Stolen jewellery
-
బురఖాతో సొంత ఇంటిలోనే చోరీ!
ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ విచిత్ర దొంగతనం వెలుగు చూసింది. ఓ కుమార్తె తన తల్లికి చెందిన లక్షల నగదు, నగలు చోరీ చేసింది. వాటితో సహా అక్కడి నుంచి ఉడాయించింది. అయితే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన జిల్లా పోలీసుల యాంటీ బర్గ్లరీ సెల్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ద్వారక డీసీపీ అంకిత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం జనవరి 30న ఉత్తమ్ నగర్‌లోని సేవక్ పార్క్‌లో నివసిస్తున్న కమలేష్ అనే మహిళ తన ఇంట్లో పట్టపగలు చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్ష రూపాయలతో పాటు విలువైన బంగారం, వెండి నగలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొంది. నేరం చేయడానికి ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని ద్వారక జిల్లా యాంటీ బర్గ్లరీ సెల్ దర్యాప్తులో తేలింది. మెయిన్ డోర్ తాళం, అల్మారా పగలగొట్టి కూడా ఉండకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన బృందం నల్ల బురఖా ధరించిన ఓ మహిళ అనుమానాస్పదంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అనంతరం నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె మరెవరో కాదు పోలీసులకు ఈ చోరీపై ఫిర్యాదు చేసిన మహిళ పెద్ద కుమార్తె శ్వేత(31). తన తల్లి తన చెల్లెలిపై అమితమైన శ్రద్ధ వహిస్తుండటంతో శ్వేతలో అసూయ, ద్వేషం కలిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికితోడు ఆమె తిరిగి చెల్లించాల్సిన అప్పులు కూడా చాలానే ఉండటంతో సొంత ఇంటిలోనే చోరీకి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 30న శ్వేత తల్లి కమలేష్ ఇంటికి తాళం వేసి, కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లింది. ఇంతలోనే బయటి నుంచి బురఖాతో వచ్చిన శ్వేత తన దగ్గరున్న డూప్లికేట్ తాళంతో ఇంటి గేటు తీసి, లోనికి ప్రవేశించి తల్లి గదిలోని నగలు, నగదు చోరీ చేసింది. ఆ నగలను శ్వేత ఒక దుకాణంలో విక్రయించిందని పోలీసులు గుర్తించారు. ఆ నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దొంగకు చుక్కలు చూపించిన దేవుడు!.. సొత్తు తిరిగిచ్చి క్షమాపణ
భోపాల్: దేవుడి సొత్తును కాజేస్తే రక్తం కక్కుకుని చనిపోవటం, తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారని చాలా సినిమాల్లో చూపించారు. కానీ, నిజ జీవితంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. విలువైన ఆభరణాలను దోచుకుంటున్నారు దొంగలు. అయితే, ఓ దొంగ ఆలయంలో చోరీ చేసిన సొత్తును తిరిగిచ్చేశాడు. దాంతో పాటు తాను తప్పు చేశానని, ఈ దొంగతనం వల్ల తాను చాల ఇబ్బందులు పడ్డానని, తనను క్షమించాలంటూ ఓ లేఖ సైతం రాయటం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో జరిగింది. బాలాఘాట్లోని శాంతినాథ్ దిగంబర జైన దేవాలయంలో గుర్తు తెలియని దొంగ అక్టోబర్ 24న చోరీకి పాల్పడ్డాడు. ఆలయంలో 9 వెండి గొడుగులు, ఒక వెండి జాడీ, 3 ఇత్తడి పాత్రలు అపహరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, దొంగ.. మనసు మార్చుకొని అపహరించిన వస్తువులను తిరిగి ఇచ్చేశాడు. చోరీ చేసిన వస్తువులను ఓ సంచిలో ఉంచి గ్రామ పంచాయతీ వద్ద ఉంచాడు. శుక్రవారం నీళ్ల కోసం వెళ్లినవారు సంచిని పరిశీలించగా.. అపహరణకు గురైన వస్తువులు, లేఖ కనిపించాయి. ప్రస్తుతం ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘నేను చేసిన పనికి క్షమాపణ కోరుతున్నా. నేను తప్పు చేశా.. క్షమించండి. దొంగతనం చేశాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.’ అని లేఖలో పేర్కొన్నాడు దొంగ. పంచాయతీ వద్ద వదిలివెళ్లిన వస్తువులను స్వాధీనం చేసుకుని దొంగ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ఎట్టకేలకు డ్రీమ్ గర్ల్‌తో వివాహం...మోదీ, యోగీలకు ఆహ్వానం! -
అమ్మవారి తాళిబొట్టు చోరీ.. తప్పు తెలుసుకున్న దొంగలు!
మైసూరు: అమ్మవారి తాళిబొట్టును చోరీ చేసుకుని వెళ్లిన దొంగలు తప్పు తెలుసుకుని తిరిగి ఆలయానికి వచ్చి కొంత నగదు, అమ్మవారి నగ అక్కడ పెట్టి వెళ్లిన వైనం మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని ఉప్పినహళ్ళి గ్రామంలో ఉన్న దుర్గాంబ అమ్మవారి దేవాలయంలొ చోటు చేసుకుంది. గతనెల 24న గ్రామంలోని దుర్గాంబ ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు అమ్మవారి తాళిబొట్టును ఎత్తుకెళ్లారు. అంతలోనే తప్పు తెలుసుకుని దొంగలు భక్తుల తరహాలో గుడికి వచ్చి దొంగిలించిన నగ, కొంత నగదు కానుకగా పెట్టి వెళ్లిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త అలా చేస్తున్నాడని వందన..) -
రూ.99 కోట్లు గాయబ్.. ఎలాగో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: ఓ చోరీ కేసులో దొంగను పట్టుకోవడంతో పాటు పోయిన సొత్తును పూర్తిస్థాయిలో రికవరీ చేస్తేనే బాధితుడికి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగినట్లు. అయితే రికవరీల ఏ ఏడాదీ 80 శాతానికి కూడా చేరట్లేదు. ఫలితంగా బాధితులకు దొంగ దొరికినా... దొరక్కపోయినా... బాధితులకు మాత్రం నష్టమే జరుగుతోంది. 2014 నుంచి 2021 వరకు హైదరాబాద్ నగరంలో చోరీ అయిన సొత్తులో కేవలం 65.14 శాతం మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. ఈ కాలంలో మొత్తం రూ.285,47,88,204 విలువైన సొత్తు నేరగాళ్ల పాలు కాగా పోలీసులు రూ.185,96,11,821 విలువైంది మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన రూ.99,51,76,383 విలువైంది పత్తాలేకుండా పోయింది. ఇందులో నగదు, నగలు, ఇతర వస్తువులు ఉన్నాయి. దర్యాప్తు అధికారులపై భారం... ► నగర పోలీసు విభాగంలో సిబ్బంది కొరత, వనరుల లేమి నేపథ్యంలో చోరీ జరిగిన తరవాత దొంగలను పట్టుకోవడం ఆలస్యం అవుతోంది. వాస్తవానికి ఒక్కో దర్యాప్తు అధికారీ ఏడాదికి కేవలం 60 నుంచి 70 కేసులను మాత్రమే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఓ కొలిక్కి చేర్చగలడు. అయితే దర్యాప్తు అధికారులుగా వ్యవహరించే ఎస్సై స్థాయి అధికారుల కొరత కారణంగా ప్రస్తుతం ఒక్కో దర్యాప్తు అధికారి ఏడాదికి సరాసరిన 200లకు పైగా కేసులను దర్యాప్తు చేస్తున్నాడు. ఫలితంగా అవి అంత తొందరగా ఓ కొలిక్కి రావడం, చోరీ కేసుల్లో దొంగలు దొరకడం ఆలస్యం జరుగుతోంది. ఎంత ఆలస్యంగా దొంగ దొరికితే... రికవరీ అంత తక్కువగా ఉంటోంది. ఫలితంగా బాధితులు నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘పెరిగిపోతున్న’ మెుత్తాలు... ► ఓ ఇంట్లోనే, దుకాణంలోనో చోరీ జరిగితే... అందులో ఎంత మెుత్తం పోయిందనేది కచ్చితంగా చెప్పలేమని పోలీసులు అంటున్నారు. కొన్ని కేసుల్లో బాధితులు చెప్తున్నదీ వాస్తవంగా ఉండట్లేదన్నారు. ఓ చోరీ కేసు పరిష్కారమై, దొంగ దొరికిన తరవాత రికవరీ పూర్తయి, మిగిలిన చట్టపరమైన అంశాలను దాటి బాధితుడికి సొత్తు చేరడానికి కొంత సమయం పడుతోంది. మరోపక్క 100 శాతం సొత్తు రికవరీ కావట్లేదు. గరిష్ఠంగా బాధితులకు అందుతున్నది 50 శాతం లోపే. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేసే సమయంలో చోరీ అయిన సొత్తు, సొమ్ముల్ని విపరీతంగా పెంచేస్తున్నారు. ఇలా చేస్తే అన్నీ ప్రక్రియలూ పూర్తయిన తరవాత తమకు అందేది చోరీ అయిన దాంతో సరిపోతుందని బాధితులు భావిస్తున్నారు. ఫలితంగా ఫిర్యాదులోనే మెుత్తాలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఈ కారణంగానే వాస్తవంగా చోరీ అయిన దానికి, రికార్డుల్లో నమోదవుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సమస్యగా మారిన రికవరీ... ► ఈ చోరులకు అరెస్టు చేయడం ఒక ఎత్తయితే... పోయిన సొత్తు రికవరీ చేయడం మరో ఎత్తుగా మారింది. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లల్లో నమోదైన నేరాల్లో 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే పరిష్కారమవుతున్నాయి. ఈ పరిష్కారమైన కేసుల్లోనూ సరాసరి రికవరీలు మాత్రం 70 శాతానికి చేరట్లేదు. గతంలో దొంగలు చోరీ సొత్తును రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో విక్రయించే వారు. అయితే ప్రస్తుతం నేరం చేసిన మరుక్షణం రాష్ట్రం దాటేస్తున్న నిందితులు కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఉత్తరాది నగరాల్లో చోరీ సొత్తును అమ్ముతున్నారు. ఫలితంగా నిందితుడు దొరికినా... రికవరీలు మాత్రం పూర్తిస్థాయిలో కావట్లేదు. తాము చోరీ సొత్తు విక్రయించిన ప్రాంతాలను నిందితులు చెప్తున్నా... దానిని కొనుగోలు చేసిన వారు మాత్రం తిరిగి ఇవ్వడంలో అనేక మెలికలు పెడుతున్నారు. దీంతో రికవరీలు శాతం నానాటికీ తీసికట్టుగా మారుతోంది. మరోపక్క ఓ నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత 24 గంటలకు మించి కస్టడీలో పెట్టుకునే అధికారం చట్ట ప్రకారం పోలీసులకు లేకపోవడం కూడా రికవరీలపై ప్రభావం చూపుతోంది. ఈ సమయంలో నిందితులు చోరీ సొత్తుకు సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడించట్లేదు. నగదైతే పత్తా ఉండదు... ► చోరీకి గురైంది బంగారం, వెండి వంటి సొత్తయితే ఎన్నాళ్ల తరవాత నిందితుడు దొరికినా... ఎంతో కొంత రికవరీ చేయడానికి వీలుంటుంది. అదే నగదు దొంగల పాలయితే ఇక రికవరీ అనే విషయాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ రకంగా వచ్చే డబ్బు ఈజీ మనీ కావడంతో నేరగాళ్లల్లో చాలా మంది వివిధ దురలవాట్లకు బానిసలుగా ఉండి విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. ఫలితంగా చోరీ చేసిన కొన్ని రోజుల్లోనే ఆ మెుత్తాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు. చాలా కొద్దిమంది నేరగాళ్లు మాత్రమే చోరీ సొమ్ముతో స్థిరాస్తులు సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో మాత్రమే చోరీకి గురైన సొమ్ము రికవరీ చేయడం సాధ్యమవుతోంది. -
అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క!: రూ.13 లక్షల బంగారం.. రూ. 8 కోట్లుగా తిరిగొచ్చింది!
Mumbai Police returns family's stolen gold worth ₹8 cr: నిజానికి దొంగలపాలైన సొమ్ము దొరకడం చాలా కష్టం. చాలా మటుకు పోలీసులు విచారించిన మన సొత్తు మనకు తిరిగి లభించడం అనేది అత్యంత అరుదు. అలాంటిది కోట్లు ఖరీదు చేసే సొమ్ము ఐతే ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు. దొరికే అవకాశం ఉంటుందనే ఊహ కూడా ఉండదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అలాంటి ఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే....ముంబైలోని ప్రముఖ చరగ్ దిన్ వ్యవస్థాపకుడు అర్జున్ దాస్వానీ కుటుంబం పై ఒక ముఠా కత్తులతో దాడి చేసింది. అతన్ని అతని భార్యను తాళ్లతో కట్టేసి ఆ ముఠా రూ.13 లక్షల విలువైన బంగారాన్ని దొంగిలించింది. ఆ తర్వాత పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. 1998లో ఆ సొత్తు మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1999లో విచారణలో ఆ ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేశారు. అయితే ఈ కేసుకి సంబంధించిన మరో ముగ్గురు నిందుతులు పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి ఆ డబ్బు పోలీసుల ఆధీనంలోనే ఉంది.కానీ ఆ కేసులో పెద్దగా పురోగతి లేకపోవడంతో సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది. ఈ కేసును విచారించిన సెషన్ కోర్టు.. ఫిర్యాదుదారునికి సొత్తు ఇవ్వకుండా సుమారు 19 ఏళ్లుగా నిరీక్షించేలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సొత్తును షరుతులతో కూడిన నిబంధనలకు లోబడి అందజేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అర్జన్ దాస్వానీ కొడుకు రాజు దాస్వాని ఆస్తికి సంబంధించిన బిల్లులను సమర్పించి తమ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అయితే 22 ఏళ్ల నిరీక్షణ తర్వాత సొంతం అయిన ఆ ఆస్తి విలువ కాస్త ఇప్పుడు రూ 8 కోట్లు పైనే కావడం విశేషం. (చదవండి: అక్కడ తండ్రులు వ్యాక్సిన్లు వేసుకోకపోతే పిల్లలతో గడపనివ్వరట!) -
రూ.2 కోట్ల విలువైన వజ్రాల నగల అపహరణ..
సాక్షి ప్రతినిధి, చెన్నై: విల్లుపురం పట్టణానికి చెందిన కరుణానిధి (45) తన తాత మలేషియా నుంచి తెచ్చిన వద్ద రూ.2 కోట్ల విలువైన వజ్రాల నగలున్నాయని చెబుతూ వాటి విక్రయానికి సిద్ధమయ్యాడు. తన ఇంటికి రంగులు వేసేందుకు వచ్చిన శివ అనే యువకునితో నగలు కొనుగోలు చేసేవారు ఎవరైనా ఉంటే చెప్పమని కోరాడు. చెన్నైలో తనకు తెలిసిన ఇద్దరు ఉన్నారని, వారి ద్వారా అమ్మవచ్చని శివ నమ్మబలికాడు. చెన్నై సాలిగ్రామానికి చెందిన అరుళ్ మురుగన్ (55), వడపళినికి చెందిన సెంథిల్ (44)లను తీసుకెళ్లి కరుణానిధికి పరిచయం చేశాడు. చెన్నై నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారని, నగలు దిండివనం తీసుకురమ్మని కరుణానిధికి చెప్పారు. దీంతో కరుణానిధి స్నేహితుడు రావణన్‌ను వెంట బెట్టుకుని కారులో దిండివనం చేరుకున్నాడు. అరుళ్ మురుగన్, సెంథిల్ మార్గమధ్యంలో కారును ఆపి నగలు కొనేవారు తీవనూరులో ఉన్నారని మళ్లించారు. ఎదురుగా మరోకారులో ఐదుగురు వచ్చి కరుణానిధి కళ్లలో కారంపొడి చల్లి నగలు ఎత్తుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
77 కేజీల బంగారు నగలు చోరీ
కృష్ణరాజపురం: బెంగళూరులో అత్యంత భారీ చోరీ చోటుచేసుకుంది. ఏకంగా 77 కేజీల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బెంగళూరు పులకేశినగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని బాణసవాడి–హెణ్ణూరు రోడ్‌లోని లింగరాజపురం బ్రిడ్జి దగ్గర్లో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ఉంది. ఇందులో తమ వినియోగదారులకు వారి బంగారం కుదువ పెట్టుకుని నగదు ఇస్తుంటారు. ఈ కార్యాలయంలో భారీగా బంగారం ఉంటుం దని భావించిన దుండగులు శనివారం రాత్రి గోడకు కన్నమేసి లోపలికి చొరబడ్డారు. బంగారం భద్రపరిచిన బీరువాలను గ్యాస్ కట్టర్లతో కత్తిరించారు. అందులోని 77 కేజీల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ముందుగా సీసీ కెమెరాలను తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన తీరు చూసి తెలిసిన వ్యక్తుల పనిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కస్టమర్లకు భరోసా బంగారం చోరీ నేపథ్యంలో కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బంగారానికి పూర్తిగా బీమా భద్రత ఉందని ముత్తూట్ ఫైనాన్స్ స్పష్టం చేసింది. దోపిడీ కారణంగా కస్టమర్ల బంగారానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఓ ప్రకటనలో పేర్కొంది. చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు రికవరీ చేసే వరకూ కొంత సమయం ఇవ్వాలని తర్వాత వారికి పూర్తి పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. నిందితులను పోలీసులు ఇప్పటికే గుర్తించారని, వారి నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నారని తెలిపింది. -
మత్తుమందు ఇచ్చి నగలు దోపిడీ
సాక్షి, నెల్లూరు: వృద్ధురాలికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ సంఘటన నెల్లూరులోని జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి (జీజీహెచ్)లో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామానికి చెందిన రామసుబ్బమ్మ (82)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికి వివాహాలయ్యాయి. భర్త రమణారెడ్డి పదేళ్ల క్రితం మృతిచెందడంతో రామసుబ్బమ్మ ఒంటరిగా నివసిస్తోంది. గుండెనొప్పిగా ఉండటంతో ఆగస్టు 28వ తేదీన ఆమె వైద్యపరీక్షల నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఎక్స్‌రే నిమిత్తం పంపారు. ఎక్స్‌రే తీయించుకున్న అనంతరం ఆమె వైద్యులను కలువగా రిపోర్ట్ రావడం ఆలస్యమవుతోందని మరుసటిరోజు రావాలని సూచించారు. దీంతో ఆమె వార్డు నుంచి బయటకు రాగా ఇద్దరు గుర్తుతెలియని మహిళలు మాటలు కలిపారు. డాక్టర్ మధ్యాహ్నం మూడుగంటల వరకు ఉంటారని, రిపోర్ట్ మధ్యాహ్నం తీసుకుని ఒకేసారి డాక్టర్‌కు చూపించుకుని వెళ్లాలని ఆమెకు చెప్పారు. దీంతో రామసుబ్బమ్మ అక్కడే ఉండిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆ ఇద్దరు మహిళలు ఆమెకు భోజనం పెట్టి, కూల్‌డ్రింక్ ఇచ్చారు. అది సేవించిన రామసుబ్బమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆ మహిళలు ఆమె ఒంటిపై ఉన్న 8.5 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అపస్మారకస్థితిలో ఉన్న రామసుబ్బమ్మను గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది అత్యవసర చికిత్స విభాగంలో చేర్పించారు. అనంతరం ఆమె కుమారుడికి తెలియజేశారు. 29వ తేదీ ఆమె మత్తు నుంచి తేరుకున్న అనంతరం కుటుంబసభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది సోమవారం రాత్రి దోపిడీ ఘటనపై దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ 60 లక్షల విలువైన డైమండ్స్ కొట్టేశారు..
న్యూఢిల్లీ : ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బొమ్మలు అమ్ముకునే మహిళలు కొందరు పార్ట్‌టైమ్‌గా పాకెట్స్ కట్ చేసే పనిలో పడ్డారు. జనసమ్మర్ధ ప్రాంతాల్లో చోరీలకు తెగబడుతూ రాజధాని పోలీసులకు పట్టుబడ్డారు. ఢిల్లీ మెట్రోలో చోరీలకు పాల్పడుతూ పట్టుబడ్డ ఏడుగురు మహిళల ముఠా నుంచి చోరీకి గురైన రూ 60 లక్షల విలువైన డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. నగరానికి చెందిన నిందితులు చిమ్నా, అంజలి, రీటా, ఆశా, పూనం, అనితా, రేష్మాలుగా గుర్తించిన పోలీసులు వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరు ఓ ముఠాగా ఏర్పడి మెట్రో స్టేషన్లు, బస్సులు, రైళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు. వ్యాపార పని నిమిత్తం ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తి వీరి బారిన పడటంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 28న బాధితుడు కరోల్‌బాగ్ నుంచి ఇంద్రప్రస్థ మెట్రో స్టేషన్‌కు ప్రయాణిస్తుండగా, మార్గమధ్యలో డైమండ్స్ ఉన్న బ్యాగ్ అదృశ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అదే ట్రైన్లో బరకంబ మెట్రో స్టేషన్ వద్ద ఏడుగురు మహిళలు రైలు దిగినట్టు వెల్లడైంది. అనుమానిత మహిళలు దిగిన ట్రైన్ కోచ్‌లోనే బాధితుడు ప్రయాణిస్తుండటం, నిందితుల్లో ఓ మహిళ బాధితుడు పోగొట్టుకున్న బ్యాగ్‌ను పోలిన బ్యాగ్‌ను తీసుకువెళుతుండటం సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. దొంగిలించిన డైమండ్స్‌ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న మహిళలను షాదిపూర్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ 60 లక్షల విలువైన డైమండ్స్‌ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బొమ్మలు అమ్ముకుంటూ జీవనం గడిపేవారని , రోజువారీ ఖర్చుల కోసం చోరీలకు తెగబడుతున్నారని పోలీసులు తెలిపారు. -
58 కిలోల బంగారం నొక్కేసి..
ముంబై : తాను పనిచేసే సంస్ధలోనే 58 కిలోల బంగారాన్ని దొంగిలించిన ఓ జ్యూవెలరీ స్టోర్ మేనేజర్ అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమర్ద్‌నగర్‌లోని ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణం వమన్‌హరి పెథే బ్రాంచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు గురువారం వెల్లడించారు. స్టోర్‌లో పనిచేసే లోకేష్ జైన్, రాజేంద్ర జైన్ల సహకారంతో బ్రాంచ్ మేనేజర్ అంకుర్ రాణే బంగారం చోరీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. స్టోర్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రాంతి చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
ఇంటికెళ్లి చోరీసొత్తు అందజేసిన పోలీసులు
సాక్షి, యలహంక /బొమ్మనహళ్లి : కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరు పోలీసుల వినూత్న ఆలోచనకు హర్షం వ్యక్తమవుతోంది. యలహంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దొంగతనాలకు సంబంధించి రికవరి అయిన బంగారు సొత్తును పోలీసులు సొంతదారుల ఇళ్ళకు వెళ్లి ఇవ్వడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. కోర్టు అనుమతితో సీఐ మంజేగౌడ, సిబ్బంది కలిసి సోమవారం తొలిజామున యలహంకలో ఉన్న వెంకటేశ్వర్లు దంపతులు ఇంటికి వెళ్లి వారికి ఇంటిలో గతంలో చోరీ జరిగిన బంగారు నగలు ఇచ్చారు. దీంతో వారికి ఆనందానికి అవధులు లేవు. అదేవిధంగా బొమ్మనహళ్లి పరిధిలో సీఐ రాజేశ్ తన పీఎస్ పరిధిలో ఉంటున్న నంద కిషోర్ ఇంటికి వెళ్లి రూ. 3 లక్షల బంగారు నగలు అందజేశారు. నందకిషోర్ ఇంటిలో ఇటీవల చోరీ జరిగింది. అర్ధరాత్రి చోరీకి గురైన నగలు ఇంటికి రావడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. ఈ సందర్భంగా బాధితులు పోలీసులను అభినందనలతో ముంచెత్తారు. -
సర్వే పేరుతో ఇంట్లోకి వచ్చి.!
కరీంనగర్: సర్వే చేస్తున్నామంటూ ఇంట్లోకి వచ్చిన ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లింది. ఈ సంఘటన ముస్తాబాద్‌లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కస్తూరి వెంకటరత్నమ్మ(60) ఇంటికి ఈ రోజు మధ్యాహ్నం ఓ మహిళ సర్వే చేస్తున్నామంటూ వచ్చింది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఫోన్ నెంబర్ వివరాలు తీసుకుంది. ఈ క్రమంలో వృద్ధురాలు ఒంటరిగా ఉంటోందని గమనించి ఆమె కళ్లలో కారం కొట్టి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెనుగులాట జరగడంతో కింద పడ్డ వెంకటరత్నమ్మ గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న పక్కింటి స్వరూప మహిళా దొంగను అడ్డుకోవడానికి యత్నించగా.. ఆమె పై దాడి చేసి అక్కడి నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీకి గురైన 10 కోట్ల బంగారం స్వాధీనం
జార్ఖాండ్‌లోని రాంచీ నగరంలో ఇటీవల నగల దుకాణంలో చోరీకి గురైన రూ.12 కోట్ల విలువైన బంగారంలో రూ.10 కోట్ల బంగారాన్ని గత రాత్రి స్వాధీనం చేసుకున్నామని నగర పోలీసు ఉన్నతాధికారి శనివారం ఇక్కడ వెల్లడించారు. పోలీసు బృందాలు తనిఖీల్లో భాగంగా దుకాణంపై భాగంలోని వాటర్ ట్యాంక్‌లో చోరీ అయిన బంగారాన్ని కనుగొన్నారని తెలిపారు. దొంగలు తాము చోరీ చేసిన బంగారాన్ని వాటర్ ట్యాంక్‌లో దాచి, పోలీసుల దర్యాప్తు సద్దుమణిగిన తర్వాత ఆ మొత్తం బంగారాన్ని అక్కడి నుంచి తలించాలని దొంగలు పథకం వేసి ఉంటారని పోలీసు ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. అయితే ఆ కేసులో ఇప్పటికి ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. అలాగే దర్యాప్తును మాత్రం మరింత ముమ్మరం చేసినట్లు వివరించారు. దోపిడికి పాల్పడిన దుండగులను సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని పోలీసు ఉన్నతాధికారి ధీమా వ్యక్తం చేశారు. రాంచీ నగరంలోని ఆనంద్ జ్యువెలరీ దుకాణాన్ని ఈ నెల 12 నుంచి 14 వరకు దసర పండగ సందర్బంగా మూసి ఉంచారు. అయితే 15వ తేదీ ఉదయం దుకాణాన్ని ఎప్పటిలాగా తెరిచారు. దుకాణంలో నగలన్నీ మాయం కావడం చూసి యజమాని చోరీ జరిగిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. చోరీకి పాల్పడిన దొంగల దుకాణంలోని సీసీ కెమెరాలను కూడా ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. అందువల్ల కేసు కొంత ఆలస్యంమైందని పేర్కొన్నారు.