దొంగలపై దాడిచేసే ఏటీఎం.. | brave ATM guard grabs machete from robbers | Sakshi
Sakshi News home page

దొంగలపై దాడిచేసే ఏటీఎం..

Published Sun, Apr 13 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

దొంగలపై దాడిచేసే ఏటీఎం..

దొంగలపై దాడిచేసే ఏటీఎం..

లండన్: ఒక ఏటీఎంలో చోరీ చేసేందుకు దొంగలు ప్లాన్ వేశారు.. ఏటీఎంలో చొరబడ్డారు.. సీసీ కెమెరాలను, విద్యుత్ వైర్లను కత్తిరించారు.. ఇక యంత్రాన్ని తెరవడానికి ప్రయత్నించగానే.. యంత్రంలోంచి ఒక్కసారిగా వేడి వేడి రంగు నీళ్లు, నురగ వారి ముఖం మీద పడ్డాయి.. ఒకటే మంట.. అంతే అన్నీ వదిలేసి దొంగలు పరుగో పరుగు.. ఏటీఎంలు మాత్రమే కాదు.. ఎవరూ తాకకూడని, చొరబడకూడని భద్రతా ప్రదేశాల్లో వినియోగించుకోగల ఈ టెక్నాలజీని జ్యూరిచ్‌లోని ఈటీహెచ్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీలో తేనెపట్టు వంటి రెండు ప్లాస్టిక్ ఫిల్ములను వినియోగించారు. ఒకదానిలోని రంధ్రాల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను, మరోదానిలో మాంగనీస్ డయాక్సైడ్‌ను నింపారు.
 
 ఈ రెండు ప్లాస్టిక్ ఫిల్ములను మధ్యలో అత్యంత పలుచని ప్లాస్టిక్ షీటును పెట్టి ఒకదానిపై ఒకటి అమర్చారు. మొత్తంగా దీనిపై ఒత్తిడి పడినప్పుడు మధ్యలో ఉన్న పలుచని ప్లాస్టిక్ షీటు పగిలి.. రెండు ఫిల్ములలోని రసాయనాలు కలుస్తాయి. దాంతో రసాయన చర్య జరిగి ఒక్కసారిగా దాదాపు 80 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రతతో నీటి ఆవిరి, నురగ వెలువడతాయి. దీనికి రంగులు, డీఎన్‌ఏతో కూడిన పదార్థాలనూ జోడించవచ్చు. దీనివల్ల దొంగలపై, కరెన్సీ నోట్లపై పడే రంగులు, డీఎన్‌ఏ పదార్థాల ద్వారా.. వారు పారిపోయినా తర్వాత సులువుగా గుర్తించవచ్చు. ఈ ఫిల్ములను ఏటీఎంలు వంటితో పాటు భద్రత అవసరమైన యంత్రాలు, ప్రదేశాల్లో ఏర్పాటు చేయవచ్చు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ వెండెలిన్ స్టార్క్ మాట్లాడుతూ... ‘‘భద్రత కోసం రంగులు, రసాయనాలను చల్లే యంత్రాలు ఇప్పటికే ఉన్నా... వాటికి విద్యుత్ సరఫరా తప్పనిసరి. విద్యుత్ సరఫరా నిలిపేస్తే పనిచేయవు. ఖరీదూ ఎక్కువే. అదే ఈ ఫిల్ముల ధర, పరిమాణం తక్కువ. విద్యుత్ అవసరం లేదు. ఎక్కడైనా సులువుగా వినియోగించవచ్చు’’ అని చెప్పారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement