శ్వేత కె సుగాధన్; చునౌతి శర్మ
ఢిల్లీ పోలీస్ మొదటిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించనుంది. ఇదొక రికార్డు. ఈ దళానికి ఐపిఎస్ శ్వేత కె సుగాధన్ నాయకత్వం వహించనుంది. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది. ఇదీ రికార్డే. భారత త్రివిధ దళాలలో, రక్షణ దళాలలో మహిళల భాగస్వామ్యం ప్రతి ఏటా ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో మహిళా శక్తి తన స్థయిర్యాన్ని ప్రదర్శించనుంది. దేశ రక్షణలో, సాయుధ ప్రావీణ్యంలో తాను ఎవరికీ తీసిపోనని చాటి చెప్పనుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళలకు దొరుకుతున్న ప్రాధాన్యం ఈ సంవత్సరం కూడా కొనసాగుతోంది. అంతే కాదు గత కొన్నాళ్లుగా త్రివిధ దళాలలో ప్రమోషన్లు, ర్యాంకులు, నియామకాల్లో స్త్రీలకు సంబంధించిన పట్టింపులు సడలింపునకు నోచుకుంటున్నాయి. ప్రాణాంతక విధుల్లో కూడా స్త్రీలు ఆసక్తి ప్రదర్శిస్తే వారిని నియుక్తులను చేయడం కనిపిస్తోంది. ఆ తెగువే ఇప్పుడు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శితం కానుంది.
ఢిల్లీ మహిళా దళం
ఈ సంవత్సరం గణతంత్ర వేడుకలలో ఢిల్లీ పోలీసులు సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించాలని, దానికి మరో మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించాలని నిర్ణయించడం చరిత్రాత్మకం. ఎప్పుడో 1975లో ఢిల్లీ పోలీసు దళానికి నాటి ఐ.పి.ఎస్. ఆఫీసర్ కిరణ్ బేడీ నాయకత్వం వహించి చరిత్ర సృష్టించింది. మళ్లీ గత సంవత్సరంగాని ఐ.పి.ఎస్. ఆఫీసర్ శ్వేత కె సుగాధన్‌కు నాయకత్వం వహించే అవకాశం రాలేదు. అయితే ఆ దళంలో ఉన్నది మగవారు.
ఈసారి మాత్రం పూర్తి మహిళా దళం పాల్గొననుండటం విశేషం. దీనికి తిరిగి శ్వేత కె సుగాధన్ నాయత్వం వహించనుండటం మరో విశేషం. నార్త్ ఢిల్లీకి అడిషినల్ డీసీపీగా పని చేస్తున్న శ్వేత కె సుగాధన్‌ది కేరళ. 2015లో బి.టెక్ పూర్తి చేసిన శ్వేత మొదటిసారి కాలేజీ టూర్‌లో ఢిల్లీని దర్శించింది. 2019లో యు.పి.ఎస్.సి. పరీక్షలు రాయడానికి రెండోసారి ఢిల్లీ వచ్చింది. అదే సంవత్సరం ఐ.పి.ఎస్.కు ఎంపికైన శ్వేత ఇప్పుడు అదే ఢిల్లీలో గణతంత్ర దినోత్సవంలో దళ నాయకత్వం వహించే అవకాశాన్ని పొందింది.
శ్వేత దళంలో మొత్తం 194 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ఉంటారు. వీరిలో 80 శాతం మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు. ఢిల్లీ పోలీసు విభాగంలో ఈశాన్య రాష్ట్రాల మహిళల నియామకానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందుకే శ్వేత నాయకత్వం వహించే దళంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిళా పోలీసులే ఉంటారు. మరో విశేషం ఏమంటే ఈసారి ఢిల్లీ పోలీస్ బ్యాండ్‌కు రుయాంగియో కిన్సే అనే మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించనుంది. 135 మంది పురుష కానిస్టేబుళ్లు ఢిల్లీ పోలీసు గీతాన్ని కవాతులో వినిపిస్తూ ఉంటే వారికి కిన్సే నాయకత్వం వహించనుంది.
కోస్ట్ గార్డ్‌కు చునౌతి శర్మ
గణతంత్ర వేడుకలలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది. తీర ప్రాంతాల గస్తీకి, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి నియుక్తమైన ఇండియన్ కోస్ట్ గార్డ్ తన ప్రాతినిధ్య దళంతో పరేడ్‌లో పాల్గొననుంది. దీనికి నాయకత్వం వహించే అవకాశం రావడం పట్ల చునౌతి శర్మ ఆనందం వ్యక్తం చేసింది. ‘గతంలో నేను ఎన్‌సీసీ కేడెట్‌గా పరేడ్‌లో పాల్గొన్నాను. ఎన్‌సీసీలో మహిళా కాడెట్‌ల దళం, పురుష కాడెట్‌ల దళం విడిగా ఉంటాయి. కాని ఇక్కడ నేను కోస్ట్ గార్డ్ పురుష జవాన్ల దళానికి నాయకత్వం వహించనున్నాను. ఈ కారణానికే కాదు మరోకందుకు కూడా ఈ వేడుకల నాకు ప్రత్యేకమైనవి. ఎందుకంటే నా భర్త శిక్కు దళానికి పరేడ్‌లో నాయకత్వం వహించనున్నాడు. దేశ సేవలో ఇదో విశిష్ట అవకాశం’ అందామె.
వీరే కాదు... త్రివిధ దళాల మరిన్ని విభాగాలలోనూ స్త్రీల ప్రాధాన్యం ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో పథం తొక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment