Women officers
-
ఉ‘మైన్’ ఫోర్స్
‘సిరి వెలుగు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారం’... తెలంగాణ రాష్ట్ర గీతంలో సింగరేణి వైభవానికి అద్దం పట్టే అక్షరాలు ఇవి.ఇప్పుడు ఆ వైభవానికి మహిళా సామర్థ్యం, శక్తి మరింతగా తోడుకానున్నాయి. బీటెక్ చదివిన అమ్మాయిలు పెద్ద పట్టణాల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేయడానికి మాత్రమే ఆసక్తి చూపుతారనేది కేవలం అపోహ మాత్రమే అనేది... సింగరేణిలో తాజాగా ఉద్యోగాలు సాధించిన మహిళల మాటలు వింటే అర్థం అవుతుంది. సింగరేణిలో ఉద్యోగం అంటే ‘కష్టం’ అనే అభిప్రాయం ఉంది, అయితే విజేతలకు మాత్రం అది కష్టమైన కాదు అత్యంత ఇష్టమైన ఉద్యోగం. తమ సంస్కృతి, కుటుంబ బాంధవ్యాలతో ముడిపడిన ఉద్వేగాల ఉద్యోగం. సింగరేణి వాకిట ‘సిరి’ వెన్నెలగా మెరిసే అపూర్వ అవకాశం.సింగరేణి చరిత్రలో మొట్టమొదటి సారిగా భూగర్భ బొగ్గు గనుల్లో మహిళా అధికారులను నియమిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇటీవల సింగరేణి యాజమాన్యం మేనేజ్మెంట్ ట్రైనీ(మైనింగ్) ఎక్స్టర్నల్ పరీక్ష నిర్వహించింది. ఎంపిక చేసిన 88మందిలో 28మంది మహిళలు ఉన్నారు. ఈ మేరకు శనివారం సింగరేణి యాజమాన్యం నియామక ఉత్తర్వులు విడుదల చేసింది. ఎంపికైన మహిళలను వివిధ ఏరియాల్లోని భూగర్భ గనుల్లో విధులు నిర్వహించేందుకు కేటాయించింది. సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాలకు మహిళా ఇంజనీర్లను కేటాయించి, సోమవారంలోగా వారిని ఆయా ఏరియా జీఎంలకు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్జీ–1 ఏరియాకు అయిదుగురు, ఆర్జీ–2కు ఆరుగురు, భూపాలపల్లి ఏరియాకు ఆరుగురు, కొత్తగూడెం ఏరియాకు ఆరుగురు, మణుగూరు ఏరియాకు ఇద్దరు, శ్రీరాంపూర్ ఏరియాకు ముగ్గురికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. రిపోర్ట్ చేసిన వారందరికీ రెండు వారాల పాటు ఓరియన్ టేషన్ ట్రైనింగ్ ఉంటుంది. అందులో మొదటి మూడు రోజులు రక్షణపై ఎంఐటీసీలలో శిక్షణ ఇస్తారు. ఓరియెంటేషన్ ట్రైనింగ్ పూర్తయిన తరువాత వారికి కేటాయించిన గనులలో పనిచేయాల్సి ఉంటుంది. సంవత్సరం పాటు ట్రైనీగా పనిచేయాలి. ఆరు నెలలకోసారి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన వారిని కొనసాగించటం జరగుతుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. అలా మొదలైంది...బ్రిటిష్ కాలంలో, 1952కి ముందు బొగ్గు గనుల్లో మహిళలు, బాలురు పనిచేసేవారు. వీరిని గనుల్లోకి పంపకూడదని గనుల చట్ట సవరణ చేయడం వల్ల 70 ఏళ్లుగా మహిళలు భూగర్భ గనుల్లో పనిచేయడం లేదు. అయితే మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని 1952 నాటి గనుల చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 29న గెజిట్‌ను జారీ చేసింది. సింగరేణిలో పురుషులకు మాత్రమే ఉద్యోగాలు పరిమితం చేయడం సరికాదంటూ గతంలో కొందరు హైకోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం మహిళలకు కూడా కార్మికులుగా ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో వేలాదిమంది ఆడబిడ్డలు వారసత్వం ఆధారంగా సింగరేణిలో ఉద్యోగం సాధించారు. భర్త చనిపోయిన భార్యకు, భర్త వదిలేసి ఒంటరిగా పుట్టింట్లో ఉంటున్న మహిళకు, తండ్రి అనారోగ్యం పాలైతే అతని స్థానంలో కూతురికి ఉపాధి కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి సింగరేణి కార్మిక బలగంలో మహిళల శ్రామిక బలం పెరిగింది. వారిని బదిలీ వర్కర్‌గా తరువాత జనరల్ మజ్దూర్ హోదాలో జీఎం కార్యాలయాలు, డిపార్ట్మెంట్లు, ఏరియా ఆసుపత్రులు, వర్క్‌షాపులు, స్టోర్స్‌లలో రిక్రూట్ చేశారు. మహిళా కార్మికుల సంఖ్య పెరుగుతుండటంతో భూగర్భ గనుల్లోకి పంపాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది.యస్... మేము‘రాణి’ంచగలం!మా నాన్న గారు చిన్నప్పుడే చనిపోయారు. ఇల్లందులో బీటెక్ పూర్తి చేశాను. అమ్మ, అన్నయ్యప్రోత్సాహంతోనే మైనింగ్ కోర్సులో జాయిన్ అయ్యా. ఇంట్లో కూర్చొనే పరీక్షకు ప్రిపేర్ అయ్యా. తాజాగా వెలువడిన ఫలితాల్లో వీవీటీగా ఎంపికయ్యాను. పురుషులకు దీటుగా మహిళలు రాణించగలరు అని చాటి చెప్పేందుకే ఈ ఉద్యోగం ఎంచుకున్నా.– షేక్ హాసియా బేగంమూడో తరం మా తాత సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యిండు. మా నాన్న ప్రస్తుతం సింగరేణిలో క్లర్క్‌గా పనిచేస్తుండు. వారి స్ఫూర్తితో నేను కూడా సింగరేణిలో చేరాలనుకున్నా. మైనింగ్‌లో బీటెక్ చేశాను. తాజాగా సింగరేణి నిర్వహించిన పరీక్షలో ఉద్యోగం సాధించాను. గనిలో పనిచేయటం గురించి ఉత్సాహం తప్ప ఎటువంటి ఆందోళన, భయం లేదు. కష్టపడి పనిచేసే ఆసక్తి ఉంటే ఏ ఉద్యోగమైనా ఒక్కటే. – మోగారం బాంధవినా కల నెరవేరిందిమాది రాజన్న సిరిసిల్ల జిల్లా. వ్యవసాయ కుటుంబం. మంథని జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశా. మైనింగ్ కోర్సు చేయడానికి కారణం మా నాన్న. మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. అయితే మైనింగ్‌లో మహిళలు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్ ఫీల్డ్‌లో ఉద్యోగం చేయడానికి మా నాన్నప్రోత్సహించేవారు. ఆయనప్రోత్సాహంతోనే మైనింగ్ కోర్సులో చేరాను. తాజాగా సింగరేణి నిర్వహించిన పరీక్షల్లో ఉద్యోగం సాధించాను. సింగరేణిలో ఉద్యోగం చేయటం నా కల. నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది.– బైరి అఖిల– గుడ్ల శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి -
NAVIKA SAGAR PARIKRAMA II: కడలి అలలిక వాళ్ల కాళ్ల కింద...
సముద్రం మీద ప్రపంచాన్ని చుట్టి రావాలంటే పెట్టి పుట్టాలి. పట్టిన పట్టు విడువని స్వభావంతో పుట్టాలి. ‘ఓషన్ సెయిలింగ్ అడ్వంచర్స్’లో ఇండియా ఉనికి ప్రపంచానికి తెలియాలంటే అందునా స్త్రీ శక్తి తెలియాలంటే ‘సర్కమ్నావిగేషన్’ (ప్రపంచాన్ని చుట్టి రావడం) ఒక్కటే మార్గమని నేవీ వైస్ అడ్మిరల్ మనోహర్ అవతి ఉద్దేశం. అందుకే ‘సాగర్ పరిక్రమ’ కార్యక్రమాన్ని ప్రతిపాదించాడు. అంటే సముద్ర మార్గాన ప్రపంచాన్ని చుట్టి రావడం. ఇప్పటికి భారతదేశం మూడు సాగర పరిక్రమలు విజయవంతంగా పూర్తి చేసింది. వీటిలో రెండింటిని పురుష ఆఫీసర్లు; ఒకదానిని మహిళా ఆఫీసర్లూ పూర్తి చేశారు. మహిళల కోసమే ‘నావికా సాగర్ పరిక్రమ’ను నేవీ ప్రవేశపెడితే 2017లో ఏడుగురు మహిళా నేవీ ఆఫీసర్లు ఆ పరిక్రమను పూర్తి చేసి జేజేలు అందుకున్నారు. ఆ తర్వాత ‘నావికా సాగర్ పరిక్రమ 2’ యత్నాలు మొదలయ్యాయి. ఏడుగురి స్థానంలో ఇద్దరినే ఉంచి సాహసవంతంగా పరిక్రమ చేయించాలని నేవీ సంకల్పించింది. ఇందుకు నేవీలో పని చేసే మహిళా ఆఫీసర్ల నుంచి స్వచ్ఛందంగా దరఖాస్తులు ఆహ్వానించగా చాలామంది స్పందించారు. వారిలో అనేక దశల వడ΄ోత తర్వాత ఇద్దరు ఆఫీసర్లు మిగిలారు. వారే రూపా, దిల్నా. గత మూడేళ్లుగా వారితో చేయించిన ట్రైనింగ్ ముగియడంతో అతి త్వరలో సాహసయాత్ర మొదలుకానుందని నేవీ తెలిపింది.→ ఆటల నుంచి సాగరంలోకి...‘నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఆటలు ఆడుతూనే 2014లో నేవీలోకి వచ్చాను’ అంటుంది లెఫ్టినెంట్ కమాండర్ డెల్నా. కేరళకు చెందిన డెల్నా ఆర్మీలో పని చేస్తున్న తండ్రిని చూసి నేవీలో చేరింది. ‘నేవీలో లాజిస్టిక్స్ ఆఫీసర్‌గా పని చేస్తూ ఉండగా ‘నావికా సాగర్ పరిక్రమ 2’ సంగతి తెలిసింది. నేను అప్లై చేశాను. సెలెక్ట్ అయ్యాను. అయితే అప్లై చేసిన చాలామంది మధ్యలోనే కుటుంబ వొత్తిళ్ల వల్ల మానుకున్నారు. సముద్రం మీద సంవత్సరం పాటు కేవలం మరొక ఆఫీసర్ తోడుతోనే ఉండాలంటే ఎవరైనా భయపడతారు. కాని మా నాన్న, నేవీలోనే పని చేస్తున్న నా భర్త నన్ను ్ర΄ోత్సహించారు. నేవీలో పని చేయడం అంటే జీవితం సముద్రంలో గడవడమే. అయినా నేనూ నా భర్త శాటిలైట్ ఫోన్ ద్వారా కనెక్టివిటీలోనే ఉంటాం’ అని తెలిపింది డెల్నా.→ నన్ను నేను తెలుసుకోవడమే‘నేలకు దూరంగా సముద్రం మీద ఉండటం అంటే నన్ను నేను తెలుసుకోవడమే’ అంటుంది లెఫ్టినెంట్ కమాండర్ రూపా. పాండిచ్చేరికి చెందిన రూప తండ్రి నేవీలోనే పని చేస్తుండటంతో 2017లో ఆమె నేవీలో చేరింది. ‘ముంబైలో నేవీ ఇన్స్పెక్టర్గా పని చేస్తుండగా నావికా సాగర్ పరిక్రమ 2లో పాల్గొనే అవకాశం వచ్చింది. సముద్రం అంటే నాకు ఇష్టం. నేలను ఒదిలి పెట్టి వచ్చిన మనిషిని సముద్రం ఎప్పుడూ నిరాశ పరచదు. అద్భుతమైన ప్రకృతిని సముద్రం మీద చూడవచ్చు. ఒక్కోసారి భయం వేస్తుంది. కాని అంతలో ముందుకు సాగే ధైర్యం వస్తుంది’ అంటోందామె.→ కఠిన శిక్షణ‘నావికా సాగర్ పరిక్రమ2’కు ఎంపికయ్యాక గత మూడు సంవత్సరాలుగా డెల్నా, రూపాలు శిక్షణ తీసుకుంటున్నారు. తారిణి అనే సెయిల్ బోట్లో వీరికి శిక్షణ జరుగుతోంది. ఇప్పటికే వీరు ఈ బోట్లో సముద్రం మీద 34 వేల నాటికల్ మైళ్లు తిరిగారు. బోట్‌ను నడపడం, దిశను ఇవ్వడం, రిపేర్లు చేసుకోవడం, వైద్యం చేసుకోవడం, శారీరక మానసిక దృడ్వం కలిగి ఉండటం... ఇవన్నీ శిక్షణలో నేర్పిస్తారు. ‘మేము ఇద్దరమే బోట్లో ఉంటాం. అంటే పని ఎక్కువ నిద్ర తక్కువ ఉంటుంది. ఊహించని తుఫాన్లు ఉంటాయి. ఒకేవిధమైన పనిని తట్టుకునే స్వభావం, ఓపిక చాలా ముఖ్యం. మేము అన్ని విధాలా సిద్ధమయ్యాము. ఇక ప్రయాణమే ఆలస్యం’ అన్నారు ఈ ఇద్దరు ధీరవనితలు. త్వరలో ్రపారంభం కానున్న వీరి సాగర పరిక్రమ కచ్చితంగా విజయవంతం అవుతుందని ఆశిద్దాం. 56 అడుగుల సెయిల్ బోట్. 40000 కిలోమీటర్ల దూరం250 రోజుల ప్రయాణంరాకాసి అలలు... భీకరగాలులువీటన్నింటినీ ఎదుర్కొంటూ ఇద్దరే మహిళా నావికులు. స్త్రీలంటే ధీరలు అని నిరూపించడానికి ఇండియన్ నేవీ త్వరలో తన ఇద్దరు నావికులను సముద్రం మీద ప్రపంచాన్ని చుట్టి రావడానికి పంపనుంది. పాండిచ్చేరికి చెందిన రూపా కాలికట్కు చెందిన డెల్నా బయలుదేరనున్నారు. ఈ సాహస యాత్ర గురించి... -
జలమార్గాన ప్రపంచయానం
భారత నౌకా దళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు జలమార్గాన ప్రపంచాన్ని చుట్టబోతున్నారు. లెఫ్టినెంట్ కమాండర్లు ఎ.రూప, కె.దిల్నా అతి త్వరలో ఈ సాహసానికి పూనుకోనున్నట్టు నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మాధ్వాల్ ఆదివారం వెల్లడించారు. నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్వీ తరిణి నౌకలో వారు ప్రపంచాన్ని చుట్టి రానున్నట్టు తెలిపారు. వారిద్దరూ మూడేళ్లుగా ‘సాగర్ పరిక్రమ’ యాత్ర చేస్తున్నారు. ‘‘సాగర్ పరిక్రమ అత్యుత్తమ నైపుణ్య, శారీరక దృఢత్వం, మానసిక అప్రమత్తత అవసరమయ్యే అతి కఠిన ప్రయాణం. అందులో భాగంగా వారు కఠోర శిక్షణ పొందారు. వేల మైళ్ల ప్రయాణ అనుభవమూ సంపాదించారు’’ అని మాధ్వాల్ వెల్లడించారు. ‘గోల్డెన్ గ్లోబ్ రేస్’ విజేత కమాండర్ (రిటైర్డ్) అభిలాష్ టోమీ మార్గదర్శకత్వంలో వారిద్దరూ శిక్షణ పొందుతున్నారు. గతేడాది ఆరుగురు సభ్యుల బృందంలో భాగంగా గోవా నుంచి కేప్‌టౌన్ మీదుగా బ్రెజిల్‌లోని రియో డిజనీరో దాకా వాళ్లు సముద్ర యాత్ర చేశారు. తర్వాత గోవా నుంచి పోర్ట్‌బ్లెయిర్ దాకా సెయిలింగ్ చేపట్టి తిరిగి డబుల్ హ్యాండ్ పద్ధతిలో బయలుదేరారు. ఈ ఏడాది ఆరంభంలో గోవా నుంచి మారిషస్‌లోని పోర్ట్ లూయిస్ దాకా డ్యూయల్ హ్యాండ్ విధానంలో విజయవంతంగా సార్టీ నిర్వహించారు. నౌకాయాన సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి భారత నావికాదళం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని, సముద్ర వారసత్వాన్ని పరిరక్షించడానికి ఇలాంటి యాత్రలను ప్రోత్సహిస్తోందని మాధ్వాల్ తెలిపారు. ఐఎన్ఎస్–తరంగిణి, ఐఎన్ఎస్–సుదర్శిని, ఐఎన్ఎస్వీ–మహదీ, తరిణి నౌకల్లో సముద్రయానం ద్వారా భారత నావికాదళం సాహసయాత్రలకు కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. 2017లో జరిగిన చరిత్రాత్మక తొలి ‘నావికా సాగర్ పరిక్రమ’లో భాగంగా మన మహిళా అధికారుల బృందం ప్రపంచాన్ని చుట్టొచి్చంది ఐఎన్ఎస్వీ తరిణిలోనే! 254 రోజుల ఆ సముద్రయానంలో బృందం ఏకంగా 21,600 మైళ్లు ప్రయాణించింది. – న్యూఢిల్లీ -
పాలనలో ఆమె సంతకం
ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు మహిళా అధికారులు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో, వారి సమస్యలు పరిష్కరించడంలో ముందు వరుసలో ఉంటున్నారు. పురుష అధికారులతో సమానంగా విధులు నిర్వహిన్నారు. కిందిస్థాయి నుంచి మొదలుకొని జిల్లాస్థాయి అధికారిగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్, న్యాయ, రెవెన్యూ, విద్య, వైద్యం, మెప్మా, వ్యవసాయశాఖ తదితర శాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. – సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్ అర్బన్కీలక స్థానాల్లో వారే..ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు శాఖల్లోని కీలకమైన స్థానాల్లో మహిళా అధికారులే ఉన్నారు. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిమ, జగిత్యాల జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నీలిమ, కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతి, పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా అరుణశ్రీ, పెద్దపల్లి డీసీపీగా డాక్టర్ చేతన, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రినిరెడ్డి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా చాహత్ బాజ్‌పేయ్, కరీంనగర్ డీఎంహెచ్‌వోగా సుజాత, డీఏవోగా భాగ్యలక్ష్మి, జగిత్యాల డీఏవోగా వాణి, కరీంనగర్ సంక్షేమ అధికారిగా సరస్వతి, ఆర్టీసీ ఆర్ఎంగా సుచరిత, రామగుండం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా హిమబిందు సింగ్, పెద్దపల్లి సహకార శాఖ అధికారి శ్రీమాల, పెద్దపల్లి డీఈవోగా మాధవి, ఇంటరీ్మడియట్ నోడల్ అధికారిగా కల్పన, ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌గా నాయిని సుప్రియ.. ఇలా.. వివిధ శాఖల్లో మహిళా అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఆలోచనా విధానం మారాలిజీవితంలో అనేక పాత్రలు పోషిస్తున్నా.. మహిళలపై ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. ఈ అనాగరిక ధోరణి నుంచి మనిషి ఆలోచనా విధానం మారాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజకీయ రంగంలోనూ మహిళలు దూసుకెళ్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో వారి ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఏ సంస్థలోనైనా, ఏ రంగంలోనైనా తగిన శిక్షణ, సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే వారు అనూహ్య ఫలితాలు సాధిస్తారు.మహిళల ప్రాతినిధ్యం పెరిగిందిఅటెండర్ నుంచి అంతరిక్షం వరకు ప్రతీ రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. నాకు అదనపు కలెక్టర్‌గా సేవలందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మహిళలు రాజకీయాల్లో వెనకబడి ఉన్నారు. సివిల్ సర్వీసులోకి వచ్చేవారు 7 శాతమే. విజయానికి ఆడ, మగ అనే తేడా లేదు. లక్ష్యాలను నిర్దేశించుకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఆడపిల్లలను ప్రోత్సహించేవారి సంఖ్య పెరుగుతోంది. అది వంద శాతానికి చేరాలి. – లక్ష్మీకిరణ్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), కరీంనగర్యువతుల్లో చైతన్యం కనిపిస్తోందిపరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. జిల్లాలో చైతన్యం ఎక్కువ. ఆడపిల్లలంటే ఒకప్పుడు వివక్ష ఉండేది. ఇప్పుడు మార్పు వచ్చింది. వ్యవసాయశాఖకు జిల్లా అధికారిగా పని చే యడం సంతోషంగా ఉంది. పల్లెల్లో సమావేశాల్లో పాల్గొన్నప్పుడు యువతుల్లో చైతన్యం కనిపిస్తోంది. స్వయం ఉపాధి పొందేవారు, ఉన్నత విద్యనభ్యసిస్తున్నవారిని చూస్తే గర్వంగా అనిపిస్తోంది.– భాగ్యలక్ష్మి, డీఏవో, కరీంనగర్చదువుతోనే సాధికారతచదువుతోనే మహిళా సాధికారిత సాధ్యమవుతుంది. ఎంచుకున్న రంగంలో ప్రతిభ చాటేందుకు ఇష్టంగా ముందుకుసాగాలి. ఎవరి జీవితం అనతికాలంలో ఉన్నతస్థానానికి చేరదు. కఠోర శ్రమ అవసరం. లక్ష్య సాధనకు నిర్విరామ కృషి ఉండాలి. ఆడవాళ్లు ఉన్నత చదువులు, ఉద్యోగాలకు పోటీపడాలి. ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో పరిపూర్ణత సాధించాలి. – అరుణశ్రీ, అదనపు కలెక్టర్, పెద్దపల్లిచట్టాలపై అవగాహన ఉండాలిమహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆత్మనిర్భరత, నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉండాలి. విద్య, వృత్తి, వివాహం, కుటుంబ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి. ప్రభుత్వాలు మహిళల కోసం చేసిన చట్టాలు, న్యాయ సేవలపై ప్రతీ ఒక్కరికి అవగా హన ఉండాలి. పోలీస్‌శాఖలో గతంతో పోలిస్తే మహిళా సిబ్బంది ప్రాతినిధ్యం పెరిగింది.– డాక్టర్ చేతన, డీసీపీ, పెద్దపల్లిఆడపిల్లలను ప్రోత్సహించాలిఆడపిల్లలకు వయసు రాగానే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. అలా కాకుండా, వారు ఎంచుకున్న లక్ష్యాలు సాధించేవరకు ప్రోత్సహించాలి. లక్ష్యసాధనకు తోడ్పాటునందించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆడవారిని ఎలా గౌరవించాలో నేర్పించాలి. మగ, ఆడ అనే తేడా లేకుండా అందరూ సమానమేనన్న భావన కలిగించాలి.– మాధవి, డీఈవో, పెద్దపల్లిచాలెంజ్గా తీసుకుంటాకోల్సిటీ(రామగుండం): కొన్ని రంగాల్లో మహిళలు చిన్నచూపునకు గురవుతున్నారు. వాటిని పట్టించుకోకుండా ప్రతీ పనిని చాలెంజ్‌గా తీసుకోవాలి. నేను చాలెంజ్‌తో ముందుకు సాగుతున్నా. పురుషుల కన్నా మహిళకు ఇల్లు, ఫ్యామిలీ, ఉద్యోగం, అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ విషయంలో సపోర్ట్ దొరకదు. నిలోఫర్ ఆస్పత్రిలో హెచ్వోడీగా చేస్తున్న నన్ను, ప్రభుత్వం అడిషనల్ డీఎంఈ క్యాడర్ హోదా కల్పిస్తూ ప్రమోషన్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన రామగుండంలోని సిమ్స్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా రెండున్నరేళ్ల క్రితం బాధ్యతలు అప్పగించారు. తొలి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన కొంతకాలం ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రొఫెషనల్ ఒత్తిళ్లతో బిజీగా ఉన్నా కుటుంబానికీ సమయం కేటాయిస్తా. – డాక్టర్ హిమబిందు సింగ్, ప్రిన్సిపాల్, సిమ్స్, గోదావరిఖని -
మృగాళ్ల వేటలో శివంగులు
కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసు ఇద్దరు మహిళా సీబీఐ అధికారులప్రవేశంతో వేగం అందుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ‘పాలిగ్రాఫ్’ టెస్ట్ చేసేందుకు తాజాగా అనుమతి తీసుకున్నారు. హెచ్‌జి కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయిస్తారనే వార్తలు అందుతున్నాయి. సంపత్ మీనా, సీమా పహుజా... ఈ ఆఫీసర్ల వైపే సుప్రీంకోర్టు కూడా చూస్తోంది. నేడు (గురువారం) ఇప్పటివరకూ ఛేదించిన విషయాలను సమర్పించమంది. సంపత్ మీనా, సీమా పహుజాల పరిచయం.అత్యంత పాశవిక ఘటనగా నమోదవడంతో పాటు, అత్యంత మిస్టరీగా మారిగా కోల్‌కతా జూనియర్ డాక్టర్ కేసును ఆగస్టు 13న కోల్కత్తా హైకోర్టు సీబీఐకి అప్పజెప్పింది. వెంటనే సీబీఐ ఈ కేసు ప్రాధాన్యం, స్వభావం దృష్టా ‘లేడీ సింగం’గా బిరుదు పొందిన సీబీఐ అడిషనల్ డైరెక్టర్ సంపత్ మీనాకు విచారణ బాధ్యత అప్పగించింది. ఆమెకు ప్రధాన సహాయకురాలిగా మరో సమర్థురాలైన సీబీఐ ఆఫీసర్ సీమా పహూజాను నియమించింది. మొత్తం 30 మంది సీబీఐ బృందంతో సంపత్ మీనా, సీమా పహుజా దుర్మార్గులను వేటాడుతున్నారు.ఇద్దరు అధికారులు ఏం చేశారు?జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం/హత్యను ఛేదించడానికి రంగంలో దిగిన సంపత్ మీనా, సీమా పహూజా తొలుత ప్రధాన నిందితుడైన సంజయ్ ఘోష్ వ్యవహారశైలిని పరిశీలించారు. అతడిని విచారిస్తున్న సమయంలో ప్రతిసారీ వాంగ్మూలాన్ని మార్చడం గమనించారు. ఏ రోజైతే రాత్రి ఘటన జరగబోతున్నదో ఆ ఉదయం సంజయ్ ఘోష్ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో అంటే ఐసీయూ ఎక్స్‌రే యూనిట్... ఇవన్నీ తిరిగినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. అతను అక్కడ ఎందుకు తిరిగాడనేది ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో బాధితురాలు ఎదురుపడి ఏదైనా వాదన చేసిందా తెలుసుకుంటున్నారు. లేదంటే రాత్రి జరగబోయే ఘటనను కుట్ర పన్నేందుకు వేరే ఎవరినైనా కలిశాడా అన్నది తేలుస్తున్నారు. ఇప్పటికే అతని మానసిక స్థితిని వారు అంచనా వేశారు. పాలిగ్రాఫ్ టెస్ట్ (ఒక విధమైన లై డిటెక్టర్ టెస్ట్) అలాగే బాధితురాలి అటాప్సీ రి΄ోర్టుతో పాటు ‘సైకాలజీ అటాప్సీ’ని కూడా అంచనా కడుతున్నారు. అంటే ఘటనకు ముందు బాధితురాలు ఎవరితో ఏం మాట్లాడింది, ఏదైనా వేదన/నిరసన వ్యక్తం చేసిందా, డైరీలో ఏమన్నా రాసుకుందా... వీటన్నింటి ఆధారంగా ఆమె సైకాలజీ అటాప్సీని నిర్థారిస్తారు. అలాగే కేసులో ముందు నుంచీ అనుమానాస్పదంగా ఉన్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పైన కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు వార్తలు అందుతున్నాయి. పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా చేసిన నిర్థారణలు సాక్ష్యాధారాలుగా కోర్టులో చెల్లక΄ోయినా కేసును ముందుకు తీసుకెళ్లడంలో సాయపడతాయి.సంపత్ మీనా1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సంపత్ మీనాది రాజస్థాన్‌లోని సవాయిమధోపూర్. జార్ఘండ్‌లో ఆమె వివిధ జిల్లాలకు ఎస్.పి.గా పని చేసింది. బి.పి.ఆర్ అండ్ డి (బ్యూరో ఆఫ్ ΄ోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్)లో పని చేసే సమయంలో ‘ఆపరేషన్ ముస్కాన్’ కింద ఆమె చైల్డ్ ట్రాఫికింగ్‌ను సమర్థంగా నిరోధించడంతో అందరి దృష్టిలో పడ్డారు. జార్ఖండ్‌లో 700 మంది పిల్లలను ఆమె వారి కుటుంబాలతో కలపగలిగారు. ఇక జార్ఖండ్‌లోని నక్సలైట్ప్రాంతాల్లో ఆమె సమర్థంగా నిర్వహించిన విధులు ఆమె సాహసాన్ని తెలియచేశాయి. దాంతో 2017లో ఆమె సీఐఐకి డెప్యూట్ అయ్యారు. అనతి కాలంలోనే అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఎక్కడ ఏ పదవిలో ఉన్నా మహిళా చైతన్యం కోసం మహిళల హక్కుల కోసం ఆమె ఎక్కువ శ్రద్ధ పెడతారనే గుర్తింపు ఉంది. అందుకే ఉన్నొవ్, హత్రాస్ ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఆమెకే కేసులను అప్పగించింది. సీమా పహుజా1993లో ఢిల్లీ ΄ోలీస్లో సబ్ ఇ¯Œ స్పెక్టర్‌గా రిక్రూట్ అయిన సీమా పహుజా సీబీఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆమె ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్ చూసి 2013లో డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారు. మానవ అక్రమ రవాణా, మైనర్ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను శోధించడంలో ఆమె దిట్ట. సిమ్లాలోని కొట్‌ఖైలో గుడియాపై అత్యాచారం, హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లో నిలిచారు. కుటుంబ బాధ్యతల కారణంగా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుని ఆమె సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోలేదు. హత్రాస్ కేసులో సంపత్ మీనాతో పని చేసిన సీమా ఇప్పుడు కోల్‌కతా కేసులో కూడా ఆమెతో పని చేయనున్నారు. ఒక కేసు ఒప్పుకుంటే నేరస్తులను కటకటాల వెనక్కు తోసే వరకు నిద్ర΄ోదని సీమాకు పేరుంది. అందుకే ఆమెను ΄ోలీస్ మెడల్ కూడా వరించింది. కాబట్టి కోల్‌కతా కేసులో నేరగాళ్లను పట్టుకునే కర్తవ్యాన్ని ఈ మహిళా అధికారులిద్దరూ సమర్థంగా నిర్వర్తించి సమాజానికి సరైన సందేశాన్ని పంపిస్తారని ఆశిద్దాం. -
Republic Day 2024: కర్తవ్య పథ్‌లో దళ నాయికలు
