విజయా డెయిరీ పునఃప్రారంభానికి సీఎం జగన్‌ శ్రీకారం  | - | Sakshi
Sakshi News home page

విజయా డెయిరీ పునఃప్రారంభానికి సీఎం జగన్‌ శ్రీకారం 

Published Mon, Apr 8 2024 12:45 AM | Last Updated on Mon, Apr 8 2024 11:37 AM

- - Sakshi

గతంలో జిల్లాకే తలమానికంగా  విరాజిల్లిన విజయా డెయిరీ

చంద్రబాబు తన సొంత సంస్థ హెరిటేజ్‌ కోసం డెయిరీని నిర్వీర్యం చేసిన వైనం

ఫలితంగా నట్టేట మునిగిన పాడి రైతులు

రెండు దశాబ్దాల పాటు కార్మికుల నిరీక్షణ

ఆసియాలోనే గుర్తింపు పొంది, ఉమ్మడి చిత్తూరు జిల్లాకే మణిహారంగా నిలిచిన విజయా డెయిరీ ఎంతోమంది పాడిరైతులకు ఆపద్బాంధవిగా ఉండేది. అయితే ఈ డెయిరీని రెండు దశాబ్దాల కిందట చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నిర్వీర్యం చేశారు. తన సొంత సంస్థ అయిన హెరిటేజ్‌ కోసం విజయా డెయిరీని ఉన్నఫళంగా మూసివేశారు. దీంతో పాడి రైతులు దిక్కుతోచని స్థితిలో వీధిన పడ్డారు. గతంలో వైఎస్‌ జగన్‌ చిత్తూరు పర్యటనకు విచ్చేసినప్పుడు ఇదే విషయాన్ని పాడిరైతులు వివరించారు. అధికారంలోకి వస్తే డెయిరీని తెరిపిస్తామని ఇచ్చిన హామీ మేరకు విజయా డెయిరీకి జగనన్న ప్రభుత్వం ఊపిరి పోస్తోంది.

చిత్తూరు అగ్రికల్చర్‌: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచిన విజయా డెయిరీకి ప్రస్తుత రాష్ట్రప్రభుత్వం ఊపిరి పోసింది. డెయిరీ పునఃప్రారంభానికి సీఎం జగన్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో ఎంతోమంది పాడి రైతులకు బాసటగా నిలవనుంది. నగర పరిధిలో 1969లో సహకార కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో విజయా డెయిరీని ప్రారంభించారు. అప్పట్లోనే రోజుకు 3 వేల లీటర్ల పాలను సేకరించి, చిత్తూరు, తిరుపతి నగరాల్లో విక్రయించేవారు. అటు తరువాత 1977–78 నుంచి తిరుమల స్వామివారి అభిషేకానికి కూడా విజయా డెయిరీ పాలను సరఫరా చేసేవారు.

తిరుమలలోని పలు హోటళ్లు, క్యాంటీన్ల నిర్వాహకులు కూడా ఈ పాలనే కొనుగోలు చేసేవారు. 1980 నుంచి ఏడాదికి రోజుకు 50 వేల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం పెరగడంతో డెయిరీ ఆవరణలో పాలకోవా, రోస్‌మిల్క్‌ తయారు చేసే యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ హయాంలో డెయిరీకి మరింత ప్రోత్సాహం లభించడంతో తిరుమలకు నెలకు రూ.కోటి మేరకు నెయ్యి సరఫరా చేయడంతో పాటు, పాలకోవా, రోస్‌ మిల్క్‌ విక్రయ కేంద్రాలను చిత్తూరు, తిరుపతి, తిరుమల నగరాల్లో ఏర్పాటు చేశారు. అంతేగాకుండా డెయిరీ నుంచి పాల పౌడర్‌ను మిలిటరీ క్యాంటీన్లకు తరలించే వారు. డెయిరీ సామర్థ్యం మరింతగా పెరగడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.20 లక్షల మంది పాడి రైతులు కుటుంబాలు రోజుకు దాదాపు 3.50 లక్షల లీటర్ల పాలను సరఫరా చేసి జీవనం సాగించే వారు.

దీంతో వి.కోట, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి, పిచ్చాటూరులో శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి నిత్యం పాలను సేకరించే వారు. డెయిరీకి రైతులను మరింత చేరువ చేస్తూ గ్రామాల్లో పాడి రైతులతో కూడిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 850 గ్రామాల్లో పాల ఉత్పత్తి దారుల సంఘం కింద పాల సేకరణ భవనాలను నిర్మించారు. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం సహకారం అందించడంతో పాల ఉత్పత్తిదారుల వాటా కూడా ఉంది. 1988లో విజయా డెయిరీలో కార్మిక యూనియన్‌ను కూడా ఏర్పాటు చేశారు.

పునరుజ్జీవం ఇలా...
2018లో చిత్తూరు పర్యటనకు విచ్చేసిన జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి రైతులు, కార్మికులు డెయిరీ పరిస్థితిని తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన అధికారంలోకి రాగానే డెయిరీని తిరిగి తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం డెయిరీ పునఃప్రారంభానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెంటనే డెయిరీకి ఉన్న అప్పులు రూ.182 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా పాడి రైతులను ఆదుకోవాలన్న తలంపుతో పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. రూ.385 కోట్లతో డెయిరీ అభివృద్ధికి ముందుకు వచ్చిన అమూల్‌ సంస్థతో ప్రభుత్వం 99 ఏళ్ల పాటు లీజు ఒప్పందం కుదుర్చుకుంది.

దీంతో గత ఏడాది జూలైలో డెయిరీని పునఃప్రారంభించే పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి డెయిరీ పనులను అమూల్‌ సంస్థ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే రూ.35 కోట్లు వెచ్చించి డెయిరీ ఆవరణలో 20 లక్షల లీటర్ల సామర్థ్యం గల ప్రాసెసింగ్‌ భవన నిర్మాణ పనులు చేపడుతోంది. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేసి డెయిరీని పునఃప్రారంభించే పనులు శరవేగంగా చేపడుతున్నారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా పాడి రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

డెయిరీ నిర్వీర్యం ఇలా....
జిల్లాకే తలమానికంగా నిలిచిన విజయా డెయిరీని చంద్రబాబునాయుడు సహకార శాఖ మంత్రిగా పనిచేసే రోజుల్లో సందర్శించారు. అప్పటికి రోజుకు 4 లక్షల లీటర్ల మేరకు పాల సేకరణ జరిగేది. డెయిరీలో దాదాపు 800 మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేసేవారు. డెయిరీ నుంచి ఢిల్లీ, పుణే, ముంబై తదితర మహా నగరాలకు రోజుకు 2 లక్షల లీటర్ల పాలను రేణిగుంట రైల్వే జంక్షన్‌ నుంచి రైలు ద్వారా రెండు ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేసి తరలించేవారు. ఇది గమనించిన చంద్రబాబుకు తన మనసులో ఎక్కడో దుర్బుద్ధి పుట్టింది. వెంటనే తాను సొంతంగా హెరిటేజ్‌ డెయిరీని ఏర్పాటు చేసుకున్నారు. విజయా డెయిరీలో అప్పట్లో మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి సహకారంతో విజయా డెయిరీకి వచ్చే పాలను హెరిటేజ్‌కు మళ్లించే పనులు చేపట్టారు.

మరోవైపు విజయా డెయిరీలో పాల పౌడర్‌, నెయ్యిని విక్రయించకుండా నిల్వ ఉంచారు. అమ్ముడుపోలేదంటూ నిల్వ ఉన్న పాల పౌడర్‌, నెయ్యిని టెండర్‌ ద్వారా విక్రయించి డెయిరీని నష్టాల పాలు చేశారు. డెయిరీకి పాల సేకరణ ఎక్కువగా ఉందంటూ వారానికి రెండు రోజుల పాటు మిల్క్‌ హాలిడేను ప్రకటిస్తూ, హెరిటేజ్‌కు పాలను మళ్లించుకున్నారు. తనకు అనుకూలంగా ఉన్న దొరబాబును డెయిరీ కార్మిక సంఘం నాయకుడిగా నియమించుకున్నారు. ఆఖరికి నష్టాలు చూపి 2002లో ఆగస్టు 31న డెయిరీని పూర్తిగా మూసి వేయించారు. దీంతో డెయిరీని నమ్ముకుని జీవనం సాగిస్తున్న పాడి రైతుల కుటుంబాలు, కార్మికుల బతుకులు వీధిన పడ్డాయి.

పాడి రైతులను ఆదుకున్నారు
విజయా డెయిరీని తిరిగి తెరిపించి, పాడి రైతులను ఆదుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా అత్యధికంగా రైతులు పాడిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గతంలో ఇందుకు విజయా డెయిరీ వీరికి అండగా ఉండేది. చంద్రబాబు స్వార్థం కోసం డెయిరీని మూసివేసి మాలాంటి పాడి రైతులను నట్టేట ముంచారు.
– హేమచంద్ర, పాడి రైతు, బైరెడ్డిపల్లె మండలం

చాలా సంతోషంగా ఉంది
చిత్తూరు విజయా డెయిరీని తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను రెండు ఆవులను మేపుకుంటూ రోజు 10 లీటర్ల మేరకు మహిళా సంఘాల డెయిరీకి పాలు పోస్తున్నా. పాడి ఆవులే మాకు జీవనాధారం. చిత్తూరు డెయిరీ తిరిగి తెరిపిస్తే పాలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని అనుకుంటున్నాం.
– లక్ష్మి, పాడి రైతు, పాలసముద్రం మండలం

ఆశలు చిగురించాయి
విజయా డెయిరీ పునఃప్రారంభం కానుండడంతో ఆశ లు చిగురిస్తున్నాయి. అమూ ల్‌ సంస్థ ఆధ్వర్యంలో డెయిరీ ని నిర్వహించడం వల్ల పాలకు మంచి గిట్టుబాటు ధర వస్తుందనుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలోని పలుచోట్ల్ల గిట్టుబాటు ధర ఇస్తున్నారు. ప్రైవేటు డెయిరీల దోపిడీకి కొంతమేర చెక్‌ పడింది.
– నిర్మల, మహిళా పాడి రైతు, పెనుమూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement