ప్రతీకాత్మకచిత్రం
న్యూఢిల్లీ : ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బొమ్మలు అమ్ముకునే మహిళలు కొందరు పార్ట్‌టైమ్‌గా పాకెట్స్ కట్ చేసే పనిలో పడ్డారు. జనసమ్మర్ధ ప్రాంతాల్లో చోరీలకు తెగబడుతూ రాజధాని పోలీసులకు పట్టుబడ్డారు. ఢిల్లీ మెట్రోలో చోరీలకు పాల్పడుతూ పట్టుబడ్డ ఏడుగురు మహిళల ముఠా నుంచి చోరీకి గురైన రూ 60 లక్షల విలువైన డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. నగరానికి చెందిన నిందితులు చిమ్నా, అంజలి, రీటా, ఆశా, పూనం, అనితా, రేష్మాలుగా గుర్తించిన పోలీసులు వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరు ఓ ముఠాగా ఏర్పడి మెట్రో స్టేషన్లు, బస్సులు, రైళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు.
వ్యాపార పని నిమిత్తం ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తి వీరి బారిన పడటంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 28న బాధితుడు కరోల్‌బాగ్ నుంచి ఇంద్రప్రస్థ మెట్రో స్టేషన్‌కు ప్రయాణిస్తుండగా, మార్గమధ్యలో డైమండ్స్ ఉన్న బ్యాగ్ అదృశ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అదే ట్రైన్‌లో బరకంబ మెట్రో స్టేషన్ వద్ద ఏడుగురు మహిళలు రైలు దిగినట్టు వెల్లడైంది.
అనుమానిత మహిళలు దిగిన ట్రైన్ కోచ్‌లోనే బాధితుడు ప్రయాణిస్తుండటం, నిందితుల్లో ఓ మహిళ బాధితుడు పోగొట్టుకున్న బ్యాగ్‌ను పోలిన బ్యాగ్‌ను తీసుకువెళుతుండటం సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. దొంగిలించిన డైమండ్స్‌ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న మహిళలను షాదిపూర్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ 60 లక్షల విలువైన డైమండ్స్‌ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బొమ్మలు అమ్ముకుంటూ జీవనం గడిపేవారని , రోజువారీ ఖర్చుల కోసం చోరీలకు తెగబడుతున్నారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment