Womens participation
-
అతివకు అందలం!
ముంబై: దేశంలో ఉద్యోగాలు, ఇతర క్రియాశీలక పనుల్లో మహిళల భాగస్వామ్యం నానాటికీ పెరుగుతోంది. మహిళా సాధికారత దిశగా ఇదొక ముందడుగు అని చెప్పొచ్చు. ఇండియాలో 140 కోట్లకుపైగా జనాభా ఉండగా, వీరిలో 69.2 కోట్ల మంది మహిళామణులే. వీరిలో దాదాపు 37 శాతం మంది ఉద్యోగాలు, క్రియాశీలక పనుల్లో కొనసాగుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ‘కెరీర్‌నెట్స్’ అనే సంస్థ ‘ఇండియాలో మహిళా ఉద్యోగుల స్థితిగతులు’ పేరిట తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఉద్యోగాలు చేస్తున్న మహిళల విషయంలో హైదరాబాద్, పుణే, చెన్నై అగ్రస్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది. 2022తో పోలిస్తే 2023లో శ్రామికశక్తిలో అతివల ప్రాతినిధ్యం 2 నుంచి 5 శాతం పెరిగినట్లు తెలియజేసింది. జూనియర్ ప్రొఫెషన్ ఉద్యోగాలు, ఎగ్జిక్యూటివ్ బోర్డుల్లో వారి భాగస్వామ్యం పెరిగినట్లు పేర్కొంది. నివేదికలో ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ► 2023లో కాలేజీల నుంచి వచ్చి కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారు. ► ఒకటి నుంచి ఏడేళ్ల అనుభవం ఉన్న మహిళలకు కొత్తగా జరుగుతున్న నియామకాల్లో 20 నుంచి 25 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. ► దేశ రాజధాని ఢిల్లీ మినహా ఇతర నగరాల్లో మహిళల నియామకం పెరిగింది. ఢిల్లీలో మాత్రం తగ్గిపోయింది. ► ఉద్యోగాల్లో మహిళల నియామకం రేటు హైదరాబాద్‌లో 34 శాతం, పుణేలో 33 శాతం, చెన్నైలో 29 శాతంగా నమోదైంది. ఢిల్లీలో ఇది కేవలం 20 శాతంగా ఉంది. -
Republic Day 2024: కర్తవ్య పథ్‌లో దళ నాయికలు
ఢిల్లీ పోలీస్ మొదటిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించనుంది. ఇదొక రికార్డు. ఈ దళానికి ఐపిఎస్ శ్వేత కె సుగాధన్ నాయకత్వం వహించనుంది. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది. ఇదీ రికార్డే. భారత త్రివిధ దళాలలో, రక్షణ దళాలలో మహిళల భాగస్వామ్యం ప్రతి ఏటా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో మహిళా శక్తి తన స్థయిర్యాన్ని ప్రదర్శించనుంది. దేశ రక్షణలో, సాయుధ ప్రావీణ్యంలో తాను ఎవరికీ తీసిపోనని చాటి చెప్పనుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళలకు దొరుకుతున్న ప్రాధాన్యం ఈ సంవత్సరం కూడా కొనసాగుతోంది. అంతే కాదు గత కొన్నాళ్లుగా త్రివిధ దళాలలో ప్రమోషన్లు, ర్యాంకులు, నియామకాల్లో స్త్రీలకు సంబంధించిన పట్టింపులు సడలింపునకు నోచుకుంటున్నాయి. ప్రాణాంతక విధుల్లో కూడా స్త్రీలు ఆసక్తి ప్రదర్శిస్తే వారిని నియుక్తులను చేయడం కనిపిస్తోంది. ఆ తెగువే ఇప్పుడు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శితం కానుంది. ఢిల్లీ మహిళా దళం ఈ సంవత్సరం గణతంత్ర వేడుకలలో ఢిల్లీ పోలీసులు సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించాలని, దానికి మరో మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించాలని నిర్ణయించడం చరిత్రాత్మకం. ఎప్పుడో 1975లో ఢిల్లీ పోలీసు దళానికి నాటి ఐ.పి.ఎస్. ఆఫీసర్ కిరణ్ బేడీ నాయకత్వం వహించి చరిత్ర సృష్టించింది. మళ్లీ గత సంవత్సరంగాని ఐ.పి.ఎస్. ఆఫీసర్ శ్వేత కె సుగాధన్కు నాయకత్వం వహించే అవకాశం రాలేదు. అయితే ఆ దళంలో ఉన్నది మగవారు. ఈసారి మాత్రం పూర్తి మహిళా దళం పాల్గొననుండటం విశేషం. దీనికి తిరిగి శ్వేత కె సుగాధన్ నాయత్వం వహించనుండటం మరో విశేషం. నార్త్ ఢిల్లీకి అడిషినల్ డీసీపీగా పని చేస్తున్న శ్వేత కె సుగాధన్ది కేరళ. 2015లో బి.టెక్ పూర్తి చేసిన శ్వేత మొదటిసారి కాలేజీ టూర్లో ఢిల్లీని దర్శించింది. 2019లో యు.పి.ఎస్.సి. పరీక్షలు రాయడానికి రెండోసారి ఢిల్లీ వచ్చింది. అదే సంవత్సరం ఐ.పి.ఎస్.కు ఎంపికైన శ్వేత ఇప్పుడు అదే ఢిల్లీలో గణతంత్ర దినోత్సవంలో దళ నాయకత్వం వహించే అవకాశాన్ని పొందింది. శ్వేత దళంలో మొత్తం 194 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ఉంటారు. వీరిలో 80 శాతం మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు. ఢిల్లీ పోలీసు విభాగంలో ఈశాన్య రాష్ట్రాల మహిళల నియామకానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందుకే శ్వేత నాయకత్వం వహించే దళంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిళా పోలీసులే ఉంటారు. మరో విశేషం ఏమంటే ఈసారి ఢిల్లీ పోలీస్ బ్యాండ్‌కు రుయాంగియో కిన్సే అనే మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించనుంది. 135 మంది పురుష కానిస్టేబుళ్లు ఢిల్లీ పోలీసు గీతాన్ని కవాతులో వినిపిస్తూ ఉంటే వారికి కిన్సే నాయకత్వం వహించనుంది. కోస్ట్ గార్డ్‌కు చునౌతి శర్మ గణతంత్ర వేడుకలలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది. తీర ప్రాంతాల గస్తీకి, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి నియుక్తమైన ఇండియన్ కోస్ట్ గార్డ్ తన ప్రాతినిధ్య దళంతో పరేడ్‌లో పాల్గొననుంది. దీనికి నాయకత్వం వహించే అవకాశం రావడం పట్ల చునౌతి శర్మ ఆనందం వ్యక్తం చేసింది. ‘గతంలో నేను ఎన్సీసీ కేడెట్‌గా పరేడ్‌లో పాల్గొన్నాను. ఎన్సీసీలో మహిళా కాడెట్ల దళం, పురుష కాడెట్ల దళం విడిగా ఉంటాయి. కాని ఇక్కడ నేను కోస్ట్ గార్డ్ పురుష జవాన్ల దళానికి నాయకత్వం వహించనున్నాను. ఈ కారణానికే కాదు మరోకందుకు కూడా ఈ వేడుకల నాకు ప్రత్యేకమైనవి. ఎందుకంటే నా భర్త శిక్కు దళానికి పరేడ్‌లో నాయకత్వం వహించనున్నాడు. దేశ సేవలో ఇదో విశిష్ట అవకాశం’ అందామె. వీరే కాదు... త్రివిధ దళాల మరిన్ని విభాగాలలోనూ స్త్రీల ప్రాధాన్యం ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో పథం తొక్కనుంది. -
Web Summit Lisbon: కలలను వదులుకోవద్దు...
ప్రపంచంలోనే అతిపెద్దదైన టెక్ కాన్ఫరెన్స్ వెబ్ సమ్మిట్ ఇటీవల పోర్చుగల్ రాజధాని లిస్బన్లో జరిగింది. ఈ వెబ్ సమ్మిట్‌కు 153 దేశాల నుండి 70 వేల మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. వారిలో 43 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో మహిళలు పాల్గొన్న ఈవెంట్‌గా ఈ సదస్సు వార్తల్లో నిలిచింది. గ్లోబల్ టెక్ ఇండస్ట్రీని రీ డిజైన్ చేయడానికి ఒక ఈవెంట్‌గా వెబ్ సమ్మిట్‌ను పేర్కొంటారు. ఇందులో 2,608 స్టార్టప్‌లు పాల్గొన్నాయి. వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి, వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త టెక్నాలజీని అందుకోవడానికి, సార్టప్‌లను ప్రదర్శించడానికి ఈ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఇందులో స్టార్టప్ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు, క్రియేటివ్ బృందాలు, ఇన్వెస్టర్లు.. పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏమంటే ప్రతి మూడవ స్టార్టప్... మహిళ సృష్టించినదే అయి ఉండటం. వెబ్సమ్మిట్ సీఈవో కేథరీన్ మహర్ ఈవెంట్ ప్రారంభంలో ‘స్టార్టప్స్‌ని మరింత శక్తిమంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం’గా పేర్కొన్నారు. స్టార్టప్స్.. నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది తమ స్టార్టప్‌ల ద్వారా వెబ్ సమ్మిట్‌కు అప్లై చేసుకున్నారు. వాటిలో ఎంపిక చేసిన స్టార్టప్‌లను సమ్మిట్ ఆహ్వానించింది. కమ్యూనిటీ, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థలపై సానుకూల ప్రభావం చూపే విధంగా పనిచేసే స్టార్టప్‌ల విభాగంలో 250 కంటే ఎక్కువ ఉన్నాయి. వంద మెంటార్ అవర్స్ సెషన్స్ ద్వారా 800 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఎక్స్పర్ట్స్ నుండి నైపుణ్యాలను నేర్చుకుంటారు. స్టార్టప్‌లలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమలలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, హెల్త్‌టెక్, వెల్నెస్, ఫిన్‌టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సస్టైనబిలిటీ, క్లీన్టెక్ .. వంటివి ఉన్నాయి. కార్యాలయాలలో వేధింపులు ఈవెంట్‌కు హాజరైన వారిలో మొత్తం 43 శాతం మంది మహిళలు ఉంటే, అత్యధికంగా 38 శాతం కంటే ఎక్కువ మంది మహిళా స్పీకర్లు ఉండటం విశేషం. అన్ని ఎగ్జిబిట్ స్టార్టప్ ఫౌండర్లలో దాదాపు మూడింట ఒక వంతు మహిళలే ఉన్నారు. ఈ సందర్భంగా వెబ్ సమ్మిట్ తన వార్షిక స్టేట్ ఆఫ్ జెండర్ ఈక్విటీ ఇన్ టెక్ నివేదికనూ విడుదల చేసింది. దాదాపు సగం మంది మహిళలు కార్యాలయంలో జెండర్ వివక్షను ఎదుర్కోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. 53.6 శాతం మంది గడిచిన ఏడాదిలో తమ తమ ఆఫీసులలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. 