రావిర్యాల విజయ డెయిరీ నడిపేదెలా?
కనాకష్టంగా మారిన యూనిట్ నిర్వహణ
రూ.1.80 కోట్లు విద్యుత్, తాగునీటి బిల్లులకు..
వీటికి తోడు నిర్వహణ, సిబ్బంది వేతనాలు అదనం
తొమ్మిది నెలలకే చేతులెత్తేయాల్సిన పరిస్థితి
ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి నిర్వహణ కష్టాలు వచ్చి పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో రూ. 246 కోట్ల వ్యయంతో రావిర్యాలలో నిర్మించిన మెగా యూనిట్ ఈ కష్టాలకు కారణం కానుంది. త్వరలో మీద పడనున్న ఆర్థిక భారం డెయిరీకి పెద్ద తలనొప్పిగా మారనుందని తెలుస్తోంది. ఈ మెగా యూనిట్ నిర్వహణను పకడ్బందీగా గాడిలోకి తెచి్చన తర్వాతే పూర్తిస్థాయిలో డెయిరీకి అప్పగించాల్సిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) కూడా తన బాధ్యతల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా యూనిట్‌ను ఏం చేయాలి? ఎలా నడపాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
తరుముకొస్తున్న కష్టాలు..
సరైన అంచనాలు, సౌకర్యాల కల్పన, ప్రణాళికలు లేకుండా రావిర్యాలలో నిర్మించిన విజయ డెయిరీ మెగా యూనిట్ చిక్కుల్లో పడింది. నీటి సౌకర్యం లేని ప్రాంతంలో ఈ డెయిరీని ఏర్పాటు చేయడంతో కేవలం ప్లాంటును నడిపించేందుకు నీటి కోసం నెలకు రూ.80 లక్షలు ఖర్చవుతోందని తెలుస్తోంది. ఇక, ఈ యూనిట్ కరెంటు బిల్లులు నెలకు రూ. కోటి దాటుతున్నాయి. వీటికి తోడు వచ్చే నెల నుంచి నెలకు రూ.2 కోట్ల వరకు రుణ వాయిదాలను చెల్లించాల్సి ఉంది. ఇవేకాక, ప్లాంటు నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు అదనం కావడంతో ప్రారంభించిన తొమ్మిది నెలలకే మెగా యూనిట్ నిర్వహణ విషయంలో చేతులెత్తేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని డెయిరీ వర్గాలంటున్నాయి. వాస్తవానికి, లాలాపేటలోని యూనిట్ ద్వారా విజయ డెయిరీ రోజుకు 4.5 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేసి మార్కెట్‌లోకి పంపుతోంది.
ఈ యూనిట్‌ను నడుపుతూనే రావిర్యాలలో రోజుకు 5–8 లక్షల లీటర్ల పాల ఉత్పత్తులు చేసే అంచనాలతో, ఆ మేరకు అత్యాధునిక యంత్రాంగంతో మెగా యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పటివరకు కేవలం 3 లక్షల లీటర్ల ఉత్పత్తులను మాత్రమే తయారు చేయగలుగుతున్నారు. ఈ మేరకు ఉత్పత్తి చేసేందుకు డెయిరీకి ఆర్థికంగా భారమవుతోంది. రోజుకు 3 లక్షల లీటర్ల ఉత్పత్తికి, 8 లక్షల వరకు లీటర్ల ఉత్పత్తికి అయ్యే నిర్వహణ ఖర్చులో పెద్దగా తేడా ఉండదని, ఈ నేపథ్యంలో 8 లక్షల లీటర్ల వరకు ఉత్పత్తి జరిగితేనే యూనిట్ మనుగడ సాధ్యమవుతుందని డెయిరీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కనీస సౌకర్యాలు, సిబ్బంది లేని పరిస్థితుల్లో మెగా యూనిట్ నిర్వహణ భారం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే ఆందోళనను వారు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment