ATM Thefts
-
మంచిర్యాలలో దోపిడీని.. హైదరాబాద్ నుంచి పసిగట్టారు
జైపూర్ (చెన్నూర్): మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం కొల్లగొట్టేందుకు దుండగులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు విఫలం చేశారు. దొంగలు సీసీ కెమెరాలు బ్లాక్ చేయగా.. ఏటీఎంలోని సీక్రెట్ సీసీ కెమెరా ద్వారా గమనించిన హైదరాబాద్ ఇంటెలిజెన్స్ సిబ్బంది స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో దండగులు పారిపోయారు. ఎస్బీఐ ఏటీఎంలోకి బుధవారం వేకువజామున మూడున్నరకు గుర్తు తెలియని దుండగుల ముఠా చొరబడింది. కారు, మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగుల్లో ఒకరు చేతులకు గ్లౌజ్‌లు, తలకు మంకీ క్యాప్ ధరించి ఉన్నాడు. దొంగలు ఏటీఎం కేంద్రంలోకి రాగానే పెప్పర్‌స్ప్రేతో సీసీ కెమెరాలను బ్లాక్ చేశారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం కట్ చేసి నగదు ఉన్న రెండు బాక్సులను బయటకు తీశారు. మరో బాక్సు కోసం ప్రయత్నిస్తుండగా.. ఏటీఎంలోపల ఉన్న సీక్రెట్ కెమెరా ద్వారా ఎస్బీఐ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగం పరిశీలించి వెంటనే 100 నంబరుకు డయల్ చేసి సమాచారం అందించారు. దీంతో ఎస్టీపీపీలో ఉంటున్న జైపూర్ ఏసీపీ నరేందర్, సీఐ రాజు, ఎస్సై రామకృష్ణ బ్లూకోల్ట్స్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఏటీఎం వద్దకు చేరుకున్నారు. వారి రాకను గమనించిన దుండగులు నగదు ఉన్న బాక్సులు, గ్యాస్‌కట్టర్ మిషన్, ఇనుప రాడ్డు అక్కడే వదిలి పారిపోయారు. ఏసీపీ, సీఐ, ఎస్సై, బ్యాంకు మేనేజర్ వం«శీ సమక్షంలో ఏటీఎంలో ఉన్న డబ్బును లెక్కించగా రూ.22,44,500 భద్రంగా ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. ఏమాత్రం ఆలస్యం జరిగినా డబ్బు చోరీకి గురయ్యేదని పోలీసులు తెలిపారు. -
దొంగలపై దాడిచేసే ఏటీఎం..
లండన్: ఒక ఏటీఎంలో చోరీ చేసేందుకు దొంగలు ప్లాన్ వేశారు.. ఏటీఎంలో చొరబడ్డారు.. సీసీ కెమెరాలను, విద్యుత్ వైర్లను కత్తిరించారు.. ఇక యంత్రాన్ని తెరవడానికి ప్రయత్నించగానే.. యంత్రంలోంచి ఒక్కసారిగా వేడి వేడి రంగు నీళ్లు, నురగ వారి ముఖం మీద పడ్డాయి.. ఒకటే మంట.. అంతే అన్నీ వదిలేసి దొంగలు పరుగో పరుగు.. ఏటీఎంలు మాత్రమే కాదు.. ఎవరూ తాకకూడని, చొరబడకూడని భద్రతా ప్రదేశాల్లో వినియోగించుకోగల ఈ టెక్నాలజీని జ్యూరిచ్‌లోని ఈటీహెచ్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీలో తేనెపట్టు వంటి రెండు ప్లాస్టిక్ ఫిల్ములను వినియోగించారు. ఒకదానిలోని రంధ్రాల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను, మరోదానిలో మాంగనీస్ డయాక్సైడ్ను నింపారు. ఈ రెండు ప్లాస్టిక్ ఫిల్ములను మధ్యలో అత్యంత పలుచని ప్లాస్టిక్ షీటును పెట్టి ఒకదానిపై ఒకటి అమర్చారు. మొత్తంగా దీనిపై ఒత్తిడి పడినప్పుడు మధ్యలో ఉన్న పలుచని ప్లాస్టిక్ షీటు పగిలి.. రెండు ఫిల్ములలోని రసాయనాలు కలుస్తాయి. దాంతో రసాయన చర్య జరిగి ఒక్కసారిగా దాదాపు 80 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతతో నీటి ఆవిరి, నురగ వెలువడతాయి. దీనికి రంగులు, డీఎన్ఏతో కూడిన పదార్థాలనూ జోడించవచ్చు. దీనివల్ల దొంగలపై, కరెన్సీ నోట్లపై పడే రంగులు, డీఎన్ఏ పదార్థాల ద్వారా.. వారు పారిపోయినా తర్వాత సులువుగా గుర్తించవచ్చు. ఈ ఫిల్ములను ఏటీఎంలు వంటితో పాటు భద్రత అవసరమైన యంత్రాలు, ప్రదేశాల్లో ఏర్పాటు చేయవచ్చు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ వెండెలిన్ స్టార్క్ మాట్లాడుతూ... ‘‘భద్రత కోసం రంగులు, రసాయనాలను చల్లే యంత్రాలు ఇప్పటికే ఉన్నా... వాటికి విద్యుత్ సరఫరా తప్పనిసరి. విద్యుత్ సరఫరా నిలిపేస్తే పనిచేయవు. ఖరీదూ ఎక్కువే. అదే ఈ ఫిల్ముల ధర, పరిమాణం తక్కువ. విద్యుత్ అవసరం లేదు. ఎక్కడైనా సులువుగా వినియోగించవచ్చు’’ అని చెప్పారు.