63.1 శాతం మంది పెట్టుబడిదారులు కృత్రిమ మేధస్సు, యంత్రాలని నమ్మి తమ స్టారప్‌లలో వృద్ధిని సాధించినట్టు తెలియజేస్తే 43.2 శాతం మంది మాత్రం తమ కంపెనీలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచినట్టు పేర్కొన్నారు. అయినా, సీనియర్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య గత ఏడాది కంటే 75 శాతం నుంచి 66.7 శాతానికి తగ్గినట్టు గుర్తించారు. ఈ సమ్మిట్... ప్రపంచంలో మహిళ స్థానం ఎలా ఉందో మరోసారి తెలియజేసింది. ప్రపంచానికి మహిళ పోర్చుగీస్ ఆర్థికమంత్రి ఆంటోనియా కోస్టా ఇ సిల్వా మాట్లాడుతూ ‘టెక్ ప్రపంచంలో ఎక్కువమంది మహిళలు అగ్రస్థానంలో ఉండాలి. వారి అవసరం ఈ ప్రపంచానికి ఎంతో ఉంది. మీ కలలను వదులుకోవద్దు. మహిళలకు అసాధారణమైన సామర్థ్యం ఉంది. సంక్షిష్టంగా ఉన్న ఈ ప్రపంచంలో మహిళల మల్టీ టాస్కింVŠ మైండ్ చాలా అవసరం’ అని పేర్కొన్నారు. ఆశలకు, స్నేహానికి, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడానికి, మన కాలపు సమస్యలను సవాల్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఒక చోట చేర్చడానికి వెబ్ సమ్మిట్ గొప్ప వేదిక’ అన్నారు. ఇలాంటి అత్యున్నత వేదికలు ప్రపంచ మహిళ స్థానాన్ని, నైపుణ్యాలను, ఇబ్బందులను అందరి ముందుకు తీసుకువస్తూనే ఉంటాయి. మహిళలు తమ ఉన్నతి కోసం అన్నింటా పోరాటం చేయక తప్పదనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉంటాయి. -
వైద్యరంగంలో మహిళల భాగస్వామ్యం పెరగాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వైద్యరంగంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశవ్యాప్తంగా వైద్యవిద్యలోకి అడుగుపెడుతున్న మహిళల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నా ఉన్నతవిద్యలో తగ్గుముఖం పడుతోందని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రి ఆవరణలో ‘వుమెన్ ఇన్ మెడిసిన్’అన్న అంశంపై ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. వైద్యరంగంలో రాణించిన మహిళలు ఎందరో ఉన్నారని, దేశంలో తొలి మహిళాడాక్టర్ ఆనందిబెన్, కేన్సర్ నిపుణురాలు డాక్టర్ వి.శాంత తదితరులను ఉదహరించారు. కోవిడ్ కష్టకాలంలో భారత్‌లో తయారైన మూడు టీకాల్లో రెండింటికి మహిళలే నేతృత్వం (సుచిత్రా ఎల్లా, మహిమ దాట్ల) వహించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కార్యక్రమంలో ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధుల వైద్యులు డాక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంతోషాలు... సవాళ్ళు...
భారతీయ గృహాలలో నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. సొంత బ్యాంకు ఖాతాలున్న స్త్రీల సంఖ్య హెచ్చుతోంది. దేశంలో సంతాన సాఫల్య రేటు తగ్గుతోంది. ఇళ్ళలో కాకుండా ఆరోగ్య వసతులున్నచోట శిశు జననాల సంఖ్య 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. అదే సమయంలో స్త్రీలలో నూటికి 30మంది పదిహేనో ఏట నుంచే భౌతిక హింసకు గురవుతున్నారు. అయినా వారిలో 77 శాతం మంది నోరు విప్పలేక, గృహహింసను గుట్టుగా భరిస్తున్నారు. కొండను అద్దంలో చూపుతూ ‘5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) తన జాతీయ నివేదికలో ప్రస్తావించిన వెలుగునీడలివి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించిన ఈ నివేదిక దేశంలో మారుతున్న ధోరణులను ప్రతిఫలిస్తూనే, మరింత పురోగతికి అవసరమైన వ్యూహాల గురించి అప్రమత్తం చేస్తోంది. తాజాగా వెల్లడైన సమాచారం అందుకే అంత కీలకమైనది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, తదితర అంశాలకు సంబంధించి విశ్వసనీయ, తులనాత్మక సమాచారం అందించడం ‘ఎన్ఎఫ్హెచ్ఎస్’ ప్రధాన ఉద్దేశం. అందుకే వరుసగా అనేక విడతల్లో ఈ సర్వే చేస్తుంటారు. ఆ వరుసలోదే ఈ 5వ సర్వే. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో (2017 మార్చి నాటికి) 6.37 లక్షల ఇళ్ళను శాంపుల్‌గా తీసుకొని, ఈ సర్వే సాగింది. అలా జిల్లా స్థాయి వరకు ఉన్న పరిస్థితిని ప్రతిఫలించే ప్రయత్నం సాగింది. ఆ సర్వే తాలూకు జాతీయ నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పుడు విడుదల చేసింది. మునుపటి ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–4’ (2015–16) నాటికీ, ఆ తర్వాతి ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–5’ (2019–21) నాటికీ మధ్య వివిధ అంశాల్లో జరిగిన పురోగతికి ఈ తాజా నివేదిక ఓ దర్పణం. గత విడత సర్వేతో పోలిస్తే, ఈ సర్వే పరిధిని విస్తరించారు. మరణాల నమోదు, ప్రీ–స్కూల్ చదువు, పిల్లల టీకాకరణ విస్తరణ, ఋతుక్రమ పరిశుభ్రత, ప్రతి ఒక్కరిలో బీపీ – షుగర్ లాంటి అనేక అంశాల సమాచారం సేకరించారు. తద్వారా ఇప్పటికే అమలులో ఉన్న ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకూ, పటిష్ఠీకరణకూ వీలుంటుంది. అవసరాన్ని బట్టి విధానపరంగా కొత్త వ్యూహాలను సర్కారు సిద్ధం చేసుకోగలుగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల’కు సంబంధించిన సూచికల్లో ఎంతో కొంత మెరుగుదల సాధించాయన్నది ఈ 5వ సర్వే లెక్క. సొంత ఆరోగ్య సంరక్షణ, ప్రధానమైన వస్తువుల కొనుగోలు, బంధువుల సందర్శన – ఇలా ఇంటికి సంబంధించి 3 ప్రధాన అంశాల్లో వివాహిత మహిళల నిర్ణయాత్మక భాగస్వామ్యం ఇప్పుడు పెరిగిందని సర్వే మాట. సొంతంగా వాడుకొనే బ్యాంక్, లేదా పొదుపు ఖాతా ఉన్న ఆడవారి సంఖ్య గత నాలుగేళ్ళలో 53 నుంచి 79 శాతానికి పెరగడం చెప్పుకోదగ్గ విశేషం. మతాలకు అతీతంగా మహిళలు ఇప్పుడు తక్కువమంది సంతానానికే జన్మనిస్తున్నారు. అలా దేశ జనాభా వృద్ధి నిదానిస్తోందని ఈ సర్వే తీపి కబురు చెబుతోంది. గతంలో మహిళల మొత్తం సంతాన సాఫల్య రేటు (టీఎఫ్ఆర్ – సగటున ప్రతి మహిళా తన జీవితకాలంలో జన్మనిచ్చే శిశువుల సంఖ్య) జాతీయస్థాయిలో 2.2 కాగా, ఇప్పుడది 2కు తగ్గింది. అన్ని మతాల స్త్రీలలోనూ తగ్గుదల కనిపించగా, ముస్లిమ్ స్త్రీలలో ఆ రేటు 2.62 నుంచి 2.36కు సర్రున పడిపోయింది. ఇది సర్వే చెబుతున్న సత్యం. అసలిప్పటి దాకా సాగిన 5 విడతల సర్వేలనూ పరిశీలిస్తే, సంతాన సాఫల్య రేటు హిందువుల (41.2 శాతం) కన్నా ముస్లిమ్లలోనే (46.5 శాతం) ఎక్కువగా తగ్గిందన్నది గమనార్హం. అంటే, సమీప భవిష్యత్తులో ఈ దేశంలో హిందువుల కన్నా ముస్లిమ్‌ల సంఖ్య మించిపోతుందంటూ దుష్ప్రచారంతో నమ్మించడానికి ప్రయత్నిస్తున్నవారి మాటలన్నీ వట్టి డొల్లవే అన్నమాట. అక్షరాస్యులా, నిరక్షరాస్యులా అన్న దాన్ని బట్టి సంతాన సాఫల్య రేటు ఉంటోందన్నది మరో కీలక అంశం. చదువుకున్న మహిళల్లో ఆ రేటు తక్కువగా ఉంటోందంటే, కుటుంబ నియంత్రణను పాటించడంలో స్త్రీ విద్యకున్న ప్రాధాన్యం అర్థమవుతోంది. 15 నుంచి 49 ఏళ్ళ మధ్య పునరుత్పత్తి వయసులో ఉన్న స్త్రీ పురుషుల్లో దాదాపు అందరికీ కుటుంబ నియంత్రణ విధానాలపై అవగాహన ఉందట. అయితే, 56.4 శాతమే వాటిని పాటిస్తున్నారు. అంటే, సామాజికంగా, ఆర్థికంగా దిగువ శ్రేణి వారిలో ప్రభుత్వాలు మరింత చైతన్యం తేవాలన్నమాట. అలాగే, ఇవాళ్టికీ దేశంలో గర్భనిరోధక సాధనాల వాడకం, కుటుంబ నియంత్రణ ఆడవారి పనే అన్న భావన ఉన్నట్టు సర్వే చాటింది. ఆ బాధ్యత తమకు లేదన్న పురుషుల భావన ఏళ్ళ తరబడిగా సమాజంలో మారని ఆధిపత్య ధోరణికీ, లింగ దుర్విచక్షణకూ మచ్చుతునక. హరియాణా, హిమాచల్‌లతో పోలిస్తే పంజాబ్‌లో బాల్య వివాహాలు తగ్గనే లేదు. ఈ వైఖరిని మార్చేందుకు ప్రభుత్వ ప్రచారోద్యమాలు తప్పవు. రెండేళ్ళ లోపు వయసు పిల్లల్లో పూర్తిగా టీకాలు వేయించుకున్నవారి శాతం ఒకప్పుడు 62. గత నాలుగేళ్ళలో అది 77 శాతానికి పెరిగింది. ఆ వయసు పిల్లల్లో నాలుగింట మూడొంతుల మందికి పైగా టీకాలు పూర్తిగా అందుతున్నాయనడం సంతోషకరమే. అదే సమయంలో స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. మన జీవనశైలిలో రావాల్సిన మార్పులను ఇది మరోసారి గుర్తు చేస్తోంది. మొత్తం మీద, దేశం అందుకోవాల్సిన ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల’కు సంబంధించి ఈ 5వ విడత సర్వే అందించిన 34 సూచికల డేటా ప్రభుత్వాల భవిష్యత్ కార్యాచరణకు కరదీపిక. ఇక, రానున్న 2023–24లో జరిగే 6వ సర్వే మరింత లోతైన సమాచారం అందిస్తుందని ఆశించవచ్చు. -
భారత్‌లో తగ్గుతున్న మహిళా కార్మికులు
న్యూఢిల్లీ: భారతదేశంలో మహిళా కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోందని.. ఇది ఆందోళనకరమని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) తెలిపింది. పురుషులతో పోలిస్తే.. మహిళాకార్మికుల సంఖ్యలో తేడా చాలా తక్కుగా ఉందని ఐఎల్వో డెరైక్టర్ జనరల్ గై రైడర్ తెలిపారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయతో సమావేశం తర్వాత రైడర్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌తోపాటు పలు దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. భారతదేశంలో పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేసినపుడే.. ఈ దేశ జీడీపీ వృద్ధి చెందుతుందని.. గతేడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి వెల్లడించింది. ప్రపంచ దేశాల్లో స్త్రీ, పురుష కార్మికుల సంఖ్యలో 12 శాతం తేడా ఉండగా.. భారత్‌లో ఇది 50 శాతంగా ఉంది.