగకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని తెలిపారు.
నిధుల సమస్య కాదు..: ఫైనాన్సింగ్ అనేది రహదారుల మంత్రిత్వశాఖలో అసలు సమస్యే కాదని గడ్కారీ అన్నారు. 112 ప్రాజెక్టులను పూర్తిచేసి, విదేశీ బీమా, పెన్షన్ ఫండ్స్‌లకు అమ్మడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు దీనికితోడు 0.50 శాతం వడ్డీకి రెండు, మూడు లక్షల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి పలు విదేశీ ఫండ్‌లు సిద్ధంగా ఉన్నట్లు సైతం ఆయన తెలిపారు. మంత్రిత్వశాఖకు రూ. 42,000 కోట్ల బడ్జెటరీ కేటాయింపులు ఉన్నాయని పేర్కొంటూ, పన్ను మినహాయింపు బాండ్ల ద్వారా రూ.70,000 కోట్లు సమీకరణకు సైతం మంత్రిత్వశాఖకు వీలుందని వివరించారు. అలాగే వార్షిక టోల్ వసూళ్లు రూ.7,000 నుంచి రూ.8,000 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. తద్వారా 15 ఏళ్ల ఆదాయం రూ.1,20,000 కోట్లని అన్నారు.
హైవేస్ ఎక్విప్‌మెంట్ తయారీపై ఇలా...
ఈ విభాగం అభివృద్ధిని మంత్రి ప్రస్తావిస్తూ, వినూత్న ఆవిష్కరణలు, టెక్నాలజీ మేళవింపు ఇందుకు దోహదపడతాయని తెలిపారు. ఆయా అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షకు, తగిన సిఫారసుల అమలుకు ఎనిమిది రోజుల్లో ఒక మండలిని తన మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
నదీ జల రవాణాపై బిల్లు...
దేశ వ్యాప్తంగా 101 నదులను ‘జల మార్గాలుగా’ మార్చడానికి ఉద్ధే శించిన బిల్లును రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు గడ్కారీ చెప్పారు. దేశాభివృద్ధిలో ఇదొక కీలక అంశమన్నారు.
మయన్మార్, థాయ్‌తోనూ త్వరలో ఒప్పందాలు...
బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌లతో రవాణా సదుపాయాల మెరుగుకు చేసుకున్న ఒప్పందం తరహాలోనే ఈ ఏడాది చివరకు మయన్మార్, థాయ్‌లాండ్‌లతో కూడా భారత్ కీలక మోటార్ ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించారు. మోటార్ వెహికల్ ఒప్పందం (ఎంవీఏ) కింద బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ మధ్య జరుగుతున్న 8 బిలియన్ డాలర్ల రోడ్డు అనుసంధాన ప్రాజెక్టు రానున్న రెండేళ్లలో పూర్తవుతుందని గడ్కారీ వివరించారు.