stolen money
-
డబ్బుల కోసం బామ్మను చంపేశాడు
న్యూఢిల్లీ: జల్సాగా తిరగాలనే కోరికతో ఓ 15 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడి సాయంతో ఎవరికీ అనుమానం రాకుండా బామ్మను చంపేసి, ఆమె దగ్గరున్న డబ్బులు ఎత్తుకుపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారా ఏరియాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జీటీబీ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంట్లో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. పక్క వీధిలోనే వారి కుమారుడి కుటుంబం ఉంటోంది. గురువారం మధ్యాహ్నం వృద్ధురాలు(77) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తొమ్మిదో తరగతి చదివే ఆమె మనవడు స్నేహితుడితో వారింటికి కలిసి వచ్చాడు. ఆ సమయంలో బామ్మ నిద్రిస్తుండటం గమనించి, దుప్పటితో ఆమెను ఊపిరాడకుండా గట్టిగా అదిమారు. ఆపైన పదునైన వస్తువుతో నుదుటిపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది. అనంతరం బాలులిద్దరూ బీరువాలో ఉన్న రూ.14 వేలను తస్కరించి వెళ్లిపోయారు. కొద్దిసేపయ్యాక ఇంటికి చేరుకున్న వృద్ధుడు.. భార్య నిద్రలోనే చనిపోయిందని భావించి, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి వృద్ధురాలి నుదుడి గాయం ఉన్న విషయాన్ని గుర్తించారు. బీరువా లాకర్లో డబ్బు మాయమైన విషయాన్ని తెలుసుకున్న వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం మనవడిని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. -
ఢిల్లీలో భారీ సైబర్ క్రైం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నార్కోటిక్స్ డివిజన్ అధికారులమంటూ ఢిల్లీకి చెందిన ఓ వైద్యురాలి(34) నుంచి సుమారు రూ.4.50 కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో జరిగిన ఈ తరహా సైబర్ నేరం ఇదేనంటున్నారు పోలీసులు. ఫెడ్ఎక్స్ కొరియర్ సర్వీస్ ద్వారా ఆమె పేరుతో ముంబై నుంచి తైవాన్ వెళ్లాల్సిన పార్సిల్లో ఇతర వస్తువులతోపాటు డ్రగ్స్ ఉన్నాయంటూ నేరగాళ్లు మే 5న సదరు బాధితురాలికి ఫోన్ చేశారు. అది మొదలుకొని అంధేరి పోలీస్ స్టేషన్, ముంబై డీసీపీ, ఆర్బీఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ అధికారుల పేరుతో పలువురు స్కైప్ ద్వారా మాట్లాడుతూ ఆమెకు మాయమాటలు చెప్పారు. ఈ విషయాలను భర్త సహా ఎవరికీ చెప్పొద్దంటూ నమ్మించారు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్‌గా ఉన్న రూ.4.47 కోట్లను డ్రా చేయించి, ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేయించుకున్నారు. స్కైప్ ద్వారా జరిగిన సంభాషణలను డిలీట్ చేయించారు. డబ్బును తిరిగి ఇస్తామన్న మోసగాళ్లు ఎంతకీ ఇవ్వకపోవడంతో బాధితురాలు మోసం గ్రహించి, పోలీసులను ఆశ్రయించారు. -
రూ.99 కోట్లు గాయబ్.. ఎలాగో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: ఓ చోరీ కేసులో దొంగను పట్టుకోవడంతో పాటు పోయిన సొత్తును పూర్తిస్థాయిలో రికవరీ చేస్తేనే బాధితుడికి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగినట్లు. అయితే రికవరీల ఏ ఏడాదీ 80 శాతానికి కూడా చేరట్లేదు. ఫలితంగా బాధితులకు దొంగ దొరికినా... దొరక్కపోయినా... బాధితులకు మాత్రం నష్టమే జరుగుతోంది. 2014 నుంచి 2021 వరకు హైదరాబాద్ నగరంలో చోరీ అయిన సొత్తులో కేవలం 65.14 శాతం మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. ఈ కాలంలో మొత్తం రూ.285,47,88,204 విలువైన సొత్తు నేరగాళ్ల పాలు కాగా పోలీసులు రూ.185,96,11,821 విలువైంది మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన రూ.99,51,76,383 విలువైంది పత్తాలేకుండా పోయింది. ఇందులో నగదు, నగలు, ఇతర వస్తువులు ఉన్నాయి. దర్యాప్తు అధికారులపై భారం... ► నగర పోలీసు విభాగంలో సిబ్బంది కొరత, వనరుల లేమి నేపథ్యంలో చోరీ జరిగిన తరవాత దొంగలను పట్టుకోవడం ఆలస్యం అవుతోంది. వాస్తవానికి ఒక్కో దర్యాప్తు అధికారీ ఏడాదికి కేవలం 60 నుంచి 70 కేసులను మాత్రమే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఓ కొలిక్కి చేర్చగలడు. అయితే దర్యాప్తు అధికారులుగా వ్యవహరించే ఎస్సై స్థాయి అధికారుల కొరత కారణంగా ప్రస్తుతం ఒక్కో దర్యాప్తు అధికారి ఏడాదికి సరాసరిన 200లకు పైగా కేసులను దర్యాప్తు చేస్తున్నాడు. ఫలితంగా అవి అంత తొందరగా ఓ కొలిక్కి రావడం, చోరీ కేసుల్లో దొంగలు దొరకడం ఆలస్యం జరుగుతోంది. ఎంత ఆలస్యంగా దొంగ దొరికితే... రికవరీ అంత తక్కువగా ఉంటోంది. ఫలితంగా బాధితులు నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘పెరిగిపోతున్న’ మెుత్తాలు... ► ఓ ఇంట్లోనే, దుకాణంలోనో చోరీ జరిగితే... అందులో ఎంత మెుత్తం పోయిందనేది కచ్చితంగా చెప్పలేమని పోలీసులు అంటున్నారు. కొన్ని కేసుల్లో బాధితులు చెప్తున్నదీ వాస్తవంగా ఉండట్లేదన్నారు. ఓ చోరీ కేసు పరిష్కారమై, దొంగ దొరికిన తరవాత రికవరీ పూర్తయి, మిగిలిన చట్టపరమైన అంశాలను దాటి బాధితుడికి సొత్తు చేరడానికి కొంత సమయం పడుతోంది. మరోపక్క 100 శాతం సొత్తు రికవరీ కావట్లేదు. గరిష్ఠంగా బాధితులకు అందుతున్నది 50 శాతం లోపే. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేసే సమయంలో చోరీ అయిన సొత్తు, సొమ్ముల్ని విపరీతంగా పెంచేస్తున్నారు. ఇలా చేస్తే అన్నీ ప్రక్రియలూ పూర్తయిన తరవాత తమకు అందేది చోరీ అయిన దాంతో సరిపోతుందని బాధితులు భావిస్తున్నారు. ఫలితంగా ఫిర్యాదులోనే మెుత్తాలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఈ కారణంగానే వాస్తవంగా చోరీ అయిన దానికి, రికార్డుల్లో నమోదవుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సమస్యగా మారిన రికవరీ... ► ఈ చోరులకు అరెస్టు చేయడం ఒక ఎత్తయితే... పోయిన సొత్తు రికవరీ చేయడం మరో ఎత్తుగా మారింది. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లల్లో నమోదైన నేరాల్లో 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే పరిష్కారమవుతున్నాయి. ఈ పరిష్కారమైన కేసుల్లోనూ సరాసరి రికవరీలు మాత్రం 70 శాతానికి చేరట్లేదు. గతంలో దొంగలు చోరీ సొత్తును రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో విక్రయించే వారు. అయితే ప్రస్తుతం నేరం చేసిన మరుక్షణం రాష్ట్రం దాటేస్తున్న నిందితులు కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఉత్తరాది నగరాల్లో చోరీ సొత్తును అమ్ముతున్నారు. ఫలితంగా నిందితుడు దొరికినా... రికవరీలు మాత్రం పూర్తిస్థాయిలో కావట్లేదు. తాము చోరీ సొత్తు విక్రయించిన ప్రాంతాలను నిందితులు చెప్తున్నా... దానిని కొనుగోలు చేసిన వారు మాత్రం తిరిగి ఇవ్వడంలో అనేక మెలికలు పెడుతున్నారు. దీంతో రికవరీలు శాతం నానాటికీ తీసికట్టుగా మారుతోంది. మరోపక్క ఓ నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత 24 గంటలకు మించి కస్టడీలో పెట్టుకునే అధికారం చట్ట ప్రకారం పోలీసులకు లేకపోవడం కూడా రికవరీలపై ప్రభావం చూపుతోంది. ఈ సమయంలో నిందితులు చోరీ సొత్తుకు సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడించట్లేదు. నగదైతే పత్తా ఉండదు... ► చోరీకి గురైంది బంగారం, వెండి వంటి సొత్తయితే ఎన్నాళ్ల తరవాత నిందితుడు దొరికినా... ఎంతో కొంత రికవరీ చేయడానికి వీలుంటుంది. అదే నగదు దొంగల పాలయితే ఇక రికవరీ అనే విషయాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ రకంగా వచ్చే డబ్బు ఈజీ మనీ కావడంతో నేరగాళ్లల్లో చాలా మంది వివిధ దురలవాట్లకు బానిసలుగా ఉండి విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. ఫలితంగా చోరీ చేసిన కొన్ని రోజుల్లోనే ఆ మెుత్తాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు. చాలా కొద్దిమంది నేరగాళ్లు మాత్రమే చోరీ సొమ్ముతో స్థిరాస్తులు సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో మాత్రమే చోరీకి గురైన సొమ్ము రికవరీ చేయడం సాధ్యమవుతోంది. -
సెల్ ఫోన్ స్క్రీన్ షేరింగ్‌కు అనుమతి ఇవ్వాలని చెప్పి..
హైదరాబాద్: క్రెడిట్ కార్డు పరిమితిని పెంచుతామంటూనమ్మించి అతని ఖాతాలో నుంచి రూ.50 వేలను కాజేసిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరా ల ప్రకారం.. ప్రైవేటు సంస్థలో పనిచేసే మారంరెడ్డి నర్సింహ వెంగళరావునగర్ కాలనీలోని ధన్‌రాజ్ అపార్ట్మెంట్లో నివసముంటన్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు ప్రతినిధుల్లా మాట్లాడారు. మీరు వాడుతున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు లిమిట్ రూ.55 వేల నుంచి లక్షా 25 వేలకు పెంచుతామని నమ్మబలికారు. ఇందుకు సెల్ ఫోన్ స్క్రీన్ షేరింగ్‌కు అనుమతి ఇవ్వాలని తెలుపడంతో నర్సింహ స్క్రీన్‌ను షేరింగ్ చేశాడు. అనంతరం ఒక ఓటీపీ నెంబర్‌ను పంపి నమోదు చేయాలని చెప్పారు. ఓటీపీ నమోదు చేయగానే రూ.50 వేలు ఖాతాలో గల్లంతయ్యాయి. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసును శనివారం ఎస్ఆర్నగర్ పోలీసులకు బదిలీ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
మంచి దొంగలు.. వీళ్లు చేసిన పనేంటో తెలుసా?
Hackers Returning Crypto: డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో అతి పెద్ద చోరీగా చెప్పుకుంటున్న పాలి నెట్వర్క్ హ్యాకింగ్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఛేదించి క్షణాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీని కొట్టేసిన హ్యాకర్లు. ఆ తర్వాత ఎందుకనో మెత్తపడ్డారు. అందులో దాదాపు సగం సొమ్మును తిరిగి ఇచ్చేశారు. హ్యాకింగ్‌లో కొత్త రికార్డు పటిష్టమైన భద్రతా వ్యవస్థగా పేర్కొంటున్న బ్లాక్‌చైయిన్ ఫ్లాట్‌ఫామ్‌పై నడిచే డీఫై యాప్ పాలినెట్వర్క్ను ఇటీవల హ్యాక్ అయ్యింది. సైబర్ నేరగాళ్లు ఈ యాప్ నుంచి ఏకంగా 611 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 12 వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీని కొట్టేశారు. పాలినెట్‌వర్క్ నుంచి తమకు అనుకూలమైన ఖాతాలకు క్రిప్టో కరెన్సీని తరలించుకుపోయారు. క్షణాల్లో జరిగిన ఈ మెరుపు హ్యాకింగ్‌తో బిత్తరపోయిన పాలి నెట్వర్క ఆ తర్వాత తేరుకుంది. కొన్ని వేల మందికి సంబంధించిన డిజిటల్ కరెన్సీని కొట్టేయడం సరికాదని... దయ ఉంచి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ హ్యాకర్లను సోషల్ మీడియా వేదికగా హ్యాకర్లను పాలిగాన్ నెట్వర్క్ కోరింది. $260 million (As of 11 Aug 04:18:39 PM +UTC) of assets had been returned: Ethereum: $3.3M BSC: $256M Polygon: $1M The remainings are $269M on Ethereum, $84M on Polygon — Poly Network (@PolyNetwork2) August 11, 2021 హ్యాకర్ల మంచి మనసు పాలిగాన్ నెట్వర్క్ చేసిన విజ్ఞప్తికి హ్యాకర్లు స్పందించారు. తాము దారి మళ్లించిన సొత్తులో కొంత భాగాన్ని పాలి నెట్వర్క్ సూచించిన ఖాతాలో జమ చేశారు. కొట్టేసిన సొత్తులో 260 మిలియన్ డాలర్లు జమ చేశారు. ఇందులో ఈథేరియమ్ 3.3 మిలియన్ డాలర్లు, బినాన్స్ స్మార్ట్ కాయిన్లు 256 మిలియన్లు, పాలిగాన్ 1 మిలియన్ డాలర్లు ఉన్నాయంటూ పాలినెట్ వర్క్ ప్రకటించింది. హ్యాకర్లు విడదల వారీగా సొమ్మును పాలిగాన్ నెట్వర్క్కి తిరిగి బదిలీ చేస్తున్నారు. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్‌కి గురైంది. -
వ్యాక్సిన్ కోసం వెళ్తే రూ.25 లక్షలు, నగలు దోచుకెళ్లిన దొంగలు
న్యూఢిల్లీ: కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆటో రిక్షా డ్రైవర్ ఇంటిని దోచుకెళ్లిన సంఘటన ఈశాన్య ఢిల్లీలోని శివ విహార్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. ఆటో డ్రైవర్, అతని భార్య టీకాలు వేసుకోవడానికి వెళ్ళినప్పుడు సుమారు 25 లక్షల రూపాయల నగదుతో పాటు విలువైన ఆభరణాలను దొంగలు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బాధితుడు అరవింద్ కుమార్ పట్వా(40) బుధవారం టీకాలు వేయించుకోవడానికి స్లాట్ బుక్ మంగళ వారం చేశాడు. మరుసటి రోజు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుంచి టీకా కేంద్రానికి బయలుదేరారు. అయితే, డ్రైవర్ తన ముగ్గురు పిల్లలను ఉస్మాన్‌పూర్ లోని ఉన్న తన అత్తగారి ఇంటి వద్ద దింపేసి, తన భార్యతో కలిసి లక్ష్మి నగర్ లో ఉన్న టీకా కేంద్రానికి వెళ్ళాడు. తర్వాత టీకా కేంద్రం నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ప్రధాన ద్వారం తెరిచి ఉండటం గమనించాడు. అతను వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా అల్మిరా తెరిచి ఉంది. నిందితులు ఆభరణాలు, నగదును తీసుకెళ్లారని పట్వా పేర్కొన్నారు. ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు కూడా ఉన్నాయని చెప్పారు. "నా సోదరి ఆభరణాలు కూడా అల్మిరాలో ఉన్నాయి. నిందితులు విలువైన వస్తువులన్నింటినీ తీసుకెళ్లారు. మేము ఇంట్లో లేనప్పుడు, ఇంటి బయట కూర్చున్న ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఉన్న పరిస్థితుల గురించి తన సహచరులతో ఫోన్లో మాట్లాడటం పొరుగువారు చూసినట్లు" పట్వా పేర్కొన్నారు. తాను ఆటో రిక్షా డ్రైవర్ని, తన నివాసంలో 'రాఖీ' వ్యాపారం నడుపుతున్నానని పట్వా చెప్పారు. గత 15 రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు రాలేదని చెప్పారు. కరవాల్ నగర్ పోలీస్ స్టేషన్లో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వివరాల ప్రకారం తదుపరి దర్యాప్తు కొనసాగించనున్నట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. చదవండి: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి -
మొన్న లక్ష, నిన్న రూ.70 వేలు ఇంటి ముందు పడేశారు!
సాక్షి, కారేపల్లి(ఖమ్మం): మండలంలోని దుబ్బతండాలో ఇటీవల జరిగిన చోరీ కేసులో రోజుకో విచిత్రం చోటుచేసుకుంటోంది. ఈ నెల 17న దుబ్బతండాకు చెందిన రైతు గుగులోతు లచ్చిరాం ఇంట్లో రూ.1.70 లక్షలు అపహరణకు గురయ్యాయి. 20వ తేదీన కారేపల్లి ఎస్ఐ సురేశ్ ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం వచ్చి విచారణ చేపట్టారు. దీంతో బెంబేలెత్తిన దొంగ 21వ తేదీన రూ.1 లక్ష నగదు బాధితుడు లచ్చిరాం ఇంటి ముందు పడేసి వెళ్లాడు. తాజాగా సోమవారం మిగిలిన మరో రూ.70 వేల నగదును లచ్చిరాం ఇంటి ముందు మరోసారి పడేసి వెళ్లాడు. దీంతో ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని స్థానికుల్లో జోరుగా చర్చసాగుతోంది. కారేపల్లి ఎస్ఐ సురేశ్ సోమవారం దుబ్బతండాకు వెళ్లి దొంగలు పడేసి వెళ్లిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మేం మేజర్లం, మాకు ప్రాణహాని ఉంది.. ప్లీజ్ రక్షించండి! -
‘రంగరాయ’లో దొంగాట
కాకినాడ క్రైం: రంగరాయ వైద్య కళాశాల మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్‌లోని బీరువా నుంచి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.20 లక్షల డబ్బు మాయమైంది. ఆలస్యంగా అదీ అనుమానాస్పదంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై గత నెల 29న కాకినాడ టూటౌన్ క్రైం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అసలేం జరిగింది గత నెల 17న రంగరాయ వైద్య కళాశాలలోని మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్‌లోని ఓ బీరువా నుంచి రూ.20 లక్షల సొత్తు చోరీకి గురైంది. సంబంధిత సీనియర్ అసిస్టెంట్ ఆ డబ్బును బీరువాలో భద్రపరిచానని చెబుతున్నారు. ఘటన జరిగిన రోజు నుంచి 13 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు పేరుతో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కాకినాడ టూ టౌన్ క్రైం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విద్యార్థుల నుంచి నేరుగా వసూలు గత నెల 16లోపు రంగరాయ వైద్య కళాశాలలో కొత్తగా సీటు పొందిన విద్యార్థులు 120 మందికి పైగా కళాశాలలో చేరారు. అడ్మిషన్ ఫీజును నేరుగా తనకివ్వాలని, తానే డీడీ తీస్తానని చెబుతూ సీనియర్ అసిస్టెంట్ చాలామంది నుంచి రూ.24 వేల చొప్పున వసూలు చేశారు. అలా వసూలు చేసిన ఆ సొత్తు విలువ రూ.20 లక్షల పైచిలుకు. బ్యాంకు నిబంధనలను అనుసరించి రూ.24 వేల విలువైన డీడీ తీయాలంటే విద్యార్థి తన ఖాతా నుంచి తన సంతకంతో డీడీ సొమ్ము బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా డబ్బు వసూలు చేయడం గమనార్హం. జవాబు లేని ప్రశ్నలు తాను విద్యార్థుల నుంచి రూ.24 వేల చొప్పన వసూలు చేశానని చెబుతున్న సీనియర్ అసిస్టెంట్ ఆ డబ్బును ఎవరో కుట్ర పూరితంగా దోచేశారని అంటున్నారు. ప్రిన్సిపాల్ మాత్రం ఆ డబ్బు సీనియర్ అసిస్టెంట్ వ్యక్తిగత సొమ్ము అంటున్నారు. పరస్పర విరుద్ధంగా వీరు చెబుతున్న మాటలతో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన సొమ్మే పోయిందా? దానికి పర్సనల్ కలర్ ఇస్తున్నారా? వంటి అంశాలు విచారణలో నిగ్గు తేలాల్సి ఉంది. -
ఆగి ఉన్న కారులో రూ. 16 లక్షలు మాయం
సాక్షి, కృష్ణా: జిల్లాలోని గన్నవరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆగివున్న కార్లను లక్ష్యంగా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అల్లాపురంలోని రావ్‌ఫిన్ రియల్ ఎస్టేట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న షేక్ సిలార్ యనమలకుదురు నుంచి రోజూ వచ్చి ఉద్యోగం చేస్తారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరుతున్న సమయంలో ఆఫీసు కాంపౌండ్‌లో ఉన్న గోశాల వద్ద కారు ఆపి గోశాలను సందర్శించుకునేందకు వెళ్లారు. ఈ సమయంలో కారు వెనుక డోర్ అద్దాలు పగులగొట్టి కారు సీటులో ఉంచిన రూ. 16 లక్షల నగదు, ఏటీఎం, పాస్ పోర్ట్, పాస్‌బుక్‌లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. కారు పెట్టిన ప్రదేశం చీకటిగా ఉండడంతో గమనించలేకపోయిన సిలార్ అక్కడి నుంచి యనమలకుదురు బయలుదేరి వెలుతుండగా.. మార్గ మధ్యలో కేసరపల్లి వద్దకు వెళ్ళేసరికి కారు అద్దం పగిలిన ఆనవాలు కనబడింది. దీంతో సిలార్ ఒక్కసారిగా కారు ఆపి పరిశీలించగా.. కారు అద్దం ధ్వంసం చేసి కారులో ఉన్న రూ. 16 లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లుగా గుర్తించాడు. వెంటనే గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే గత నాలుగు రోజుల్లో అదే ప్రాంతంలో ఆగివున్న రెండు కార్ల అద్దాలు ధ్వసం చేయడం, తాజాగా ఆదివారం ఆగి ఉన్న కారులో 40 నిమిషాల్లో అద్దాలు పగులగొట్టి రూ.16 లక్షలు దోపిడీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఏమైనా దొంగాల గ్యాంగ్ తిరుగుతుందా.. సిలార్ కారులో డబ్బు పెట్టినట్టు తెలిసినవారే ఎవరైనా అతన్ని అనుసరించి దోపిడీ పాల్పడ్డారా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిలార్ మాత్రం తనకు తెలిసినవారి మీద ఎటువంటి అనుమానం లేదని.. గుర్తు తెలియని వ్యక్తులే ఈ దొంగతనం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. -
రూపాయి దొంగతనం; వాతలు పెట్టిన తల్లి
సాక్షి, కారేపల్లి: అభం శుభం తెలియని ఓ చిన్నారిపై కన్నతల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. పొయ్యిలో కొరకాసుతో చేయి, తొడ భాగంపై వాతలు పెట్టింది. తీవ్ర గాయాల పాలైన చిన్నారి కేకలు వేస్తూ విలవిల్లాడిపోయింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన సిరికొండ నాగమణి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త లక్ష్మయ్య ఆమెను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో 10 ఏళ్ల కూతురు కృష్ణవేణితో కలిసి జీవిస్తోంది. చిన్నారి ఇంట్లో ఒక రూపాయి దొంగతనం చేసిందని, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 29వ తేదీన రాత్రి పొయ్యిలో మండుతున్న కర్ర (కొరకాసు) తీసుకొని చిన్నారి చేతిపై, తొడ భాగంపై విచక్షణరహితంగా వాతలు పెట్టింది. తీవ్రగాయాల పాలైన చిన్నారి ఏడుస్తూ అల్లాడిపోయింది. ఇరుగుపొరుగు గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగమణికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. తల్లి నాగమణికి కౌన్సెలింగ్ ఇస్తున్న ఐసీడీఎస్ అధికారులు అయినా తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయగా..ఓ యువకుడు తన సెల్ ఫోన్‌తో వీడియో తీసి స్థానికంగా ఉన్న వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారింది. సోమవారం ఉదయం విలేకరులు, ఐసీడీఎస్ అధికారులు పేరుపల్లి గ్రామానికి చేరుకుని గాయ పడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐసీడీఎస్ సీడీపీఓ దమయంతి, సూపర్వైజర్ పుష్పావతిలు నాగమణికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నారిని సీడబ్ల్యూసీ అధికారులు ఆదేశాల మేరకు ఖమ్మంలోని బాలల సదన్‌కు తరలించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పావతి ఫిర్యాదు మేరకు కృష్ణవేణిపై ఎస్ఐ పొదిల వెంకన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ విలేకరులతో మాట్లాడుతూ చిన్నారి గాయాలు మానేవరకు బాలల సదన్‌లో ఉంచి చికిత్స నిర్వహిస్తామని తెలిపారు. సీడబ్ల్యూసీ అధికారుల సూచనల మేరకు చిన్నారిని హాస్టల్లో ఉంచి చదివించాలా? తల్లికి అప్పగించటమా..! అనే విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
‘డెయిరీ’ డబ్బులు కాజేశాడు?
సాక్షి, నస్రుల్లాబాద్(నిజామాబాద్) : మండలంలోని దుర్కి గ్రామ పంచాయతీ ఎదుట కొందరు రైతులు ఆందోళనకు దిగారు. పాల కేంద్ర నిర్వాహకుడు తమ డబ్బులు కాజేశాడని ఆరోపించారు. దుర్కిలో గల విజయ డెయిరీ ఆధ్వర్యంలో 13 గ్రూపులను ఏర్పాటు చేశారు. పాల ఉత్పత్తి పెంచడానికి ఈ గ్రూపులకు 2017 మేలో మండల కేంద్రంలోని కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా సుమారు రూ.3.5లక్షలు చొప్పున రుణం ఇప్పించారు. ఈ గ్రూపుల లోన్ రికవరీకి విజయ డెయిరీ నిర్వాహకుడు ప్రతి నెల సభ్యుల నుంచి రూ.2వేలను తీసుకుని బ్యాంకులో చెల్లించాలి. లోన్ తీసుకున్న నాటి నుంచి కేవలం 10 నెలలు చెల్లించి ఆ తర్వాత చెల్లించకపోవడంతో బ్యాంకు నుంచి సదరు గ్రూపులకు నోటీసులు అందాయి. దీంతో సదరు రైతుల పాల డబ్బులు బ్యాంకులో కట్టకుండా వాడుకున్నాడని రైతులు ఆరోపించారు. 13 గ్రూపుల్లోని 5 గ్రూపులకు రెండో విడుత గేదెల లోన్ ఇచ్చినట్లు వాటి బకాయి వివరాలు సైతం ఉండడంతో వారు రైతులు సుమారు రూ.35 లక్షలు సొంతానికి వాడుకున్నాడని ఇప్పడు అడిగితే తనకు సంబంధం లేదని డెయిరీ నిర్వాహకుడు ఖదీర్ చెప్పాడని రైతులు ఆరోపించారు. ఇదీ అసలు సంగతి.. దుర్కిలో విజయ డెయిరీ పేరున 13 గ్రూపులో ఉన్న 76 మంది సభ్యులు గేదెల లోన్ తీసుకున్నారు. అయితే బ్యాంకుకు రైతుకు సంబంధం లేకుండా సాగుతున్న తరుణంలో ఏడాదిన్నరగా లోన్ కట్టడంలేదని బ్యాంకు వారు సదరు రైతులకు నోటీసులు అందించారు. వాటిని చూసిన రైతులు కంగుతిన్నారు. డెయిరీ నిర్వాహకుడిని సంప్రదించగా గతేడాదికి ముందు రైతుల పాల డబ్బులను ప్రతి నెల రూ.12వేల చొప్పున బ్యాంకులో కట్టేవాడు. అయితే 2018 ఆగస్టు నుంచి డబ్బులను తీసుకోవడం లేదని, తానేందుకు లోన్ కడుతానని చెప్పడంతో రైతులు కంగుతిన్నారు. బ్యాంకు లావాదేవీలు డెయిరీ నిర్వాహకుడు చూసుకునేవాడని, ఏడాదిన్నరగా డబ్బులు చెల్లించకపోవడంతో పాటు రెండో విడుత లోన్ సైతం తీసుకోలేదని గ్రామంలోని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సదరు బ్యాంకు మేనేజర్ రాకేష్‌ను వివరణ కోరగా గ్రామంలోని అన్ని గ్రూపులకు కలిసి రూ.21లక్షల బకాయి ఉందని అది కేవలం రైతులు కట్టాలన్నారు. బయటకు రావాల్సిన వాస్తవాలు.. ప్రతి నెల డబ్బులను కట్టాల్సిన డెయిరీ నిర్వాహకుడు బ్యాంకు లోన్ కట్టకపోవడంతో బ్యాంకు నుంచి ఇంత ఆలస్యంగా నోటీసులు ఎందుకు వచ్చాయి. రెండో విడుతలో లోన్ ఇచ్చే సమయంలో పశువైద్యాధికారులు గేదెలను చూసి, పరీక్షించి బ్యాంకుకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అయితే లబ్ధిదారులు గేదెలను తీసుకోలేదని ఎందుకు చెబుతున్నారు. గతేడాది ఆగస్టు నుంచి పాల డబ్బులు పూర్తిగా చెల్లించిన వివరాలు నిర్వాహకుడి వద్ద ఉన్నా.. రైతులు తీసుకోలేదని ఎందుకు చెబుతున్నారు. లోన్ తీసుకునే సమయంలో లబ్ధిదారుడు లేనిది మేనేజర్ లోన్ డబ్బులను ఎవ్వరికి ఇచ్చారు. నిర్వాహకుని వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నా రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు. గ్రామంలోని గల 13 గ్రూపులకు 76 మంది ఉండగా కేవలం కొందరే ఎందుకు ఆరోపిస్తున్నారు. రైతులు చెప్పేది నిజమా..? డెయిరీ నిర్వాహకుని మాటలు నిజమా? -
ఓ విదేశీ జంట.. కరెన్సీ కావాలంటూ!
సాక్షి, కర్నూలు : కరెన్సీ మార్పిడి కోసం వచ్చామంటూ మాటలతో బురిడీ కొట్టించి ఓ విదేశీ జంట పలు దేశాల విదేశీ కరెన్సీని చోరీ చేసి ఉడాయించింది. పోలీసుల కథనం మేరకు.. కర్నూలు స్కంద బిజినెస్ పార్క్‌లో ఉన్న ఫారిన్ ఎక్సేంజ్ కార్యాలయానికి ఈ నెల 13వ తేదీన న్యూజిలాండ్‌కు చెందిన వారమని ఓ విదేశీ జంట వచ్చింది. తమ వద్ద ఉన్న కరెన్సీ మార్చి ఇవ్వాలని క్యాషియర్‌ను మాటల్లోకి దింపింది. అతన్ని ఏమార్చి రూ.1.40 లక్షల విలువైన పలు విదేశీ కరెన్సీని తస్కరించి ఉడాయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదే జంట ఈ నెల 10వ తేదీన కొచ్చిన్, 11న మైసూర్లో విదేశీ కరెన్సీ చోరీ చేసినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని సూచించారు. -
దేవుళ్లకే శఠగోపం!
సాక్షి, కొత్తకోట రూరల్: జల్సాలకు ఆలవాటు పడిన కొందరు ఆలయాలను కూడా వదలడం లేదు. ఇటీవల కురుమూర్తిస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన ఘటన మరవకముందే కొత్తకోటలోని మూడు ఆలయాల్లో దొంగలు హుండీలను పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పట్టణ శివారులోని వెంకటగిరి, పట్టణంలోని సాయిబాబ, కోట్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీలను ఎత్తుకెళ్లి గ్రామ శివారులోని పొలాల్లో పడేశారు. ఈ క్రమంలో కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో రూ.3 వేల నగదు, సాయిబాబ ఆలయంలో రూ.500, వెంకటగిరి ఆలయంలో అరకిలో వెండి (శఠగోపం)తోపాటు తీర్థం పోసే పాత్ర ఎత్తుకెళ్లారని ఎస్ఐ తెలిపారు. ఉదయమే ఆయా ఆలయాల్లో తాళాలు పగులగొట్టి ఉండగా వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందిం చారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాకేంద్రాలను నుంచి క్లూస్ టీంలు వచ్చి పొలాల్లో పడేసిన హుండీలను పరిశీలించారు. దొంగతనానికి గురైన హుండీలపై ఉన్న వేలిముద్రలను క్లూస్‌టీం సభ్యులు సేకరించారు. మూడు ఆలయాలను వనపర్తి డీఎస్పీ సృజన, సీఐ వెంకటేశ్వర్రావు పరిశీలించి ఎస్ఐతో వివరాలు తెలుసుకున్నారు. -
లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ: ఢిల్లీ పోలీసులు అరుదైన ఘనత సాధించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. దొంగిలించబడిన సొత్తును రికవరీ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించడంతో ఆగ్నేయ ఢిల్లీ పోలీసులకు ఈ ఘనత దక్కింది. నవంబర్ 27న యాక్సిస్ బ్యాంకుకు చెందిన రూ. 22. 49 కోట్లను క్యాష్ వ్యాన్ డ్రైవర్ దొంగిలించగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ నగదును రికవరీ చేశారు. ఫిర్యాదు చేసిన 10 గంటల్లో డబ్బును రికవరీ చేయడం విశేషం. మొత్తం డబ్బులో ఓ పదివేలను మాత్రం డ్రైవర్ ఆ పది గంటల్లో ఖర్చు చేశాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు దీనిని అతిపెద్ద మనీ రికవరీగా గుర్తించారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. DP enters the Lima Book of Records for making India's largest ever cash recovery of ₹22.49 Crores of stolen money. pic.twitter.com/aXcOoHD3ky — BS Bassi (@BhimBassi) January 2, 2016 -
సీసీటీవీ కేబుళ్లను కత్తిరించి....దోచేశారు
గోదావరిఖని: కరీంనగర్ జిల్లాలో దోపిడీ దొంగలు... సీసీ కెమెరాలకు కంటపడకుండా చోరీలు చేసి నగదును దోచుకుపోయారు. గోదావరిఖనిలోని లక్ష్మి నగర్లో గురువారం రాత్రి రెండు షాపుల్లో చోరీలు జరిగాయి. పట్టణంలోని రీగల్ షూమార్ట్, హ్యాండ్లూమ్ షూ కంపెనీ షట్టర్ల తాళాలు పగులగొట్టి దొంగలు రూ.1.70 లక్షల నగదును ఎత్తుకుపోయారు. సీసీ కెమెరాల్లో రికార్డుకాకుండా దొంగలు తెలివిగా వ్యవహరించారు. షాపులోనికి ప్రవేశించిన దొంగలు ముందుగా సీసీ కెమెరాల కేబుళ్లను కత్తిరించారు. ఆ తర్వాత నగదును దోచుకున్నారు. పని పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు సీసీటీవీ సెట్‌టాప్ బాక్స్‌ను కూడా ఎత్తుకుపోయారు. శుక్రవారం ఉదయం షాపు తెరించేందుకు వచ్చిన యజమానులు చోరీ జరిగినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరికి గురైన రెండు దుకాణాల యాజమాన్యం ఒక్కరే కావడం విశేషం. డీఎస్పీ మల్లారెడ్డి, సీఐలు తమ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.