
2047 నాటికి వికసిత్ భారత్ సాధిస్తాం
కేంద్ర కార్మిక శాఖ సెక్రటరీ సుమిత
న్యూఢిల్లీ: 2047 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ప్రకటించారు. అప్పటికి శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని 70 శాతానికి పెంచనున్నట్టు చెప్పారు. సేవల రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై సీఐఐ నిర్వహించిన సదస్సులో భాగంగా ఆమె మాట్లాడారు.
కొన్ని రంగాల్లో మహిళలు మరింత పెద్ద ఎత్తున పాలుపంచుకునేందుకు గొప్ప అవకాశాలున్నట్టు చెప్పారు. జాతీయ విద్యా విధానం కింద మహిళల విద్యార్హతల పెంపుపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లు, సంస్థలకు వెంచర్ క్యాపిటల్ మద్దతుకు పిలుపునిచ్చారు. ‘‘మహిళా వ్యాపారవేత్తలకు వెంచర్ క్యాపిటల్ మద్దతు ఎంతో కీలకం. వారు నాయకులుగా మారేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు మార్గదర్శకం అవసరం’’అని సుమిత దావ్రా పేర్కొన్నారు.
వివక్ష ..
శ్రామికశక్తిలో మరింత మంది మహిళలు భాగస్వాములు కాకుండా వివక్ష వారిని అడ్డుకుంటున్నట్టు సుమితా దావ్రా పేర్కొన్నారు. వేతనం, నాయకత్వ బాధ్యతల్లో, ఉద్యోగ భద్రతలో అసమానతలు ఉన్నట్టు చెప్పారు. అయితే గడిచిన ఆరేళ్లలో ఆరి్థక కార్యకలాపాల్లో మహిళల పాత్ర పెరిగినట్టు చెప్పారు. అలాగే, విద్యావంతులైన మహిళలు ఉద్యోగాల్లో చేరడంలో, స్థిరమైన ఆర్జనలోనూ పురోగతి ఉన్నట్టు వివరించారు. ‘‘టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాలతోపాటు తయారీలోనూ మహిళలు రాణిస్తుండడాన్ని చూస్తున్నాం. మహిళలకు సంబంధించి వర్కర్ పాపులేషన్ రేషియో (డబ్ల్యూపీఆర్) గత ఆరేళ్లలో రెట్టింపైనట్టు డేటా తెలియజేస్తోంది’’అని సుమితా దావ్రా చెప్పారు.
హిందుస్థాన్ జింక్‌లో 30 శాతం మహిళలే
2030 నాటికి తమ కంపెనీ ఉద్యోగుల్లో 30 శాతం మహిళలే ఉండాలన్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఉన్నట్టు వేదాంత గ్రూప్ కంపెనీ హిందుస్థాన్ జింక్ (హెచ్‌జెడ్‌ఎల్) ప్రకటించింది. ప్రస్తుతం హిందుస్థాన్ జింక్ ఉద్యోగుల్లో మహిళలు 25% ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment