మెట్రో నుంచి 10 కి.మీ. వరకూ రియల్టీ అవకాశాలు
అందుబాటు గృహాలతో సొంతింటి కల సాకారం
సిటీ వ్యూ బాగుండాలంటే భూగర్భ మెట్రో మేలు
‘సాక్షి రియల్టీ’తో జనప్రియ ఆప్‌స్కేల్ ఎండీ క్రాంతి కిరణ్‌రెడ్డి
హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది మెట్రో, ఔటర్ ప్రాజెక్ట్‌లే.. మెట్రో రైలుతో ప్రధాన నగరంలో, ఓఆర్‌ఆర్‌తో శివారు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. దీంతో నగరంలో రియల్ బూమ్ ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం రెండో దశలో ఔటర్ రింగ్ రోడ్డు వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించింది. దీంతో మెట్రో మార్గంలో చుట్టూ 10 కి.మీ. వరకూ స్థిరాస్తి అవకాశాలు మెరుగవుతాయి. ఇదే సమయంలో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానిస్తే నగరం నలువైపులా ప్రయాణం సులువవుతుంది. బడ్జెట్ గృహాల లభ్యత పెరిగి, ఐటీ ఉద్యోగ వర్గాల సొంతింటి కల సాకారమవుతుందని జనప్రియ అప్‌స్కేల్ ఎండీ క్రాంతి కిరణ్‌రెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో
ప్రజల దైనందిన జీవితంలో ప్రజారవాణా అత్యంత కీలకం. దీంతో ప్రభుత్వం మెట్రోని పొడిగించాలని నిర్ణయించింది. వచ్చే 5–10 ఏళ్లలో దశలవారీగా మెట్రో 2.0 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రియల్టీ మరింత దూరం విస్తరిస్తోంది. సాధారణంగా ప్రజలు మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు.
ఐటీ కేంద్రాల చుట్టుపక్కల ఇళ్ల ధరలు రూ.కోటి దాటిపోయాయి. ఐటీ ఉద్యోగ వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. మెట్రోతో శివార్లకు రవాణా సౌకర్యం రావడంతో ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వీరంతా తమ బడ్జెట్‌లో నివాసాలు దొరికే తూర్పు హైదరాబాద్‌లో కొనుగోలు చేశారు.
విదేశాల్లో ప్రైవేట్‌కే స్టేషన్ల బాధ్యత..
సింగపూర్, న్యూయార్క్ వంటి దేశాల్లో మాదిరిగా నగరంలోనూ భూగర్భ మెట్రో ఉంటే మేలు. విదేశాలలో భూగర్భ మెట్రో స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని స్థానికంగా హోటల్స్, మాల్స్ వంటి వాణిజ్య సముదాయాలకే అప్పగిస్తారు. స్టేషన్ నుంచి వచ్చిపోయే ప్రయాణికులకు ఆయా వాణిజ్య సముదాయాలకు యాక్సెస్ ఉంటుంది. దీంతో యజమానులకు బిజినెస్ అవుతుంది. ప్రతిఫలంగా స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని వాణిజ్య యజమానులే భరిస్తారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు యజమానికి ఇద్దరికీ లాభమే.
ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..
చిత్తడి, వదులుగా ఉండే నేలలో భూగర్భ మెట్రో కష్టమవుతుంది. కానీ, మనది రాతి భూభాగం. భూగర్భ మెట్రో లైన్ కోసం సొరంగం తవ్వడం కష్టమవుతుందేమో.. కానీ ఒకసారి తవ్వాక నియంత్రణ సులువు. రోడ్డు మార్గం ఎలా ఉంటుందో మెట్రో లైన్ కూడా అలాగే వేయాల్సి ఉంటుంది. పైగా వంకర్లు ఉండే మార్గంలో ఎక్కువ బోగీలతో మెట్రోను నడపడం కుదరదు. కానీ, భూగర్భ మెట్రోను ఏ నుంచి బీ పాయింట్‌కు సరళ రేఖ మాదిరిగా వేయవచ్చు. దీంతో మెట్రో రైలు వేగం పెరగడంతో పాటు ఎక్కువ బోగీలతో మెట్రో నడపొచ్చు.
భవిష్యత్తు ఈ ప్రాంతాలదే..
ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల బహుళ జాతి సంస్థలే నగరానికి ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ, కొన్నేళ్లుగా తయారీ రంగంలో కూడా మల్టీనేషనల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఫాక్స్‌కాన్, టాటా ఎయిరోస్పేస్ వంటి సంస్థలు ఆదిభట్ల, శంషాబాద్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ అంతా వెస్ట్‌లోనే ఉంది కాబట్టి ఈ ప్రాంతాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కానీ, ఇప్పటికే ఆయా ప్రాంతాలలో నివాస, వాణిజ్య భవనాలతో కిక్కిరిసిపోవడంతో ఈ అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది. కొంగరకలాన్, ఆదిభట్ల, శంషాబాద్, కొల్లూరు, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో మార్కెట్ ఊపందుకుంటుంది.
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు..
ఐటీలోనే కాదు రియల్ ఎస్టేట్‌లోనూ హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతున్నాయి. రెండు నగరాలకు ఉన్న తేడా.. రోడ్ల వెడల్పు. బెంగళూరులో ఎయిర్‌పోర్టు రోడ్డు తప్ప అన్నీ దాదాపు 60 ఫీట్ల రోడ్లే.. కానీ, మన దగ్గర 100, 140 ఫీట్ల రోడ్లు కూడా ఉన్నాయి. నగరంలో అంత పెద్ద రోడ్లు ఎలా వచ్చాయి? రోడ్డు వెడల్పుగా ఉంటే అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్‌ఎస్‌ఐ) ఉంటుందని యజమానులు రోడ్ల కోసం భూములు ఇచ్చారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
దీంతో భారీ టౌన్‌షిప్‌లు, స్కై స్క్రాపర్లు వస్తున్నాయి. తాజాగా హైరైజ్ ప్రాజెక్ట్‌లతో ట్రాఫిక్ పెరుగుతోందని ఎఫ్‌ఎస్‌ఐపై ఆంక్షలు పెట్టాలనే ప్రతిపాదనకు బదులుగా రోడ్లను ఇంకా వెడల్పు చేయడం ఉత్తమం. హైదరాబాద్ రియల్టీకి వరమైన జీవో–86 వల్లే దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సమర్థవంతమైన జీవోపై ఆంక్షలు పెట్టాలనుకోవడం సరైన నిర్ణయం కాదు.
Comments
Please login to add a commentAdd a comment