ఢిల్లీ పోలీస్ మొదటిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించనుంది. ఇదొక రికార్డు. ఈ దళానికి ఐపిఎస్ శ్వేత కె సుగాధన్ నాయకత్వం వహించనుంది. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది. ఇదీ రికార్డే. భారత త్రివిధ దళాలలో, రక్షణ దళాలలో మహిళల భాగస్వామ్యం ప్రతి ఏటా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో మహిళా శక్తి తన స్థయిర్యాన్ని ప్రదర్శించనుంది. దేశ రక్షణలో, సాయుధ ప్రావీణ్యంలో తాను ఎవరికీ తీసిపోనని చాటి చెప్పనుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళలకు దొరుకుతున్న ప్రాధాన్యం ఈ సంవత్సరం కూడా కొనసాగుతోంది. అంతే కాదు గత కొన్నాళ్లుగా త్రివిధ దళాలలో ప్రమోషన్లు, ర్యాంకులు, నియామకాల్లో స్త్రీలకు సంబంధించిన పట్టింపులు సడలింపునకు నోచుకుంటున్నాయి. ప్రాణాంతక విధుల్లో కూడా స్త్రీలు ఆసక్తి ప్రదర్శిస్తే వారిని నియుక్తులను చేయడం కనిపిస్తోంది. ఆ తెగువే ఇప్పుడు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శితం కానుంది. ఢిల్లీ మహిళా దళం ఈ సంవత్సరం గణతంత్ర వేడుకలలో ఢిల్లీ పోలీసులు సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించాలని, దానికి మరో మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించాలని నిర్ణయించడం చరిత్రాత్మకం. ఎప్పుడో 1975లో ఢిల్లీ పోలీసు దళానికి నాటి ఐ.పి.ఎస్. ఆఫీసర్ కిరణ్ బేడీ నాయకత్వం వహించి చరిత్ర సృష్టించింది. మళ్లీ గత సంవత్సరంగాని ఐ.పి.ఎస్. ఆఫీసర్ శ్వేత కె సుగాధన్కు నాయకత్వం వహించే అవకాశం రాలేదు. అయితే ఆ దళంలో ఉన్నది మగవారు. ఈసారి మాత్రం పూర్తి మహిళా దళం పాల్గొననుండటం విశేషం. దీనికి తిరిగి శ్వేత కె సుగాధన్ నాయత్వం వహించనుండటం మరో విశేషం. నార్త్ ఢిల్లీకి అడిషినల్ డీసీపీగా పని చేస్తున్న శ్వేత కె సుగాధన్ది కేరళ. 2015లో బి.టెక్ పూర్తి చేసిన శ్వేత మొదటిసారి కాలేజీ టూర్లో ఢిల్లీని దర్శించింది. 2019లో యు.పి.ఎస్.సి. పరీక్షలు రాయడానికి రెండోసారి ఢిల్లీ వచ్చింది. అదే సంవత్సరం ఐ.పి.ఎస్.కు ఎంపికైన శ్వేత ఇప్పుడు అదే ఢిల్లీలో గణతంత్ర దినోత్సవంలో దళ నాయకత్వం వహించే అవకాశాన్ని పొందింది. శ్వేత దళంలో మొత్తం 194 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ఉంటారు. వీరిలో 80 శాతం మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు. ఢిల్లీ పోలీసు విభాగంలో ఈశాన్య రాష్ట్రాల మహిళల నియామకానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందుకే శ్వేత నాయకత్వం వహించే దళంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిళా పోలీసులే ఉంటారు. మరో విశేషం ఏమంటే ఈసారి ఢిల్లీ పోలీస్ బ్యాండ్‌కు రుయాంగియో కిన్సే అనే మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించనుంది. 135 మంది పురుష కానిస్టేబుళ్లు ఢిల్లీ పోలీసు గీతాన్ని కవాతులో వినిపిస్తూ ఉంటే వారికి కిన్సే నాయకత్వం వహించనుంది. కోస్ట్ గార్డ్‌కు చునౌతి శర్మ గణతంత్ర వేడుకలలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది. తీర ప్రాంతాల గస్తీకి, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి నియుక్తమైన ఇండియన్ కోస్ట్ గార్డ్ తన ప్రాతినిధ్య దళంతో పరేడ్‌లో పాల్గొననుంది. దీనికి నాయకత్వం వహించే అవకాశం రావడం పట్ల చునౌతి శర్మ ఆనందం వ్యక్తం చేసింది. ‘గతంలో నేను ఎన్సీసీ కేడెట్‌గా పరేడ్‌లో పాల్గొన్నాను. ఎన్సీసీలో మహిళా కాడెట్ల దళం, పురుష కాడెట్ల దళం విడిగా ఉంటాయి. కాని ఇక్కడ నేను కోస్ట్ గార్డ్ పురుష జవాన్ల దళానికి నాయకత్వం వహించనున్నాను. ఈ కారణానికే కాదు మరోకందుకు కూడా ఈ వేడుకల నాకు ప్రత్యేకమైనవి. ఎందుకంటే నా భర్త శిక్కు దళానికి పరేడ్‌లో నాయకత్వం వహించనున్నాడు. దేశ సేవలో ఇదో విశిష్ట అవకాశం’ అందామె. వీరే కాదు... త్రివిధ దళాల మరిన్ని విభాగాలలోనూ స్త్రీల ప్రాధాన్యం ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో పథం తొక్కనుంది. -
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు త్రివిధ దళాలలో మహిళా అధికారులకు సంబంధించి ఈ సంవత్సరంలో ఎన్నో ‘ప్రథమం’లు కనిపిస్తాయి. మహిళా సైనికులు ఆర్టిలరీ బ్రాంచిలలోకి అడుగుపెట్టారు. యుద్ధనౌకల కమిషనింగ్ బృందంలో భాగం అయ్యారు. అత్యంత కఠినమైన యుద్ధభూమి సియాచిన్లోకి వైద్యసేవల కోసం వెళ్లారు. భారత నావికాదళానికి చెందిన గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్’ ఇంఫాల్ మహిళా అధికారులు, నావికులతో ప్రత్యేక వసతులతో కూడిన తొలి యుద్ధనౌకగా అవతరించింది, నావికా, వైమానిక దళాలు తమ ఆపరేషన్లకు సంబంధించిన ప్రతి విభాగం లోకి మహిళలను అనుమతిస్తున్నాయి. ఇంతకాలం పురుషులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండే విభాగాలలో ఈ సంవత్సరం మహిళా అధికారులు నాయకత్వ స్థానాల్లోకి వచ్చారు.... ► హరియాణాలోని జింద్ జిల్లాకు చెందిన చెందిన పాయల్ చబ్ర ఎంబీబీఎస్, ఎంఎస్ చేసింది. అంబాలా కంటోన్మెంట్ని ఆర్మీ హాస్పిటల్, లడఖ్‌లోని ఖర్దుంగ్లా ఆర్మీ హాస్పిటల్లో పనిచేసింది. ఆ తరువాత లడఖ్‌లోని ఆర్మీ హాస్పిటల్లో సర్జన్‌గా పనిచేసింది. ఒకవైపు సర్జన్‌గా పనిచేస్తూనే మరోవైపు పారో కమాండో కావడానికి ఆగ్రాలోని పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత పారా మిలిటరీ ప్రత్యేక భద్రతా దళంలో చేరిన తొలి మహిళా ఆర్మీ సర్జన్‌గా ప్రత్యేకత సాధించింది. ►ముంబాయికి చెందిన ప్రేరణ దేవస్థలీ సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. 2009లో భారత నావికా దళంలో చేరింది. పశ్చిమ నౌకాదళానికి చెందిన పెట్రోలింగ్ నౌక ‘ఐఎన్ఎస్ త్రిన్కాత్’ ఫస్ట్ ఫిమేల్ కమాండింగ్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రేరణ సోదరుడు ఇండియన్ నేవీలో పనిచేస్తాడు. అతడి స్ఫూర్తితోనే నావికాదళంలోకి వచ్చింది ప్రేరణ. ‘భారత నౌకాదళం అవకాశాల సముద్రం. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది ప్రేరణ. ► దిల్లీ కంటోన్మెంట్‌లోని భారత సైన్యానికి చెందిన రక్తమార్పిడి కేంద్రం(ఎఎఫ్టీసీ) ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్‌గా ప్రత్యేకత చాటుకుంది కల్నల్ సునీతా బీఎస్. రోహ్తక్ మెడికల్ కాలేజీలో ‘పాథాలజీ’లో పీజీ చేసిన సునీత అరుణాచల్‌ప్రదేశ్‌లో మిలిటరీ ఆస్పత్రిలో కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. ► ‘ఫ్రంట్‌లైన్ ఐఏఎఫ్ కంబాట్ యూనిట్’ కమాండర్ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ షాలిజా ధామి. 2003లో హెలికాప్టర్ పైలట్ అయింది. 2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం ఆమె సొంతం. వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్లో ఫ్లైట్ కమాండర్‌గా పనిచేసింది. పంజాబ్‌లోని లూథియానా థామి స్వస్థలం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసింది. భారత వైమానిక దళంలో శాశ్వత కమిషన్‌ను పొందిన మొదటి మహిళా అధికారిగా నిలిచింది. ► తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ‘స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్’కు పురుష అధికారులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండేవారు. ఈ ఏడాది ఆ అవకాశం గీతా రాణాకు వచ్చింది. స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్‌కు కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా అధికారిగా గీతా రాణా ప్రత్యేకత నిలుపుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్(ఈఎంఈ) ట్రైనింగ్ సెంటర్లో ఇన్‌స్ట్రక్టర్‌గా బాధత్యలు నిర్వహించింది గీతా రాణా. ► స్క్వాడ్రన్ లీడర్ మనిషా పధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్(ఏడీసీ)గా నియామకం అయినా ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. మనిషా స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్–పుణె చివరగా భటిండాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది. ► ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. వైద్యసేవలు అందించడానికి ఈ ప్రమాదకరమైన యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ప్రత్యేకత చాటుకుంది కెప్టెన్ ఫాతిమా వసిమ్. దీనికిముందు ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ తీసుకుంది. (చదవండి: కొత్త సంవత్సరమా మనిషిని మేల్కొలుపు) -
తొలిసారి.. ఇక్కడ పోలింగ్ భారమంతా మహిళలదే
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ రికార్డు నెలకొల్పింది. శుక్రవారం రాయ్‌పూర్ (నార్త్)లో పోలింగ్ ప్రక్రియ ఆసాంతం మహిళా అధికారులు, సిబ్బంది చేతులమీదుగానే నడిచింది. ప్రిసైడింగ్ అధికారి మొదలుకొని పోలింగ్ అధికారి వరకు మొత్తం 201 పోలింగ్ బూత్‌ల్లో మహిళలకు మాత్రమే బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. ‘సంగ్వారీ (ఉమెన్ ఫ్రెండ్లీ) బూత్‌లకు పూర్తిగా మహిళా అధికారులను నియమించాం. 804 మంది మహిళలకు ప్రత్యక్ష బాధ్యతలు అప్పగించాం. మరో 200 మందిని రిజర్వులో ఉంచాం. ఇక్కడ ఐఏఎస్ అధికారి ఆర్.విమలను పరిశీలకురాలిగా నియమించాం. లయిజనింగ్ అధికారి కూడా మహిళే. చాలావరకు బూత్‌ల వద్ద భద్రతకు మహిళా సిబ్బందినే నియమించాం’అని వివరించింది. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి మహిళా ఐఏఎస్ రీనా బాబా సాహెబ్ కంగాలె కావడం విశేషమని ఆ ప్రకటనలో వివరించింది. మహిళా అధికారులే పోలింగ్ నిర్వహించిన రాయ్‌పూర్(నార్త్)నియోజకవర్గంలో స్త్రీ, పురుష నిష్పత్తి కూడా 1010:1000గా ఉండటం మరో విశేషమని పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాతే ఒక నియోజకవర్గంలో పోలింగ్ బాధ్యతలను కేవలం మహిళలకే అప్పగించాలన్న ఆలోచన రూపుదిద్దుకుందని రాయ్‌పూర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సర్వేశ్వర్ నరేంద్ర భూరె తెలిపారు. ఈ మేరకు చేపట్టిన చర్యలు విజయవంతం కావడంతో ఇప్పుడు అందరూ తమను ప్రశంసిస్తున్నారని చెప్పారు. రాయ్‌పూర్ సిటీ(సౌత్) నియోజకవర్గంలోని సగం వరకు బూత్‌ల్లోనూ మహిళా అధికారులనే నియమించినట్లు ఆయన వెల్లడించారు. చదవండి: వినోదం కోసమే ఆమె మధ్యప్రదేశ్‌కు వస్తారు -
కల్నల్ నియామకాల్లో మహిళలకు అన్యాయం... నిబంధనలకు విరుద్ధం: సుప్రీం
న్యూఢిల్లీ: మహిళా అధికారులకు కల్నల్‌గా పదోన్నతి కలి్పంచేందుకు సైన్యం నిరాకరించడం నిబంధనలకు విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమకు కల్నల్‌గా ప్రమోషన్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మహిళా సైనికాధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస మనోజ్ మిశ్రా ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. మహిళా సైనికాధికారులు సైనయంలో తమకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు, బాధ్యతలను చిరకాలం పాటు పోరాడి మరీ సాధించుకున్నారని అభిప్రాయపడింది. కల్నల్ ప్రమోషన్ల విషయంలో మహిళా అధకారుల రహస్య వార్షిక నివేదిక (సీఆర్)లకు సైన్యం కటాఫ్ తేదీని వర్తింపజేసిన తీరు వారికి అన్యాయం చేసేదిగా ఉందంటూ ఆక్షేపించింది. కనుక కల్నల్ ప్రమోషన్ల ప్రక్రియను 15 రోజుల్లోగా తాజాగా చేపట్టాలని సైన్యాన్ని ఆదేశించింది. లింగ వివక్షకు తావులేకుండా మహిళా సైనికాధికారులకు కూడా కల్నల్ తదితర పదోన్నతులు కలి్పంచాలంటూ 2020లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. నేవీలో కూడా దీన్ని వర్తింపజేయాలంటూ కొద్ది రోజులకే మరో తీర్పు వెలువరించింది. సాయుధ దళాల్లో మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడేందుకు తమ తీర్పులు తోడ్పడతాయని ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. -
పోలీస్ ఆఫీసర్లుగా ఆన్ డ్యూటీలో ఉన్న హీరోయిన్లు
పోలీస్ ఆఫీసర్లుగా కొందరు నాయికలు దోషులను పట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా కేసు వివరాల కోసం లోతుగా విచారణ చేస్తూ, ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోకి వెళ్లి΄ోయారు. ఈ తారల పరిశోధనల విశేషాల్లోకి వెళదాం. ఆన్ ఇన్వెస్టిగేషన్ తొలి అడుగు రెండు దశాబ్దాలుగా అగ్రకథానాయికగా త్రిష ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా కూడా నడుస్తున్న తరుణంలో ఈ ΄్లాట్‌ఫామ్‌లో ఆమె సైన్ చేసిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. ఇందులో త్రిషపోలీసాఫీసర్గా నటిస్తున్నారు. పూర్తి స్థాయిపోలీసాఫీసర్ పాత్రలో త్రిష నటిస్తుండటం కూడా ఇదే మొదటిసారి అనొచ్చు. క్రైమ్–ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సిరీస్‌కు సురేష్ వంగలా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో రూపొందుతున్న ఈ సిరీస్ ఇతర భాషల్లో అనువాదమై, త్వరలో స్ట్రీమింగ్ కానుంది. పవర్ఫుల్ సత్యభామ హైదరాబాద్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్‌పోలీస్ సత్యభామగా చార్జ్ తీసుకున్నారు కాజల్ అగర్వాల్. ఆమె టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘సత్యభామ’. ఈ చిత్రంలో ఏసీపీ సత్యభామ పాత్ర చేస్తున్నారు కాజల్. ఆల్రెడీ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. అఖిల్ డేగల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో కొన్ని చిత్రాల్లో కాజల్పోలీసాఫీసర్ పాత్రలో నటించినప్పటికీ ఓ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించడం ఇదే తొలిసారి. ఆఖరి నిజం ఢిల్లీలో 2018లో జరిగిన బురారి ఆత్మహత్యల ఘటన ఆధారంగా ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లు రూపొందాయి. తాజాగా రూపొందిన మరో వెబ్‌సిరీస్ ‘ఆఖ్రీ సచ్’ (ఆఖరి నిజం). ఆత్మహత్యల మిస్టరీ చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆన్యగా తమన్నా నటించారు. ఈ తరహా పాత్ర చేయడం ఇదే తొలిసారి అని ఇటీవల తమన్నా పేర్కొన్నారు. రాబీ గ్రేవాల్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌గా మరికొందరు తారలు నటిస్తున్నారు. -
మణిపుర్ గాయాల్ని మాన్పాలంటే...
మణిపుర్ పోలీసులకు చెందిన సుమారు 4,500 ఆయుధాల ఆచూకీ ఇప్పటికీ తెలియదు. కేంద్రం వెంటనే రాష్ట్ర పాలనా బాధ్యతలు తీసుకోవాల్సిన అసాధారణమైన, ప్రమాదకరమైన పరిస్థితి ఇది. మణిపుర్ ఏళ్లుగా తుపాకుల నీడలో, మత్తుమందుల ప్రభావంలో, బలవంతపు వసూళ్ల మధ్య బతికింది. వీటన్నింటి నుంచి బయటపడేందుకు రాష్ట్రానికి న్యాయమైన అవకాశం ఇవ్వాల్సిన సమయం ఇదే. రాజకీయంగా చర్చలు ప్రారంభించాలి. ఆర్థిక పరిపుష్టికి ఊతమివ్వాలి. మణిపుర్‌లోని అన్ని తెగలు కూడా దృఢమైన, న్యాయమైన పాలన కోసం ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రపతి పాలనలో సమర్థమైన అధికార యంత్రాంగం మణిపుర్‌ను మళ్లీ సరైన మార్గంలో పెట్టగలదు. మణిపుర్ నివురుగప్పిన నిప్పులా అసందిగ్ధ భవిష్యత్తుకేసి చూస్తోంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు, దుకాణాలు, రహదారులు కూడా ధ్వంస మైపోయి రాష్ట్రం నిర్జీవమైన మట్టిదిబ్బ రూపం సంతరించుకుంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మణిపుర్ ప్రస్తావన పార్లమెంటులో వచ్చింది. కానీ ఇరుపక్షాల పరస్పర నిందారోపణలతో ఒరిగింది శూన్యం. దేశ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను అమలు చేసే క్రమంలో అసాం రైఫిల్స్, మణిపుర్ పోలీసుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం కూడా పరిస్థితి మరింత దిగజారేందుకు కారణమైంది. ఈ ఏడాది మే 4న కాంగ్పోకీ జిల్లాలో ఇద్దరు అమాయక మహిళలపై జరిగిన అకృత్యాలు సుప్రీంకోర్టును సైతం నిర్ఘాంతపోయేలా చేశాయి. రాష్ట్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరించగా కొందరి ప్రయోజనాలు, పక్షపాతాలతో రాజకీయాలు నడిచాయి. జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగితే కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా అస్సలు సహించరాదు. అధ్వాన్నమైన స్థితి ఏమిటంటే... సంఘటన జరిగిన తొలిరోజే పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోవడం. వారిని ఉద్యోగాల్లోంచి తొలగించేందుకు ఇంతకంటే బలమైన కారణం కని పించదు. కొన్ని రోజుల తరువాత ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా పరిస్థితి ఎక్కడిదక్కడే ఉంది. పోలీసులు, నాయకులు తమ బాధ్యతలను విస్మరించి, వారి వారి తెగల్లో హీరోలు కావాలని అనుకుంటే ఇంతకంటే ఎక్కువేమీ ఆశించలేము. ఈ ఘటన తరువాతి రోజే ఇంఫాల్‌లో కార్లు కడిగే పనిచేస్తున్న ఇద్దరు మహిళలపై దారుణమైన నేరం జరిగింది. రాష్ట్రం స్పందన భిన్నంగా ఏమీ లేదు. దౌర్భాగ్యకరమైన స్థితి ఏమిటంటే, ఈ మూక దాడుల్లో మహిళలూ భాగస్వాములు కావడం! రాష్ట్ర పోలీసులకు చెందిన సుమారు 4,500 ఆయుధాల ఆచూకీ ఇప్పటికీ తెలియదు. కేంద్రం వెంటనే రాష్ట్ర పాలనా బాధ్యతలు తీసు కోవాల్సిన అసాధారణమైన, ప్రమాదకరమైన పరిస్థితి ఇది. నిఘా వర్గాలు కూడా దీనిపై కచ్చితంగా నివేదిక అందించే ఉంటాయి. రాష్ట్రం తనదైన కారణాలతో నోరు మెదపదు కానీ అంతర్గత ఘర్షణలతో అట్టుడుకుతున్న రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిది. నిబద్ధత కలిగిన హోంశాఖ కార్యదర్శి ఎవరైనా సరే... మణిపుర్ ఘటనపై సీరియస్‌గా స్పందించి ఉండేవారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలుతున్న వైనాన్ని గమనించి రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా సిఫారసు చేసేవారు. అయితే జరిగిందేమిటి? ఎత్తుకెళ్లిన ఆయుధాలు తిరిగి ఇచ్చేయండి సామీ అని రాష్ట్ర డీజీపీ స్వయంగా బతి మాలడం, ఆయుధాల సేకరణ కోసం రాజకీయ నేతల ఇళ్ల ముంగిట్లో డ్రాప్‌బాక్స్‌ల ఏర్పాటుచేయడం! మణిపుర్ విషయంలో కేంద్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం ఇదే. రాష్ట్రం సాధారణ స్థితికి చేరుకుని తన కాళ్లపై తాను నిలబడగలగాలంటే కనీసం రెండేళ్లపాటు రాజకీయాలను దూరంగా పెట్టాలి. నిష్పక్షపాతమైన, ప్రొఫెషనల్‌గా వ్యవహరించే యంత్రాంగం పాలనా విధులు చేపట్టాలి. మణిçపుర్‌ను మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు ఈ కార్యాచరణ అనుసరించడం మేలు: 1. రాష్ట్ర పెద్దగా బాధ్యతగా వ్యవహరించలేకపోయిన, ప్రజల నైతిక మద్దతు కోల్పోయిన ముఖ్యమంత్రిని వెంటనే తొలగించాలి. కుకీలతోపాటు కొందరు మైతేయిల్లోనూ ముఖ్యమంత్రిపై విశ్వాసం పోయింది. శాంతిభద్రతలు భయంకరంగా ఉన్నాయని బీజేపీ నేతలే కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించడం ద్వారా ప్రధానమంత్రి రాష్ట్రానికి మాత్రమే కాకుండా, తనకు తాను మేలు చేసుకున్న వారవుతారు. 2. రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రంలోని విశ్రాంత అధికారుల్లో సమర్థులను ఎన్నుకుని గవర్నర్‌గా నియమించాలి. 3. ఐఏఎస్, ఐపీఎస్, రక్షణ శాఖల నుంచి ఒక్కొక్కరిని గవర్నర్‌కు సలహాదారులుగా నియమించాలి. జి.ఎస్.పంధేర్, హర్జీత్ సంధూ, ఎ.ఎన్.ఝా, నిఖిలేష్ ఝా, జాన్ షిల్సీ, జర్నేల్ సింగ్, బీ.ఎల్.వోహ్రా లాంటి అత్యుత్తమ అధికారులను పరి గణనలోకి తీసుకోవచ్చు. ఆర్థిక, పారిశ్రామిక పరిస్థితిని పునరుద్ధరించేందుకు ఆర్థికరంగ నిపుణులు ఒకరిని కూడా సలహాదారుగా నియ మించుకోవచ్చు. 4. ప్రత్యేక హక్కుల చట్టంతో సైన్యాన్ని తీసుకు రావద్దు. ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రాన్ని పాలించలేమన్న సంకే తాన్ని పంపడం అనవసరం. పైగా ఏఎఫ్ఎస్పీఏతో సైన్యాన్ని దింపితే అది పాత గాయాలను మళ్లీ రేపవచ్చు. 5. క్షేత్రస్థాయి పోలీసింగ్ మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలి. అవసరమైతే జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్పీలను డిప్యుటేషన్‌పై బయటి రాష్ట్రాల నుంచి తీసుకురావచ్చు. 6. ఆయుధాలు ఎత్తుకెళ్లిన వారిని ‘సిట్’లు అరెస్ట్ చేసేలా చూడాలి. దుండగుల చేతుల్లో 4,500 ఆయుధాలున్నాయంటే మణి పుర్ ఇప్పుడు సాయుధ రాష్ట్రమనే లెక్క. ఆయుధాలు ఎత్తుకెళ్లిన వారి పేర్లు వెల్లడించకపోతే తగిన చర్యలుంటాయని పోలీసులను హెచ్చరించాలి. దోపిడి సమయంలో అక్కడే ఉన్నవారిపై చట్టపరమైన విచారణ జరగాలి. 7. మిలిటెంట్లకు వ్యతిరేకంగా భద్రతాదళాలు తీసుకుంటున్న చర్యలకు విఘాతం కలిగిస్తున్న మహిళా వర్గాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. తగినంత మంది మహిళ అధికారిణులు, సిబ్బందిని ఈ కార్యక్రమాల కోసం ఉపయోగించాలి. 8. నిందితుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు, నేర విచారణ బృందాలను ఏర్పాటు చేయాలి. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం బాధితుల్లో కలిగించేందుకు ఇది అత్యవసరం. 9. కుకీ మిలిటెంటు గ్రూపులు ఇరవై ఐదింటిపై చర్యలను నిలిపి వేయడంపై ఉన్న గందరగోళాన్ని తొలగించాలి. పద్నాలగు క్యాంపుల్లోని 2,200 మంది కేడర్ వద్ద ఉన్న ఆయుధాలను సమీక్షించాలి. కుకీ, మైతేయి మిలిటెంట్లు ఏర్పాటు చేసుకున్న బలవంతపు వసూళ్ల చెక్ పోస్టులను పెకిలించాలి. నల్ల మందు మాఫియాపై స్థానిక పోలీసులు కఠిన చర్యలకు దిగాలి. ఈ మాఫియాలో కొందరు రాజకీయ నేతలూ మిలాఖత్ అయి ఉన్నారు. డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతున్న అదనపు ఎస్పీ థౌనావోజామ్ బృందం తనకు తగిన మద్దతు లేదని రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇటువంటి వారిని మళ్లీ నియమించుకుని డ్రగ్ మాఫియా ఆటలు కట్టేలా చూడాలి. 10. నిరాశ్రయులైనవారు మళ్లీ తమ ఇళ్లకు చేరుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఇందుకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేయాలి. పాలన యంత్రాంగ చక్రాలు కదలడం మొదలై, అది ప్రజలకు స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టిన తరువాత రెండో దశ కార్య కలాపాలకు శ్రీకారం చుట్టాలి. పోలీసు కౌన్సిల్స్ ఏర్పాటు చేసి అందులో తటస్థులైన విద్యావేత్తలు, జర్నలిస్టులు, పౌర సమాజపు సభ్యులను చేర్చాలి. గతంలో భయంతో లేదా తమ తెగలకు నిబద్ధంగా ఉండాలన్న కారణంతో కొందరు సభ్యులు రాజీనామా చేశారు. తటస్థులను సభ్యులుగా చేయడం ద్వారా శాంతి స్థాపన సాధ్యం. చివరగా... ఘర్షణల సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు తెగువ చూపిన వారిని బహిరంగంగా గౌరవించాలి. కుకీలున్న చోట మైతేయిలను, మైతేయిల ప్రాబల్యం ఉన్న చోట కుకీలను కాపాడిన ఘటనలు కోకొల్లలు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్ సంక్షోభాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరి ష్కారం దీర్ఘకాలికమైందిగా ఉండాలి. ప్రతి తెగకూ తమ బాధలు చెప్పుకునేందుకు అనువైన వేదిక, ప్రాతినిధ్యం కల్పించాలి. అప్పుడు మాత్రమే ఉగ్రవాదులు ఆయుధాలు వదిలేయడం సాధ్యమవుతుంది. కంచెలు, కందకాలు తొలగిపోతాయి. యశోవర్ధన్ ఆజాద్ కేంద్ర మాజీ సమాచార కమిషనర్,విశ్రాంత ఐపీఎస్ అధికారి, డీప్స్ట్రాట్ ఛైర్మన్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
మహిళా అధికారులు.. వరదలకు ఎదురు నిలిచి ధీరత్వం ప్రదర్శించారు
పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు మహిళా ఆఫీసర్ల ధైర్యగాధలు మార్మోగుతున్నాయి. ఇటీవలి పెను వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడటంలో మహిళా కలెక్టర్లు, ఎస్పిలు రేయింబవళ్లు కష్టపడి ధీరత్వాన్ని ప్రదర్శించారు. చంటి పిల్లల్ని ఇళ్లల్లో వదిలి ప్రజల కోసం రోజుల తరబడి పని చేసిన ఈ ఆఫీసర్ల పరిచయం... ఉత్తర భారతాన్ని వానలు, వరదలు చుట్టుముట్టాయి. పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకూ కుంభవృష్టి ముంచెత్తింది. నదులు వెర్రెత్తి ఫ్రవహించాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి. గిరి వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుని వరదనీటిలో అడ్డొచ్చినవాటిని ధ్వంసం చేసుకుంటూ ముందుకు సాగాయి. కార్లు అగ్గిపెట్టెల్లా చెల్లాచెదురయ్యాయి. ప్రాణాలకు ప్రమాదం వచ్చి ఏర్పడింది. ఇలాంటి సమయాల్లో బయటకు అడుగు పెట్టడమే కష్టం. కాని ఈ సందర్భాలను సమర్థంగా ఎదుర్కొని ప్రశంసలు పొందారు మహిళా అధికారులు. ప్రకృతి విసిరే సవాళ్లకు తాము జవాబు చెప్పగలమని నిరూపించారు. సహాయక బృందాలను సమాయత్త పరచడం, లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించడం, వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా తరలించడం ఈ పనుల్లో స్వయంగా పాల్గొంటూ రేయింబవళ్లు పని చేశారు. అందుకే వారిని జనం మెచ్చుకుంటున్నారు. కృతజ్ఞతలు చెబుతున్నారు. పాటియాలా కలెక్టర్ ఉత్తర భారతానికి పెను వర్షగండం ఉందని వార్తలొచ్చాక ఆ గండం పంజాబ్‌లో పాటియాలా జిల్లాకు కూడా వచ్చింది. జూలై 9, 10 తేదీల్లో పాటియాలా జిల్లా వరదల్లో చిక్కుకుంది. ఆ జిల్లా కలెక్టర్ సాక్షి సహానె వెంటనే రంగంలో దిగింది. ఆమెకు మూడేళ్ల కుమార్తె ఉంది. ఆ కుమార్తె బాగోగులు తన తల్లిదండ్రులకు అప్పజెప్పి దాదాపు 7 రోజులు ఇంటికే వెళ్లకుండా జిల్లా అంతటా తిరుగుతూ ప్రజలను కాపాడింది సాక్షి సహానె. ముఖ్యంగా ఎగువన ఉన్న మొహాలీ జిల్లా నుంచి వరద నీరు పాటియాలాలోని సట్లజ్ యమున లింక్ కెనాల్‌కి చేరడంతో ఒక్కసారిగా వరద చండీగడ్–పాటియాలా హైవేపై ఉన్న రాజ్‌పుర ప్రాంతానికి వచ్చేసింది. అక్కడే చిత్కారా యూనివర్సిటీ, నీలమ్ హాస్పిటల్ ఉన్నాయి. రెండూ వరదలో చిక్కుకున్నాయి. ‘నీలమ్ హాస్పిటల్లో ఉన్న అందరు పేషెంట్లను, 14 మంది ఐసియు పేషెంట్లను విజయవంతంగా తరలించ గలిగాం’ అని సహానె తెలిపింది. అలాగే చిత్కారా యూనివర్సిటీలో విద్యార్థులందరూ బయటకు రాలేనంతగా వరద నీటిలో చిక్కుకున్నారు. సహానె స్వయంగా యూనివర్సిటీ దగ్గరకు వెళ్లి ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్ దళాల సహాయంతో ఆ విద్యార్థులను బయటకు తరలించారు. ‘సులూర్ అనే గ్రామంలో వరద నీటిలో చిక్కుకుని ఆహారం కోసం జనం అల్లాడుతున్నారని నాకు అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. వెంటనే ఆహారం తీసుకుని ఆ వానలో వరదలో బయలుదేరాను. కారులో కూచుని ఉంటే వరద నీరు నా అద్దాల వరకూ చేరుకుంది. భయమూ తెగింపు కలిగాయి. అలాగే ముందుకు వెళ్లి ఆహారం అందించగలిగాను’ అంది సాక్షి సహానె. 2014 ఐ.ఏ.ఎస్ బ్యాచ్‌కు చెందిన సహానె తన చొరవ, చురుకుదనంతో పాటియాలా జిల్లా ప్రజల అభిమానం గెలుచుకుంది. కుల్లు ఎస్.పి. హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లా ఎస్.పి 28 సంవత్సరాల సాక్షి వర్మను అందరూ ‘లేడీ సింగం’ అంటారు. సిమ్లా జిల్లాలో ఆమె పని చేసినప్పుడు బ్రౌన్‌షుగర్ సరఫరా చేసే ముఠాలను పట్టుకుంది. అలాగే పేరు మోసిన దొంగలను జైలు పాలు చేసింది. స్త్రీల రక్షణ కోసం ‘గుడియా హెల్ప్‌లైన్’, ‘శక్తి బటన్’, ‘హోషియార్ సింగ్’ అనే హెల్ప్లైన్లు ప్రారంభించింది. దాంతో జనం ఆదరణ పొందింది. కుల్లు ఎస్.పిగా చార్జ్ తీసుకున్నాక వచ్చిన తీవ్ర వరదలను సాక్షి వర్మ సమర్థంగా ఎదుర్కొంది. ‘ఈ వరదల్లో నాకు ఎదురైన పెద్ద సవాలు ఏమిటంటే మా జిల్లాలో ఉన్న పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్స్ మనాలి కావచ్చు, తీర్థన్ కావచ్చు... వీటన్నింటితో కమ్యునికేషన్ కోల్పోవడం. మొబైల్స్ పని చేయలేదు. మా పోలీసు శాఖ వైర్లెస్ ఫోన్లు కొన్ని చోట్ల మాత్రమే పని చేశాయి. మిగిలిన ప్రాంతాలకు శాటిలైట్ ఫోన్లు పంపి అక్కడి నుంచి సమాచారం తెప్పించాను. కాని శాటిలైట్ ఫోన్లు చేర్చడం కూడా పెద్ద సవాలైంది. అలాగే రోడ్లు ధ్వంసం కావడం వల్ల సహాయక బృందాలు చేరలేకపోయాయి. అయినా సరే మేమందరం సమర్థంగా సహాయక చర్యలు చేపట్టాము. పని చేసేటప్పుడు నేను స్త్రీనా, పురుషుడినా అనేది నాకు గుర్తు ఉండదు. ఒక ఆఫీసర్‌గా ఏం చేయగలను అనేదే ఆలోచిస్తాను’ అని తెలిపింది సాక్షి వర్మ– 2014 ఐపిఎస్ బ్యాచ్ ఆఫీసర్. మండి ఎస్.పి. కుల్లు జిల్లా పక్కనే ఉంటుంది మండి జిల్లా. రెంటికీ రెండు గంటల దూరం. ఈ జిల్లా కూడా తీవ్రంగా వరద బారిన పడింది. వంతెనలు, ఇళ్లు, రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. చివరకు పోలీస్ స్టేషన్లకు బిఎస్ఎఫ్ దళాలకు కూడా కమ్యూనికేషన్ లేదు. ఇలాంటి సమయంలో గొప్ప సమర్థతతో పని చేసింది మండి ఎస్.పి సౌమ్య సాంబశివన్. 2010 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన ఈ ఆఫీసర్ బియాస్ నది ఒడ్డున ఉన్న స్లమ్స్ చిక్కుకున్న 80 మందిని కాపాడగలగడంతో మొదటి ప్రశంస పొందింది. టూరిస్ట్ ప్రాంతం కాబట్టి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అక్కడికి వచ్చిన టూరిస్ట్‌లు ఎలా ఉన్నారంటూ ఫోన్ల వరద మొదలైంది. టూరిస్ట్‌లను సురక్షితంగా ఉంచడం సౌమ్యకు ఎదురైన పెద్ద సవాలు. ‘వారందరిని వెతికి స్థానిక సత్రాల్లో, గురుద్వారాల్లో చేర్చడం చాలా వొత్తిడి కలిగించింది. అలాగే ఇళ్లు విడిచి రావడానికి చాలామంది ఇష్టపడలేదు. కష్టపడి సంపాదించుకున్న వస్తువులను వదిలి రావడం ఎవరికైనా బాధే. వారు అలాగే ఉంటే చనిపోతారు. ఎంతో ఒప్పించి వారిని ఖాళీ చేయించాను’ అందామె. సౌమ్య సాంబశివన్ కింద మొత్తం 1200 మంది సహాయక సిబ్బంది పని చేసి ఈ ఉత్పాతాన్ని ఎదుర్కొన్నారు. -
74th Republic Day: పరేడ్‌లో మహిళా శక్తి
74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే రిపబ్లిక్ పరేడ్‌లో ఈసారి మహిళా శక్తికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆర్మి, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనికవాతు బృందాలకు మహిళా ఆఫీసర్లు నాయకత్వం వహించనున్నారు. మొదటిసారి మహిళా ఒంటె దళం కవాతు చేయనుంది. డేర్ డెవిల్స్‌గా స్త్రీల బృందం మోటర్ సైకిల్ విన్యాసాలుచేయనుంది. అనేక శకటాలు మహిళా శక్తిని చాటనున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా స్త్రీ ప్రభావ శక్తికి ఈ పరేడ్ వేదిక కానుంది. గణతంత్ర దినోత్సవం నాడు మన దేశం తన సైనిక తేజాన్ని, సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని, అంతర్గత వైవిధ్యాన్ని చాటుకుంటుంది. ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు జరిగే సైనిక కవాతు, రాష్ట్ర ప్రభుత్వాల శకటాల విన్యాసం, కళా బృందాల ఆట΄ాటలు. చూడటానికి కళ్లు చాలవు. ఇదంతా కలిసి మన దేశం... మనమంతా కలిసి మన శక్తి అనే భావన ఈ సందర్భంలో కలుగుతుంది. అయితే ఈసారి ఈ ‘మన శక్తి’లో స్త్రీ శక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, త్రివిధ దళాలుప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్ల ఈ పరేడ్ స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలువనుంది. ముగ్గురు మహిళా సైనికాధికారులు పరేడ్‌లోపాల్గొనే త్రివిధ దళాల కవాతు బృందాలకు పురుష ఆఫీసర్లు నాయకత్వం వహించి ముందు నడవడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు మహిళా ఆఫీసర్లకు నాయకత్వ స్థానం దొరికింది. నావికా దళంలో నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ (29) 144 మంది నావికులతో కూడిన కవాతు బృందాలకు నాయకత్వం వహించనుంది. బెంగళూరుకు చెందిన దిశ అమృత్ 2016లో నావికా దళంలో చేరక ముందు ఐటి రంగంలో పని చేసింది. ఎన్సిసి కాడెట్‌గా ఉన్నప్పటి నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌పాల్గొంటున్న ఆమె ఈసారి ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మిగ్– 17 పైలెట్‌గా ఉన్న స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి తన దళం తరఫున 144 మంది గగన యోధులతో కవాతు నిర్వహించనుంది. ఇక మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌కు లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ నాయకత్వం వహించనుంది. ‘చిన్నప్పటి నుంచి టీవీలో చూసిన పరేడ్‌లో ఈసారి నేను పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని శర్మ అంది. ఈ ముగ్గురు కాకుండా లెఫ్టినెంట్ డింపుల్ భాటి మోటార్ సైకిల్ విన్యాసాల దళంలో, మేజర్ మహిమ ‘కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్’ బృందాల నాయకత్వంలోపాల్గొననున్నారు. మహిళా శకటాలు ఈసారి పరేడ్‌లో 17 రాష్ట్రాల నుంచి, 6 మంత్రిత్వ శాఖల నుంచి, త్రివిధ దళాల నుంచి శకటాలుపాల్గొననున్నాయి. ఇవి కాకుండా డిఆర్డివో శకటం ఉంటుంది. అయితే వీటిలో చాలా శకటాలు ఈసారి మహిళా శక్తికి ప్రాధాన్యం,ప్రాముఖ్యం ఇచ్చాయి. మూడు సైనిక దళాలు ఈసారి మహిళా కేంద్రిత శకటాలను నడుపుతున్నాయి. టూరిజంలోనూ, సేంద్రియ వ్యవసాయంలోనూ స్త్రీల భాగస్వామ్యంలో వారి స్వయం సమృద్ధికిపాటుపడతాం అనే థీమ్‌తో త్రిపుర శకటం ఉండనుంది. పశ్చిమ బెంగాల్ శకటం యునెస్కో గుర్తింపు పొందిన దుర్గా పూజను ‘మానవత్వానికి అమూర్త వారసత్వ సంపదగా’ అభివర్ణిస్తూ ముందుకు సాగనుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘సకల సజీవిత్వాలను సమృద్ధి చేసే అమృత స్త్రీతత్వం’ థీమ్‌తో శకటం నడపనుంది. కేంద్ర హోమ్ శాఖ అయితే ఆరు కేంద్ర బలగాలలో స్త్రీ పోరాట పటిమను ప్రదర్శించే శకటంను ఎంచుకుంది. కేరళ మహిళా సాక్షరత శకటాన్ని, కర్నాటక మహిళా స్వయం సమృద్ధి శకటాన్ని ఈ పరేడ్ దారుల్లో నడిపించనున్నాయి. కళకళలాడే నృత్యాలు వీరందరూ కాకుండా వివిధ రాష్ట్రాల సాంస్కృతిక బృందాలలో విద్యార్థునులు, యువతలు, మహిళా కళాకరులు విశేష సంఖ్యలోపాల్గొననున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి మొదలు వీరంతా తమ సాంస్కృతిక విన్యాసాలను ప్రదర్శించనున్నారు. లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ, స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి, లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ చారిత్రక దృశ్యం దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ నేత్రపర్వంగా ఉండటమే కాదు, దేశభక్తి భావాలు ఉ΄÷్పంగేలా కూడా చేస్తుంది. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేకత... సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) ‘క్యామెల్ కాంటింజెంట్’లో తొలిసారిగా ΄ాల్గొంటున్న మహిళా సైనికులు... దిల్లీలో ఘనంగా జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చెందిన ‘క్యామెల్ కాంటింజెంట్’ 1976 నుంచి భాగం అవుతోంది. ఈసారి జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళా సైనికులు ‘క్యామెల్ కాంటింజెంట్’లో భాగం కావడం చారిత్రక ఘట్టం కానుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇరవై నాలుగు మంది మహిళా సైనికులకు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో క్యామెల్ రైడింగ్‌లో శిక్షణ ఇచ్చి పన్నెండు మందిని ఎంపిక చేశారు. ‘రిపబ్లిక్ డే పరేడ్‌లో ΄ాల్గొనడం ఒక సంతోషం అయితే క్యామెల్ కాంటింజెంట్‌లో భాగం కావడం మరింత సంతోషం కలిగిస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైన అంబిక. ‘రిపబ్లిక్ డే ఉత్సవాల్లో క్యామెల్ రైడర్స్‌ను చూసి అబ్బురపడేదాన్ని. ఇప్పుడు నేను అందులో భాగం కావడం గర్వంగా ఉంది’ అంటుంది సోనాల్. విజయ్‌చౌక్ నుంచి ఎర్రకోట వరకు కర్తవ్యపథ్ మీదుగా క్యామెల్ రైడర్స్ కవాతు నిర్వహిస్తారు. రిపబ్లిక్‌డే తరువాత జరిగే రీట్రీట్ సెరిమనీలో కూడా ఈ బృందం ΄ాల్గొనబోతోంది. అమృత్‌సర్‌లో జరిగిన బీఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో ఈ బృందం ΄ాల్గొని ప్రశంసలు అందుకుంది. ఉమెన్ రైడర్స్ కోసం ఆకట్టుకునే యూనిఫాంను కూడా రూ΄÷ందించారు. ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ దీన్ని డిజైన్ చేశారు. మన దేశంలోని వివిధ ్ర΄ాంతాలకు చెందిన క్రాఫ్ట్ ఫామ్స్‌ను ఈ డిజైన్ ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తుంది. రాజస్థాన్‌లోని మెవాడ్ సంప్రదాయానికి చెందిన తల΄ాగా మరో ఆకర్షణ. మన దేశంలో భద్రతావసరాలు, సాంస్కృతి కార్యక్రమాల్లో ఒంటెలను ఉపయోగిస్తున్న ఏకైక సైనిక విభాగం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సాంస్కృతిక కార్యక్రమాల్లో బీఎస్ఎఫ్ క్యామెల్ కాంటింజెంట్ కవాతులకు ప్రత్యేకత ఉంది. ఉమెన్ రైడర్స్ రాకతో కవాతులలో రాజసం ఉట్టిపడుతుంది. మేము సైతం: ఉమెన్ రైడర్స్, ఆకట్టుకునే యూనిఫాం: ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ డిజైన్ చేశారు. -
శెభాష్.. ఒకేసారి ఇద్దరు మహిళా డీజీపీలు
ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహిళా శక్తి గురించి తెలిసినప్పుడు ఒక కొత్త ఊపిరి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడా ఊపిరిని, ఉత్సాహాన్నీ రెట్టింపు చేస్తూ పంజాబ్‌లో ఒకేసారి ఇద్దరు మహిళలు డీజీపీలుగా పదోన్నతులు పొందారు. మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచారు. పంజాబ్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) స్థాయికి పదోన్నతి పొందిన ఏడుగురు పోలీసు అధికారుల పేర్లను హోం వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఆ ఏడుగురు అధికారుల్లో ఇద్దరు మహిళా ఐపీఎస్‌లు గౌరవప్రదమైన పాత్రను కైవసం చేసుకున్నారు. శశిప్రభ ద్వివేది, గురుప్రీత్ కౌర్ ఇద్దరు మహిళలు ఇలా ఒకేసారి డీజీపీలుగా పదోన్నతులు పొందడం ఇదే మొదటిసారి. ఈ పదోన్నతులు ఇప్పుడు పంజాబ్ పోలీసు ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్న అధికారుల సంఖ్యకు సంబంధించి అత్యంత శక్తిమంతమైన శక్తులలో ఒకటిగా మారడానికి మార్గం సుగమం చేశాయి. గురుప్రీత్ కౌర్ డియో 1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అదే సంవత్సరం అధికారిగా నియమితులయ్యారు. గురుప్రీత్ ఇటీవల పదోన్నతి పొందిన బ్యాచ్‌లో అత్యంత సీనియర్ అధికారి. పంజాబ్ పోలీస్‌లో భాగమైన మొదటి మహిళా ఐపీఎస్ అధికారి. గతంలో మహిళా వ్యవహారాలను కవర్ చేసే బాధ్యతలు, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాను కలిగి ఉన్న కమ్యూనిటీ వ్యవహారాల విభాగానికి బాధ్యత వహించారు. చీఫ్ ఆఫ్ డ్రగ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (క్రైమ్)గా, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడిషనల్ డీజీపిగా పనిచేశారు. తన పదోన్నతిపై ఆమె స్పందిస్తూ ‘డీజీపీగా పనిచేసే అవకాశం లభించినందుకు ఆనందం’గా ఉందన్నారు. శశిప్రభ ద్వివేది అడిషనల్ ఛార్జ్ ఆఫ్ మోడర్నైజేషన్ (రైల్వేస్) అడిషనల్ డిజిపిగా పదోన్నతి పొందిన ద్వివేది 1993 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారు. 1994లో ఆమె« విధుల్లో చేరారు. 2021లో పంజాబ్ లోక్‌పాల్ ఏడీజీపీగా నియమితులయ్యారు. ఆగస్టు 2022లో ద్వివేది గౌరవ వందనం స్వీకరించి, పోలీసుల పాసింగ్ ఔట్ పరేడ్‌ను పరిశీలించారు. ఏడీజీపీగా ఆమె ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌కు అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా జవాన్లందరిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, ‘నిజాయితీగా, నిర్భయంగా విధులు నిర్వర్తించాలని, చట్టాన్ని గౌరవించాల’ని ఆమె సూచించారు. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగాన్ని ఎత్తిచూపుతూ, దశాబ్దాలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్స్ రాకెట్‌ను అంతమొందించేందుకు తగిన కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. -
శతఘ్ని దళాల్లోకి మహిళా అధికారులు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద సాయుధ దళం ‘ఆర్మీ’పోరాట విభాగంలోనూ మహిళలను చేర్చుకోవాలని నిర్ణయించింది. ముందుగా ఆర్టిలరీ (శతఘ్ని)దళాల్లో మహిళా అధికారులను చేర్చుకునేందుకు ఉద్దేశించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుందని భావిస్తున్నామన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే బోఫోర్స్ హౌవిట్జర్, కె–9 వజ్ర, ధనుష్ వంటి తుపాకులను ఇకపై మహిళలు కూడా ఉపయోగించగలుగుతారు. వీరు ఆర్టిలరీ పోరాట సహాయక విభాగంలో ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పదాతి దళం తర్వాత రెండో అతిపెద్ద రెజిమెంట్ శతఘ్ని దళమే. నిర్ణాయక విభాగంగా భావించే కీలకమైన ఈ దళంలో మిస్సైళ్లు, మోర్టార్లు, రాకెట్ లాంఛర్లు, డ్రోన్లు మొదలైనవి ఉంటాయి. పదాతి దళం, శతఘ్ని, మెకనైజ్డ్ శతఘ్ని రెజిమెంట్లలో ఇప్పటి వరకు మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్లు లేవు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆర్మీ మార్పులు తెచ్చింది. మహిళలకు పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 2022లో ఖడక్వాస్లాలోని డిఫెన్స్ అకాడమీలోకి 19 మంది మహిళా కేడెట్లతో మొదటి బ్యాచ్‌కు మూడేళ్ల శిక్షణ ప్రారంభించింది. అయితే, ఇన్ఫాంట్రీ, ఆర్మర్డ్ రెడ్ కార్ప్స్, మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీల్లోకి మహిళా అధికారులను చేర్చుకోవాలన్న ప్రణాళికలేవీ లేవని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. -
శౌర్యమే శ్వాసగా.. అత్యున్నత పదవిలో ఇద్దరు మహిళా అధికారులు
‘సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)లో మహిళలు ఏమిటి!’ అనే ఆశ్చర్యం, అనుమానం కనిపించేవి. సున్నితమైన ప్రాంతాలలో వారు విధులు నిర్వహించాల్సి రావడమే దీనికి కారణం. అయితే ఆ ఆశ్చర్యాలు, అనుమానాలు కనుమరుగై పోవడానికి ఎంతోకాలం పట్టలేదు. సీఆర్పీఎఫ్లో మహిళలు అద్భుతమైన విజయాలు సాధించారు. స్త్రీ సాధికారతకు పెద్ద పీట వేస్తున్న సీఆర్పీఎఫ్లో తాజాగా ఇద్దరు మహిళా ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) ర్యాంక్‌కు ప్రమోట్ అయ్యారు... ఉద్యోగాలు రెండు రకాలుగా ఉంటాయి. కడుపులో చల్ల కదలకుండా హాయిగా చేసేవి ఒక రకం. రెండో రకం ఉద్యోగాలు మాత్రం అడుగడుగునా సవాలు విసురుతాయి. మన సామర్థ్యాన్ని పరీక్షించి చూస్తాయి. ‘అమ్మాయిలకు పోలీసు ఉద్యోగాలేమిటి!’ అనుకునే రోజుల్లో సాయుధ దళాల్లోకి వచ్చారు సీమ దుండియా, అనీ అబ్రహాం. వృత్తి నిబద్ధతతో ఉన్నతశిఖరాలకు చేరారు. తాజాగా ఈ మహిళా ఉన్నతాధికారులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) ర్యాంక్‌కు ప్రమోట్ అయ్యారు. సీమా దుండియా సీఆర్పీఎఫ్–బిహార్ విభాగానికి, అనీ అబ్రహాం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఎఎఫ్)కు నేతృత్వం వహించనున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు ఒక మహిళ నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి. ‘ఇదొక గొప్ప విజయం అనడంలో సందేహం లేదు. కేంద్ర రిజర్వు పోలీసు దళాలలో మహిళలు ఉగ్రవాదం నుంచి ఎన్నికల హింస వరకు అనేక రకాల సవాళ్లు ఎదుర్కొంటున్నారు. తమను తాము నిరూపించుకుంటున్నారు. మహిళా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందిలేని వాతావరణాన్ని కల్పించడం, సౌకర్యాలపై దృష్టిపెట్టడం, ఉన్నత విజయాలు సాధించేలా వారిని ప్రోత్సహించడం, ఆర్‌ఎఎఫ్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లడం ఇప్పుడు నా ప్రధాన లక్ష్యాలు’ అంటుంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చీఫ్ అనీ అబ్రహం. ఇక సీమా దుండియా స్పందన ఇలా ఉంది... ‘నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో సీఆర్పీఎఫ్లో పురుషాధిపత్య ధోరణులు కనిపించేవి. మగవాళ్లతో పోటీ పడగలమా? అనే సందేహం ఉండేది. దీంతో మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. అయితే ఆ కష్టం వృథా పోలేదు. మంచి విజయాలు సాధించేలా చేసింది. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేలా చేసింది. మొదట్లో మమ్మల్ని సందేహంగా చూసిన వారే ఆ తరువాత మనస్ఫూర్తిగా ప్రశంసించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా అనుభవాలతో కొత్తవారికి మార్గదర్శనం చేయాలనుకుంటున్నాను’ అంటుంది సీమా. సీఆర్పీఎఫ్ మహిళా విభాగం ఫస్ట్ బ్యాచ్‌కు చెందిన సీమా, అబ్రహామ్‌లు ఐక్యరాజ్యసమితి తరపున ఆల్–ఫిమేల్ ఫార్మ్డ్ పోలీస్ యూనిట్ (ఎఫ్పీయూ)లో కమాండర్లుగా పనిచేశారు. ఇద్దరూ రాష్ట్రపతి పోలీస్ మెడల్స్ అందుకున్నారు. ‘ఒకసారి యూనిఫాం వేసుకున్నాక...ప్రమాదకరమైన ప్రాంతమా, భద్రతకు ఢోకాలేని ప్రాంతమా అనే ఆలోచన రాదు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవలసిందే అనే ఆత్మబలం వచ్చి చేరుతుంది. అదే ఈ వృత్తి గొప్పదనం’ అంటుంది అనీ అబ్రహాం. మూడు దశాబ్దాల అనుభవంతో ఈ ఇద్దరు సాహసికులు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఆ పాఠాలు భవిష్యత్ తరానికి విలువైన పాఠాలు కానున్నాయి. -
నేవీ నారీ శక్తి ఘనత
న్యూఢిల్లీ: పూర్తిగా మహిళా అధికారులతో కూడిన నావికాదళ బృందం ఉత్తర అరేబియా సముద్రంపై నిఘా మిషన్‌ను సొంతంగా నిర్వహించిన అరుదైన ఘనత సాధించింది. పోర్బందర్లోని ‘ఐఎన్ఏఎస్ 314’కు చెందిన మహిళా అధికారుల ఫ్రంట్‌లైన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ బుధవారం ఈ చరిత్ర సృష్టించిందని నేవీ తెలిపింది. లెఫ్టినెంట్ కమాండర్ ఆంచల్ శర్మ సారథ్యంలోని ఈ బృందంలో పైలెట్లు లెఫ్టినెంట్ శివాంగి, లెఫ్టినెంట్ అపూర్వ గీతె, టాక్టికల్, సెన్సార్ ఆఫీసర్లు లెఫ్టినెంట్ పూజా పాండా, సబ్ లెఫ్టినెంట్ పూజా షెకావత్ ఉన్నారని వెల్లడించింది. వీరంతా అత్యాధునిక డోర్నియర్ విమానం ద్వారా నిఘా విధులు నిర్వర్తించారని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ తెలిపారు. వీరు చేపట్టిన మొట్టమొదటి మిలిటరీ ఫ్లయింగ్ మిషన్ ప్రత్యేకమైందని, వైమానిక దళంలోని మహిళా అధికారులు మరిన్ని బాధ్యతలను స్వీకరించడానికి, మరిన్ని సవాళ్లతో కూడిన విధులను చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తుందని కమాండర్ మధ్వాల్ అన్నారు. ‘ఈæ మిషన్ సాయుధ దళాలు సాధించిన ఒక ప్రత్యేక విజయానికి సూచిక’అని ఆయన అన్నారు. ఈ మిషన్ నారీ శక్తిలో నిజమైన స్ఫూర్తిని నింపుతుందని ఆయన పేర్కొన్నారు. -
స్త్రీలకు శాశ్వత కమిషన్: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది సుప్రీంకోర్టు తీర్పు మేరకు రక్షణ శాఖ మహిళలకు ఆర్మీలో శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేసే ఆర్మీ ప్రక్రియపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ పొందడానికి నిర్దేశించిన మెడికల్ ఫిట్నెస్ పద్దతి అనేది ఏకపక్షంగా.. అహేతుకంగా, వివక్షాపూరితంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సైన్యంలో శాశ్వత కమిషన్ కోసం సుమారు 80 మంది మహిళా అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "మన సమాజ నిర్మాణం మగవారి కోసం.. మగవారిచే సృష్టించబడిందని ఇక్కడ మనం గుర్తించాలి" అని కోర్టు అభిప్రాయపడింది. సైన్యం సెలెక్టివ్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఎస్‌సీఏఆర్) మూల్యాంకనం ఆలస్యం చేయడం, మెడికల్ ఫిట్నెస్ క్రైటిరియాను అమలు చేయడం అనేది మహిళా అధికారులపై వివక్ష చూపుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. "ఎస్ఎస్సీ (షార్ట్ సర్వీస్ కమిషన్) మూల్యాంకనం విధానం మహిళా అధికారులకు ఆర్థిక, మానసిక హాని కలిగిస్తుంది" అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన ఏర్పాటైన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. "కోర్టు ముందుకు వచ్చిన అనేక మంది మహిళా అధికారులు అనేక అవార్డులు గెలుచుకున్నారు. చాలామంది విదేశీ కార్యకలపాల అంశంలో బాగా పనిచేశారు" అన్నారు. ‘‘క్రీడా పోటీలలో రాణించిన వారిని విస్మరించినట్లు మేం గుర్తించాం, మహిళలు సాధించిన విజయాల వివరణాత్మక లిస్టు తీర్పులో ఇవ్వబడింది ... దీన్ని బట్టి చూస్తే ఈ బోర్డు ఎంపిక కోసం కాకుండా తిరస్కరణ కోసం పని చేసినట్లు కనిపిస్తోంది’’ అని చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత మిలిటరీకి సంబంధించి గతేడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు శాశ్వత కమిషన్ని ఏర్పాటు చేసి సైన్యంలోని మహిళా అధికారులకు పురుష అధికారులతో సమానంగా కమాండ్ స్థానాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. మహిళల సర్వీసుతో సంబంధం లేకుండా శాశ్వత కమిషన్ అందరికీ అందుబాటులో ఉండాలని కోర్టు తెలిపింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం చేసిన వాదనలు "వివక్షత", "కలతపెట్టేవి"గా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే భారత వైమానిక దళం, భారత నావికాదళం మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ని మంజూరు చేసింది. దీని ప్రకారం ఐఏఎఫ్ మహిళలను ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీలలో అధికారులుగా అనుమతిస్తుంది. మహిళా ఐఏఎఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులు ప్రస్తుతం హెలికాప్టర్, రవాణా విమానం, ఫైటర్ జెట్లను కూడా నడుపుతున్నారు. నావికాదళంలో లాజిస్టిక్స్, లా, అబ్జర్వర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, మారిటైమ్ నిఘా పైలట్లు, నావల్ ఆర్మేమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్లలో ఎస్ఎస్సీ ద్వారా చేరిన మహిళా అధికారులను నావికా దళం అనుమతిస్తుంది. చదవండి: ఆర్మీలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్ సాయం చేయాలని ఉంది.. కానీ: సుప్రీంకోర్టు -
ఆఫీసర్స్ అందరూ మహిళలే
మహిళల్లో ఓటు వేయాలన్న ఉత్సాహం కలిగించడం కోసం అస్సాంలోని నల్బరి జిల్లా యంత్రాంగం కొత్తగా ఆలోచిస్తోంది. నల్బరినే ఎందుకు అంటే.. ఆ జిల్లాలోని అత్యున్నతస్థాయి అధికారులంతా దాదాపుగా మహిళలే కావడం! డిప్యూటీ కమిషనర్ మహిళ. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహిళ. ముగ్గురు అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు మహిళలు. వీళ్లంతా కలిసి నల్బరిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు నడిపించేందుకు రకరకాల ప్రణాళికలు, పథకాలు రచిస్తున్నారు! 126 స్థానాలు గల అస్సాం అసెంబ్లీకి మూడు విడతలుగా.. మార్చి 27, ఏప్రిల్ 1, 6 తేదీలలో.. పోలింగ్ జరుగుతోంది. అభ్యర్థుల గెలుపోటములపై మహిళా ఓటర్లే ప్రభావం చూపబోతున్నారని సర్వేల అంచనా. బ్రహ్మపుత్ర నది ఉత్తరపు ఒడ్డున అస్సాం నగరం గువాహటికి 60 కి.మీ. దూరంలో ఉంది నల్బరి జిల్లా. ఆ జిల్లాను నడిపే అత్యున్నతస్థాయి అధికారులంతా మహిళలేనన్నది మరీ కొత్త సంగతైతే కాదు. అయితే వీళ్లంతా కలిసి మహిళా ఓటర్లను పోలింగ్ బూత్‌ల వైపు ఆకర్షించేందుకు కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. వీళ్లకేం పని? వీళ్లకే పని! డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు.. వీళ్లే కదా జిల్లా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయవలసింది, బాధ్యత గల పౌరులుగా మెలిగేలా నడిపించవలసింది! అస్సాంలో త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేయడం పౌరధర్మం అయితే, ఓటు వేయించడం అధికారం ధర్మం. ఆ ధర్మాన్నే ఈ మహిళా అధికారులంతా బాధ్యతగా, వినూత్నంగా చేపడుతున్నారు. అభ్యర్థులు మహిళల ఓట్ల కోసం పాట్లు పడుతుంటే, అధికారులు మహిళల చేత ఓటు వేయించడం కోసం ‘ప్లాట్’లు ఆలోచిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. లోపల బూత్ సిబ్బంది, బయట భద్రతా సిబ్బంది అంతా మహిళల్నే నియమిస్తున్నారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. మహిళల్ని ఆ పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలైన నల్బరీ, బర్క్షెత్రి, ధర్మాపూర్లను ప్రత్యేక జోన్లుగా, సెక్టార్లుగా, చౌక్‌లుగా విభజించి అక్కడ మహిళా చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కేంద్రాలలో ఉండేది మళ్లీ మహిళలే. వారు తమ పరిధిలోని మహిళలకు ఓటు ఎందుకు వేయాలో చెబుతారు. ఓటు వేయకపోతే ఏం జరుగుతుందో వివరిస్తారు. ‘ఈసారి మన మహిళల ఓటు మీద అస్సాం భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని సర్వేలను ఉదహరిస్తూ కొన్ని ప్రధానమైన అభివృద్ధి అంశాలను అర్థమయ్యేలా చేస్తారు. ఓటు ఎవరికి వేసినా గానీ, మొత్తానికైతే ఓటు వేయడం మానకూడదన్న స్పృహ కలిగిస్తారు. ఇందుకోసం ఆ కేంద్రాల్లోని మహిళా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఇప్పటికే పూర్తయింది. ఇక పోలింగ్ డ్యూటీలో ఉన్న మహిళలకైతే వాళ్లెంత చిన్న బాధ్యతల్లో ఉన్నా ప్రత్యేక వసతుల్ని కల్పిస్తున్నారు. ‘‘మహిళలు సౌకర్యంగా ఉంటే, సమాజం సవ్యంగా సాగుతుంది’’ అంటారు డిప్యూటీ కమిషనర్ పురబి కన్వార్. అందుకే ఆమె ఓటు వేసే మహిళలకే కాకుండా, ఓటు వేయమని చెప్పే, బూత్ లోపల ఓటు వేసేందుకు దారి చూపే మహిళా సిబ్బంది అందరికీ కూడా సౌకర్యంగా ఉండేట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. పురబి కన్వార్ జిల్లా ఎన్నికల అధికారి కూడా. మరోవైపు.. ఇళ్లకు డెలివరీ అయ్యే గ్యాస్ సిలిండర్లపై ‘ఓటు వెయ్యడం మీ కర్తవ్యం’ అని తెలియజెప్పే స్టిక్కర్లను అతికించమని చెబుతున్నారు. ఇప్పటి వరకు అలా స్టిక్కర్లు అంటించిన సిలిండర్లు ఐదు వేల వరకు డెలివరీ అయ్యాయి. అలాగే వీధి నాటకాలు వేయిస్తున్నారు. మహిళా కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ‘మహిళా అధికారుల జిల్లా’గా నల్బరి స్టోరీ అప్పుడే అయిపోలేదు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్.. అందరూ మహిళలే! జిల్లా ఎస్పీ మహిళ (అమన్‌జీత్ కౌర్). జిల్లాలోని ఐదుగురు జడ్జిలు, నలుగురు సర్కిల్ ఆఫీసర్లు, సబ్–రిజిస్ట్రార్ (రెవిన్యూ), ఇంకా.. డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, సబ్–డివిజినల్ అగ్రికల్చర్ ఆఫీసర్, సాయిల్ సైంటిస్ట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు అంతా మహిళలే. ఇంత మంది మహిళా అధికారులు ఉన్నప్పుడు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం లేకుండా ఉంటుందా? మహిళల్లో చైతన్యం వెల్లివిరవకుండా ఉంటుందా? -
భారత నౌకా దళంలో తొలిసారిగా..
సాక్షి, న్యూఢిల్లీ : భారత నౌకాదళంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. లింగసమానత్వాన్ని పునర్నిర్వచిస్తూ యుద్ధనౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితిసింగ్‌లు అడుగుపెట్టనున్నారు. భారత నౌకా దళంలో పలు ర్యాంకుల్లో ఎంతోమంది మహిళా అధికారులున్నా యుద్ధనౌకల్లో వీరి నియామకం ఇదే తొలిసారి. ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉండటం, సిబ్బంది క్వార్టర్లలో ప్రైవసీ ఇబ్బందులు, మహిళలు, పురుషులకు ప్రత్యేక బాత్రూంల కొరత వంటి పలు కారణాలతో ఇప్పటివరకూ యుద్ధ నౌకల్లో మహిళా అధికారులను నియోగించలేదు. ఈ ఇద్దరు మహిళా అధికారులు వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. నౌకాదళం అమ్ములపొదిలో చేరనున్న అత్యాధునిక ఎంహెచ్-60ఆర్ హెలికాఫ్టర్లలో వీరు విధులు నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఎంహెచ్-60ఆర్ హెలికాఫ్టర్లు శత్రు దేశాల నౌకలు, సబ్మెరైన్లను గుర్తిస్తాయి. 2018లో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ లాక్‌హీడ్-మార్టిన్ నిర్మించిన ఈ హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేశారు. కాగా రఫేల్ యుద్ధవిమానాలకు ఎంపిక చేసిన పైలట్లలో ఓ మహిళా పైలట్‌ను ఐఏఎఫ్ నియమించేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో నేవీలో ఇద్దరు మహిళా అధికారుల నియామకం సైన్యంలో మహిళలకు సమ ప్రాతినిథ్యం దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు పంపింది. చదవండి : విశాఖ గూఢచర్యం కేసు.. మరొకరి అరెస్ట్ -
సాయం చేయాలని ఉంది.. కానీ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆర్మీలో శాశ్వత కమిషన్(పీసీ) కింద లభించే ప్రయోజనాలు తాము కూడా పొందేందుకు వీలుగా కటాఫ్ తేదీని మార్చాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన షార్ట్ సర్వీసు కమిషన్ (ఎస్ఎస్సీ) మహిళా అధికారులకు నిరాశే మిగిలింది. ఈ మేరకు వారు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేయని వాళ్లకు పీసీ ప్రయోజనాలు కల్పించాలంటే గతంలో తాము ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సి వస్తుందని, అదే జరిగితే అన్ని బ్యాచ్‌లు ఇలాంటి ప్రతిపాదనతో ముందుకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఎస్ఎస్సీ కింద రిక్రూట్ చేసే మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌కు తీసుకురావాలంటూ ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా... 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఎస్ఎస్సీ అధికారులు పీసీ కింద పరిగణింపబడతారని, అదే విధంగా అంతకంటే ఎక్కువ కాలం ఎస్ఎస్సీలో కొనసాగిన వారికి మొత్తంగా 20 ఏళ్ల పాటు సర్వీసులో ఉండే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తీర్పు వెలువడే నాటికి 14 ఏళ్ల సర్వీసు కంటే ఒక నెల తక్కువ సర్వీసు ఉన్న 19 మంది మహిళా అధికారులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.(చదవండి: ఆర్మీలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్) తద్వారా పదవీ విరమణ అనంతరం పీసీ కింద లభించే ప్రయోజనాలు(పెన్షన్) పొందే వీలు ఉంటుందని వారి తరఫు న్యాయవాది మీనాక్షి లేఖి సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఇందుకు స్పందించిన జస్టిస్ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ‘‘తీర్పు వెలువడే నాటికి 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుందని, పీసీ కింద చేకూరే ప్రయోజనాలు చేకూరుతాయని ఆనాటి జడ్జిమెంట్‌లో పేర్కొన్నాం. తీర్పు చెప్పిన రోజే కటాఫ్ డేట్. ఒకవేళ మేం ఆ తేదీని మారిస్తే.. తర్వాతి బ్యాచ్‌లకు కూడా ఇలాగే మార్చాల్సి వస్తుంది. ముందు బ్యాచ్‌లపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. వాళ్ల కోసం ఏదైనా చేయాలని ఉంది. కానీ అదెలాగో అర్థం కావడం లేదు’’అని పిటిషనర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. (చదవండి: టీనేజర్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం ) ఇక ఈ పిటిషన్ విచారణ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది, కల్నల్ బాలసుబ్రహ్మణ్యం మహిళా అధికారుల అభ్యర్థనను వ్యతిరేకించారు. ‘‘జూలై 16 న శాశ్వత కమిషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం ఫిబ్రవరి 17 నాటికి 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లకు మాత్రమే పెన్సన్ వస్తుంది. ఒకవేళ మీరు దీనిని అనుమతిస్తే.. సంక్లిష్ట పరిస్థితులు తలెత్తుతాయి. ఎందుకంటే ప్రతీ ఆర్నెళ్లకొకసారి ఓ బ్యాచ్ బయటకు వస్తుంది. వాళ్లందరికీ ఇలాంటి ప్రయోజనాలు కల్పించలేము’’అని కోర్టుకు తెలిపారు. కాగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు రక్షణ శాఖ మహిళలకు ఆర్మీలో శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఆర్మీ, ఎయిర్, డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీర్లు, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీర్లు, ఆర్మీ సర్వీసు కార్పొరేషన్, ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ వంటి విభాగాల్లో పని చేసేందుకు శాశ్వత కమిషన్ కింద నియామకాలు చేపట్టనున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. దీంతో మహిళలంతా పదవీ విరమణ వయసు వచ్చేంత వరకు సర్వీసులు కొనసాగే అవకాశం ఉంటుంది. -
ఆర్మీలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్
న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. షార్ట్ సర్వీసు కమిషన్ (ఎస్ఎస్సీ) కింద రిక్రూట్ చేసే మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌కు తీసుకురావాలంటూ గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పడం తెల్సిందే. ఈ తీర్పు మేరకు రక్షణ శాఖ శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ద్వారా ఆర్మీలో మహిళలు విస్తృతమైన పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుందని, మహిళా సాధికారతకు బాటలుపడతాయని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ చెప్పారు. ఇండియన్ ఆర్మీలోని అన్ని విభాగాల్లోనూ షార్ట్ సర్వీసు కమిషన్డ్ కింద ఉన్న మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్ కిందకు తీసుకువస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినట్టు కల్నల్ వెల్లడించారు. ఇకపై ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీర్లు, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీర్లు, ఆర్మీ సర్వీసు కార్పొరేషన్, ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ వంటి విభాగాల్లో పని చేసే మహిళలంతా శాశ్వత కమిషన్ కింద నియామకాలే జరుగుతాయి. ఎస్ఎస్సీ కింద ఉన్న వారంతా శాశ్వత కమిషన్ కింద మారే డాక్యుమెంటేషన్ ప్రక్రియ త్వరలో చేపట్టనున్నారు. ఎస్ఎస్సీ కింద నియమించే వారిని తొలుత అయిదేళ్లకు నియమిస్తారు.ఆ తర్వాత వారి సర్వీస్‌ను 14 ఏళ్లకు పెంచే అవకాశం ఉంటుంది. శాశ్వత కమిషన్ ద్వారా మహిళలంతా పదవీ విరమణ వయసు వరకు సర్వీసులు కొనసాగుతారు. -
రంగం సిద్ధమైంది
‘రోడ్ మ్యాప్’ అంటే ఏమిటి? భారత సైన్యంలోని మహిళా ఆర్మీ అధికారుల్ని ‘పర్మినెంట్ కమిషన్’లోకి తీసుకోడానికి రోడ్ మ్యాప్ రెడీ అయిందని గురువారం ఆర్మీ చీఫ్ నరవణె అన్నారు కదా. రోడ్ మ్యాప్ అంటే ఒక ప్రణాళిక. ఒక పనికి విధి విధానాలు ఏర్పాటు చేసుకోవడం. ఆర్మీలోని ‘పర్మినెంట్ కమిషన్’ (పి.సి) లోకి ఆర్మీలోని ‘షార్ట్–సర్వీస్ కమిషన్’(ఎస్.ఎస్.సి.)లో ఉన్న మహిళా ఆర్మీ అధికారులను తీసుకోవాలని గత సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ పనికి రోడ్ మ్యాప్ తయారైంది. తక్షణం ఎవరికి ప్రయోజం? సుప్రీంకోర్టు ఇచ్చిన గడుపు మేరకు మూడు నెలల్లో.. ఎస్.ఎస్.సి.లో ఏ విభాగంలోనైనా పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన మహిళా ఆర్మీ అధికారులందరికీ ప్రయోజనమే. పి.సి.లోకి వారికి పదోన్నతి లభిస్తుంది. ఎస్.ఎస్.సి.లో పదేళ్లు పూర్తయిన వారంతా కచ్చితంగా పి.సి.లో చేరాల్సిందేనా? కచ్చితంగా ఏం లేదు. ఇష్టం ఉన్నవారు చేరవచ్చు. ఇష్టం లేనివాళ్లు పదేళ్ల సర్వీసు తర్వాత మరో నాలుగేళ్లు ఎస్.ఎస్.సి.లోనే ఉండొచ్చు. ఆ తర్వాత వారికి ఉద్యోగ విరమణే. రోడ్‌మ్యాప్ తయారైంది. తర్వాతేమిటి? ప్రస్తుతం ఆర్మీలో 1653 మంది మహిళా ఆర్మీ అధికారులు ఉన్నారు. వారిలో పదేళ్ల సర్వీసు పూర్తయిన వారు 600 మంది ఉన్నారు. ఇక ఇప్పుడు వీళ్లందరికీ లెటర్లు పంపుతారు. పర్మినెంట్ కమిషన్‌లోకి వెళ్లడం సమ్మతమేనా అని. సమ్మతం అయినవారు 60 ఏళ్ల వయసు వచ్చేవరకు పి.సి. అధికారిగా ఉండొచ్చు. ఆర్మీలోని వివిధ విభాగాలలో (పోరాట విధులు సహా) అత్యున్నత హోదాలకు చేరుకోవచ్చు. ఇప్పటి వరకు షార్ట్ సర్వీస్ కమిషన్‌లో ఉన్న పురుషులకు మాత్రమే పర్మినెంట్ కమిషన్‌లోకి వెళ్లేందుకు వీలుండేది. భారత సైన్యంలో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? అన్ని విభాగాల్లోని స్త్రీ పురుషులందరూ కలిపి 13 లక్షల మంది ఉన్నారు. వారిలో 41 వేల మంది పురుష ఆఫీసర్లు. (మహిళా అధికారుల సంఖ్య.. పై సమాధానంలో ఉంది చూడండి). గత ఏడాది రిపబ్లిక్ పరేడ్‌లో తొలిసారి పురుష సైనిక దళానికి సారథ్యం వహించిన ఆర్మీ అధికారి లెఫ్ట్‌నెంట్ భావనా కస్తూరి (27) -
విదేశాల్లో మహిళా సేనాని
శాశ్వత కమిషన్‌తో పాటు కమాండ్ పోస్ట్‌ల్లో మహిళా అధికారులను నియమించాలని ఆర్మీని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లోని ఆర్మీల్లో మహిళా అధికారుల పరిస్థితిపై చిన్న కథనం. న్యూఢిల్లీ: యుద్ధ విధుల్లో కీలక పాత్ర పోషించే అవకాశం మహిళలకు లభించడం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇటీవల కాలంలోనే ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రత్యక్ష యుద్ధ విధుల్లో, ప్రత్యేక ఆపరేషన్ల కోసం ఏర్పాటైన సుశిక్షిత దళాల్లో మహిళకు అవకాశం కల్పించడం బ్రిటన్‌లో 2018లో ప్రారంభించారు. అంతకుముందు, ఆయా దళాల్లో మహిళా సైనికాధికారులను చేర్చుకునే విషయంలో నిషేధం ఉండేది. అమెరికా సైన్యంలో కూడా 2016 వరకు సాధారణ సైనిక విధులకు మాత్రమే మహిళలు పరిమితమయ్యారు. 2016లో పోరాట దళాల్లోనూ వారికి అవకాశం కల్పించడం ప్రారంభించారు. 2019 సంవత్సరంనాటికి క్షేత్ర స్థాయి పోరాట దళాల్లో కీలక విధుల్లో ఉన్న మహిళా అధికారుల సంఖ్య 2906కి చేరుకుంది. అమెరికా వైమానిక, నౌకా దళాల్లోని పోరాట బృందాల్లో మహిళల భాగస్వామ్యం మాత్రం 1990వ దశకం మొదట్లోనే ప్రారంభమైంది. చైనాలో.. ప్రపంచంలోనే సంఖ్యాపరంగా అత్యంత పెద్ద సైన్యం.. చైనాకు చెందిన ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)’ అన్న విషయం తెలిసిందే. దాదాపు 14 లక్షల చైనా ఆర్మీ గ్రౌండ్ ఫోర్స్‌లో ఉన్న మహిళా అధికారుల సంఖ్య సుమారు 53 వేలు మాత్రమే. అంటే 5శాతం కూడా లేరు. అలాగే, మన మరో పొరుగుదేశం పాకిస్తాన్ సాయుధ దళాల్లోని మహిళల సంఖ్య 3400 మాత్రమే. కెనడా దేశం 1989 సంవత్సరంలో, డెన్మార్క్ 1988 సంవత్సరంలో, ఇజ్రాయెల్ 1985లో సైనిక పోరాట విధుల్లో మహిళా సైనికులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. సైన్యంలోకి మహిళలను తీసుకోవడం మాత్రం ఇజ్రాయెల్ 1948లోనే ప్రారంభించింది. యుద్ధ విధుల్లోని అన్ని స్థాయిల్లో మహిళలకు అవకాశం కల్పించిన తొలి నాటో దేశంగా నార్వే నిలిచింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటెజిక్ స్టడీస్ గణాంకాల ప్రకారం రష్యా సాయుధ దళాల్లో మహిళలు దాదాపు 10శాతం ఉన్నారు. ఆర్మీలో లింగ వివక్ష లేదు: మహిళా సైనికాధికారులకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, కమాండ్ పోస్ట్‌ల్లో వారికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆర్మీ చీఫ్ నరవణె పేర్కొన్నారు. మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుతో లింగ సమానత్వ దిశగా ముందడుగు వేసినట్లు అవుతుందన్నారు. ఆర్మీలోని వివిధ స్థాయిల్లో విధులు అప్పగించేందుకు వీలుగా 100 మహిళా సైనికులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. శాశ్వత కమిషన్‌లో చేరేందుకు సిద్ధమా? అని మహిళాఅధికారులకు లేఖలను పంపిస్తున్నామన్నారు. -
నారీ.. సైన్యాధికారి
న్యూఢిల్లీ: కమాండ్ రోల్స్‌లో మహిళా సైనికాధికారుల నియమించే విషయంలో కొనసాగుతోన్న వివక్షకు చెల్లుచీటీ ఇస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. శారీరక పరిమితులు, సామాజిక కట్టుబాట్ల పేరుతో సైనిక పటాలాల కమాండింగ్ బాధ్యతల్లో మహిళా అధికారులను నియమించకపోవడం తగదని స్పష్టం చేసింది. భారత సైన్యంలో పనిచేస్తోన్న మహిళా అధికారులకు పురుషులతో సమానంగా ఉన్నత బాధ్యతలు నెరవేర్చే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ భావనను వ్యతిరేకించడమేనని సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మక తీర్పునిచ్చింది. అందులో భాగంగానే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ)లోని మహిళా సైనికాధికారులకు మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్(పర్మనెంట్ కమిషన్–పీసీ) ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. గతంలో ఎందరో మహిళాఅధికారులు దేశానికి అత్యున్నత పురస్కారాలను తెచ్చిపెట్టిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేస్తూ సాయుధ దళాలలో లింగపరమైన వివక్షకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు తమ ఆలోచనావిధానాలను మార్చుకోవాల్సి ఉంటుందని హితవు పలికింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో.. కమాండ్ పోస్టింగ్స్‌తో పాటు పురుష అధికారులతో సమానంగా పదోన్నతులు, ర్యాంక్స్, పెన్షన్సు, ఇతర ప్రయోజనాలు దక్కనున్నాయి. 2010 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పుకు సమర్థన రక్షణ రంగంలో ఎన్నేళ్ళ సర్వీసు ఉన్నదనే విషయంతో సంబంధం లేకుండా పురుష సైనికుల మాదిరిగానే మహిళా సైనికులకు వృత్తిపరమైన ఎంపిక కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. మహిళా సైనికుల విషయంలో వివక్ష తగదంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పదేళ్లుగా ఈ ఆదేశం అమలుపై కేంద్రం శ్రద్ధ చూపలేదని తప్పు పట్టింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగీల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఆ పరిమితులు అడ్డు కాదు సైన్యంలో ఉన్నత పదవులను నిర్వర్తించడంలో మహిళలకు వారి సహజ శారీరక పరిమితులూ, సామాజిక కట్టుబాట్లు అడ్డుగా ఉన్నాయన్న కేంద్రం వివరణను కోర్టు తోసిపుచ్చింది. ‘మాతృత్వం, పిల్లల పోషణ లాంటి సవాళ్ళు’ కూడా ఉన్నాయన్న కేంద్రం వివరణను కోర్టు తప్పు పట్టింది. మహిళల శారీరక పరిమితులు వారి విధి నిర్వహణకు ఏ విధంగానూ అడ్డురావని కోర్టు స్పష్టం చేసింది. కేవలం 4 శాతమే మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ ఏర్పాటును, కమాండ్ పోస్టింగ్స్‌ను నిరాకరించడం ఆందోళనకరమని, ఇది సమానత్వ భావనకు వ్యతిరేకమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఆర్మీలో ఉన్న మొత్తం కమిషన్డ్ అధికారుల్లో మహిళా అధికారుల సంఖ్య కేవలం 1,653 అని, అది 4% కన్నా తక్కువేనని గుర్తు చేసింది. ‘లింగపరమైన వివక్షతో వారి సామర్థ్యాన్ని తక్కువచేయడం మహిళలుగా వారిని మాత్రమే కాదు.. మొత్తం భారతీయ సైన్యాన్ని అవమానించడమే’ అని పేర్కొంది. ‘ఎస్ఎస్సీలో ఉన్న మహిళాఅధికారులందరికీ శాశ్వత కమిషన్‌ను అనువర్తింపచేయాలి. 14 ఏళ్ల పైబడిన సర్వీస్ ఉన్నమహిళా అధికారులు పీసీలో చేరేందుకు ఇష్టపడనట్లయితే.. పెన్షన్ అర్హతకు అవసరమైన 20 ఏళ్ల సర్వీస్ పూర్తయేంతవరకు విధుల్లో కొనసాగించాలి’ అని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. కమాండ్ పోస్టింగ్స్‌ను ఇవ్వడంలో అడ్డంకులు కల్పించరాదని స్పష్టం చేసింది. యుద్ధ విధుల్లో మహిళా అధికారుల సేవలను వినియోగించుకోవడం విధానపర నిర్ణయమని ధర్మాసనం పేర్కొంది.