దుండగులు ధ్వంసం చేసిన ఏటీఎం. సీసీ కెమెరాను పెప్పర్ స్ప్రేతో బ్లాక్ చేస్తున్న దుండగుడు
జైపూర్ (చెన్నూర్): మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఎస్‌బీఐ ఏటీఎం కొల్లగొట్టేందుకు దుండగులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు విఫలం చేశారు. దొంగలు సీసీ కెమెరాలు బ్లాక్ చేయగా.. ఏటీఎంలోని సీక్రెట్ సీసీ కెమెరా ద్వారా గమనించిన హైదరాబాద్ ఇంటెలిజెన్స్ సిబ్బంది స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో దండగులు పారిపోయారు. ఎస్‌బీఐ ఏటీఎంలోకి బుధవారం వేకువజామున మూడున్నరకు గుర్తు తెలియని దుండగుల ముఠా చొరబడింది.
కారు, మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగుల్లో ఒకరు చేతులకు గ్లౌజ్‌లు, తలకు మంకీ క్యాప్ ధరించి ఉన్నాడు. దొంగలు ఏటీఎం కేంద్రంలోకి రాగానే పెప్పర్‌స్ప్రేతో సీసీ కెమెరాలను బ్లాక్ చేశారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం కట్ చేసి నగదు ఉన్న రెండు బాక్సులను బయటకు తీశారు. మరో బాక్సు కోసం ప్రయత్నిస్తుండగా.. ఏటీఎంలోపల ఉన్న సీక్రెట్ కెమెరా ద్వారా ఎస్‌బీఐ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగం పరిశీలించి వెంటనే 100 నంబరుకు డయల్ చేసి సమాచారం అందించారు.
దీంతో ఎస్టీపీపీలో ఉంటున్న జైపూర్ ఏసీపీ నరేందర్, సీఐ రాజు, ఎస్సై రామకృష్ణ బ్లూకోల్ట్స్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఏటీఎం వద్దకు చేరుకున్నారు. వారి రాకను గమనించిన దుండగులు నగదు ఉన్న బాక్సులు, గ్యాస్‌కట్టర్ మిషన్, ఇనుప రాడ్డు అక్కడే వదిలి పారిపోయారు. ఏసీపీ, సీఐ, ఎస్సై, బ్యాంకు మేనేజర్ వం«శీ సమక్షంలో ఏటీఎంలో ఉన్న డబ్బును లెక్కించగా రూ.22,44,500 భద్రంగా ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. ఏమాత్రం ఆలస్యం జరిగినా డబ్బు చోరీకి గురయ్యేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment