భోపాల్: దేవుడి సొత్తును కాజేస్తే రక్తం కక్కుకుని చనిపోవటం, తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారని చాలా సినిమాల్లో చూపించారు. కానీ, నిజ జీవితంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. విలువైన ఆభరణాలను దోచుకుంటున్నారు దొంగలు. అయితే, ఓ దొంగ ఆలయంలో చోరీ చేసిన సొత్తును తిరిగిచ్చేశాడు. దాంతో పాటు తాను తప్పు చేశానని, ఈ దొంగతనం వల్ల తాను చాల ఇబ్బందులు పడ్డానని, తనను క్షమించాలంటూ ఓ లేఖ సైతం రాయటం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో జరిగింది.
బాలాఘాట్‌లోని శాంతినాథ్ దిగంబర జైన దేవాలయంలో గుర్తు తెలియని దొంగ అక్టోబర్ 24న చోరీకి పాల్పడ్డాడు. ఆలయంలో 9 వెండి గొడుగులు, ఒక వెండి జాడీ, 3 ఇత్తడి పాత్రలు అపహరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, దొంగ.. మనసు మార్చుకొని అపహరించిన వస్తువులను తిరిగి ఇచ్చేశాడు. చోరీ చేసిన వస్తువులను ఓ సంచిలో ఉంచి గ్రామ పంచాయతీ వద్ద ఉంచాడు. శుక్రవారం నీళ్ల కోసం వెళ్లినవారు సంచిని పరిశీలించగా.. అపహరణకు గురైన వస్తువులు, లేఖ కనిపించాయి. ప్రస్తుతం ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘నేను చేసిన పనికి క్షమాపణ కోరుతున్నా. నేను తప్పు చేశా.. క్షమించండి. దొంగతనం చేశాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.’ అని లేఖలో పేర్కొన్నాడు దొంగ. పంచాయతీ వద్ద వదిలివెళ్లిన వస్తువులను స్వాధీనం చేసుకుని దొంగ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ఎట్టకేలకు డ్రీమ్ గర్ల్‌తో వివాహం...మోదీ, యోగీలకు ఆహ్వానం!
Comments
Please login to add a commentAdd a comment