
కారులో వచ్చి ఏటీఎంలోకి చొరబాటు
గ్యాస్ కట్టర్లతో కట్ చేసి సినీ ఫక్కీలో అర్ధరాత్రి భారీ చోరీ
రంగారెడ్డి జిల్లా రావిర్యాల్‌లో ఘటన
ఇబ్రహీంపట్నం రూరల్: ముఖాలకు మాస్క్లు.. చేతులకు గ్లౌస్‌లు.. వెంట ఇనుప రాడ్లు, గ్యాస్ కట్టర్లు.. దర్జాగా స్విఫ్ట్ కారులో వచ్చి ఏటీఎంలోకి చొరబాటు.. కట్ చేస్తే సినీ ఫక్కీలో నాలుగంటే నాలుగే నిమిషాల్లో రూ.29,69,900 కొట్టేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ చోరీ ఘటన జరిగింది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిర్యాలలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తెల్లని కారులో ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు చేరుకున్నారు.
ముందుగా ఒక వ్యక్తి కారులోంచి దిగి ఏటీఎంలోకి ప్రవేశించాడు. అలారం మోగకుండా వైర్లు కత్తిరించాడు. తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. మరో ఇద్దరు వెంటనే కారు దిగి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లు, గ్యాస్ కట్టర్లతో రాత్రి 1:55 గంటలకు ఏటీఎం లోపలికి ప్రవేశించారు. ఒక వ్యక్తి సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టాడు. దీంతో సీసీ కెమెరాలు బ్లర్ అయిపోయి రికార్డింగ్ ఆగిపోయింది. వెంటనే గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి, అందులో ఉన్న రూ.29.69 లక్షల నగదు అపహరించుకుపోయారు.
ముందే రెక్కీ?
ఈ చోరీకి ఒకటి రెండు రోజుల ముందే దుండగులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్లాన్ ప్రకారం నాలుగు నిమిషాల్లో పని పూర్తి చేయడంతో దొంగలను ప్రొఫెషనల్స్‌గా భావిస్తున్నారు. కాగా, దుండగుల కారు పహాడీషరీఫ్ వైపు నుంచి వచ్చి మళ్లీ అటే వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ
చోరీ జరిగిన పది నిమిషాల్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదిభట్ల పోలీసులకు సమాచారం వచి్చంది. వెంటనే అక్కడికి చేరుకోగా అప్పటికే దొంగలు పరారయ్యారు. ఆదిబట్ల ఎస్‌ఐ వెంకటేశ్, సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి, క్రైం డీసీపీ అరవింద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు .
ఐదు బృందాలతో గాలింపు
రావిర్యాలలో జరిగిన ఈ చోరీ ఘటనను రాచకొండ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆదిభట్ల పోలీసులు, క్రైమ్ సిబ్బంది, ఎస్‌ఓటీ, సైబర్ క్రైమ్ సిబ్బందిని కలిపి మొత్తం ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు వెళ్లిన స్థలాలను, వారి కారు నంబర్‌ను గుర్తించే పనిలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment