సాక్షి, నస్రుల్లాబాద్(నిజామాబాద్) : మండలంలోని దుర్కి గ్రామ పంచాయతీ ఎదుట కొందరు రైతులు ఆందోళనకు దిగారు. పాల కేంద్ర నిర్వాహకుడు తమ డబ్బులు కాజేశాడని ఆరోపించారు. దుర్కిలో గల విజయ డెయిరీ ఆధ్వర్యంలో 13 గ్రూపులను ఏర్పాటు చేశారు. పాల ఉత్పత్తి పెంచడానికి ఈ గ్రూపులకు 2017 మేలో మండల కేంద్రంలోని కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా సుమారు రూ.3.5లక్షలు చొప్పున రుణం ఇప్పించారు.
ఈ గ్రూపుల లోన్ రికవరీకి విజయ డెయిరీ నిర్వాహకుడు ప్రతి నెల సభ్యుల నుంచి రూ.2వేలను తీసుకుని బ్యాంకులో చెల్లించాలి. లోన్ తీసుకున్న నాటి నుంచి కేవలం 10 నెలలు చెల్లించి ఆ తర్వాత చెల్లించకపోవడంతో బ్యాంకు నుంచి సదరు గ్రూపులకు నోటీసులు అందాయి. దీంతో సదరు రైతుల పాల డబ్బులు బ్యాంకులో కట్టకుండా వాడుకున్నాడని రైతులు ఆరోపించారు. 13 గ్రూపుల్లోని 5 గ్రూపులకు రెండో విడుత గేదెల లోన్ ఇచ్చినట్లు వాటి బకాయి వివరాలు సైతం ఉండడంతో వారు రైతులు సుమారు రూ.35 లక్షలు సొంతానికి వాడుకున్నాడని ఇప్పడు అడిగితే తనకు సంబంధం లేదని డెయిరీ నిర్వాహకుడు ఖదీర్ చెప్పాడని రైతులు ఆరోపించారు.
ఇదీ అసలు సంగతి..
దుర్కిలో విజయ డెయిరీ పేరున 13 గ్రూపులో ఉన్న 76 మంది సభ్యులు గేదెల లోన్ తీసుకున్నారు. అయితే బ్యాంకుకు రైతుకు సంబంధం లేకుండా సాగుతున్న తరుణంలో ఏడాదిన్నరగా లోన్ కట్టడంలేదని బ్యాంకు వారు సదరు రైతులకు నోటీసులు అందించారు. వాటిని చూసిన రైతులు కంగుతిన్నారు. డెయిరీ నిర్వాహకుడిని సంప్రదించగా గతేడాదికి ముందు రైతుల పాల డబ్బులను ప్రతి నెల రూ.12వేల చొప్పున బ్యాంకులో కట్టేవాడు.
అయితే 2018 ఆగస్టు నుంచి డబ్బులను తీసుకోవడం లేదని, తానేందుకు లోన్ కడుతానని చెప్పడంతో రైతులు కంగుతిన్నారు. బ్యాంకు లావాదేవీలు డెయిరీ నిర్వాహకుడు చూసుకునేవాడని, ఏడాదిన్నరగా డబ్బులు చెల్లించకపోవడంతో పాటు రెండో విడుత లోన్ సైతం తీసుకోలేదని గ్రామంలోని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సదరు బ్యాంకు మేనేజర్ రాకేష్‌ను వివరణ కోరగా గ్రామంలోని అన్ని గ్రూపులకు కలిసి రూ.21లక్షల బకాయి ఉందని అది కేవలం రైతులు కట్టాలన్నారు.
బయటకు రావాల్సిన వాస్తవాలు..
- ప్రతి నెల డబ్బులను కట్టాల్సిన డెయిరీ నిర్వాహకుడు బ్యాంకు లోన్ కట్టకపోవడంతో బ్యాంకు నుంచి ఇంత ఆలస్యంగా నోటీసులు ఎందుకు వచ్చాయి.
- రెండో విడుతలో లోన్ ఇచ్చే సమయంలో పశువైద్యాధికారులు గేదెలను చూసి, పరీక్షించి బ్యాంకుకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అయితే లబ్ధిదారులు గేదెలను తీసుకోలేదని ఎందుకు చెబుతున్నారు.
- గతేడాది ఆగస్టు నుంచి పాల డబ్బులు పూర్తిగా చెల్లించిన వివరాలు నిర్వాహకుడి వద్ద ఉన్నా.. రైతులు తీసుకోలేదని ఎందుకు చెబుతున్నారు.
- లోన్ తీసుకునే సమయంలో లబ్ధిదారుడు లేనిది మేనేజర్ లోన్ డబ్బులను ఎవ్వరికి ఇచ్చారు. నిర్వాహకుని వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నా రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు.
- గ్రామంలోని గల 13 గ్రూపులకు 76 మంది ఉండగా కేవలం కొందరే ఎందుకు ఆరోపిస్తున్నారు. రైతులు చెప్పేది నిజమా..? డెయిరీ నిర్వాహకుని మాటలు నిజమా?
Comments
Please login to add a commentAdd a comment