రూ.99 కోట్లు గాయబ్‌.. ఎలాగో తెలుసా! | Stolen Asset Recovery Less in Hyderabad, Year Wise Data Here | Sakshi
Sakshi News home page

రూ.99 కోట్లు గాయబ్‌.. ఎలాగో తెలుసా!

Published Tue, Jan 18 2022 6:28 PM | Last Updated on Tue, Jan 18 2022 6:28 PM

Stolen Asset Recovery Less in Hyderabad, Year Wise Data Here - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఓ చోరీ కేసులో దొంగను పట్టుకోవడంతో పాటు పోయిన సొత్తును పూర్తిస్థాయిలో రికవరీ చేస్తేనే బాధితుడికి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగినట్లు. అయితే రికవరీల ఏ ఏడాదీ 80 శాతానికి కూడా చేరట్లేదు. ఫలితంగా బాధితులకు దొంగ దొరికినా... దొరక్కపోయినా... బాధితులకు మాత్రం నష్టమే జరుగుతోంది. 2014 నుంచి 2021 వరకు హైదరాబాద్‌ నగరంలో చోరీ అయిన సొత్తులో కేవలం 65.14 శాతం మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. ఈ కాలంలో మొత్తం రూ.285,47,88,204 విలువైన సొత్తు నేరగాళ్ల పాలు కాగా పోలీసులు రూ.185,96,11,821 విలువైంది మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన రూ.99,51,76,383 విలువైంది పత్తాలేకుండా పోయింది. ఇందులో నగదు, నగలు, ఇతర వస్తువులు ఉన్నాయి.  

దర్యాప్తు అధికారులపై భారం... 
► నగర పోలీసు విభాగంలో సిబ్బంది కొరత, వనరుల లేమి నేపథ్యంలో చోరీ జరిగిన తరవాత దొంగలను పట్టుకోవడం ఆలస్యం అవుతోంది. వాస్తవానికి ఒక్కో దర్యాప్తు అధికారీ ఏడాదికి కేవలం 60 నుంచి 70 కేసులను మాత్రమే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఓ కొలిక్కి చేర్చగలడు. అయితే దర్యాప్తు అధికారులుగా వ్యవహరించే ఎస్సై స్థాయి అధికారుల కొరత కారణంగా ప్రస్తుతం ఒక్కో దర్యాప్తు అధికారి ఏడాదికి సరాసరిన 200లకు పైగా కేసులను దర్యాప్తు చేస్తున్నాడు. ఫలితంగా అవి అంత తొందరగా ఓ కొలిక్కి రావడం, చోరీ కేసుల్లో దొంగలు దొరకడం ఆలస్యం జరుగుతోంది. ఎంత ఆలస్యంగా దొంగ దొరికితే... రికవరీ అంత తక్కువగా ఉంటోంది. ఫలితంగా బాధితులు నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.  

‘పెరిగిపోతున్న’ మెుత్తాలు...  
► ఓ ఇంట్లోనే, దుకాణంలోనో చోరీ జరిగితే... అందులో ఎంత మెుత్తం పోయిందనేది కచ్చితంగా చెప్పలేమని పోలీసులు అంటున్నారు. కొన్ని కేసుల్లో బాధితులు చెప్తున్నదీ వాస్తవంగా ఉండట్లేదన్నారు. ఓ చోరీ కేసు పరిష్కారమై, దొంగ దొరికిన తరవాత రికవరీ పూర్తయి, మిగిలిన చట్టపరమైన అంశాలను దాటి బాధితుడికి సొత్తు చేరడానికి కొంత సమయం పడుతోంది. మరోపక్క 100 శాతం సొత్తు రికవరీ కావట్లేదు. గరిష్ఠంగా బాధితులకు అందుతున్నది 50 శాతం లోపే. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేసే సమయంలో చోరీ అయిన సొత్తు, సొమ్ముల్ని విపరీతంగా పెంచేస్తున్నారు. ఇలా చేస్తే అన్నీ ప్రక్రియలూ పూర్తయిన తరవాత తమకు అందేది చోరీ అయిన దాంతో సరిపోతుందని బాధితులు భావిస్తున్నారు. ఫలితంగా ఫిర్యాదులోనే మెుత్తాలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఈ కారణంగానే వాస్తవంగా చోరీ అయిన దానికి, రికార్డుల్లో నమోదవుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.  

సమస్యగా మారిన రికవరీ...  
► ఈ చోరులకు అరెస్టు చేయడం ఒక ఎత్తయితే... పోయిన సొత్తు రికవరీ చేయడం మరో ఎత్తుగా మారింది. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లల్లో నమోదైన నేరాల్లో 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే పరిష్కారమవుతున్నాయి. ఈ పరిష్కారమైన కేసుల్లోనూ సరాసరి రికవరీలు మాత్రం 70 శాతానికి చేరట్లేదు. గతంలో దొంగలు చోరీ సొత్తును రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో విక్రయించే వారు. అయితే ప్రస్తుతం నేరం చేసిన మరుక్షణం రాష్ట్రం దాటేస్తున్న నిందితులు కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఉత్తరాది నగరాల్లో చోరీ సొత్తును అమ్ముతున్నారు. ఫలితంగా నిందితుడు దొరికినా... రికవరీలు మాత్రం పూర్తిస్థాయిలో కావట్లేదు. తాము చోరీ సొత్తు విక్రయించిన ప్రాంతాలను నిందితులు చెప్తున్నా... దానిని కొనుగోలు చేసిన వారు మాత్రం తిరిగి ఇవ్వడంలో అనేక మెలికలు పెడుతున్నారు. దీంతో రికవరీలు శాతం నానాటికీ తీసికట్టుగా మారుతోంది. మరోపక్క ఓ నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత 24 గంటలకు మించి కస్టడీలో పెట్టుకునే అధికారం చట్ట ప్రకారం పోలీసులకు లేకపోవడం కూడా రికవరీలపై ప్రభావం చూపుతోంది. ఈ సమయంలో నిందితులు చోరీ సొత్తుకు సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడించట్లేదు.  

నగదైతే పత్తా ఉండదు...  
► చోరీకి గురైంది బంగారం, వెండి వంటి సొత్తయితే ఎన్నాళ్ల తరవాత నిందితుడు దొరికినా... ఎంతో కొంత రికవరీ చేయడానికి వీలుంటుంది. అదే నగదు దొంగల పాలయితే ఇక రికవరీ అనే విషయాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ రకంగా వచ్చే డబ్బు ఈజీ మనీ కావడంతో నేరగాళ్లల్లో చాలా మంది వివిధ దురలవాట్లకు బానిసలుగా ఉండి విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. ఫలితంగా చోరీ చేసిన కొన్ని రోజుల్లోనే ఆ మెుత్తాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు. చాలా కొద్దిమంది నేరగాళ్లు మాత్రమే చోరీ సొమ్ముతో స్థిరాస్తులు సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో మాత్రమే చోరీకి గురైన సొమ్ము రికవరీ చేయడం సాధ్యమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement