న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో.. అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. అయితే ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందనే విమర్శ బలంగా వినిపిస్తోందిప్పుడు.
ప్రమాదానికి నెల ముందే ఈ ఇనిస్టిట్యూట్ పరిస్థితులపై అధికారులకు ఓ ఫిర్యాదు వెళ్లినట్లు తెలుస్తోంది. కిషోర్ సింగ్ కుష్వా అనే సివిల్స్ అభ్యర్థి.. కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(MCD)కు కోచింగ్ సెంటర్ నిర్వహణ తీరుపై లేఖ రాశాడు. ‘‘ఇది అత్యవసరమైన అంశం. విద్యార్థుల ప్రాణాలకు సంబంధించింది. కేవలం పార్కింగ్ కోసమో, స్టోరేజ్ కోసమో సెల్లార్లను ఉపయోగించుకోవాలన్న ఎంసీడీ నిబంధనలను కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పట్టించుకోవట్లేదు.
.. సెల్లార్‌లోనే క్లాసులు, లైబ్రరీలను నిర్వహిస్తున్నారు. తద్వారా విద్యార్థులు, సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి కోచింగ్‌సెంటర్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కిషోర్ సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదు ఇంకా విచారణ దశలోనే ఉందని ఆయన చేసిన ఆన్‌లైన్ పోర్టల్‌లో స్టేటస్ చూపిస్తోంది. దీనిపై స్పందించడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు.
మరోవైపు.. ఢిల్లీలో జరిగిన దుర్ఘటనపై విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నేతలు మండిపడ్డారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే స్థానిక కౌన్సిలరుకు తెలియజేశామన్నారు. వెంటనే స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు.
ఏడుకు అరెస్టులు..
ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ప్రమాద ఘటనలో.. బిల్డింగ్ యజమాని సహా ఐదుగురిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య ఏడుకి చేరింది. ఇంతకు ముందే కోచింగ్ సెంటర్ ఓనర్‌ను, కో ఆర్డినేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. దీంతో వాళ్లకు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment