సాక్షి, హైదరాబాద్: సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ తెలంగాణను పూర్తిగా నిర్వీర్యం చేశాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఏం న్యాయం చేశావని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అమలు చేయడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యావైద్యాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌కు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఇచ్చి పేద విద్యార్థులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ‘దళిత అధికారులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు మరో న్యాయం చేశావు. ఐఏఎస్ మురళిని అవమానించావ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అవమానిస్తే ఆయన ఐపీఎస్ పదవికి రాజీనామాలు చేశారు. దళిత ఓట్ల కోసమే దళిత బంధు పెట్టాడు. రేపు జరగబోయే హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు బొంద పెడతారు’ అని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ బుధవారం ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర సభ’ జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో సభా వేదికకు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కమ్ ఠాగూర్ వచ్చారు. సమావేశానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, దళిత, గిరిజనులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికార పార్టీ దళిత, గిరిజనులకు అన్యాయం చేస్తోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్‌కు సూటిగా ‘ఏడేళ్ల పాలనలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు?’ అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం (కాంగ్రెస్) దళితులకు ఇచ్చిన భూములను టీఆర్‌ఎస్ లాక్కుంటోందని ఆరోపించారు. వాటిని వ్యాపారవేత్తలకు రూ.కోట్లకు అమ్ముకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి, కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, అద్దంకి దయాకర్ తదితరులు ఉన్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది.
చదవండి: గాంధీభవన్‌లో దండోరా సభ పాస్‌ల గొడవ
చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి
Comments
Please login to add a commentAdd a comment