ఇంటర్‌ఛేంజ్ ఫీజు పెంచే యోచనలో ఆర్‌బీఐ
ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరించేవారికి త్వరలో ఛార్జీలు పెంచనున్నాయి. ఏటీఎం లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజును పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యోచిస్తోంది. ఇది ఏటీఎం ద్వారా చేసే నగదు ఉపసంహరణలను మరింత ఖరీదైనవిగా చేస్తుంది. ఐదు లావాదేవీల ఉచిత పరిమితి ముగిసిన తర్వాత చేసే నగదు లావాదేవీలకు గరిష్ట రుసుమును రూ.21 నుంచి రూ.22కు పెంచాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిఫారసు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఏటీఎం ద్వారా చేసే నగదు లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజు(ఇతర బ్యాంకు ఏటీఎం ద్వారా చేసే లావాదేవీలు) రూ.17 నుంచి రూ.19కి, నగదు రహిత లావాదేవీలకు రూ.6 నుంచి రూ.7కు పెరగవచ్చని సమాచారం.
పెరుగుదల ఎందుకు?
ద్రవ్యోల్బణం, అధిక రుణ వ్యయాలు, రవాణా, నగదు భర్తీకి సంబంధించిన ఖర్చుల కారణంగా బ్యాంకులు ఛార్జీలు పెంచుతున్నాయి. ఏటీఎం ఆపరేటర్లకు, ముఖ్యంగా మెట్రోయేతర ప్రాంతాల్లో నిర్వహణ ఖర్చులను భరించడానికి, ఏటీఎం సేవల సుస్థిరతకు సాయపడడానికి ఈ పెంపు అవసరమని బ్యాంకులు భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఇంటర్ చేంజ్ ఫీజులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ డివైజ్‌ల్లో ఏఐ టూల్స్ నిషేధం!
వినియోగదారులపై ప్రభావం
ఈ సిఫార్సులను ఆర్‌బీఐ ఆమోదిస్తే వినియోగదారులు ఉచిత పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలకు చెల్లించే ఫీజు పెరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఏటీఎంల నుంచి తరచూ నగదు ఉపసంహరించుకునే వారిపై ఇది ప్రభావం చూపుతుంది. ప్రతిపాదిత ఫీజుల పెంపు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆర్‌బీఐ కమిటీ ఏర్పాటు చేసింది. దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ పెరుగుదలకు మద్దతు ఇస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment