న్యూఢిల్లీ: ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరదనీరు చేరి ముగ్గురు మృతిచెందిన ఘటనపై ఢిల్లీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. కోచింగ్ సెంటర్ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై జరిపించాలని కోరుతూ ఓ ఎన్జీఓ దాఖలుచేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్బన్ ప్లానింగ్ లోపాలపై వివరణ కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా రాజింద్రనగర్ ప్రాంతంలో మురికి కాల్వలను ఆక్రమించి కట్టిన అన్ని కట్టడాలను శుక్రవారం నాటికి కూల్చివేయాలని ఆదేశించింది.
ఇక ఢిల్లీ హైకోర్టు ఆప్ ప్రభుత్వంపై కూడా మండిపడింది. ప్రభుత్వాల ఉచితాల సంస్కృతి కారణంగా పన్నులు వసూలు చేయకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా జరుగుతాయని తెలిపింది. యూపీఎస్సీ కోచింగ్ హబ్ అయిన రాజిందర్ నగర్‌లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి నిర్వహించడానికి అనుమతిస్తున్నారని పేర్కొంది.
మరోవైపు ఇప్పటి వరకు ఎమ్‌సీడీ(MCD) అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఢిల్లీ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో బిల్డింగ్ యజమాని, కోచింగ్ సెంటర్ యజమాని సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని, అరెస్టయినవారిలో వరదలున్న వీధి గుండా వేగంగా దూసుకొచ్చిన కారు డ్రైవర్ కూడా ఉన్నారని తెలిపింది. అయితే తమ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ దుర్ఘటనకు మున్సిపల్ అధికారులను ఒక్కరినైనా అరెస్టు చేసి జైలుకు పంపారా అని అని ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులో ఢిల్లీ పోలీసులను కూడా ప్రతివాదిగా చేర్చింది ధర్మాసనం.
ఢిల్లీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయడంలో విఫలమైతే కేంద్ర ఏజెన్సీకి బదిలీ చేయాలని సూచిస్తామని హెచ్చరించింది. అనంతరం తదుపరి విచారణ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment