మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణతో నగరాభివృద్ధి
సిటీ, శివార్లకు మధ్య మెరుగైన కనెక్టివిటీ, మౌలిక వసతులు
నగరం మూడు వైపులా అందుబాటు ధరల్లో గృహాలకు అవకాశాలు
‘యూజర్ పే’ విధానంలో గ్రోత్ కారిడార్‌లో రోడ్లు
వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌తో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలి
రాష్ట్ర ఆదాయంలో 25–30 శాతం వాటా స్థిరాస్తి రంగానిదే..
తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీవీ రావు
‘మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ బృహత్తర ప్రాజెక్ట్‌లతో హైదరాబాద్ అభివృద్ధి ఖాయం. ఏ నగరంలోనైనా సరే ప్రభుత్వం, డెవలపర్లు సంయుక్తంగా ప్రజా కేంద్రీకృత విధానాలతో నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టిస్తారు. రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, నీరు వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లను ప్రభుత్వం కల్పిస్తే.. కాలనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలపర్లు చేపడతారు’ అని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్(టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో
సబర్బన్ పాలసీ అవసరం..
విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం, వినోదం ఇలా ప్రతీ అవసరం కోసం ప్రజలు ప్రధాన నగరానికి రావాల్సిన, ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏటా 3 లక్షల మంది నగరానికి వలస వస్తున్నారు. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోతే కోర్ సిటీలో జన సాంద్రత పెరిగి, బెంగళూరు, ఢిల్లీ మాదిరిగా రద్దీ, కాలుష్య నగరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే శివారు ప్రాంతాలు మెరుగైన మౌలిక వసతులతో అభివృద్ధి చెందేందుకు సబర్బన్ పాలసీ అవసరం. మెట్రో విస్తరణతో ప్రధాన నగరం, శివారు ప్రాంతాలు అనుసంధానం కావడంతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. శరవేగమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. అందుకే హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో ఈ ఏడాది రూ.5 వేల కోట్ల నిధులతో నాలాల పునరుద్ధరణ పూర్తి చేయాలి.
ఆదాయంలో 25–30 శాతం వాటా..
ప్రస్తుతం గ్రేటర్‌లో 1.1 కోట్ల జనాభా ఉంది. మెరుగైన మౌలిక వసతులతో దేశంలోనే నివాసితయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. వ్యవసాయం తర్వాత రెండో అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమ రియల్ ఎస్టేట్ రంగం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్‌టీ, నిర్మాణ అనుమతుల రుసుము, ఇంపాక్ట్ ఫీజు, ఆదాయ పన్ను ఇలా స్థిరాస్తి రంగం నుంచి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర ఆదాయంలో 25–30 శాతం వాటా స్థిరాస్తి రంగానిదే.
‘యూజర్ పే’తో గ్రోత్ కారిడార్‌లో రోడ్లు..
ఓఆర్‌ఆర్ నిర్మాణ సమయంలోనే గ్రోత్ కారిడార్‌కు రెండు వైపులా రహదారులను ప్లాన్ చేశారు. కానీ.. ఇప్పటికీ వేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆయా రోడ్లను ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీతో హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకొని, రైతుల నుంచి భూములను సేకరించి రహదారులను నిర్మించాలి. ఇందుకైన వ్యయాన్ని ఈ రోడ్లను వినియోగించుకునే డెవలపర్ల నుంచి వసూలు చేస్తారు. ఉదాహరణకు టోల్ మాదిరిగా ఏ నుంచి బీ రోడ్డు నిర్మాణానికి అయిన వ్యయాన్ని బిల్డర్లు ‘యూజర్ పే’ రూపంలో చెల్లిస్తారు. దీంతో ప్రభుత్వంపై వ్యయ భారం తగ్గడంతో పాటు మెరుగైన రోడ్లతో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ రోడ్లలో కొన్ని రీజినల్ రింగ్ రోడ్ అనుసంధానించబడి రేడియల్ రోడ్లుగా అభివృద్ధి చెందుతాయి.
వాక్ టు వర్క్‌తో.. ఫోర్త్ సిటీ..
తెలంగాణ ప్రభుత్వం 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మాణాన్ని తలపెట్టింది. అయితే.. ఈ పట్టణం ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ప్లాన్ చేయాలి. వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌లతో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యా, వైద్య, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతో ఫోర్త్ సిటీ స్వయం సమృద్ధి చెందుతుంది. ఈ మోడల్‌ను హైదరాబాద్‌లోని మిగతా మూడు వైపులకూ విస్తరించాలి.
నివాస, వాణిజ్య స్థిరాస్తికి డిమాండ్..
హైడ్రా దూకుడుతో కొంత కాలంగా స్థిరాస్తి రంగం మందగమనాన్ని ఎదుర్కొంది. అయితే నిర్మాణ అనుమతులు ఉన్న ప్రాజెక్ట్‌ల జోలికి వెళ్లమని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రస్తుతం మార్కెట్‌లో నిలకడ వాతావరణం నెలకొంది. దీంతో కొత్త కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేరాఫ్ హైదరాబాద్. ఆయా రంగాల్లో 1.50 లక్షల కొత్త ఉద్యోగాలతో రాబోయే కాలంలో నివాస, వాణిజ్య స్థిరాస్తి రంగానికి డిమాండ్ తప్పకుండా ఉంటుంది. ఉప్పల్ నుంచి నారాపల్లి, పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట, పరేడ్ గ్రౌండ్ నుంచి కొంపల్లి ఫ్లై ఓవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మూడు మార్గాలతో పాటు ఆదిభట్ల నుంచి లేమూరు మార్గంలో నివాస కార్యకలాపాలు పెరగనున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతికి అందుబాటులో ధరల్లో ఇళ్లు లభ్యమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment