raviryala
-
రుణ వాయిదాలకే నెలకు రూ. 2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి నిర్వహణ కష్టాలు వచ్చి పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో రూ. 246 కోట్ల వ్యయంతో రావిర్యాలలో నిర్మించిన మెగా యూనిట్ ఈ కష్టాలకు కారణం కానుంది. త్వరలో మీద పడనున్న ఆర్థిక భారం డెయిరీకి పెద్ద తలనొప్పిగా మారనుందని తెలుస్తోంది. ఈ మెగా యూనిట్ నిర్వహణను పకడ్బందీగా గాడిలోకి తెచి్చన తర్వాతే పూర్తిస్థాయిలో డెయిరీకి అప్పగించాల్సిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) కూడా తన బాధ్యతల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా యూనిట్‌ను ఏం చేయాలి? ఎలా నడపాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. తరుముకొస్తున్న కష్టాలు..సరైన అంచనాలు, సౌకర్యాల కల్పన, ప్రణాళికలు లేకుండా రావిర్యాలలో నిర్మించిన విజయ డెయిరీ మెగా యూనిట్ చిక్కుల్లో పడింది. నీటి సౌకర్యం లేని ప్రాంతంలో ఈ డెయిరీని ఏర్పాటు చేయడంతో కేవలం ప్లాంటును నడిపించేందుకు నీటి కోసం నెలకు రూ.80 లక్షలు ఖర్చవుతోందని తెలుస్తోంది. ఇక, ఈ యూనిట్ కరెంటు బిల్లులు నెలకు రూ. కోటి దాటుతున్నాయి. వీటికి తోడు వచ్చే నెల నుంచి నెలకు రూ.2 కోట్ల వరకు రుణ వాయిదాలను చెల్లించాల్సి ఉంది. ఇవేకాక, ప్లాంటు నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు అదనం కావడంతో ప్రారంభించిన తొమ్మిది నెలలకే మెగా యూనిట్ నిర్వహణ విషయంలో చేతులెత్తేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని డెయిరీ వర్గాలంటున్నాయి. వాస్తవానికి, లాలాపేటలోని యూనిట్ ద్వారా విజయ డెయిరీ రోజుకు 4.5 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి పంపుతోంది. ఈ యూనిట్‌ను నడుపుతూనే రావిర్యాలలో రోజుకు 5–8 లక్షల లీటర్ల పాల ఉత్పత్తులు చేసే అంచనాలతో, ఆ మేరకు అత్యాధునిక యంత్రాంగంతో మెగా యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పటివరకు కేవలం 3 లక్షల లీటర్ల ఉత్పత్తులను మాత్రమే తయారు చేయగలుగుతున్నారు. ఈ మేరకు ఉత్పత్తి చేసేందుకు డెయిరీకి ఆర్థికంగా భారమవుతోంది. రోజుకు 3 లక్షల లీటర్ల ఉత్పత్తికి, 8 లక్షల వరకు లీటర్ల ఉత్పత్తికి అయ్యే నిర్వహణ ఖర్చులో పెద్దగా తేడా ఉండదని, ఈ నేపథ్యంలో 8 లక్షల లీటర్ల వరకు ఉత్పత్తి జరిగితేనే యూనిట్ మనుగడ సాధ్యమవుతుందని డెయిరీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కనీస సౌకర్యాలు, సిబ్బంది లేని పరిస్థితుల్లో మెగా యూనిట్ నిర్వహణ భారం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే ఆందోళనను వారు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
‘అల్పాహారం’ ఎలా?.. మెనూ తేల్చకుండానే అమలుకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ‘అల్పాహారం’ అమలు విధివిధానాల ఖరారు, మెనూపై ఓ స్పష్టత రాకముందే ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలన్న ఆదేశాలతో అధికారుల్లో హడావుడి మొదలైంది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని దసరా రోజు ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే వచ్చేవారం ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ పథకాన్ని ఈ నెల 6నే మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల నుంచి సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే విద్యార్థులకు ఏ రోజు ఏం ఇవ్వాలనే దానిపై అధికారులు స్పష్టతకు వచ్చినట్టు లేదు. మెనూపై రూపొందించిన నివేదికపై ఈవారం మంత్రి సబితతో సంప్రదింపులు జరపాలని భావించారు. మార్పులు చేర్పులపై అధికారుల్లో నూ తర్జనభర్జన జరుగుతోంది. దీంతోపాటు అల్పాహారం అమలుకు విధి విధానాలు, ఏ అధికారులకు ఏ తరహా బాధ్యతలు అప్పగించాలనే దానిపై విద్యా శాఖ ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. కార్యక్రమాన్ని హడావుడిగా ప్రారంభించినా, కొద్దిరోజుల పాటు అమలు మాత్రం కష్టమేనని అధికారులు అంటున్నారు. దీనిపై వివరణ కోరేందుకు విద్యాశాఖ ఉన్నతాధి కారులను సంప్రదించగా, వారు నిరాకరించారు. చదవండి: ‘కానిస్టేబుల్’ తుది ఫలితాల వెల్లడి -
‘హుజురాబాద్’లో టీఆర్ఎస్ను బొందపెట్టాలి: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ తెలంగాణను పూర్తిగా నిర్వీర్యం చేశాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఏం న్యాయం చేశావని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అమలు చేయడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యావైద్యాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌కు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఇచ్చి పేద విద్యార్థులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ‘దళిత అధికారులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు మరో న్యాయం చేశావు. ఐఏఎస్ మురళిని అవమానించావ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అవమానిస్తే ఆయన ఐపీఎస్ పదవికి రాజీనామాలు చేశారు. దళిత ఓట్ల కోసమే దళిత బంధు పెట్టాడు. రేపు జరగబోయే హుజురాబాద్‌లో టీఆర్ఎస్కు బొంద పెడతారు’ అని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ బుధవారం ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర సభ’ జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో సభా వేదికకు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కమ్ ఠాగూర్ వచ్చారు. సమావేశానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, దళిత, గిరిజనులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికార పార్టీ దళిత, గిరిజనులకు అన్యాయం చేస్తోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్‌కు సూటిగా ‘ఏడేళ్ల పాలనలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు?’ అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం (కాంగ్రెస్) దళితులకు ఇచ్చిన భూములను టీఆర్ఎస్ లాక్కుంటోందని ఆరోపించారు. వాటిని వ్యాపారవేత్తలకు రూ.కోట్లకు అమ్ముకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి, కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, అద్దంకి దయాకర్ తదితరులు ఉన్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది. చదవండి: గాంధీభవన్‌లో దండోరా సభ పాస్‌ల గొడవ చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి -
రాజన్న చిరునామా.. చేవెళ్ల
సాక్షి, చేవెళ్ల: ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా.. అధికారంలో ఉన్నా రంగారెడ్డి జిల్లా అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎంతో అభిమానం. ఈ ప్రాంతం ఆయనతో ఓ బంధం పెనవేసుకుంది. చేవెళ్ల నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, ఔఆర్ఆర్ నిర్మాణం, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు సహకారంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఈ జిల్లాలోనే అధికంగా అమలయ్యాయి. రంగారెడ్డి జిల్లాపై రాజన్న ముద్ర చెరపలేనిది. వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే వైఎస్సార్‌కు చేవెళ్ల ప్రాంతమంటే అమితాభిమానం. చేవెళ్ల నియోజకవర్గంతో ఆయనకు పెనవేసుకున్న బంధం ఏర్పడింది. పేదలు, రైతుల శ్రేయస్సే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ ఘంటాపథంగా ప్రకటిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారు. 2004 ఎన్నికల్లో సీఎం పదవిని అధిష్టించిన అనంతరం వైఎస్సార్ వెనుతిరిగి చూడకుండా పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా పథకాలను ప్రవేశపెట్టారు. దాంతో వారు ఊహించిన దానికంటే ఎక్కువగా మేలు జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డికి సెంటిమెంట్‌గా చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు ఎంతో అనుబంధం ఉంది. ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఏ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించినా చేవెళ్ల నుంచే ప్రారంభించే సెంటిమెంట్ వైఎస్సార్‌కు ఉంది. 2001లో మండల పరిషత్, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచార సభకు ప్రతిపక్ష నేతగా చేవెళ్లకు వచ్చిన ఆయన ఆ తర్వాత ఎన్నడూ చేవెళ్లను మరువలేదు. చేవెళ్ల ప్రాంతం తన సెంటిమెంట్ అంటూ బహిరంగంగానే ఆయన పలుసార్లు ప్రకటించారు. 2003లో చేవెళ్ల నుంచి మహా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. తెలంగాణ ప్రాంతంలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు (నేటి కాళేశ్వరం ప్రాజెక్టు)కు నవంబర్ 19, 2008లో శంకుస్థాపన చేశారు. 2009 ఏప్రిల్లోఎన్నికల ప్రచారాన్ని చేవెళ్ల నుంచే ప్రారంభించి రెండోసారి విజయధుందుబి మోగించారు. పాదయాత్రలో వెన్నంటే.. 2004లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖరరెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పూర్తిస్థాయిలో ప్రసన్నకుమార్ పాల్గొని మనన్నలు పొందారు. 2005లో రాజీవ్ పల్లె బాట కార్యక్రమంలో భాగంగా మంచాలకు వైఎస్సార్ వచ్చారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తల మధ్య వీరిని రాజశేఖరరెడ్డి పేరు పెట్టి పిలవడం విశేషం. మంచాల మండలానికి వైఎస్సార్ ప్రత్యేకంగా 500 ఇళ్లు మంజూరు చేశారు. ఇళ్లతో పాటు అర్హులైన వారందరికీ పింఛన్లు కూడా అందజేశారు. ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఎంతోమందికి గుండె శస్త్ర చికిత్సలు కూడా చేయించారు. 2005 జనవరి 13వ తేదీన ఇబ్రహీంపట్నంలో పర్యటించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు కృష్ణ నుంచి తాగునీరు అందించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేశారు. 2008లో రెండో విడుతగా మరో రూ.12 కోట్లు కేటాయించారు. రావిర్యాలకు రాజన్నయోగం మహేశ్వరం: ఓవైపు అంతర్జాతీయ విమానాశ్రయం.. చుట్టూ ఔటర్ రింగురోడ్డు.. పరిసర ప్రాంతాల్లో అనేక అంతర్జాయతీస్థాయి కంపెనీలు.. వీటన్నింటి మధ్య ఉన్న రావిర్యాల గ్రామం అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్నది. ఇటు అభివృద్ధికి, అటు రియల్ బూమ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రావిర్యాల ఒకప్పుడు కుగ్రామం. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పడిన అభివృద్ధి బీజాలు, ఆయన చూపిన ప్రత్యేక చొరవతో రావి ర్యాల గ్రామం ప్రస్తుతం ప్రపంచపటంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది. అప్పట్లో వైఎస్సార్ చేసిన కృషిని ఆ గ్రామం స్మరించుకుంటోంది. రావిర్యాల శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. చుట్టూ ఔటర్ రింగురోడ్డు, పక్కనే శ్రీశైలం జాతీయ రహదారి ఉండడం, అనేక అంతర్జాతీయ కంపెనీలు, పరిశ్రమలు వెలుస్తుండడం, రియల్ బూమ్ భారీస్థాయిలో ఉండడంతో రావిర్యాల గ్రామానికి వరంగా మారింది. ఒకప్పుడు మారుమూల కుగ్రామంగా ఉన్న రావిర్యాల ఇప్పుడు వెలుగుతోంది. 2004లో ఈ గ్రామానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకావడంతో క్రమంగా రావిర్యాల అభివృద్ధి పథంలోకి వచ్చింది. ఎయిర్‌పోర్టు రావడం, గ్రామానికి అనుకొని ఔటర్ రింగురోడ్డు వెళ్లడంతో ఈ గ్రామానికి మహర్దశ పట్టింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రావిర్యాల గ్రామంలోనూ, పరిసర ప్రాంతాల్లో అనేక ప్రముఖ కంపెనీలు ఏర్పాటయ్యాయి. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రావిర్యాల రెవెన్యూ పరిధిలో శ్రీశైలం ప్రధాన రహదారి పక్కన హార్డ్‌వేర్ పార్కు, ఫ్యాబ్ సిటీ, టీసీఎస్, రాజీవ్ జేమ్స్ పార్కు (డైమండ్ పార్కు), ఆగాఖాన్ అంతర్జాతీయ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటుచేశారు. దీనికితోడు గ్రామాన్ని చుట్టుకొని ఔటర్ రింగురోడ్డు రావడంతో రావిర్యాలకు రియల్ బూమ్ వరంగా మారింది. ఒక్కసారిగా భూములకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు రావిర్యాల గ్రామం అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఇక్కడ భూమి ఎకరానికి రూ.3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు పలుకుతోంది. గ్రామం చుట్టు భారీ పరిశ్రమలు, కంపెనీలు వచ్చాయి. వైఎస్సార్ పాలనలో కొత్త వెలుగులు 2004లో వైఎస్సార్ అధికారం చేపట్టిన తర్వాత నగర శివారులోని రావిర్యాలతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు కొత్త వెలుగులు వచ్చాయి. సమీపంలోని శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, ఆ వెంటనే 2005–06 సమయంలో రావిర్యాల రెవెన్యూ పరిధిలో హార్డ్‌వేర్ పార్కు, ఫ్యాబ్‌సిటీ, ఇంటర్నేషనల్ ఆగాఖాన్ అకాడమీ, రాజీవ్ జేమ్స్ పార్కు వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వెలువడం, హైదరాబాద్ నగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు గ్రామానికి ఆనుకొని రావడంతో గ్రామం అభివృద్ధి వేగం పూంజుకుంది. కొత్త ఉపాధి అవకాశాలు లభించాయి. గ్రామం నుంచి ఉన్నత చదువులు చదివేవారి సంఖ్య పెరిగింది. రాజశేఖర్‌రెడ్డి హయాంలో భారీ స్థాయిలో కానిస్టేబుల్,ఉపాధ్యాయుల ఉద్యోగాలు పెద్దసంఖ్యలో గ్రామస్తులకు లభించాయి. రియల్ బూమ్ ఆసరాతో పలువురు గ్రామ విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. నాటి బీజాలే.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శివారు ప్రాంతంలో అభివృద్ధికి చూపిన చొరవ వల్లే ఇక్కడ ప్రస్తుతం పెద్దఎత్తున అభివృద్ధి జరుగడానికి మూలకారణమని ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు వల్లే ఇప్పుడు గ్రామంలో ప్రగతి వెలుగులు పరుచుకున్నాయని, రావిర్యాల గ్రామం ప్రపంచపటంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేస్థాయిలో ఎదిగిందని వారు వైఎస్ కృషిని స్మరించుకుంటున్నారు. రాజశేఖర్‌రెడ్డి హాయంలో గ్రామానికి భారీ ప్రాజెక్టులు తీసుకురావడం, కంపెనీలు స్థాపించడం, ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయడం మూలంగానే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందని ఆయన జయంతి సందర్భంగా వైఎస్సార్ అభిమానులు స్మరించుకుంటు నివాళులు అర్పిస్తున్నారు. -
మహేశ్వరం.. మహర్దశ!
మూడేళ్ల క్రితం ఎకరం ధర రూ.25 లక్షలు.. మరి నేడో అర కోటికి పైమాటే ♦ అమీర్‌పేట్, రావిర్యాల, తుక్కుగూడలో రియల్ బూమ్ ♦ ఐటీఐఆర్, టీ-పాస్‌తో పరిశ్రమల పరుగులు ♦ స్థిరాస్తి రంగానికి పెరిగిన గిరాకీ; ప్రాజెక్ట్‌లతో నిర్మాణ సంస్థల క్యూ ♦ గతంలో షేరింగ్ ఆటోలు కూడా తిరగని ప్రాంతం! ♦ మరి నేడో.. లగ్జరీ కార్లు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయ్!! ♦ గతంలో గ్రామాధికారులు కూడా సరిగా పట్టించుకోని ప్రాంతం! మరి నేడో.. ఐటీఐఆర్‌తో కేంద్రం, టీ-పాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిన హైటెక్ గ్రామం!! ... ఇదంతా మహేశ్వరం మండలం గురించి. ఈ ప్రాంతాన్ని మూడు ముక్కల్లో వివరించాలంటే.. ఎత్తై కార్యాలయ భవనాలు.. విశాలమైన రోడ్లు.. లక్షల సంఖ్యలో ఉద్యోగులు! ఇలా పూర్తి స్థాయి హైటెక్ గ్రామంగా రూపుదిద్దుకుంటున్న మహేశ్వరం మండలంపై ఈ వారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది. సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ పరిధిలో మహేశ్వరం, కందుకూరు మండలాలొస్తాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అమీర్‌పేట్, ర్యావిర్యాల, తుక్కుగూడ, మంఖాల్, శ్రీనగర్ ప్రాంతాల గురించే. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లే కారణం. గతంలో కేంద్రం ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐఆర్) మూడు క్లస్టర్లలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఉంది. ♦ ఈ క్లస్టర్ కిందికి మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం ప్రాంతాలొస్తాయి. మొత్తం 79.2 చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న క్లస్టర్లో ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇక రాష్ర్ట ప్రభుత్వం విషయానికొస్తే.. 313 ఎకరాల్లో మహేశ్వరంలో, 600 ఎకరాల్లో రావిర్యాలలో ఎలక్ట్రానిక్ సిటీ (ఈ-సిటీ)లను ఏర్పాటు చేశాయి. నూతన పారిశ్రామిక విధానం (టీ-పాస్)లో పరిశ్రమల స్థాపన కోసం 60కి పైగా కంపెనీలు స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నాయి కూడా. ♦ భాగ్యనగర అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా నగరం చుట్టూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నగరం చుట్టూ 13 రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాంతాలను నగరంతో అనుసంధానించనున్నారు. వీటిలో తుక్కుగూడ ప్రాంతానికి చోటు దక్కింది. ఆయా ప్రాంతాల్లో 2041 నాటికి నగరం ఎలా విస్తరిస్తుంది? అప్పటి మౌలిక, వాణిజ్య అవసరాలకు తగ్గట్లు ప్రజా రవాణా, మౌలిక వసతుల ఏర్పాట్లు చేస్తారు. అలాగే సైన్స్‌పార్క్‌ను మహేశ్వరంలో ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ ప్రతిపాదించింది. ఆయా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటుగా ఈ ప్రాంతంలో స్థిరాస్తి, అద్దెల ధరలు పెరుగుతాయి. గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతులూ మెరుగవుతాయి. ఐటీఐఆర్ జోన్ కారణంగా కేవలం ఐటీ రంగమే కాదు.. రవాణా, పర్యాటక, ఆతిథ్య రంగాలకూ గిరాకీ పెరుగుతుంది. వైద్య, విద్యా రంగాలకు రానున్న రోజుల్లో ఆదరణ లభిస్తుంది. ఎకరం రూ.50 లక్షల పైమాటే.. మూడేళ్ల క్రితం వరకూ మహేశ్వరం మండలంలో ఎకరం ధర పాతిక లక్షలుండేది. కానీ, నేడు రూ.50 లక్షలకు పైగానే ఉందని శతాబ్ది టౌన్షిప్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. 3,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆయుర్వేద, అల్లోపతి, హోమియోపతి వైద్య కళాశాలతో పాటూ 70 ఎకరాల్లో చిన జీయర్ స్వామి ఆశ్రమం, నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. కార్వి, సెంట్రల్ ఎక్సైజ్, బ్యాంక్ కాలనీ నివాస సముదాయాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాంతం హైలెట్స్.. మహేశ్వరం మండలం మెహదీపట్నం నుంచి 32 కి.మీ., శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్‌కు 12 కి.మీ. దూరంలో ఉంటుంది. కొంగర, రావిర్యాల, శ్రీనగర్ గ్రామాల్లో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లు, మండల కేంద్రంలో ఐటీ ఎలక్ట్రానిక్ పార్క్, మంఖాల్‌లో పారిశ్రామికవాడలో పలు కంపెనీలు రానున్నాయి. రావిర్యాలలో రూ.200 కోట్లతో ఏర్పాటైన మైక్రోమ్యాక్స్ ప్లాంట్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఇదే ప్రాంతంలో బెంగళూరుకు చెందిన వండర్ లా సంస్థ అమ్యూజ్మెంట్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కూడా.