
జనవరి–మార్చి మధ్య అధిక నియామకాలు
ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఆప్నా వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఉద్యోగ దరఖాస్తులు (నియామకాలు) గణనీయంగా పెరిగినట్టు.. ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం పెరిగినట్టు ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఆప్నా వెల్లడించింది. సౌకర్యవంతమైన పని నమూనాలు, టైర్–2, 3 పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆప్నా ఒక నివేదికను విడుదల చేసింది. జనవరి–మార్చి మధ్య 1.81 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయని, గతేడాది మొదటి మూడు నెలలతో పోల్చితే 30 శాతం పెరిగినట్టు తెలిపింది.
బీపీవో, ఫైనాన్స్, హెచ్‌ఆర్ తదితర విభాగాల్లో నియామకాలు పెరగడం, ఆర్థిక వ్యవస్థ పట్ల ఆశావహ పరిస్థితులకు ఈ గణాంకాలు నిదర్శమని పేర్కొంది. ముఖ్యంగా మహిళల నుంచి దరఖాస్తులు 23 శాతం పెరిగి 62 లక్షలుగా ఉన్నాయి. మొత్తం దరఖాస్తుల్లో ఫ్రెషర్ల (ఉద్యోగానికి కొత్త/అనుభవం లేని) నుంచి వచి్చనవి 66 లక్షలు ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 46 శాతం పెరిగాయి. చండీగఢ్, ఇందోర్, జమ్‌షెడ్‌పూర్ తదితర టైర్ 2, 3 పట్టణాల నుంచి అధిక దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా ఆప్నా ప్లాట్‌ఫామ్‌పై 3.1 లక్షల జాబ్ పోస్టింగ్‌లు నమోదయ్యాయి. 2024 క్యూ1తో పోల్చితే 26% పెరిగాయి. చిన్న, మధ్య తరహా సంస్థల నుంచి ఎక్కువగా ఉన్నాయి.
వరంగల్‌లో పెరుగుతున్న టెక్ నియామకాలు
ఎల్‌ఐసీ, పేటీఎం, డెల్హివరీ, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థల నుంచే లక్ష నియామకాలు జరిగాయి. ఇవి మెట్రోలకు బయట ఇతర పట్టణాల్లోనూ నియామకాలు చేపట్టాయి. సాఫ్ట్‌వేర్/వెబ్ డెవలపర్ ఉద్యోగాలకు పోస్టింగ్‌లు 65 శాతం మేర పెరిగాయి. ఈ పోస్ట్‌లకు ఫ్రెషర్ల నుంచి 42 శాతం అధికంగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఏఐ/ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ ఇంటెలిజెన్స్ తదితర ఉద్యోగాల్లో నిపుణుల అవసరం పెరిగింది. ఇక కొత్త నియామకాల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. జైపూర్ లక్నో, రాజ్‌కోట్, వరంగల్ టెక్నాలజీ ఉద్యోగ నియామకాల్లో కీలక కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఆప్నా నివేదిక వెల్లడించింది. ఈ పట్టణాల్లో 30–50 శాతం వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుకునే విషయంలో టైర్ 2, 3 పట్టణాలు కీలక పాత్ర పోషించనున్నట్టు తెలిపింది.