
పంచాయతీ కార్యదర్శిని నిలదీస్తున్న రైతు జగన్‌మోహనరావు
నరసన్నపేట (శ్రీకాకుళం): తన పొలంలో మురుగు కాలువ నిర్మించినందుకు చాలా కాలంగా అభ్యం తరం చెబుతున్న ఓ రైతు మహిళ పంచాయతీ కార్యదర్శిని చంపేసి తానూ చచ్చిపోతానని బెదిరించాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వంటిపై పోసు కునే ప్రయత్నం చేయడంతో రైతు భరోసా గ్రామ సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాలివీ.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మం డలం దూకలపాడులో బుధవారం వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో రైతు భరోసా గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకొచ్చిన అల్లు జగన్‌మోహనరావు అనే రైతు గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.సుమలతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘నా పొలంలో మురికి కాలువ తవ్విస్తావా.. నాకు ప్రభుత్వం నుంచి ఏ పథకం రాకుండా చేస్తావా’ అంటూ దూషించాడు. ‘నిన్ను పెట్రోల్ పోసి చంపేస్తా.. నేనూ పెట్రోల్ పోసుకుంటా’ అంటూ బ్యాగ్‌లోంచి పెట్రోల్ బాటిల్ తీసి తన శరీరంపై పోసుకోబోయాడు. స్థానికులు అడ్డుకోవడంతో సభలో ఉన్న అధికారులు, ఇతరులపై పెట్రోల్ పడింది.
అగ్గిపుల్ల తీయడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో మహిళా అధికారులు, వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. పంచాయతీ కార్యదర్శి సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రైతును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై డీపీవో సమీక్షించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఫోన్‌లో పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి అధైర్యపడవద్దని చెప్పారు. నిర్భయంగా విధులు నిర్వహించాలని, తప్పులు జరగకుండా చూసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment