మూడేళ్ల క్రితం ఎకరం ధర రూ.25 లక్షలు.. మరి నేడో అర కోటికి పైమాటే
♦ అమీర్‌పేట్, రావిర్యాల, తుక్కుగూడలో రియల్ బూమ్
♦ ఐటీఐఆర్, టీ-పాస్‌తో పరిశ్రమల పరుగులు
♦ స్థిరాస్తి రంగానికి పెరిగిన గిరాకీ; ప్రాజెక్ట్‌లతో నిర్మాణ సంస్థల క్యూ
♦ గతంలో షేరింగ్ ఆటోలు కూడా తిరగని ప్రాంతం!
♦ మరి నేడో.. లగ్జరీ కార్లు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయ్!!
♦ గతంలో గ్రామాధికారులు కూడా సరిగా పట్టించుకోని ప్రాంతం!
మరి నేడో.. ఐటీఐఆర్‌తో కేంద్రం, టీ-పాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిన హైటెక్ గ్రామం!! ... ఇదంతా మహేశ్వరం మండలం గురించి. ఈ ప్రాంతాన్ని మూడు ముక్కల్లో వివరించాలంటే.. ఎత్తై కార్యాలయ భవనాలు.. విశాలమైన రోడ్లు.. లక్షల సంఖ్యలో ఉద్యోగులు! ఇలా పూర్తి స్థాయి హైటెక్ గ్రామంగా రూపుదిద్దుకుంటున్న మహేశ్వరం మండలంపై ఈ వారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది.
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ పరిధిలో మహేశ్వరం, కందుకూరు మండలాలొస్తాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అమీర్‌పేట్, ర్యావిర్యాల, తుక్కుగూడ, మంఖాల్, శ్రీనగర్ ప్రాంతాల గురించే. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లే కారణం. గతంలో కేంద్రం ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐఆర్) మూడు క్లస్టర్లలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా ఉంది.
♦ ఈ క్లస్టర్ కిందికి మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం ప్రాంతాలొస్తాయి. మొత్తం 79.2 చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న క్లస్టర్‌లో ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇక రాష్ర్ట ప్రభుత్వం విషయానికొస్తే.. 313 ఎకరాల్లో మహేశ్వరంలో, 600 ఎకరాల్లో రావిర్యాలలో ఎలక్ట్రానిక్ సిటీ (ఈ-సిటీ)లను ఏర్పాటు చేశాయి. నూతన పారిశ్రామిక విధానం (టీ-పాస్)లో పరిశ్రమల స్థాపన కోసం 60కి పైగా కంపెనీలు స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నాయి కూడా.
♦ భాగ్యనగర అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా నగరం చుట్టూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నగరం చుట్టూ 13 రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాంతాలను నగరంతో అనుసంధానించనున్నారు. వీటిలో తుక్కుగూడ ప్రాంతానికి చోటు దక్కింది. ఆయా ప్రాంతాల్లో 2041 నాటికి నగరం ఎలా విస్తరిస్తుంది? అప్పటి మౌలిక, వాణిజ్య అవసరాలకు తగ్గట్లు ప్రజా రవాణా, మౌలిక వసతుల ఏర్పాట్లు చేస్తారు. అలాగే సైన్స్‌పార్క్‌ను మహేశ్వరంలో ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ ప్రతిపాదించింది.
ఆయా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటుగా ఈ ప్రాంతంలో స్థిరాస్తి, అద్దెల ధరలు పెరుగుతాయి. గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతులూ మెరుగవుతాయి. ఐటీఐఆర్ జోన్ కారణంగా కేవలం ఐటీ రంగమే కాదు.. రవాణా, పర్యాటక, ఆతిథ్య రంగాలకూ గిరాకీ పెరుగుతుంది. వైద్య, విద్యా రంగాలకు రానున్న రోజుల్లో ఆదరణ లభిస్తుంది.
ఎకరం రూ.50 లక్షల పైమాటే..
మూడేళ్ల క్రితం వరకూ మహేశ్వరం మండలంలో ఎకరం ధర పాతిక లక్షలుండేది. కానీ, నేడు రూ.50 లక్షలకు పైగానే ఉందని శతాబ్ది టౌన్‌షిప్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. 3,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆయుర్వేద, అల్లోపతి, హోమియోపతి వైద్య కళాశాలతో పాటూ 70 ఎకరాల్లో చిన జీయర్ స్వామి ఆశ్రమం, నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. కార్వి, సెంట్రల్ ఎక్సైజ్, బ్యాంక్ కాలనీ నివాస సముదాయాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రాంతం హైలెట్స్..
మహేశ్వరం మండలం మెహదీపట్నం నుంచి 32 కి.మీ., శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్‌కు 12 కి.మీ. దూరంలో ఉంటుంది. కొంగర, రావిర్యాల, శ్రీనగర్ గ్రామాల్లో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లు, మండల కేంద్రంలో ఐటీ ఎలక్ట్రానిక్ పార్క్, మంఖాల్‌లో పారిశ్రామికవాడలో పలు కంపెనీలు రానున్నాయి. రావిర్యాలలో రూ.200 కోట్లతో ఏర్పాటైన మైక్రోమ్యాక్స్ ప్లాంట్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఇదే ప్రాంతంలో బెంగళూరుకు చెందిన వండర్ లా సంస్థ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కూడా.