
భయంకరమైన పరిణామాలెదుర్కొంటారు..
అహ్మదాబాద్: వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపూ కేసులో సాక్షుల హత్యలు, బెదిరింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఇద్దరు ఉన్నత మహిళా పోలీసు అధికారులకు కూడా బెదిరింపు లేఖలు వచ్చాయి. ఎసీపీ కనన్ దేశాయ్, ఎస్ఐ దివ్య రవియా అనే ఇద్దరు మహిళా పోలీసు అధికారులకు భయంకరమైన పరిణామాలను ఎదుర్కొంటారంటూ ఆ లేఖలో హెచ్చరికలు ఉన్నాయి.. సంత్ ఆశారాం ఆశ్రమం పేరుతో వచ్చిన ఈ లేఖ బుధవారం స్థానిక మహిళా పోలీస్ స్టేషన్కు చేరినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. లేఖ ఎక్కడనుంచి వచ్చిందనే దానిపై సిటీ క్రైమ్ బ్రాంచ్ దీనిపై విచారణ చేపట్టినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆ మహిళా అధికారులిద్దరికీ 24 గంటలూ కాపలా ఉండేలా భద్రతను ఏర్పాటు చేశామన్నారు. అయితే 2014 లో ఆశారాం బాపూపై అత్యాచార ఆరోపణ కేసులు నమోదైన సమయంలో రవియా విచారణాధికారిగా ఉండగా ఆమె పై అధికారిగా కనన్ దేశాయ్గా ఉన్నారు. మరోవైపు హత్య చేస్తామని చెప్పి మరీ వరుసగా సాక్షులను హతమారుస్తూ ఉండడంతో దీనిపై పోలీసు అధికారుల్లో అనేక అనుమానాలు, ఆందోళన మొదలైంది. ఈ కేసులో ఆశారాం మాజీ సహాయకుడు అమృత్ ప్రజాపతి, అఖిల్ గుప్తా, కృపాల్ సింగ్ ఇలా ఇప్పటికి ఏడుగురు హతమయ్యారు. కాగా సూరత్ సిస్టర్స్ మీద అత్యాచారం కేసులో ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ్ సాయి కూడా నిందితుడిగా ఉన్నాడు.