సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ నాశనమవుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. పార్టీలో ఏ పరిణామం జరిగినా పీసీసీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని చెప్పారు. పార్టీని నడిపించడంలో రేవంత్ ఫెయిల్ అయ్యాడని, ఆయనతోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, తాను కూడా ఫెయిలేనని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా.. ప్రజా సమస్యలపై పోరాడే శక్తి ఉన్నా.. వ్యవస్థ బాగోలేదని, అంతా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్న పది మంది కూడా ఒక్క దగ్గర కూర్చునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
రేవంత్ వన్‌మ్యాన్ షో ప్రయత్నం
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తోందో అర్థం కావడం లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇంట్లో కూర్చుని జూమ్ సమావేశాలు పెడితే సరిపోదని.. పీసీసీ అధ్యక్షుడు గ్రామగ్రామానికి వెళ్లాలని పేర్కొన్నారు. రేవంత్ పాదయాత్రతో వన్ మ్యాన్ షో చేద్దామనుకుంటున్నారని, అలా చేస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు.
గతంలో వారానికో మీటింగ్ అని చెప్పారని, పీసీసీ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయని ప్రశ్నించారు. పీసీసీ, సీఎల్పీ మధ్య సమన్వయం లేదని, ఈ విషయంలో ఇన్‌చార్జిది కూడా తప్పేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని తాను చెప్పబోనన్నారు. అయితే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే మెడిసిన్ తన దగ్గర ఉందని, భవిష్యత్తులో తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఆ మందు బయటకు తీస్తానని పేర్కొన్నారు.
నేతలు వెళ్తుంటే ఏం చేస్తున్నారు?
శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటం పార్టీకి నష్టమని, ఇందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ సంస్థాగత ఇన్‌చార్జి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యత వహించాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. శశిధర్‌రెడ్డి పార్టీ వదిలి వెళ్లే పరిస్థితి ఏర్పడితే ఈ ముగ్గురూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత రేవంత్, భట్టి ఏం చేస్తారని నిలదీశారు.
టీఆర్‌ఎస్, బీజేపీ బయట వాళ్ల ఆట వారు ఆడుతుంటే.. రేవంత్, భట్టి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో వాళ్ల ఆట ఆడుతున్నారని వ్యాఖ్యా నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తానొక్కడినే పనిచేశానని రేవంత్ చెప్పడం సరికాదని జగ్గారెడ్డి అన్నారు. మునుగోడు ఓటమి బాధ్యతల నుంచి రేవంత్ తప్పించుకోలేడన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే అన్ని ఖర్చులు తానే పెట్టుకుంటానని రేవంత్ చెప్పాడని.. మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ చెరో రూ.100 కోట్లు పెడితే, రేవంత్ కనీసం రూ.50 కోట్లయినా ఖర్చు పెట్టి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.
జనాల కాళ్లు మొక్కితే ఓట్లు పడే రోజులు పోయా యన్నారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత ఇద్దరూ పార్టీ నాయకులందరినీ పట్టించుకోకపోయినా, అసంతృప్తితో ఉన్న నాయకులతో అయినా మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీకి లేఖ రాశానని చెప్పిన జగ్గారెడ్డి.. ఆ లేఖ వివరాలను వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు.
బీజేపీ, టీఆర్‌ఎస్‌లది కుక్కల కొట్లాట
రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నాయని, వారిది కుక్కల కొట్లాట అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎంపీ అర్వింద్ రైతుల సమస్యలపై కొట్లాడుతున్నారా? ప్రజల సమస్యలు వదిలేసి సొంత దుకాణాలు పెట్టుకుంటున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఒకరినొకరు గిచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసేందుకే ఆట ఆడుతున్నారు’’అని మండిపడ్డారు.
కాంగ్రెస్‌లో కలకలం.. ఆరా తీసిన అధిష్టానం
మునుగోడు ఉప ఎన్నిక, భారత్‌జోడో యాత్ర, పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి నిష్క్రమణ తదితర అంశాలపై జగ్గారెడ్డి చేసిన వ్యా ఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. దీనిపై ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్ ఆరా తీసి నట్టు తెలిసింది. శనివారం సాయంత్రం జగ్గారెడ్డికి ఫోన్ చేసిన ఆయన.. ఏం మాట్లాడారు? ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే అంశాలపై వివరణ కోరినట్టు సమాచారం. ఇక పార్టీ నేతలు జూమ్ సమావేశాలతో ఏం చేస్తారని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి.. శనివారం సాయంత్రం జూమ్ ద్వారా జరిగిన పీసీసీ కీలక సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment