
ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ విచిత్ర దొంగతనం వెలుగు చూసింది. ఓ కుమార్తె తన తల్లికి చెందిన లక్షల నగదు, నగలు చోరీ చేసింది. వాటితో సహా అక్కడి నుంచి ఉడాయించింది. అయితే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన జిల్లా పోలీసుల యాంటీ బర్గ్‌లరీ సెల్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
ద్వారక డీసీపీ అంకిత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం జనవరి 30న ఉత్తమ్ నగర్‌లోని సేవక్ పార్క్‌లో నివసిస్తున్న కమలేష్ అనే మహిళ తన ఇంట్లో పట్టపగలు చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్ష రూపాయలతో పాటు విలువైన బంగారం, వెండి నగలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొంది.
నేరం చేయడానికి ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని ద్వారక జిల్లా యాంటీ బర్గ్‌లరీ సెల్ దర్యాప్తులో తేలింది. మెయిన్ డోర్ తాళం, అల్మారా పగలగొట్టి కూడా ఉండకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన బృందం నల్ల బురఖా ధరించిన ఓ మహిళ అనుమానాస్పదంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అనంతరం నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె మరెవరో కాదు పోలీసులకు ఈ చోరీపై ఫిర్యాదు చేసిన మహిళ పెద్ద కుమార్తె శ్వేత(31). తన తల్లి తన చెల్లెలిపై అమితమైన శ్రద్ధ వహిస్తుండటంతో శ్వేతలో అసూయ, ద్వేషం కలిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.
దీనికితోడు ఆమె తిరిగి చెల్లించాల్సిన అప్పులు కూడా చాలానే ఉండటంతో సొంత ఇంటిలోనే చోరీకి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 30న శ్వేత తల్లి కమలేష్ ఇంటికి తాళం వేసి, కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లింది. ఇంతలోనే బయటి నుంచి బురఖాతో వచ్చిన శ్వేత తన దగ్గరున్న డూప్లికేట్ తాళంతో ఇంటి గేటు తీసి, లోనికి ప్రవేశించి తల్లి గదిలోని నగలు, నగదు చోరీ చేసింది. ఆ నగలను శ్వేత ఒక దుకాణంలో విక్రయించిందని పోలీసులు గుర్తించారు. ఆ నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment